ఊపిరి పోసిన ముద్దు!
ఫొటో స్టోరీ
అది 1967, జూలై. న్యూయార్క్‌లోని ‘వెస్ట్ 26 స్ట్రీట్’లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఫొటోగ్రాఫర్ రాకో మొరాబిటో. అనుకోకుండా అతడి కళ్లు రోడ్డు పక్కనే ఉన్న ఓ కరెంటు స్తంభం మీద పడ్డాయి. అక్కడి దృశ్యం చూసి షాక్ తిన్నాడు రాకో. ఓ లైన్‌మేన్ (ర్యాండల్ జి. చాంపియన్) స్తంభం మీది నుంచి తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. అతణ్నలా చూడగానే కారు బ్రేకు వేసి, కిందికి దిగాడు రాకో. అప్పటికే మరో లైన్‌మేన్ జె.డి.థామ్సన్ స్తంభం దగ్గరకు పరుగెడుతున్నాడు. ఏం జరిగివుంటుందో ఊహించిన రాకో అంబులెన్సుకు ఫోన్ చేసి, కెమెరా తీసుకుని స్తంభం దగ్గరకు పరుగుదీశాడు.
చాంపియన్ స్తంభం మీద పని చేస్తుండగా తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలింది. ఒక్కసారిగా నాలుగు వేల వోల్టుల కరెంటు అతడి శరీరంలోకి ప్రవేశించింది. దాంతో అతడి గుండె ఆగిపోయింది. శరీరం కాస్త కిందికి జారి, స్తంభం మీద నుంచి అచేతనంగా వేళ్లాడసాగింది. తన సహోద్యోగిని అలా చూడగానే పరుగు పరుగున వెళ్లిన థామ్సన్... స్తంభం ఎక్కి, చాంపియన్‌ని చేతులతో పట్టుకుని, అతని నోటిలో నోరు పెట్టి కృత్రిమ శ్వాసను అందించడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా అతడిని బతికించాలని తపన పడ్డాడు. థామ్సన్ తపన వృథా కాలేదు. కాసేపటి తర్వాత చాంపియన్ శరీరం స్పందించడం మొదలుపెట్టింది. దాంతో అతడిని తన భుజాల మీద వేసుకుని జాగ్రత్తగా కిందికి దించాడు. తగిన సమయంలో చికిత్స అందేలా చేసి, చాంపియన్‌కి ప్రాణం పోశాడు.
ఈ మొత్తం సంఘటననీ తన కెమెరాలో పలు చిత్రాలుగా బంధించాడు రాకో. వాటిలో ఇది ఒకటి. ‘కిస్ ఆఫ్ లైఫ్’ పేరుతో ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన ఈ ఫొటోకి గాను 1968లో పులిట్జర్ బహుమతి అందుకున్నాడు రాకో!