మనసుల్ని తడిమిన ముద్దు!
ఫొటో స్టోరీ
అనురాగాన్ని రుచి చూపించేందుకు, ప్రేమను తెలియబర్చేందుకు, ఇష్టాన్ని ప్రదర్శించేందుకు ముద్దు మంత్రాన్ని ఉపయోగిస్తాం మనం. కానీ ఈ ముద్దు అలాంటిది కాదు. అది ఓ వేదనకు చిహ్నం. ఓ విషాద జ్ఞాపకం!
పెళ్లి అంటే ఏమిటో పూర్తిగా తెలియక ముందే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది ఇరాన్‌కు చెందిన సోమయే మెహ్రీ. భర్త ఆమిర్ ద్వారా పెళ్లి అంటే నరకం అన్న నిర్వచనాన్ని తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదామెకి. అతడు కొడితే భరించింది. తిడితే సహించింది. చిత్రహింసలు పెట్టినా ఓర్చుకుంది. చివరికి అతడు పోసిన యాసిడ్‌లో కాలి, కరిగి, ఇలా మిగిలింది.
దురదృష్టమేమిటంటే... ఆమిర్ యాసిడ్ దాడి చేసినప్పుడు, సోమయే ఒడిలో చిన్నారి రానా ఉంది. యాసిడ్ తన ఒంటిని మండించిన బాధ కంటే... కడుపున మోసి కన్న బిడ్డ కళ్లముందు కాలిపోతున్నప్పుడు కలిగిన వేదనకే విలవిల్లాడింది సోమయే. కొన్ని నెలల నరక యాతన తరువాత మృత్యుకౌగిలి నుంచి బయట పడినా... ఈ లోకం తమ రూపాలను చూసి ముఖాలు తిప్పుకున్నప్పుడల్లా ఇంతకంటే మరణమే మేలని ఏడుస్తోందామె.
ముఖ్యంగా తన బిడ్డని ఎవరైనా అసహ్యించుకుంటుంటే ఆమె తల్లి మనసు రగిలిపోతోంది. ఆ బాధతోనే ఆమె ఏడుస్తుంటే... తల్లి వేదన అర్థం కాని రానా... ఆమె బుగ్గమీద చిన్న ముద్దు ముద్ర వేసింది. ఆ దృశ్యం ఇరానియన్ ఫొటోగ్రాఫర్ ఇబ్రహీం నొరూజీ కంట పడింది. ప్రపంచ పొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శితమైన ఈ ఫొటో పలు అవార్డులను గెలుచుకుంది. ఆ చిన్నారి ముద్దు... తన తల్లి చెంపతో పాటు కొన్ని లక్షల మంది మనసులను కూడా తడిమింది!