పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు.. జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే.. ‘ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం’ అంటుంటారు. ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వును ఆరు రకాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు.
అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. అందుకే చాలామంది ‘మర్యాద మరువకుండా, దూషణ లక్ష్యంగా పెట్టుకోకుండా, శ్రుతి మించనీయకుండా చేసే హాస్యమే నిజమైన హాస్యం’ అని చెబుతుంటారు. నవ్వేటప్పుడు కేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదుళ్లు, పక్కవాళ్లను గిచ్చుళ్లు ఇవన్నీ సహజం. ఎగరడాలు, మెలికలు తిరగడాలు, కళ్లనీళ్లు తుడుచుకోవడాలు ఇవన్నీ నవ్వులో తారస్థాయికి చిహ్నాలు. అయితే ‘మనసారా నవ్వే నవ్వుకు ఆయువు ఎక్కువ’ అంటున్నారు వైద్యులు.
‘స్నానం.. దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం.. బుద్ధిని సరి చేస్తుంది.ఉపవాసం.. ఆరోగ్యాన్ని అందిస్తుంది.హాస్యం.. మనిషినే ఉబ్బితబ్బిబ్బు చేస్తుంది, మనసును ఉర్రూతలూగిస్తుంది. అంతకుమించి.. ఆలోచనల్ని ఉత్తేజపరుస్తుంది’ అంటుంటారు ప్రవచనకర్తలు. అందుకే, వాసన లేని పువ్వులా.. పరిహాసం లేని ప్రసంగం వ్యర్థమని చెబుతుంటారు.
నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం
దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్
పువ్వులవోలె ప్రేమరసముం గురిపించు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్
‘ఈ లోకంలో మనిషి తప్ప ఏ జీవీ నవ్వలేదు. నవ్వులు మనిషి మనోవికాసానికి దివ్వెలు. అయితే కొన్ని విషపునవ్వులు ఉంటాయి. అలాంటివి కాకుండా.. పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు లోకంలోని సమస్త దుఃఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి’ అని మహాకవి జాషువా ఎప్పుడో చెప్పారు.
నవ్వితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే.. నవ్వుతో గుండె లయ పెరిగి.. శ్వాసలో వేగం పుంజుకుంటుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత హాట్ బీట్ నెమ్మదించి.. బీపీ కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది.
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం. తరచూ ఒత్తిడిలో ఉండేవారికి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించే న్యూరోపెపై్టడ్స్ అనే చిన్న మాలిక్యూల్స్ విడుదల కావాలంటే.. ఎక్కువగా నవ్వుతూ ఉండాలి.
ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారు యాక్టివ్‌గా కనిపిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు. దాంతో స్నేహితులు కూడా పెరుగుతారు. స్మైలీ ఫేస్ ఉండేవారితో స్నేహం చేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ నవ్వుల్లో మర్మం తెలుసుకుని మెలగడం ఉత్తమం.
నిత్యం మూడీగా ఉండేవాళ్లు.. ఎప్పటికప్పుడు బ్రెయిన్‌కి స్మైలీ సంకేతాలు ఇస్తూ ఉండాలి. లేదంటే ఆ దిగులు మరింత పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు.. అహ్లాదకరమైన వాతావరణాల్లో తిరగడం.. స్నేహితుల మధ్య ఉండటం చాలా అవసరం. అప్పుడే మూడ్ మారుతుంది.
నవ్వితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి.. రోగనిరోధకశక్తికి ఎంతో అవసరమైన యాంటీ బాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
చిరునవ్వు ఎందరిలో ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గానే నిలుస్తుంది. నవ్వుతో చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవ్వేవారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది.
నవ్వు జీవితంపై సానుకూలప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో భవిష్యత్ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని, ఆయుష్షుని కూడా పెంచుతుందని సైంటిఫిక్‌గా నిరూపితమైంది.
నవ్వు బాడీలో ఆక్సిజన్ స్థాయిని పెంచి.. శ్వాస వ్యాయామానికి ఒక మార్గంగా నిలుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరస్తుంది. కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు ఆ రోజంతా తెలియని ఎనర్జీని అందుకోవచ్చు.
లాఫింగ్ థెరపీతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ నవ్వు.. శరీరం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
నవ్వు.. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు.. ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. దాంతో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి.
మోబియస్ సిండ్రోమ్
మోబియస్ సిండ్రోమ్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అరుదైన లోపం. ఈ జబ్బున్నవాళ్ల ముఖంలో ఎలాంటి కవళికలు పలికించలేరు. వీళ్లు నవ్వలేరు, ఆవులించలేరు, కనుబొమలను పైకెత్తలేరు. ఇది ఒకరకమైన నాడీ సమస్య.
ఫేక్ స్మైల్స్ సర్వేలు
కాల్ సెంటర్స్ వంటి పబ్లిక్ సర్వీస్‌లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి. కానీ అది వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు తేల్చేశారు. ఇలా నకిలీ నవ్వు నవ్వే వాళ్లు తమ వ్యక్తిగత ఫీలింగ్స్‌ను మనసులోనే దాచి వేస్తారని.. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ పరిశోధనలో తేలింది.
దీని ప్రకారం.. ఇష్టంలేని వారి ముందు.. తప్పని పరిస్థితుల్లో నవ్వే నకిలీ నవ్వులు ఏమాత్రం మంచివి కావని తేలింది. పైగా ఇలాంటి నవ్వుల వల్ల.. ఫీలింగ్స్‌లో మిశ్రమమైన స్పందనకు మెదడు కన్‌ఫ్యూజ్ అవుతుంది. అది మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
నవ్వుకు కాస్త సమయం
వీలు చిక్కినప్పుడల్లా కామెడీ సినిమాలు, కామెడీ ప్రోగ్రామ్స్ (హెల్దీ జోక్స్) చూస్తూండాలి · నలుగురిలో ఉన్నప్పుడు అహ్లాదకరమైన గత హాస్య స్మృతులను వివరిస్తూ.. నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుండాలి.
కామెడీని పండించగల స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూండాలి. గ్రూప్ ఎంటర్‌టైనింగ్ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటే.. తప్పకుండా అందులో భాగస్వాములు కావాలి. కుటుంబ సభ్యులతో చిన్ననాటి చిలిపి సంగతులను చర్చించడం.. అప్పటికే మీకు ఎదురుపడిన కామెడీ సన్నివేశాల గురించి వారితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి · కొన్నిసార్లు ఎదుటివారిపైన పంచులు వేసినా.. మరి కొన్నిసార్లు ఎదుటివారు మన మీద వేసే పంచులకు ఫీల్ అవ్వకుండా ఉండగలగాలి.
Comments
Please login to add a commentAdd a comment