Cover Story: వర్చువల్‌ లోకం కొంచెం వెర్రి.. కొంచెం వర్రీ | We should be careful from the virtual world | Sakshi
Sakshi News home page

Cover Story: వర్చువల్‌ లోకం కొంచెం వెర్రి.. కొంచెం వర్రీ

Published Sun, Feb 4 2024 7:00 AM | Last Updated on Sun, Feb 4 2024 7:00 AM

We should be careful from the virtual world - Sakshi

వాస్తవం కన్నా కల్పనే అందంగా ఉంటుంది! ప్రాక్టికాలిటీ కన్నా భ్రమే ఆనందాన్నిస్తుంది! నిజానికి బంధనాలుంటాయి..  ఊహలకు ఆకాశం కూడా హద్దు కాదు! అందుకే వర్చువల్‌ వరల్డ్‌లో  అందరూ హీరోలే..  అసలు ఆ కిక్కే వేరప్పా! కల చెదిరి..  స్పృహలోకొచ్చాక  రియాలిటీ ఇచ్చే షాక్‌ కూడా వేరప్పా! వర్చువల్‌ ప్రభావాలు.. రియాల్టీ ప్రమాదాలు  ఇప్పుడు చర్చనీయాంశాలు! 

పాతికేళ్ల కిందట.. మ్యాట్రిక్స్‌ అనే హాలీవుడ్‌ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఇంటెలిజెంట్‌ మెషిన్లు అందులో మనుషుల శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుని.. అచ్చంగా వారిని పోలిన రూపాలతో వర్చువల్‌ వరల్డ్‌ని రూపొందించి తామనుకున్న సంఘ వ్యతిరేక పనులు చేస్తుంటాయి. ఈ వర్చువల్‌ బాడీకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని తాలుకు ప్రభావం ఎనర్జీ సోర్స్‌ రూపంలో ఉన్న అసలైన మనిషిపై కనిపిస్తుంటుంది. ఆఖరికి వర్చువల్‌ వరల్డ్‌ కారణంగా ఎనర్జీ సోర్సెస్‌ చనిపోతాయి కూడా!

పన్నెండేళ్ల కిందట.. వచ్చిన ‘అవతార్‌’ సినిమా కూడా అలాంటిదే. పండోరా గ్రహంలో ఉన్న అపార సహజ వనరులపై కన్నేసిన మనుషులు వాటిని సొంతం చేసుకునేందుకు తమ శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుంటూ వర్చువల్‌ మనుషులను తయారు చేస్తారు. ఆ పండోరా గ్రహవాసులు, వర్చువల్‌ మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుట్రకుతంత్రాలతో పండోరా మీద మనుషుల ఆధిపత్య పోరుతో సాగుతుంది సినిమా.

తాజాగా.. ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోన్న హారర్‌ కామేడీ.. ‘కంజూరింగ్‌ కన్నప్పన్స్‌’ అనే తమిళ సినిమా ‘డ్రీమ్‌ క్యాచర్‌’ పాయింట్‌ చుట్టూ తిరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యంకాని విషయాలను కలలో సాధ్యం చేసుకోవడమనే అంశంపైనే ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇందులోని క్యారెక్టర్స్‌కి ఆ కలలో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల వల్ల నిజ జీవితంలోనూ ముప్పు వాటిల్లుతుంది. చివరకు జీవితం భయానకం అవుతుంది. కలల మీద అంతకుముందే హాలీవుడ్‌లో ‘ఇన్స్‌సెప్షన్స్‌ ’ పేరుతో ఒక సినిమా వచ్చింది.

పై చిత్రాలన్నీ ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్స్‌ ఆధారంగా ‘వర్చువల్‌ వరల్డ్‌’ కేంద్రంగా  వచ్చినవే. మన జీవితాల్లో వర్చువల్‌ వరల్డ్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కళ్లకుకట్టే ప్రయత్నం చేసినవే. అలా సిల్వర్‌స్క్రీన్స్‌కే పరిమితమైన వర్చువల్‌ వరల్డ్‌ మెల్లమెల్లగా రియల్‌ వరల్డ్‌లోకీ చేరింది. అందరూ ఊపయోగించే వాట్సాప్‌ నుంచి పబ్‌జీ వంటి గేమ్స్, స్నాప్‌చాట్‌ వంటి యాప్‌ల దాకా ప్రత్యేకంగా అవతార్‌లు పుట్టుకొస్తున్నాయి.

ఆ యాప్‌లను వాడే కొద్దీ తమ రియల్‌ వరల్డ్‌లోని బాడీ కంటే యాప్‌లలో ఉపయోగించే అవతార్‌లనే మనుషులు మానసికంగా సొంతం చేసుకోవడం మొదలైంది. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారు, లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరికి ఆ వర్చువల్‌ అవతార్‌కి ఏమైనా అయితే దాని తాలుకు లక్షణాలతో మనుషులు రియల్‌ వరల్డ్‌లో మంచం పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ఘటన వర్చువల్‌ వరల్డ్‌పై మరింత చర్చకు కారణమైంది. 

సరికొత్త ఐడెంటిటీ
రియల్‌ వరల్డ్‌లో.. పుట్టిన ఊరు, కుటుంబం వంటి తదితర వివరాలతో సామాజికంగా మనుషులకు ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆధార్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పాస్‌పోర్ట్‌తో వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. కానీ డిజిటల్‌ వరల్డ్‌ దీనికి భిన్నం. నిర్ధారిత తనిఖీ, పరిశీలన, విచారణ వంటివేమీ లేకుండానే గుర్తింపును పొందే వీలుంటుంది.

సోషల్‌ మీడియాలోని ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌లో.. ఓక్కో యాప్‌లో ఒకే మనిషి పదుల సంఖ్యలో ఐడెంటిటీలు పొందవచ్చు. దీంతో డిజిటల్‌ వరల్డ్‌లో అసలైన ఊరు, పేరు తెలియకుండానే చలామణి కావొచ్చు. సామాజిక కట్టుబాట్లు, ఇంట్లో వాళ్ల ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ వెసులుబాటు కారణంగానే యువతరం మొదలు పెద్దల వరకు అంతా డిజిటల్‌ ఐడెంటిటీ వైపు అడుగులు వేస్తున్నారు. నిజమైన గుర్తింపులేని ఈ తీరే మోసాలకు కారణమవుతోంది.

డీపీలతో
గిట్టని వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేయడానికి ఫేక్‌ ఫొటోలతో ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేసి అభాసుపాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు ముఖ్యంగా మహిళలను ఇబ్బందిపెడుతున్నాయి. అవమానాలకు గురిచేస్తున్నాయి. పరిచయస్తులు, మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్లే.. స్పర్థల కారణంగా దూరమైతే చాలు టార్గెట్‌ మహిళల ఫొటోలు, ఫోన్స్‌ నంబర్లను పోర్న్స్‌ సైట్లలో పెడుతూ తీవ్రమైన మానసిక హింసకు పాల్పడుతున్నారు.

లేదా ఫేక్‌ డీపీలతో చాటింగ్‌ చేస్తూ మోసాలకు దిగుతున్నారు. స్త్రీ, పురుష స్నేహాలతోనే కాకుండా మరోరకం నకిలీ ఖాతాలకూ ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఆ నకిలీ ఖాతాలు చక్కగా మనతో ఇన్స్‌బాక్స్‌ లేదా డైరెక్ట్‌ మెసేజెస్‌తోనే స్నేహాన్ని పెంచుకుంటాయి. హఠాత్తుగా.. చాలా అవసరం పడిందని.. ఫలానా అంత నగదు పంపాలంటూ వేడుకుంటాయి. తిరిగి చెల్లిస్తామని నమ్మబలుకుతాయి.

నమ్మి నగదు పంపిన వెంటనే డిసపియర్‌ అయిపోతాయి. ఫేస్‌బుక్‌లో దాదాపు అందరూ ఈ నకిలీ ఖాతాలు – మనీ రిక్వెస్ట్‌లకు బాధితులుగా మారారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండాపోతోంది. నకిలీ గుర్తింపు ఆధారంగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. 

డీప్‌ ఫేక్‌తో
ఇటీవల సినిమా నటి రష్మికా మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అమెరికా, యూరప్‌ దేశాల్లో ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కి సంబంధించి.. డీప్‌ ఫేక్‌ వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి. రెండు వేర్వేరు వీడియోలను కలుపుతూ నిఖార్సైన నకిలీని క్రియేట్‌ చేయడంలో డీప్‌ ఫేక్‌లు ఆరితేరిపోయారు.

దశబ్దాల కిందటే మార్ఫింగ్‌ అనేది ఉనికిలోకి వచ్చినా దాన్ని గుర్తించడం తేలికే. ఎక్కడో కంప్యూటర్‌ గ్రాఫిక్స్, వీఎఫెక్స్‌ వాడితే తప్ప సహజంగా అనిపించేది కాదు అది. కానీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ.. చేతిలోని స్మార్ట్‌ ఫోన్స్‌తో ఫేక్‌ని క్రియేట్‌ చేయగలుగుతుండటంతో సమస్య తీవ్రమైంది.

నకిలీ వర్సెస్‌ అవతార్‌
డిజిటల్‌ దునియా/వర్చువల్‌ వరల్డ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించడం వెనుక కచ్చితమైన ఉద్దేశం అర్థమవుతోంది. ఆర్థికంగా దోచుకోవడం, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసి మానసికంగా కుంగదీయడం వాటి ప్రధాన లక్ష్యాలు. కొన్నిసార్లు ఎదుటి వారితో ఆడుకోవడానికీ నకిలీ ఖాతాలు వస్తున్నాయి. వీటిని సృష్టించే వారు తమకు సంబంధించిన వివరాలను ఆ ఖాతాలో పొందుపరచరు.

ఇందుకు భిన్నం అవతార్‌. పూర్తిగా మనకు సంబంధించిన మరో రూపమే అవతార్‌ అన్నట్టుగా ఉంటుంది. మన అవతార్‌కు ఎలాంటి హెయిర్‌ స్టైల్‌ ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, శరీరం రంగు ఎలా ఉండాలి.. వంటి అన్ని విషయాల్లో మన ఇచ్ఛకు తగ్గట్టుగా వర్చువల్‌ అవతార్‌ను రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ అవతార్‌తోనే సోషల్‌ మీడియా, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్, ఆన్స్‌లైన్స్‌ గేమ్స్‌లో పాల్గొనవచ్చు.

ఈ పాల్గొనడమే చెలరేగే స్థాయికి చేరితే వర్చువాలిటీ రియాల్టీకి మధ్య ఉండే గీత చెరిగిపోతుంది. ఆ తర్వాత వర్చువల్‌గా జరిగే విషయాలకు రియాల్టీలో నష్టపోవాల్సి వస్తుంది. మానసిక ఆనందం కోసం వచ్చిన వర్చువల్‌ వరల్డ్‌ చివరకు మానసిక వేదనకు దారి తీస్తోంది. ఇలా ఇబ్బందులకు గురవుతున్న వారిలో టీనేజర్లు, మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.

అసలు కంటే ఎక్కువ
రియల్‌ వరల్డ్‌లో ఉన్న గుర్తింపు కంటే డిటిజల్‌ దునియాలో దక్కే గుర్తింపే ఎక్కువ అనుకునే వారు పెరుగుతున్నారు. ఉదాహరణకు మోస్ట్‌ పాపులర్‌ పబ్‌జీ గేమ్‌. ఈ గేమ్‌ను.. ఆన్స్‌లైన్స్‌లో ఎవరికి వారు తమ ‘అవతార్‌’ను ఎంచుకుని ఏక కాలంలో ఆడుకునే వీలుంది. అవతార్‌ ధరించే డ్రెస్‌లు, వాడే ఆయుధాలకు ఇక్కడ రేట్‌ ఫిక్స్‌ అయి ఉంటుంది. ఒక్కో లెవెల్‌ను దాటుకుంటూ ఈ అవతార్‌లు గేమ్‌లో ముందుకు వెళ్తుంటాయి.

ఆయా లెవెల్స్‌ ఆధారంగా ఆ ఆటగాడు ఎంతటి మొనగాడనే గుర్తింపును డిజిటల్‌ దునియా ఇస్తుంది. ఈ రికగ్నిషన్స్‌ ఇచ్చే కిక్‌ కోసం  పరీక్ష ఫీజులు మొదలు.. తల్లిదండ్రుల అకౌంట్ల దాకా డబ్బును స్వైప్‌ చేయడానికి ఏ మార్గం దొరికినా వదలకుండా లక్షల రూపాయలను ఈ గేమ్స్‌ కోసం ధారపోసే గేమర్లు ఉన్నారంటే ఆశ్చర్యమూ అతిశయోక్తీ ఎంతమాత్రం లేదు.. కాదు. 

చిక్కులు
వాస్తవ ప్రపంచంలో.. మనుషులు తప్పులో.. నేరాలో చేస్తే వాటిని అరికట్టేందుకు, శిక్షించేందుకు చట్టాలు, శిక్షాస్మృతులున్నాయి. కానీ రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్‌ దునియాలో జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేసేదెలా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ఇప్పటికే కొన్ని దేశాలు చట్టాలను తయారుచేసుకున్నాయి. మరికొన్ని పకడ్బందీ చట్టాలను రూపొందించే పనిలో ఉన్నాయి.

అయితే డిజిటల్‌ దునియాలో..  ప్రపంచంలోని ఓ మూలనున్న వారు మరో మూలనున్న వారిని మోసం చేసేందుకు, వేధించేందుకు అవకాశం ఎక్కువ. సైబర్‌ క్రైమ్‌కి సంబంధించిన చట్టాలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. దీంతో నేరాలు, మోసాలకు పాల్పడిన వారిని పట్టుకోవడమే కష్టం అనుకుంటే వారిని ఏ చట్టాల పరిధిలో శిక్షించాలనేది మరో తలనొప్పిగా మారింది. 

మెటావర్స్‌
డిజిటల్‌ దునియా కారణంగా ఇలాంటి సమస్యలు ఒకొక్కటిగా ముందుకు వస్తున్నా టెక్నోక్రాట్స్‌ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. సోషల్‌ మీడియా దిగ్గజం మార్క్‌ జుకర్‌బర్గ్‌.. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి పోటీగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెటావర్స్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన మెటావర్స్‌ను పరిచయం చేశారు కూడా.

అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోలేదు. అయితే మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే యూనివర్స్‌కి పోటీగా మెటావర్స్‌ లేదా మరోవర్స్‌ రావొచ్చు. ఇలాంటి ప్రత్యామ్నయ ‘వర్స్‌’ల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలకు ఎలా చెక్‌ పెట్టాలన్నది ఇటు టెక్నోక్రాట్స్, అటు దేశాధినేతల ముందున్న సవాల్‌.

ఎప్పటి నుంచో
నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఊహల్లో సాధ్యం చేసుకోవడం మనిషి పుట్టుక నుంచీ ఉన్నదే. దానికి కథలు, కవితలు ఇతర కళారూపాలను సాధనాలుగా మలచుకోవడం నాగరికత నేర్పిందే. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్‌ టెక్నాలజీ రూపంలో మనుషులకు కొత్త కొత్త అవతార్‌లను సృష్టించి ఇస్తోంది. ఆనందలోకంలో తిప్పుతోంది. కానీ క్రమంగా సీన్స్‌ రివర్స్‌ అవుతోంది.

డిజిటల్‌ అవతార్‌ రూపంలో ఉన్న మనిషి ‘టార్గెట్‌’ అవుతున్నాడు. వర్చువల్‌ వరల్డ్‌లో జరిగిన సంఘటనలకు ఇచ్చే ప్రతి స్పందనలతో భౌతిక ప్రపంచంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వర్చువల్‌ వరల్డ్‌లో దాడికి గురైన వ్యక్తులు రియల్‌ వరల్డ్‌లో అసలైన బాధితులుగా మారుతున్నారు.

ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను ఎలా పట్టుకోవాలి ? వారిని ఎలా శిక్షించాలి ? రియల్‌ వరల్డ్‌ తరహాలోనే వర్చువల్‌ వరల్డ్‌ విషయంలోనూ చట్టాలు తయారు చేయాలనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. పరిష్కారమార్గాల అన్వేషణలో కాలయాపన తగదని ఇంగ్లండ్‌ అవతార్‌ రేప్‌ ఘటన చెబుతోంది. చట్టాల రూపకల్పన వేగంవంతం కావాలని హెచ్చరిస్తోంది.

వర్చువల్‌ రేప్‌
ఇంగ్లండ్‌లో ఓ మైనర్‌ బాలిక ఆన్స్‌లైన్స్‌లో వర్చువల్‌ గేమ్‌కు బాగా అలవాటు పడింది. ఆ గేమ్‌లో తన అవతార్‌తో మమేకమైపోయింది. గ్రూప్‌గా ఆడే ఆ గేమ్‌లో కొందరు మగ అవతార్‌లు ఈ మైనర్‌ బాలిక అవతార్‌పై కన్నేశారు. గేమ్‌ ఆడుతూ ఆ బాలిక అవతార్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గేమ్‌లో పూర్తిగా లీనమైపోయిన ఆ అమ్మాయి ఆ వర్చువల్‌ గ్యాంగ్‌ రేప్‌కు కంపించిపోయింది. వాస్తవంగానే తనపై లైంగికదాడి జరిగినట్టుగా ట్రామాలోకి వెళ్లిపోయింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా ఆ వర్చువల్‌ గ్యాంగ్‌ రేప్‌ని ఎలా నిర్ధారించాలి? దానికి కారణమైన నిందితులను ఎలా గుర్తించాలి? ఏ గ్రౌండ్‌ మీద  వారిని  శిక్షించాలనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మొత్తానికి విషయం వైరల్‌ అయింది. వర్చువల్‌ వరల్డ్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా అలసత్వం తగదంటూ  ఒకరకంగా ప్రపంచాన్ని హెచ్చరించిందీ సంఘటన.

ఏకాభిప్రాయం ఉండాలి
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో దూషించే వారిని పట్టుకుని శిక్షించడమే కష్టమవుతుంటే.. డిజిటల్‌ వరల్డ్‌లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత డిజిటల్‌ రైట్స్‌ అనే సమస్యలకు పరిష్కారం చూపడమనేది ఇంకా బాలారిష్టాలనే దాటలేకపోతుంటే.. వీటి తర్వాత లెవెల్‌లోని డిజిటల్‌ వరల్డ్, వర్చువల్‌ రియాల్టీలో జరుగుతున్న .. జరిగే అరచాకాలను అరికట్టడం సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది.

వాటిని నిలువరించే సమర్థవంతమైన వ్యవస్థలు, చట్టాలు ఇంకా రాలేదనే చెప్పాలి. ఇది అనేక సంక్లిష్టతలతో కూడుకున్నది.  డిజిటల్‌ వరల్డ్, వర్చువల్‌ రియాల్టీలో క్రియేట్‌ అవుతున్న సమస్యలపై  ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ట్రోలింగ్, బులీయింగ్, డిఫమేషన్స్‌ వంటి అంశాలపై అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి.

నేరం/ఘటన ఎక్కడ జరిగినా అందుకు సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం, విచారణ చేయడంలో దేశాల మధ్య ఒప్పందాలు జరగాలి. అదేవిధంగా వర్చువల్‌ /డిజిటల్‌ వరల్డ్‌కి సంబంధించిన అంశాలపై సామాన్యులకూ అవగాహన కలిగేలా కెపాసిటీ బిల్డింగ్‌ జరగాలి. కనీసం అవతార్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీగా మారాలి. అప్పుడే జరగబోయే అనర్థాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.     – అనిల్‌ రాచమల్ల, సైబర్‌ క్రైమ్‌ పట్ల అవగాహన కలిగిస్తున్న సాంకేతిక నిపుణులు

కేసులు పెరుగుతున్నాయి
నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ప్రకారం 2022లో.. సైబర్‌ క్రైమ్‌కి సంబంధించి  దేవశ్యాప్తంగా 65,843 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధికంగా చీటింగ్‌ కేసులు 42,710 (64.8 శాతం) ఉండగా బెదిరింపులకు పాల్పడిన కేసులు 3,648 (5.5 శాతం) ఉన్నాయి. ఇక సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్స్‌కి సంబంధించి 3,434 (5.2 శాతం) కేసులు నమోదయ్యాయి.

సైబర్‌ కేసుల పెరుగుదలను పరిశీలిస్తే 2012లో దేశవ్యాప్తంగా 3.693 కేసులు నమోదుకాగా 2022కి వచ్చేసరికి ఈ సంఖ్య 65,893కి చేరుకుంది. నమోదు కాని కేసులు సంఖ్య ఇంతకు నాలుగింతలు ఉండొచ్చని అంచనా. గత దశాబ్దకాలంగా స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వాడకం పెరగడంతో అదే స్థాయిలో సైబర్‌ కేసుల తీవ్రతా పెరుగుతోంది. 2012లో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఫోన్లు ఉపయోగిస్తున్నవారు 12.5 శాతం ఉండగా 2022 చివరికి అది 76.6 శాతానికి పెరిగింది.

హై స్కూల్‌ పిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్‌ ఫోన్స్‌ ఉంటోంది. ప్రస్తుతమైతే సైబర్‌ నేరాల్లో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. సరైన జాగ్రత్తలు, నియంత్రణ లేని పక్షంలో లైంగిక వేధింపులు, మానసిక సమస్యలకూ డిజిటల్‌ దునియానే ప్రధాన కారణం కావడానికి అవకాశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

పేరెంట్స్‌పైనే భారం
ఇంటర్నెట్‌ వినియోగం నేడు అనివార్యమైపోయింది. చిన్నా, పెద్దా అందరికీ అత్యవసరం అయింది. అయితే అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న హద్దును అందరూ మరచిపోతున్నారు. ముందు తేరుకోవాల్సింది పెద్దలే. ఇంటర్నెట్‌నే ఇల్లులా భ్రమపడుతున్న పిల్లలను ఆ మాయజాలం నుంచి బయటకు తేవాల్సిన బాధ్యత పెద్దలదే. అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న గీత మీద అవగాహన కల్పించాలి.

వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గోపత్యను పాటించడం ఇప్పుడు చాలా అవసరం. అన్నీ గూగుల్లోనే ఉన్నాయిశ వేవ్‌లో పడిపోయిన నేటి తరం అంతర్జాలంలో తమ వ్యక్తిగత వివరాలను ప్రూవ్స్‌తోసహా (ఫొటోలు, వీడియోలు వగైరా) ఎంత తక్కువగా అప్‌ డేట్‌ చేస్తే అంత సేఫ్‌గా ఉండొచ్చనే ఫ్యాక్ట్‌ని బ్రెయిన్స్‌ చిప్‌లోకి ఎక్కించాలి. ‘వర్చువల్‌ వరల్డ్‌ అనేది ఒక భ్రాంతి.. అదొక కాలక్షేపం..’ అనే సత్యాన్నీ వీలైనన్ని సార్లు మెదడులో సేవ్‌ చేయించాలి. ఇదీ పేరెంటింగ్‌లో భాగం కావాలి. -కృష్ణగోవింద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement