కరెంటు.. రోడ్డు.. మంచినీళ్ల వసతి .. గ్రామాభివృద్ధికి చిహ్నాలు! గ్రంథాలయం.. ఆ ఊరి చైతన్యానికి నిదర్శనం! ఈ డిజిటల్ వరల్డ్‌లో అలాంటి చైతన్యంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది పశ్చిమగోదావరి జిల్లాలోని కుముదవల్లి.. 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కందుకూరి విరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి చిరునామాగా నిలిచి! 1890వ దశకంలోకి వెళితే.. కుముదవల్లిలోని మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన తిరుపతిరాజుకు పుస్తక పఠనం అంటే ప్రాణం. దానికి కారణం.. ఆ ఊరికే చెందిన పడ్రంగి చిన్నమారాజు.
అప్పట్లో ఆయన తన దగ్గరున్న 50 పుస్తకాలను తిరుపతిరాజు తండ్రి లచ్చిరాజుకిచ్చి లైబ్రరీ ఏర్పాటుకు సాయపడ్డారు. తిరుపతిరాజులో పఠనాసక్తిని కలిగించింది ఆ గ్రంథాలయమే. అందులోని పుస్తకాల వల్లే స్వాతంత్య్ర సమరం గురించి తెలిసింది ఆయనకు. అలా తను చదివిన విషయాలన్నీ తన ఊళ్లోని వాళ్లకూ తెలియాలని.. తమ ఊరూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనాలని తపించారు తిరుపతి రాజు.
ఆ చైతన్యం తన ఊరి ప్రజల్లో రావాలంటే తన తండ్రి ఏర్పాటు చేసిన ఆ చిన్న లైబ్రరీని మరిన్ని పుస్తకాలు, పత్రికలతో అభివృద్ధిపరచాలని నిర్ణయించుకున్నారు. అలా 1897 నవంబర్ 28న ఆ ఊళ్లో చిన్న గుడిసె వేసి ‘కందుకూరి వీరేశలింగం కవి సవూజ గ్రంథాలయం’ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు కొనుగోలు చేయడానికి తిరుపతిరాజు తనకున్న ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ గ్రంథాలయాన్ని స్వయంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులే ప్రారంభించారు.
గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న గ్రామస్థులు, అలనాటి పుస్తకాలు
తిరుపతిరాజు.. కోరుకున్నట్టే స్థానికులు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయానికి వచ్చే పత్రికల్లో చదివి స్ఫూర్తిపొందారు. ఆ గ్రామం నుంచి దాదాపు 24 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అలా ఆ గ్రంథాలయం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. 1934లో గ్రంథాలయోద్యమానికీ పట్టుగొమ్మగా నిలిచింది కుముదవల్లి. ఈ లైబ్రరీ గురించి విరేశంలింగం పంతులు స్వదస్తూరీతో ఇక్కడి మినిట్స్ బుక్‌లో రాసి, చేసిన సంతకం ఇప్పటికీ భద్రంగా ఉంది. రూథర్‌ఫర్డ్ రాసిన అభిప్రాయమూ అందులో కనపడుతుంది.
పూరిగుడిసె నుంచి పక్కా భవనం.. కాలక్రమంలో ఈ లైబ్రరీ పూరిగుడిసె నుంచి పెంకుటిల్లుగా, దాన్నుంచి అధునాతన వసతుల భవంతిగా మారింది. అక్షరాస్యత వ్యాప్తి, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, సహకార పరపతి సంఘం తదితర ప్రజోపయోగ అంశాలకు వైదికయింది. విజ్ఞాన గని.. ఇందులో.. ఎందరో మహామహులు రచించిన గ్రంథాలు, ప్రవుుఖుల చేతిరాత ప్రతులు వంటి అవుూల్యమైన అక్షర సంపద పోగై ఉంది.
ఆత్మకథలు, వచనాలు, నవలలు, ఆధ్యాత్మిక, ఆయుర్వేదం, భారతి, ఆంధ్రపత్రిక, శారద, విజ్ఞానం, గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, బాల వ్యాకరణం, వేదాంతసారం వంటి 17 వేల పుస్తకాలు కనిపిస్తాయిక్కడ. కోస్తా జిల్లాలోని విద్యార్థులు తెలుగుభాష, చరిత్రపై పీహెచ్‌డీ చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, చిలకవుర్తి లక్ష్మీనర్సింహం, దుగ్గరాల బలరామకృష్ణయ్య, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డాక్టరు సి నారాయణరెడ్డి, నండూరి కృష్ణవూచార్యులు వంటి పెద్దలు ఈ గ్రంథాలయానికి వస్తూపోతూండేవారట.
ప్రత్యేకతలెన్నో..
పుస్తక పఠనాన్ని ఈ గ్రామస్థుల జీవనశైలోలో భాగం చేసిన ఆ గ్రంథాలయాభివృద్ధి కోసం కుముదవల్లి ఓ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అక్కడ ఎవరి పెళ్లి జరిగినా ఎంతోకొంత డబ్బును ఆ లైబ్రరీకి విరాళంగా ఇస్తూ! ఇప్పటికీ ఆ లైబ్రరీని దేవాలయంగా భావిస్తారు కుముదవల్లి వాసులు. పాదరక్షలతో లోనికి వెళ్లరు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్‌గా పెనుమత్స సూర్యసుగుణ సేవలందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతకనుగుణంగా ఆ లైబ్రరీలోని పుస్తకాల డిజిటలైజషన్ ప్రక్రియా మొదలైంది. – విజయ్‌కుమార్ పెనుపోతుల
Comments
Please login to add a commentAdd a comment