సంక్రాంతి: వైజ్ఞానికం.. ఆధ్యాత్మికం.. ఆనంద భరితం | The Festival Of Sankranti Is Very Special And Knowledgeladen | Sakshi
Sakshi News home page

సంక్రాంతి: వైజ్ఞానికం.. ఆధ్యాత్మికం.. ఆనంద భరితం

Published Sun, Jan 14 2024 5:10 AM | Last Updated on Sun, Jan 14 2024 6:00 AM

The Festival Of Sankranti Is Very Special And Knowledgeladen - Sakshi

శుభ్రంగా ఊడ్చి కళ్లాపుచల్లిన వాకిళ్ళు ఆ వాకిళ్లలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు ఆ రంగవల్లుల నడుమ ఠీవిగా కూర్చున్న గొబ్బిళ్లు ఇంకా హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వాళ్లు ఇలా ఇంటిముందుకొచ్చిన చిరుకళాకారులందరికీ లేదనకుండా ధాన్యదానం  అమ్మలక్కలతో కలిసి ఆడుతూ పాడుతూ చేసిన రకరకాల పిండివంటలు పండక్కి పిలిచిన బంధుమిత్రులు...

స్వయంగా వెంటబెట్టుకొచ్చిన  కూతురు, అల్లుడు అందరూ కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేయడం, కోడిపందాలు, ఎడ్లపందాలు ఈ సంబరాల కోసమే కదా ఎంత ఖర్చయినా, ఎన్ని కష్టాలు పడ్డా పల్లెటూరికి పయనం కావడం ఇవన్నీ సంక్రాంతి సంబరాలలోని భాగాలే కానీ... ఇవన్నీ ఎందుకు? అని ప్రశ్నించుకున్నప్పుడే కదా ఆ పండగలోని పరమార్థం అర్థమయ్యేది... ఊరంతా కలిసి సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో అంతా ఆనందమే! ప్రతి పనిలోనూ సృజనాత్మకత.. కళాత్మకత తొంగి చూడవలసిందే! 

సాధారణంగా ఏ పండగకైనా కడుపునిండా తినడం, ఆ తర్వాత వినోదాలతో ఉల్లాసంగా ఉండటం మామూలే. అయితే సంక్రాంతి మాత్రం అందుకు భిన్నమైనది. కడుపునిండా తినడం మాత్రమే కాదు, చేతినిండా దానం చేయడం, నడుం వంచి పని చేయడం, నోరారా హరినామ స్మరణ చేయడం, కూతుళ్లను, అల్లుళ్లను ఆహ్వానించి, వారికి సమస్త భోగాలూ సమకూర్చడం, కష్టజీవులు, కళాకారులు, చేతివృత్తిదారులకు తిండిగింజలు కొలవడం, ఆపై కోడిపందాలు, ఎడ్లపందాలు, పతంగులతో వినోదించడం, తమతో సమానంగా ఏడాదంతా కష్టపడ్డ గొడ్డూ గోదను కూడా సమాదరించడం వంటివన్నీ సంక్రాంతి పండగ ఇతర పండగల కన్నా కాస్త విభిన్నమైనదని చెప్పకనే చెబుతాయి. 

ధనుర్మాసం ప్రకృతి తలుపు తట్టడం ఆలస్యం.. తూరుపు తెలతెలవారుతుండగానే ఇంటిముందు అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు.. ఆ వెంట హరిదాసుల సుతిమెత్తని స్వరం నుంచి వెలువడే కీర్తనలు, ఆ కీర్తనలకు తగ్గట్టు చిరతలతో తాళం వేస్తూ.. ఆ తాళానికి తగ్గట్టుగా చిద్విలాసాన్ని చిందిస్తూ ఉంటే వినడానికి, చూడటానికి ఎంత మంగళకరంగా అనిపిస్తుంది! హరిలో రంగ హరీ అంటూ హరిదాసు ఆగిన ఇంటి ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది మాలక్ష్మమ్మ.

నిండైన మనసుతో, ప్రశాంత వదనంతో, మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయపాత్రలో దోసెడు ధాన్యం కుమ్మరించిన ఇల్లాలిని సకల సంపదలతో తులతూగమని ఆశీర్వదించి మరో ఇంటికి వెళుతుంది మహాలక్ష్మీదేవి. దానం చేసిన ఇంట అషై్టశ్వర్యాలూ అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి.

అందుకే సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసే చిరుదానం కూడా అనంత పుణ్య ఫలితాన్నిస్తుందని శాస్త్రం చెబుతోంది. స్వయంకృషితో పాటు భగవత్‌ కృప కూడా తోడుకావడం వల్ల కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సంప్రదాయం. మూడురోజుల సంక్రాంతి నేర్పేది ఇదే! తమకున్న దానిని నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం.

కనికట్టు కళ
మాయాలేదు.. మర్మం లేదు! అంతా కళే! కనికట్టు. చూపరులను ఆశ్చర్యంతో కట్టిపడేసే కళ. కళ్లప్పగించి చూస్తుండగానే కాసును కప్పగా... నిమ్మను దానిమ్మగా మార్చేస్తాడు కాటికాపరి. వీరినే విప్రవినోదులని కూడా అంటారు. కాస్త ఘటికుడైన మాయలోడు అయితే ఇంద్రజాలాన్ని ప్రదర్శించి మరో నాలుగు కుంచెల ధాన్యాన్ని అదనపు బహుమతిగా పొందుతాడు. ఆనందాన్ని పంచే వినోదమూ లక్ష్మీరూపమే! ఇప్పుడు కనుమరుగైన విప్రవినోదులు ఒకప్పుడు పల్లెపల్లెలో చేసే సందడి అంతా ఇంతా కాదు! 

సోది చెబుతానమ్మ.. సోది చెబుతాను..
‘కంచి కామాక్షి పలుకు.. మధుర మీనాక్షి పలుకు..’ అంటూ వచ్చి సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎరుకల సోదమ్మ. చారెడు ధాన్యమిస్తే చాలు.. బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. అమ్మవారి అ అనుగ్రహమో, వంశపారంపర్యంగా వచ్చిన అనుభవమో.. చెప్పించుకునే వారి ముఖాలలో మారే భావాలను బట్టి వెల్లువలా దొర్లే మాటల మహిమో తెలియదు కానీ..

మనసులో దాగున్న మనోవ్యథను మాయం చేసేస్తుంది తన పలుకులతోనే. బతుకును బంగారంలా పండించుకోవడానికి సాక్షాత్తూ ఆ కంచి కామాకమ్మో, మధుర మీనాక్షమ్మో ఎరుక చెప్పే సోదెమ్మ రూపంలో సాక్షాత్కరించిందేమో అన్నట్లు చెబుతుంది. 

నందీశ్వరుడే ఇంటిముంగిట నర్తనమాడేవేళ...
డూ డూ బసవన్నను తోలుకొని గంగిరెద్దు దాసరి వచ్చేది.. పాతబట్టలు ఇస్తారనే ఆశతోనే కావచ్చు! కానీ, పండుగ సరదాని పదింతలు పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తాడు. వీనులవిందైన డోలు, సన్నాయి వాద్యాలతో ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అంటూ బసవన్నను ఆడిస్తూ ఇంటిల్లిపాదీ పండుగపూట నందీశ్వరుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాడు.

గంగిరెద్దును ఆడించే అప్పన్న మాత్రం తక్కువా! సాక్షాత్తూ విష్ణుమూర్తి స్వరూపమే! పూర్వం గజాసురుడి పొట్టలో ఉన్న పరమేశ్వరుణ్ణి వెలుపలికి రప్పించడానికి శ్రీమహావిష్ణువు వేషం మార్చి, గంగిరెద్దుల మేళాన్ని కట్టిన కథ ప్రతి ఏటా వినాయక వ్రతకల్పంలో చదివేదే కదా! ఘల్లు ఘల్లుమని మోగే గంగిరెద్దుల కాళ్లగజ్జెల మోత సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి కాలి అందెల మోతను తలపిస్తుంది. 

కైలాసాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసే డమరుక నాదాలు
‘అంబ పలుకు.. జగదంబ పలుకు..’ అని గొంతెత్తే బుడబుక్కల కళాకారుడు శకున శాస్త్రంలో సాటిలేని మేటి. తొలికోడి కూసింది మొదలుకొని నింగిలో సూర్యకిరణాలు చురుక్కుమనిపించే వరకు అతను పలికిందల్లా బంగారమే! అతని చేతి డమరుకం ధ్వని చెవిన పడినవారంతా సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువుండే కైలాసాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసుకుంటారు.

ఒకటేమిటి సంక్రాంతి వేళ పల్లెపల్లెలో కనిపించే, వినిపించే కళారూపాలన్నీ పుష్యలక్ష్మి అనుగ్రహాలే! ఇన్ని సంబరాలు స్వాగతం పలుకుతూ ఉండగా.. పుష్యమాసంలో పౌష్యలక్ష్మి ప్రతి ఇల్లూ తన పుట్టిల్లే అని భావించి కదిలి వస్తుందని కవులు అభివర్ణించారు. సంక్రాంతి అంటే చేరడం అని అర్థం. ఈ పండుగ నాటికి పొలాల్లోంచి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుతుంది. పట్నవాసులంతా పల్లెకు చేరుకుంటారు.

ఇలాతలం నుంచి రివ్వున ఎగిరే గాలిపటాలు గగనతలంలోకి దూసుకెళ్తాయి. భోగిపండ్ల అభిషేకం కోసం పిల్లలంతా వాడకట్టులోని ఇండ్లలోకి చేరిపోతారు. నోముల వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ముత్తయిదువలు కలివిడిగా ఒక్కో ఇంటికి చేరిపోతుంటారు. ఇన్ని చేరికలకూ కారణం ఆదిత్యుడు ధనుస్సులోంచి మకర రాశిలోకి సంక్రమించడం. ఆయన నెలకో రాశి మారుతూనే ఉంటాడు కదా! ఇదే ఎందుకు ప్రత్యేకం? ద్వాదశాదిత్యుడైన దివాకరుని దివ్యయాత్రలో ప్రధాన ఘట్టాలు నాలుగు.

అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణాలు. మార్తాండుడు ఈ మజిలీలు చేరగానే వాతావరణంలో మార్పులు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో మకర సంక్రమణం మరింత మనోహరం. జొన్న, సజ్జ, కొర్ర తదితర మెట్ట పంటలు దట్టంగా పండి దిట్టంగా దిగుబడులు కురిపించే కాలమిది. వరి కోతలు పూర్తయ్యే ముచ్చట తెలిసిందే! పాడి గేదెలు దండిగా పాలను వర్షించే కాలం, లేగదూడలతో పశుసంపద పెరిగే సమయం ఇది. ప్రకృతి పరంగా ఇన్ని విశేషాలున్న ఈ కాలం ఆధ్యాత్మికంగా మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నది.

ఆరోగ్య క్రాంతి
‘సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమ’ని సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటేనే కదా.. ఏ పనైనా చేయగలం. సంక్రాంతి సందర్భంగా చేసే పిండివంటలన్నీ ఆరోగ్య సాధనకు అక్కరకొచ్చేవే! చకిలాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు ఇలా చేసే ప్రతి పదార్థమూ నువ్వులు, బెల్లం ప్రాధాన్యం కూడుకున్నవే ఉంటాయి. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని అందించడంతోపాటు కీళ్లకు సత్తువనిస్తాయి.

సజ్జలు పండే ప్రాంతంలో నువ్వులు చల్లుకొని సజ్జరొట్టెలు చేసుకునే ఆచారం ఉంది. ఉత్తర భారతదేశంలో గొంగళ్లు దానం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఇలా దానమిచ్చిన వారికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి పర్వం సందర్భంగా శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు.

నువ్వులు కొనలేని బీదసాదలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియమం చేశారు పెద్దలు. ఈవిధంగా సంక్రాంతి పండుగ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు సామాజిక బాధ్యతనూ గుర్తుచేస్తుంది. సంక్రాంతి సందడికి తలలూపుతూ తొలుతగా స్వాగతం పలికేది పతంగులే! ఈ పండుగకు పదిరోజుల ముందు నుంచే రంగురంగుల గాలిపటాలు నింగిలో గిరికీలు కొడుతూ గాలివాటానికి తగ్గట్టుగా తలలు వంచి వందనాలు చేస్తూ సయ్యాటలు ఆడతాయి.

ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా పతంగులు ఇప్పుడు ఎగురవేయడం దేనికి? ఈ ప్రశ్న వెనుకా ఆరోగ్య మంత్రమే సమాధానంగా కనిపిస్తుంది. ఈ కాలంలో సూర్యరశ్మి అధికంగా అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు! అందుకే కాబోలు పెద్దలు పతంగుల సంప్రదాయానికి తెరలేపారు.

గాలిపటాల జోరులో, పతంగులతో పేచీ పడుతూ పిల్లలంతా ఆరుబయట అలసిపోతున్నా పట్టించుకోకుండా వినోదిస్తుంటారు. ఈ క్రమంలో శరీరానికి కావాల్సినంత ‘డి’ విటమిన్‌ లభిస్తుంది. అంతేకాదు.. నింగిలోకి అలా చూస్తూ ఉండటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వారిలో పెరుగుతుంది. 

భోగి.. పిల్లల వైభోగం
సంక్రాంతికి ముందురోజు ‘భోగి’తో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు ఇదే. ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం.

రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగుపండ్లకు బదరీఫలాలు అని పేరు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీఫలాలను కురిపించారట.

ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు.

పండగలోని పరమార్థం
సంక్రాంతి అనగానే ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దటం భోగిమంటలు వేయడం, బాలలకు భోగిపళ్లు పోయడం, పిండివంటలు చేసుకోవడం, బంధుమిత్రులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేయడం అనే అనుకుంటూ ఉంటుంది నేటితరం. నిజానికి ఇవన్నీ సంక్రాంతి సంబరాలలోని భాగాలే కానీ, ఎందుకు చేయాలి ఇవన్నీ అని ప్రశ్నించుకున్నప్పుడే ఆ పండగలోని పరమార్థం అర్థమయ్యేది. 

గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బొమ్మల కొలువు తీర్చిదిద్దడం, కోడిపందాలాడటం ఈ పండగ పేరు చెప్పగానే ఎలా గుర్తుకొస్తాయో, సంక్రాంతి అంటే నిర్వాణం, మోక్షం అని కూడా అర్థం కావాలి. పరమేశ్వరుడితో ఎలా మమేకం కావాలో తెలియాలి.

సూర్యుడు ఈ పర్వదినాన ధనుర్రాశి నుంచి మకరరాశికి మారుతుండటం వల్ల ఈ రోజును మకర సంక్రాంతి అనడం పరిపాటి. నిజానికి సంక్రాంతి పండగ రైతుల పండగ, పెద్ద పండగ, పెద్దల పండగ. ఆడపడచులు, అల్లుళ్ల పండగ. కళాకారుల పండగ. చేతివృత్తుల వారి పండగ. ఆఖరకు పశువులకు కూడా పండగే. 

భోగిపండగ ఏం చెబుతోందంటే...
భోగి రోజున తెల్లవారుఝామునే లేచి ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగిమంటల్లో వేసి కాల్చేస్తూ ఉంటారు. అంటే గతం తాలూకు  జ్ఞాపకాలు, ఆలోచనలు అలాగే అశాశ్వతాలైన ఆస్తి, వస్తువులు, పాతబడి, పాడైపోయిన పరికరాలు, పనిముట్లపై వ్యామోహం వదిలేయనంతవరకు ఆనందంగా ఉండలేమని, గతం నుంచి బయటపడి వర్తమానంలో ఉండటమే పండగ అని చెబుతోంది భోగి.

రైతులు సంవత్సరం పొడవునా వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్తాచెదారాన్ని భోగిరోజున ఉదయాన్నే మంటలుగా వేసుకుంటారు. ఇండ్లలో ఉన్న పాత కలప, పనికిరాని వస్తువులను అన్నింటిని మంటలో వేయడాన్ని వరుణయాగంగా పిలుస్తారు.

ఎందుకంటే వరుణదేవుని కరుణా కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్లలోకి ధాన్యం రావడం ఆనందంతో ఉండటం, తరువాతి సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణుడు అనుగ్రహించాలనే దృక్పథమే ఈ మంటలు వేయడంలోని ఉద్దేశం.  మేఘాలకు అధిపతి అయిన వరుణదేవుడిని గ్రామీణులు భోగి మంటల రూపంలో చేసే వరుణ యాగం ద్వారా ప్రార్థిస్తారు. 

ఆ పిండివంటలే ఎందుకు?
ఈ పండగ చలికాలంలో వస్తుంది కాబట్టి బియ్యం, బెల్లం, పాలు, నువ్వులు, మినుములతో వండిన పిండివంటలు తీసుకోవడం వల్ల శరీరంలో కొంత ఉష్ణం పెరిగి చలికాలంలో ఉండే నిస్సత్తువ, నిస్పృహ, నిరాశ వంటి లక్షణాలు పోయి ఉత్సాహంగా ఉండటానికి దోహదం చేస్తుంది. 

పతంగులకు పండగొచ్చింది!
సాధారణంగా మన పండుగలన్నీ చంద్రుడి గమనం మీదనే ఆధారపడి ఉంటాయి. సంక్రాంతి ఒక్కటే సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటున్నాము. సూర్యుడు మనకు ఎన్నోవిధాలుగా సహకరిస్తుంటాడు. పంటలు బాగా పండి మనమంతా ఆరోగ్యంగా ఉండటంలో, సృష్టి అంతా మనుగడ సాగించగలగడంలో సూర్యుడి పాత్ర సాటిలేనిది. రకరకాల రంగు రంగుల గాలిపటాలు ఎగురవేస్తూ మన సంతోషాన్ని, కృతజ్ఞతలను సూర్యునికి తెలియ జేయడమే పతంగుల పండగ వెనక ఉన్న అంతరార్థం.

అంతేకాదు, దేవతల పగలు అయిన ఉత్తరాయణంలో దేవతలకు స్వాగతం పలకడం, గాలి వాలును బట్టి గాలిపటం ఎటుపడితే అటు ఎగిరిపోకుండా సమతుల్యత సాధించడం కోసం మనం దారాన్ని పట్టుకుని ఏకాగ్రంగా ఎగురవేసినట్లే జీవితంలోని ఒడుదొడుకులను, సమస్యలు, సవాళ్లను కూడా ఎదుర్కోగలగాలి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే ఈ పండుగనాడు గాలిపటాలను ఎగురవేస్తాం. 

సంక్రాంతి దానాలు.. తర్పణాలు
మకర సంక్రమణంతో ప్రచండ తేజోమంతుడైన సూర్యుడు తన దివ్యకాంతులతో నూతన తేజాన్ని, కొత్తదనాన్ని కల్పించడానికి స్వాగతించే రోజే మకర సంక్రాంతి. ప్రతినెలా జరిగే సూర్యసంక్రమణాలలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా గోచరించదు.

కాని మకర సంక్రమణంతో ప్రకృతిలో వచ్చే మార్పు స్పష్టంగా కనపడుతుంది. మకర సంక్రాంతినాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో యథాశక్తి దానధర్మాలు చేస్తే జన్మజన్మల దారిద్య్రబాధలు అంటవని పెద్దలు చెబుతారు. అందుకే పితృదేవతలందరికీ తర్పణాలు ఇచ్చుకుంటారు.

మోక్ష సాధన మార్గం
ఆధ్యాత్మిక సాధనలన్నీ మోక్షలక్ష్మిని పొందడానికే! ఇహంలో సకల సంపదలతో తులతూగినా.. పరంలో సాధించాల్సిన స్థిరమైన సంపద మోక్షమే కదా! మహోన్నతమైన పురుషార్థాన్ని పొందడానికి అనువైన కాలం ఉత్తరాయణం. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్రఫలకారిగా అనుకూలించే సమయమిది.

ఉత్తరాయణాన్ని దేవయానంగానూ అభివర్ణిస్తారు. వెలుగును ఇచ్చే మార్గంగా దీన్ని చెబుతారు. ఇదే ఉత్తరాయణం. రెండోది పితృయానం. ఇది చీకటి మార్గం, ధూమ మార్గం. అదే దక్షిణాయనం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తత్త్వాన్ని గ్రహించిన ఉపాసకులు ఉత్తరాయణ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకుంటారు.

కనుమ... ముక్కనుమ
సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో మనతోపాటు శ్రమించిన ఎడ్లను, పాడికి ఆధారమైన గోవులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. సేద్యానికి ఉపయోగించే పరికరాలను కూడా శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పొంగళ్లు చేసి పొలాల్లో చల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్లను ఊరేగిస్తారు.

దక్షిణ కర్ణాటకలోని పల్లెల్లో ఎడ్లతో ‘కంబళ’ పోటీలు నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు సంక్రాంతి వేళకు అక్కడికి చేరుకుంటారు. కనుమ మర్నాడు ముక్కనుమగా చెబుతారు. 

గురుగులు.. కుంకుమ భరిణెలు..
సంక్రాంతి పండుగలో ముత్తయిదువలు నోము ఆచరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి ముందు పక్షం రోజులను పీడదినాలుగా భావిస్తారు. వృద్ధులు, రోగపీడితులు ఈ కాలంలో మరణించే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిహారంగా సంక్రాంతి పూట వ్రతం చేస్తారు. అమ్మవారిని ఆరాధిస్తారు. ఒకప్పుడు మట్టి గురుగులను నోములో ఉంచి గురిగితోపాటు పసుపు, కుంకుమ, నువ్వులు ముత్తయిదువలకు వాయనంగా ఇచ్చేవారు.

ఇప్పుడు గురుగుల స్థానంలో భరిణెలు, ఇతర అలంకరణ వస్తువులను వాయనంగా ఇస్తున్నారు. పండుగ వేళ పాలు పొంగించే తంతు ప్రహసనంగా సాగుతున్నది. ఇంటి మధ్యలో ఆవుపిడకలపై మట్టి గురిగిలో పాలను మరిగించి, పొంగిస్తారు. పాలు పొంగి ఇంటి లోపలి వైపునకు దొర్లితే ఆ ఏడాది సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఉత్తరాయణ ప్రవేశ సమయంలో కొందరు పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు విడుస్తారు. కూష్మాండదానం చేస్తారు.

సంక్రాంతి పండుగలో ఆద్యంతం ఆనందాలే కనిపిస్తాయి. ప్రతి పనిలోనూ దైవత్వం దర్శనమిస్తుంది. సంప్రదాయాలు, సందళ్లు అన్నిటా వైజ్ఞానిక రహస్యాలూ దాగి ఉన్నాయి. సంక్రాంతి శోభను పల్లెపల్లెకూ పంచే కళాకారులకు తోచింది ఇవ్వడం, వ్యవసాయంలో సాయంగా ఉన్న పశువులను పూజించుకోవడం, ఏడాదంతా మనకు చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తులకు పంటలో భాగం ఇవ్వడం.. ఇవన్నీ మన పెద్దలు ఆచరించి, ఆనందించిన విధానాలు. వారి అడుగుజాడల్లోనే మనమూ పయనిద్దాం. సంక్రాంతి లక్ష్మిని సమంగా పంచుకుందాం!  - డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement