
సమాధి అయిన జీవితం!
ఫొటో స్టోరీ
మనిషి చనిపోతే సమాధి చేస్తారు. కానీ ఇక్కడ సమాధి అయ్యింది ఒక మనిషే కాదు...
ఆ మనిషిని నమ్ముకున్న మరో మనిషి జీవితం కూడా!
అక్టోబర్ 16, 2013. బ్రిటన్‌లోని ఆర్లింగ్టన్‌లో ఉన్న శ్మశాన వాటికలో విషాదం పరచుకుంది.
అప్పటి వరకూ అక్కడ నిలబడివున్న పాదాలు మెలమెల్లగా అడుగులు వేస్తూ వెళ్లిపోవడంతో ఒక్కసారిగా శూన్యం ఆవరించింది. అంతవరకూ మిన్నంటిన రోదనలు మాయమవ్వడంతో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బిగ్గరగా ఓ కేక.... ‘టిమ్... ఎక్కడికి వెళ్లిపోయావ్’ అంటూ! అది ఓ యువతి గుండె లోతుల్లోంచి గొంతును చీల్చుకుంటూ వచ్చింది. పది సెకన్ల పాటు ప్రతిధ్వనించింది! అప్పుడే చేసిన
ఓ సమాధికి ఆనుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ యువతి. దుఃఖం వెల్లువలా ఎగసిపడుతోంది. కళ్ల నుండి వేదన కాలువలై పారుతోంది. అక్కడికి కాస్త దూరంలో నిలబడి చూస్తోన్న ఫొటోగ్రాఫర్ మాన్యుయెల్ సెనెలా మనసు కదిలిపోయింది. వెంటనే కెమెరాను తీశాడు. ఆమె ఆవేదనకు ఇలా చిత్రరూపమిచ్చాడు.
ఆ యువతి పేరు తానియా. ఆర్మీ ఆఫీసర్ అయిన ఆమె భర్త యుద్ధంలో కన్ను మూశాడు... సరిగ్గా వారి పెళ్లి రోజుకు ముందురోజు! అప్పటికామె నాలుగు నెలల గర్భవతి. కడుపులో పిండాన్ని తడుముకుంటూ, సమాధి అయిన తన జీవితాన్ని తలచుకుంటూ తానియా పడిన బాధకు చెరగని సాక్ష్యం... ఈ చిత్రం!