నేల రాలిన జీవితం
ఫొటో స్టోరీ
అది 1976.బోస్టన్‌లోని ఓ పత్రికాఫీసులో కూర్చుని పని చేసుకుంటున్నాడు ఫొటో గ్రాఫర్ స్టాన్‌లీ జె. ఫోర్‌మన్. అంతలో ఓ కబురు... అక్కడికి కొంత దూరంలోని ఓ ఆరంతస్తుల భవంతి మంటల్లో చిక్కుకుందని. వెంటనే కెమెరా తీసుకుని బయలుదేరాడు స్టాన్‌లీ. అతడు వెళ్లేసరికి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కలంతా దట్టంగా పొగ కమ్ముకుంది. దారుణమైన ఆ పరిస్థితిని ఫొటోలు తీయసాగాడు స్టాన్‌లీ. అప్పుడే అతడి కళ్లు పై అంతస్తు మీదికి మళ్లాయి. అక్కడ... కిటికీ దగ్గర... ఓ పందొమ్మిదేళ్ల యువతి, మూడేళ్ల పసిపాప నిలబడి ఉన్నారు.
తమను ఎవరు కాపాడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతలో రెస్క్యూ టీమ్‌లోని ఓ సభ్యుడు భవనం పైనుంచి తాడు సహాయంతో కిందికి దిగసాగాడు. వారిని ఎలాగైనా కాపాడాలనే ప్రయత్నంలో ఉన్నాడతను. కాసేపయితే కాపాడేవాడే. కానీ అంతలోనే ఘోరం జరిగి పోయింది. కిటికీ దగ్గర మంటలు తీవ్రమయ్యాయి. వారి కాలి కింది నేల కాలి, కరిగి, కదలసాగింది. దాంతో ఆ ఇద్దరూ ఒక్కసారిగా పైనుంచి పడిపోయారు.
మొదట ఆ యువతి, ఆపైన ఆ చిన్నారి. యువతి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మీద పడటంతో చిన్నారి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. నాటి ఆ విషాద ఘటనకు... పులిట్జర్ బహుమతి పొందిన ఈ చిత్రం సాక్ష్యంగా నిలిచింది!