Sunday Cover Stories
-
Cover Story: వెడ్డింగ్ విడ్డూరాలు
మాఘం వచ్చేసింది.. మనువాడాలనుకునే జంటలు మంచి రోజుకోసం ఎదురుచూస్తున్నాయి! జీలకర్ర – బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. అప్పగింతలు.. హిందూ సంప్రదాయంలోని ఈ తంతు దాదాపు దేశమంతా ఒకేలా ఉంటుంది.. పెళ్లికి ముందు.. తర్వాత ఉండే ఆచారవ్యవహారాలు.. వాటిల్లోని కొన్ని వ్యత్యాసాలు తప్ప! మన దగ్గర పెళ్లి.. కుటుంబ సంబరంగా కన్నా సామాజిక ఆడంబరంగానే అలరారుతోంది. ఖర్చు మోయలేని భారమైనా ప్రతి తంతునూ ఆనందంగా.. బంధుమిత్ర సమేతంగా ఆస్వాదిస్తున్నారు. ఈ దేశంలో హిందూ మెజారిటీ, ముస్లిమ్, క్రిస్టియన్ మైనారిటీల తర్వాత సిక్కు, జైన్, పార్సీ, బౌద్ధ మతాలూ ఉన్నాయి. సీరియళ్లు, సిరీస్‌లు, భారతీయ చిత్ర పరిశ్రమ.. ఇవన్నీ హిందూ పెళ్లికి ఎంత గ్లామర్‌ని పెంచాయో ముస్లిం, క్రిస్టియన్ పెళ్లిళ్లకూ తెర మీద అంతే స్పెస్నిచ్చాయి. కాబట్టి వాటి ప్రస్తావన లేకుండా మిగిలిన మైనారిటీ మతాల్లోని పెళ్లితంతు, దాని ఆచార వ్యవహరాలతోపాటు పలు దేశాల్లోని పెళ్లి పద్ధతులు, సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? అన్నిట్లో.. అన్ని చోట్లా పెళ్లి ఇంతే ఘనమైన వేడుకగా ఉందా? చూద్దాం.. ఆనంద్ కారజ్ సిక్కు మతంలో పెళ్లి తంతును ఆనంద్ కారజ్ అంటారు. అంటే ఆనందమయమైన జీవితం వైపు అడుగులు అని తెలుగు అర్థం ఇచ్చుకోవచ్చు. ఈ తంతును గురు అమర్ దాస్ మొదలుపెట్టారు. దీన్ని సిక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. గురుద్వారాలో గురు రామ్‌దాస్ స్వరపరచిన నాలుగు లావాల (శ్లోకాలు లేదా భజనలు)ను చదువుతూ లేదా పాడుతూ ఆనంద్ కార్జ్ను నిర్వహిస్తారు. వరకట్నం నిషిద్ధం. అంతేకాదు పెళ్లికి ముందు జాతకాలు చూసుకోవడాలు.. ఆ జాతకాల ప్రకారం పెళ్లి ముహూర్తం నిర్ణయించడం కూడా నిషిద్ధమే. హిందూ పెళ్లిలో ఉన్నట్లే సిక్కు వివాహ వేడుకలోనూ పెళ్లికి ముందూ తర్వాతా రోజుకో తంతు ఉంటుంది. లగన్ పార్సీ పెళ్లిని లగన్ అంటారు. పార్సీలకూ వారం రోజుల పాటు ఈ లగన్ వేడుక ఉంటుంది.. రకరకాల తంతులతో. అయితే అన్నీ కూడా సింపుల్‌గా.. సరదాగా ఉంటాయి. సాధారణంగా.. పార్సీలు పూజించే ఫైర్ టెంపుల్ (అగ్ని దేవాలయం)లోనే లగన్ ఉంటుంది. గుడిలో ఏర్పాటు చేసిన పెళ్లి మంటపానికి ముందు వరుడు వస్తాడు. వధువు తల్లి ఒక ట్రేలో పచ్చి కోడిగుడ్లు, వక్క, బియ్యం, కొబ్బరికాయ, ఖర్జూరాలు, నీళ్లతో మంటపానికి వస్తుంది. నీటిని తప్ప మిగిలిన అన్నిటితో వరుడి తల చుట్టూ ఏడుసార్లు దిష్టి తీసినట్టుగా తిప్పి వరుడి తల మీంచి విసిరేస్తుంది. ఆ తర్వాత నీళ్లను వరుడి కుడి ఎడమల వైపు చల్లేస్తుంది.అనంతరం పెళ్లి కూతురు వస్తుంది. పెళ్లి ఎంత సింపుల్‌గా జరుగుతుందో రిసెప్షన్ అంత గ్రాండ్‌గా ఉంటుంది. అసలు పార్సీల లగన్ ఈ రిసెప్షన్తోనే ఫేమస్. చక్కటి సంగీతం.. సూపర్ డాన్స్‌లు.. నోరూరించే వంటకాలతో అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా దాన్ని పార్సీ కల్చరల్ పరేడ్ అనొచ్చు. మంగళ్ ఫేరా జైన్స్‌లో కూడా హిందువులకున్నట్లే లగ్న లేఖన్ (పెళ్లి పత్రిక రాసుకోవడం) దగ్గర్నుంచి సగాయి (నిశ్చితార్థం), మంగళ్ ఫేరా (పెళ్లి), స్వగృహ ఆగమన (అత్తారింటికి వెళ్లడం) వరకు ముఖ్యమైన ఘట్టాలన్నీ ఉంటాయి. అయితే సగాయిలో ఉంగరాలు మార్చుకోవడం వంటివి ఉండవు. ఈ వేడుక పెళ్లికొడుకు ఇంట్లో జరుగుతుంది. పెళ్లికూతురి సోదరుడు వెళ్లి పెళ్లికొడుకు నుదుట తిలకం దిద్ది, కట్నకానుకలు అందజేస్తాడు. పెళ్లికి ముందు వధూవరులిద్దరి ఇళ్లల్లో మండప్ పూజ జరుగుతుంది. దీని తర్వాతే హారతితో పెళ్లి కొడుకు బారాత్‌ను పెళ్లి మంటపానికి ఆహ్వానిస్తారు. అక్కడ ముత్తయిదువల మంగళ గీతాల మధ్య పెళ్లికొడుకు, పెళ్లికూతురి సోదరుడు ఇద్దరూ ఒకరికొకరు తిలకం దిద్దుతారు. అనంతరం పెళ్లికొడుకు తాను తెచ్చిన కానుకలను ఇస్తాడు. దీని తర్వాతే పెళ్లికొడుకు పెళ్లి వేదిక మీదకు వెళ్తాడు. అప్పుడు కన్యాదానం తంతు మొదలవుతుంది. పెళ్లికూతురి తండ్రి పెళ్లికొడుకు చేతిలో రూపాయి పావలాతోపాటు పెళ్లికూతురి చేతిని ఉంచుతూ వరుడికి పిల్లను అప్పగిస్తాడు. దాని తర్వాత వధూవరులిద్దరూ కలసి అగ్ని చుట్టూ తిరుగుతారు. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుని అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్తారు. నిజానికి జైన్స్ సింప్లిసిటీకి మారుపేరు అని చెప్తారు. ఇదివరకైతే వాళ్ల పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరిగేవట. కాని కొత్త తరం హంగు, ఆర్భాటాలనే ఇష్టపడుతున్నట్టుంది ఇక్కడ కూడా! అసోంలో.. ఒక గమ్మత్తయిన పెళ్లి ఆచారం ఉంది. వధువు తరఫు బంధుమిత్రులు వరుడికి రకరకాల పొడుపు కథలు చెప్పి సమాధానమివ్వమంటారు. జవాబు చెప్పలేకపోతే డబ్బు డిమాండ్ చేస్తారు. ఆ సవాళ్లన్నింటినీ ఛేదించుకుంటూ వధువును చేరుకోవాలి వరుడు. తన ప్రేమను చాటుకోవాలి. చెసియన్ పెళ్లిని బౌద్ధం ఒక కుటుంబ వ్యవహారంగానే చూస్తుంది. మతానికి సంబంధించిన విషయంగానో.. సామాజిక అంశంగానో చూడదు. స్త్రీ, పురుషుల ఎంపికలాగే పరిగణిస్తుంది. అందుకే పెళ్లి వేడుక కూడా చాలా నిరాడంబరంగా ఉంటుంది. పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థాన్ని చెసియన్ అంటారు. నిశ్చితార్థానికి వరుడి తల్లిదండ్రులు వధువు కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల మధ్య నిశ్చితార్థం జరుగుతుంది. ఆ రోజే పెళ్లి తేదీని నిర్ణయిస్తారు. పెళ్లి వధువు ఇంటి దగ్గరైనా లేదా బౌద్ధాలయంలోనైనా జరుగుతుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు వధూవరులిద్దరినీ ఆశీర్వదిస్తారు. వివాహం ఒకవేళ వధువు ఇంట్లో జరిగితే పెళ్లి తర్వాత వధూవరులిద్దరూ బౌద్ధాలయానికి వెళ్లి అక్కడా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆసియా దేశాలకు వెళితే.. ములుకు లేని బాణాలు.. అదృష్టజాతకురాలు చైనాలో.. కాబోయే వరుడు ములుకు తీసేసిన బాణాలతో గురి చూసి వధువు మీదకు వేయాలి. తర్వాత వాటన్నిటినీ పోగు చేసి.. పెళ్లి రోజున విరిచేయాలి. ఇలా చేస్తేనే వారి మధ్య ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆ బంధం బలపడుతుందని చైనీయుల విశ్వాసం. ఇంకో విషయం ఏంటంటే.. పెళ్లికూతురి తరఫువారు.. ఊళ్లోని ఒక అదృష్టజాతకురాలిని అద్దెకు తీసుకొచ్చి పెళ్లికూతురి వెంట ఆమెకు తోడుగా అత్తారింటికి పంపిస్తారు. అలా పంపిస్తే ఆమె అదృష్టం పెళ్లికూతురికీ వస్తుందని చైనీయుల నమ్మకమట! సింహాసనంలా అలంకరించిన కుర్చీలో పెళ్లికూతురు ఊరేగింపుగా అత్తారింటికి వెళ్తుంది. అలా వెళ్లేప్పుడు దారంతటా పెళ్లికూతురి తరఫు బంధువులు వధువుకి గొడుగు పడుతూ అక్షింతలు జల్లుతూ ఉంటారు. తల మీద కొంగుతో.. జపాన్‌లో.. పెళ్లి సమయంలో షింటో మత సంప్రదాయం ప్రకారం నిర్వహించే వేడుకలో వధువుపై నుంచి కింది దాకా తెల్లటి దుస్తులను ధరించాలి. తల మీద నుంచి మెడ వరకు ‘సునోకకుషి’ అనే వస్త్రాన్నీ వేసుకోవాలి. తెలుపు వర్ణం ఆమె కన్యాత్వాన్ని సూచిస్తే.. తల మీది వస్త్రం ఆమెకు తన అత్తగారి పట్ల ఉన్న అసూయను దాస్తుందట. పెళ్లిళ్లు సాధారణంగా షింటో ఆలయాల్లో జరుగుతాయి. ఆలయంలో కాకుండా ఇళ్లల్లో జరిగినా, వధూవరులు తప్పనిసరిగా ఆలయానికి వెళ్లి అక్కడి ‘కామి’లకు (దేవీదేవతలు) తమ పెళ్లిని తెలిపి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత వధూవరులిద్దరూ బియ్యం నుంచి తయారు చేసే ‘సకీ’ అనే మద్యాన్ని మూడేసి గుటకల చొప్పున తాగుతారు. తర్వాత బంధుమిత్రులతో కలసి విందు చేసుకుంటారు. ఎండు చేపతో.. దక్షిణ కొరియాలో పెళ్లి వేడుకలో ఒక వింతయిన ఆచారం ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం, అతని స్నేహితులు పెళ్లికొడుకును బోర్లా పడుకోబెట్టి అతని అరికాళ్లపై కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ కొడుతూ గమ్మత్తయిన ప్రశ్నలు వేస్తుంటారట. వరుడు ఆ దెబ్బలను తింటూ వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటాడు. పెళ్లి కొడుకు జ్ఞాపకశక్తి చురుగ్గా ఉండటానికి ఇలా చేస్తారట. మ్యారేజ్ డే.. భార్య బర్త్ డే.. వంటివన్నీ గుర్తుంచుకోవడానికేనేమో! పావురాలు ప్రేమ ప్రతీకలు ఫిలప్పీన్స్‌లో పెళ్లయిన వెంటనే వధూ వరులిద్దరూ తెల్ల పావురాల జంటను గాల్లోకి ఎగరేస్తారట. ఆ దేశంలో తెల్ల పావురాలను సఖ్యత, ప్రేమానుబంధాలకు ప్రతీకలుగా భావిస్తారు. అప్పుడే పెళ్లయిన జంట అలా ఆ పావురాలను గాల్లోకి వదిలేస్తే ఆ జంట కూడా పదికాలాలపాటు ప్రేమానుబంధంలో బందీగా ఉంటుందని ఆ దేశస్తుల నమ్మకమట. అందుకే అలా పావురాలను ఎగరేస్తారు. జెండా ఎగరేసి.. టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లికి సంబంధించి గమ్మత్తయిన ఆనవాయితీ ఉంది. పెళ్లి ముహూర్తాన.. వరుడి స్నేహితులు వరుడి ఇంటి ఆవరణ లేదా ఇంటి మీద టర్కీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆ జెండాకు ఆ ప్రాంతంలో దొరికే పళ్లు, కూరగాయలతోపాటు అద్దాలనూ వేలాడదీస్తారట. పెళ్లి వేడుక మొదలైందని అలా జెండా ఎగరేసి మరీ ఊళ్లో్లవాళ్లకు చాటుతారన్నమాట! యూరప్‌లో వెడింగ్ కస్టమ్స్... పెళ్లి కూతురిని దాచేసి.. రూమేనియాలో.. వధువు తరఫు బంధువులు.. పెళ్లి ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వధువును దాచేస్తారు. వరుడొచ్చి తనకు కాబోయే భార్య ఎక్కడుందో చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. ‘చెబుతాం కానీ ఖర్చు అవుతుంది’ అంటారు. గిఫ్ట్స్ కావాలని డిమాండ్ చేస్తారు. అలా వరుడిని ముహూర్తం వేళ వరకూ ఆటపట్టించి.. చివరకు ఒక మంచి పాట పాడాలని పట్టబట్టి వరుడి చేత ఓ లవ్ సాంగ్ పాడించి..పెళ్లికూతురిని అప్పజెప్తారు. ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మ్యారేజ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే.. ఉమ్మేస్తేనే అదృష్టం ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పెళ్లి ఆచారం వింటే విస్తుపోతారు. పెళ్లి రోజున వధువు తండ్రి ఆమె వేసుకున్న వెడింగ్ డ్రెస్ మీద ఉమ్మేస్తాడు. కోపంతో కాదు.. ప్రేమతో! బిడ్డ వైవాహిక జీవితం బాగుండాలి.. ఆమె అదృష్టవంతురాలు కావాలనే ఆశతో! అవును అది వాళ్ల ఆచారం. అలా చేయని తండ్రి బిడ్డ క్షేమాన్ని కోరనట్టే అట. ఒంటె నాట్యం దక్షాణ ఆఫ్రికా దేశం నైజర్‌లో పెళ్లయిపోయాక ఎడారిలో రిసెప్షన్ పార్టీ పెడతారు. ఆ పార్టీలో అతిథుల మధ్య.. డ్రమ్ బీట్‌కి అనుగుణంగా ఒంటె డాన్స్ చేస్తుంది. రిసెప్షన్‌కి ఒంటె డాన్స్ వినోదమే కాదు అక్కడి పెళ్లి ఆనవాయితీ కూడా! ఆస్ట్రేలియా దేశాల్లోని పెళ్లి ఆచారాలు చూస్తే.. రంగు రాళ్లు రిటర్న్ గిఫ్ట్స్ కావు ఆస్ట్రేలియాలో పెళ్లికి వచ్చిన అతిథులు అందరికీ రంగు రాళ్లు ఇస్తారు. ఓ టేబుల్ మీద ఒక బౌల్ పెడతారు. పెళ్లయి.. విందు ఆరగించి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయే ముందు ఈ అతిథులు అంతా తమ దగ్గరున్న రంగురాళ్లను ఆ బౌల్లో వేసి వెళ్లిపోతారు. కొత్త పెళ్లి జంట ఆ బౌల్‌ని తీసుకుని తమ ఇంటికి వెళ్లి దాన్ని డ్రాయింగ్ రూమ్‌లోనో.. బెడ్ రూమ్‌లోనో డెకరేటివ్ పీస్‌గా పెట్టుకుంటుంది. తమ పెళ్లికి హాజరైన అతిథులకు గుర్తుగా! ఇది అక్కడి ఆచారం! పన్ను పీకి చేతిలో పెట్టాలి ఫిజీ ద్వీపంలో.. ఏ కుర్రాడైనా ఏ పిల్ల మీదైనా మనసు పారేసుకుని.. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి ‘మీ అమ్మాయిని ఇష్టపడుతు న్నాను.. పెళ్లి చేసుకుంటాను’ అని అడిగితే.. ఆ పిల్ల తండ్రి వెంటనే ‘కడలి ఈద గలవా ఓ వరుడా.. అడుగుకు డైవ్ చేయగలవా? డైవ్ చేసి తిమింగలం నోటిలోని పన్ను పీక గలవా?’ అని సవాలు విసురుతాడు. ఆ అమ్మాయి మీద తన ప్రేమను నిరూపించుకోవాలంటే అబ్బాయి ఆ చాలెంజ్‌ను స్వీకరించాల్సిందే.. సముద్రంలోకి దూకి తిమింగలం పన్ను పీకి కాబోయే మామగారి చేతిలో పెట్టాల్సిందే! జంకినా.. వెనకడుగు వేసినా.. అమ్మాయి మీద ప్రేమలేనట్టే! అది అక్కడి తీరు మరి! దక్షిణ అమెరికాలో.. బద్దలు కొట్టాల్సిందే! గ్వాటెమాలలో కొత్తపెళ్లి జంటను ‘వందేళ్లు కలసి జీవించండి’ అని దీవిస్తే సరిపోదు.. గంటను బద్దలు కొట్టాల్సిందే! బియ్యం, పిండి వంటివన్నీ వేసిన గంట లాంటి పింగాణీ పాత్రను పెళ్లి కొడుకు తల్లి.. నేలకేసి కొడుతుంది. దీనివల్ల కొత్త పెళ్లి జంట మీది చెడు దృష్టి పోయి.. ఆ వధూవరులు సుఖశాంతులు, అషై్టశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకమట. అందుకే వరుడి తల్లి.. కొడుకు, కోడలిని నోటిమాటతో ఆశీర్వదిస్తే సరిపోదు, పింగాణి గంటను పగలకొట్టాలి. ఉత్తర అమెరికాలో.. ఎనిమిదిలా.. మెక్సికోలో.. పెళ్లి ప్రమాణాలు పూర్తయిన వెంటనే రోజా పూలదండను ఎనిమిది అంకెలా మలచి దాంతో వధూవరులిద్దరినీ బంధిస్తారు. అలా చేయడాన్ని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారట. మిగిలిన కార్యక్రమాలు అయిపోయేంత వరకు ఆ ఇద్దరూ అలా దండఖానాలో బందీలుగా ఉండాల్సిందే. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక ఆ జంటను విముక్తం చేసి ఆ దండను వధువు చేతికిస్తారట వాళ్ల కమిట్మెంట్కి గుర్తుగా. ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇలా చెప్పుకుంటూ పోతే ఆచారవ్యవహారాలుగా కొనసాగుతున్న పెళ్లి చిత్రాలెన్నో ఈ ప్రపంచంలో!! -
Cover Story: వర్చువల్ లోకం కొంచెం వెర్రి.. కొంచెం వర్రీ
వాస్తవం కన్నా కల్పనే అందంగా ఉంటుంది! ప్రాక్టికాలిటీ కన్నా భ్రమే ఆనందాన్నిస్తుంది! నిజానికి బంధనాలుంటాయి.. ఊహలకు ఆకాశం కూడా హద్దు కాదు! అందుకే వర్చువల్ వరల్డ్‌లో అందరూ హీరోలే.. అసలు ఆ కిక్కే వేరప్పా! కల చెదిరి.. స్పృహలోకొచ్చాక రియాలిటీ ఇచ్చే షాక్ కూడా వేరప్పా! వర్చువల్ ప్రభావాలు.. రియాల్టీ ప్రమాదాలు ఇప్పుడు చర్చనీయాంశాలు! పాతికేళ్ల కిందట.. మ్యాట్రిక్స్ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఇంటెలిజెంట్ మెషిన్లు అందులో మనుషుల శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుని.. అచ్చంగా వారిని పోలిన రూపాలతో వర్చువల్ వరల్డ్‌ని రూపొందించి తామనుకున్న సంఘ వ్యతిరేక పనులు చేస్తుంటాయి. ఈ వర్చువల్ బాడీకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని తాలుకు ప్రభావం ఎనర్జీ సోర్స్ రూపంలో ఉన్న అసలైన మనిషిపై కనిపిస్తుంటుంది. ఆఖరికి వర్చువల్ వరల్డ్ కారణంగా ఎనర్జీ సోర్సెస్ చనిపోతాయి కూడా! పన్నెండేళ్ల కిందట.. వచ్చిన ‘అవతార్’ సినిమా కూడా అలాంటిదే. పండోరా గ్రహంలో ఉన్న అపార సహజ వనరులపై కన్నేసిన మనుషులు వాటిని సొంతం చేసుకునేందుకు తమ శరీరాలను ఎనర్జీ సోర్స్‌గా ఉపయోగించుకుంటూ వర్చువల్ మనుషులను తయారు చేస్తారు. ఆ పండోరా గ్రహవాసులు, వర్చువల్ మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుట్రకుతంత్రాలతో పండోరా మీద మనుషుల ఆధిపత్య పోరుతో సాగుతుంది సినిమా. తాజాగా.. ఓటీటీలో హల్చల్ చేస్తోన్న హారర్ కామేడీ.. ‘కంజూరింగ్ కన్నప్పన్స్’ అనే తమిళ సినిమా ‘డ్రీమ్ క్యాచర్’ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. నిజ జీవితంలో సాధ్యంకాని విషయాలను కలలో సాధ్యం చేసుకోవడమనే అంశంపైనే ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇందులోని క్యారెక్టర్స్‌కి ఆ కలలో అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల వల్ల నిజ జీవితంలోనూ ముప్పు వాటిల్లుతుంది. చివరకు జీవితం భయానకం అవుతుంది. కలల మీద అంతకుముందే హాలీవుడ్లో ‘ఇన్స్సెప్షన్స్ ’ పేరుతో ఒక సినిమా వచ్చింది. పై చిత్రాలన్నీ ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్స్ ఆధారంగా ‘వర్చువల్ వరల్డ్’ కేంద్రంగా వచ్చినవే. మన జీవితాల్లో వర్చువల్ వరల్డ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలను కళ్లకుకట్టే ప్రయత్నం చేసినవే. అలా సిల్వర్స్క్రీన్స్కే పరిమితమైన వర్చువల్ వరల్డ్ మెల్లమెల్లగా రియల్ వరల్డ్‌లోకీ చేరింది. అందరూ ఊపయోగించే వాట్సాప్ నుంచి పబ్జీ వంటి గేమ్స్, స్నాప్‌చాట్ వంటి యాప్‌ల దాకా ప్రత్యేకంగా అవతార్లు పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను వాడే కొద్దీ తమ రియల్ వరల్డ్‌లోని బాడీ కంటే యాప్‌లలో ఉపయోగించే అవతార్లనే మనుషులు మానసికంగా సొంతం చేసుకోవడం మొదలైంది. గంటల తరబడి వాటితోనే గడుపుతున్నారు, లక్షల కొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరికి ఆ వర్చువల్ అవతార్‌కి ఏమైనా అయితే దాని తాలుకు లక్షణాలతో మనుషులు రియల్ వరల్డ్‌లో మంచం పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఇంగ్లండ్‌లో జరిగిన ఘటన వర్చువల్ వరల్డ్‌పై మరింత చర్చకు కారణమైంది. సరికొత్త ఐడెంటిటీ రియల్ వరల్డ్‌లో.. పుట్టిన ఊరు, కుటుంబం వంటి తదితర వివరాలతో సామాజికంగా మనుషులకు ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పరంగా అయితే ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ పాస్‌పోర్ట్‌తో వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. కానీ డిజిటల్ వరల్డ్ దీనికి భిన్నం. నిర్ధారిత తనిఖీ, పరిశీలన, విచారణ వంటివేమీ లేకుండానే గుర్తింపును పొందే వీలుంటుంది. సోషల్ మీడియాలోని ఒక్కో ఫ్లాట్‌ఫామ్‌లో.. ఓక్కో యాప్‌లో ఒకే మనిషి పదుల సంఖ్యలో ఐడెంటిటీలు పొందవచ్చు. దీంతో డిజిటల్ వరల్డ్‌లో అసలైన ఊరు, పేరు తెలియకుండానే చలామణి కావొచ్చు. సామాజిక కట్టుబాట్లు, ఇంట్లో వాళ్ల ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా విహరించవచ్చు. ఈ వెసులుబాటు కారణంగానే యువతరం మొదలు పెద్దల వరకు అంతా డిజిటల్ ఐడెంటిటీ వైపు అడుగులు వేస్తున్నారు. నిజమైన గుర్తింపులేని ఈ తీరే మోసాలకు కారణమవుతోంది. డీపీలతో గిట్టని వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేయడానికి ఫేక్ ఫొటోలతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అభాసుపాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు ముఖ్యంగా మహిళలను ఇబ్బందిపెడుతున్నాయి. అవమానాలకు గురిచేస్తున్నాయి. పరిచయస్తులు, మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్లే.. స్పర్థల కారణంగా దూరమైతే చాలు టార్గెట్ మహిళల ఫొటోలు, ఫోన్స్ నంబర్లను పోర్న్స్ సైట్లలో పెడుతూ తీవ్రమైన మానసిక హింసకు పాల్పడుతున్నారు. లేదా ఫేక్ డీపీలతో చాటింగ్ చేస్తూ మోసాలకు దిగుతున్నారు. స్త్రీ, పురుష స్నేహాలతోనే కాకుండా మరోరకం నకిలీ ఖాతాలకూ ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఆ నకిలీ ఖాతాలు చక్కగా మనతో ఇన్స్బాక్స్ లేదా డైరెక్ట్ మెసేజెస్‌తోనే స్నేహాన్ని పెంచుకుంటాయి. హఠాత్తుగా.. చాలా అవసరం పడిందని.. ఫలానా అంత నగదు పంపాలంటూ వేడుకుంటాయి. తిరిగి చెల్లిస్తామని నమ్మబలుకుతాయి. నమ్మి నగదు పంపిన వెంటనే డిసపియర్ అయిపోతాయి. ఫేస్బుక్లో దాదాపు అందరూ ఈ నకిలీ ఖాతాలు – మనీ రిక్వెస్ట్‌లకు బాధితులుగా మారారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండాపోతోంది. నకిలీ గుర్తింపు ఆధారంగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. డీప్ ఫేక్‌తో ఇటీవల సినిమా నటి రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి.. డీప్ ఫేక్ వీడియోలు కోకొల్లలుగా వచ్చాయి. రెండు వేర్వేరు వీడియోలను కలుపుతూ నిఖార్సైన నకిలీని క్రియేట్ చేయడంలో డీప్ ఫేక్‌లు ఆరితేరిపోయారు. దశబ్దాల కిందటే మార్ఫింగ్ అనేది ఉనికిలోకి వచ్చినా దాన్ని గుర్తించడం తేలికే. ఎక్కడో కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వాడితే తప్ప సహజంగా అనిపించేది కాదు అది. కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్స్‌తో ఫేక్‌ని క్రియేట్ చేయగలుగుతుండటంతో సమస్య తీవ్రమైంది. నకిలీ వర్సెస్ అవతార్ డిజిటల్ దునియా/వర్చువల్ వరల్డ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించడం వెనుక కచ్చితమైన ఉద్దేశం అర్థమవుతోంది. ఆర్థికంగా దోచుకోవడం, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసి మానసికంగా కుంగదీయడం వాటి ప్రధాన లక్ష్యాలు. కొన్నిసార్లు ఎదుటి వారితో ఆడుకోవడానికీ నకిలీ ఖాతాలు వస్తున్నాయి. వీటిని సృష్టించే వారు తమకు సంబంధించిన వివరాలను ఆ ఖాతాలో పొందుపరచరు. ఇందుకు భిన్నం అవతార్. పూర్తిగా మనకు సంబంధించిన మరో రూపమే అవతార్ అన్నట్టుగా ఉంటుంది. మన అవతార్‌కు ఎలాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, శరీరం రంగు ఎలా ఉండాలి.. వంటి అన్ని విషయాల్లో మన ఇచ్ఛకు తగ్గట్టుగా వర్చువల్ అవతార్‌ను రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ అవతార్తోనే సోషల్ మీడియా, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్, ఆన్స్లైన్స్ గేమ్స్‌లో పాల్గొనవచ్చు. ఈ పాల్గొనడమే చెలరేగే స్థాయికి చేరితే వర్చువాలిటీ రియాల్టీకి మధ్య ఉండే గీత చెరిగిపోతుంది. ఆ తర్వాత వర్చువల్‌గా జరిగే విషయాలకు రియాల్టీలో నష్టపోవాల్సి వస్తుంది. మానసిక ఆనందం కోసం వచ్చిన వర్చువల్ వరల్డ్ చివరకు మానసిక వేదనకు దారి తీస్తోంది. ఇలా ఇబ్బందులకు గురవుతున్న వారిలో టీనేజర్లు, మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. అసలు కంటే ఎక్కువ రియల్ వరల్డ్‌లో ఉన్న గుర్తింపు కంటే డిటిజల్ దునియాలో దక్కే గుర్తింపే ఎక్కువ అనుకునే వారు పెరుగుతున్నారు. ఉదాహరణకు మోస్ట్ పాపులర్ పబ్జీ గేమ్. ఈ గేమ్‌ను.. ఆన్స్‌లైన్స్‌లో ఎవరికి వారు తమ ‘అవతార్’ను ఎంచుకుని ఏక కాలంలో ఆడుకునే వీలుంది. అవతార్ ధరించే డ్రెస్‌లు, వాడే ఆయుధాలకు ఇక్కడ రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఒక్కో లెవెల్‌ను దాటుకుంటూ ఈ అవతార్లు గేమ్‌లో ముందుకు వెళ్తుంటాయి. ఆయా లెవెల్స్ ఆధారంగా ఆ ఆటగాడు ఎంతటి మొనగాడనే గుర్తింపును డిజిటల్ దునియా ఇస్తుంది. ఈ రికగ్నిషన్స్ ఇచ్చే కిక్ కోసం పరీక్ష ఫీజులు మొదలు.. తల్లిదండ్రుల అకౌంట్ల దాకా డబ్బును స్వైప్ చేయడానికి ఏ మార్గం దొరికినా వదలకుండా లక్షల రూపాయలను ఈ గేమ్స్ కోసం ధారపోసే గేమర్లు ఉన్నారంటే ఆశ్చర్యమూ అతిశయోక్తీ ఎంతమాత్రం లేదు.. కాదు. చిక్కులు వాస్తవ ప్రపంచంలో.. మనుషులు తప్పులో.. నేరాలో చేస్తే వాటిని అరికట్టేందుకు, శిక్షించేందుకు చట్టాలు, శిక్షాస్మృతులున్నాయి. కానీ రోజురోజుకూ విస్తరిస్తున్న డిజిటల్ దునియాలో జరుగుతున్న మోసాలు, నేరాలకు అడ్డుకట్ట వేసేదెలా అన్నదే అంతు చిక్కని ప్రశ్న. దీనిపై ఇప్పటికే కొన్ని దేశాలు చట్టాలను తయారుచేసుకున్నాయి. మరికొన్ని పకడ్బందీ చట్టాలను రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే డిజిటల్ దునియాలో.. ప్రపంచంలోని ఓ మూలనున్న వారు మరో మూలనున్న వారిని మోసం చేసేందుకు, వేధించేందుకు అవకాశం ఎక్కువ. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన చట్టాలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. దీంతో నేరాలు, మోసాలకు పాల్పడిన వారిని పట్టుకోవడమే కష్టం అనుకుంటే వారిని ఏ చట్టాల పరిధిలో శిక్షించాలనేది మరో తలనొప్పిగా మారింది. మెటావర్స్ డిజిటల్ దునియా కారణంగా ఇలాంటి సమస్యలు ఒకొక్కటిగా ముందుకు వస్తున్నా టెక్నోక్రాట్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్.. మనం జీవిస్తున్న యూనివర్స్‌కి పోటీగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెటావర్స్‌ను అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే ప్రకటించారు. రెండేళ్ల కిందట ఆయన మెటావర్స్‌ను పరిచయం చేశారు కూడా. అది ఆశించిన స్థాయిలో జనాల్లోకి చొచ్చుకుపోలేదు. అయితే మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే యూనివర్స్‌కి పోటీగా మెటావర్స్ లేదా మరోవర్స్ రావొచ్చు. ఇలాంటి ప్రత్యామ్నయ ‘వర్స్’ల కారణంగా ఏర్పడే దుష్పరిణామాలకు ఎలా చెక్ పెట్టాలన్నది ఇటు టెక్నోక్రాట్స్, అటు దేశాధినేతల ముందున్న సవాల్. ఎప్పటి నుంచో నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఊహల్లో సాధ్యం చేసుకోవడం మనిషి పుట్టుక నుంచీ ఉన్నదే. దానికి కథలు, కవితలు ఇతర కళారూపాలను సాధనాలుగా మలచుకోవడం నాగరికత నేర్పిందే. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్ టెక్నాలజీ రూపంలో మనుషులకు కొత్త కొత్త అవతార్లను సృష్టించి ఇస్తోంది. ఆనందలోకంలో తిప్పుతోంది. కానీ క్రమంగా సీన్స్ రివర్స్ అవుతోంది. డిజిటల్ అవతార్ రూపంలో ఉన్న మనిషి ‘టార్గెట్’ అవుతున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో జరిగిన సంఘటనలకు ఇచ్చే ప్రతి స్పందనలతో భౌతిక ప్రపంచంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు. వర్చువల్ వరల్డ్‌లో దాడికి గురైన వ్యక్తులు రియల్ వరల్డ్‌లో అసలైన బాధితులుగా మారుతున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితులను ఎలా పట్టుకోవాలి ? వారిని ఎలా శిక్షించాలి ? రియల్ వరల్డ్ తరహాలోనే వర్చువల్ వరల్డ్ విషయంలోనూ చట్టాలు తయారు చేయాలనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయి. పరిష్కారమార్గాల అన్వేషణలో కాలయాపన తగదని ఇంగ్లండ్ అవతార్ రేప్ ఘటన చెబుతోంది. చట్టాల రూపకల్పన వేగంవంతం కావాలని హెచ్చరిస్తోంది. వర్చువల్ రేప్ ఇంగ్లండ్‌లో ఓ మైనర్ బాలిక ఆన్స్‌లైన్స్‌లో వర్చువల్ గేమ్‌కు బాగా అలవాటు పడింది. ఆ గేమ్‌లో తన అవతార్‌తో మమేకమైపోయింది. గ్రూప్‌గా ఆడే ఆ గేమ్‌లో కొందరు మగ అవతార్లు ఈ మైనర్ బాలిక అవతార్‌పై కన్నేశారు. గేమ్ ఆడుతూ ఆ బాలిక అవతార్‌పై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గేమ్‌లో పూర్తిగా లీనమైపోయిన ఆ అమ్మాయి ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌కు కంపించిపోయింది. వాస్తవంగానే తనపై లైంగికదాడి జరిగినట్టుగా ట్రామాలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా ఆ వర్చువల్ గ్యాంగ్ రేప్‌ని ఎలా నిర్ధారించాలి? దానికి కారణమైన నిందితులను ఎలా గుర్తించాలి? ఏ గ్రౌండ్ మీద వారిని శిక్షించాలనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. మొత్తానికి విషయం వైరల్ అయింది. వర్చువల్ వరల్డ్‌కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంకా అలసత్వం తగదంటూ ఒకరకంగా ప్రపంచాన్ని హెచ్చరించిందీ సంఘటన. ఏకాభిప్రాయం ఉండాలి ఫేస్బుక్, యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో దూషించే వారిని పట్టుకుని శిక్షించడమే కష్టమవుతుంటే.. డిజిటల్ వరల్డ్‌లో వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత డిజిటల్ రైట్స్ అనే సమస్యలకు పరిష్కారం చూపడమనేది ఇంకా బాలారిష్టాలనే దాటలేకపోతుంటే.. వీటి తర్వాత లెవెల్లోని డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో జరుగుతున్న .. జరిగే అరచాకాలను అరికట్టడం సాధ్యమయ్యే పనేనా అనిపిస్తోంది. వాటిని నిలువరించే సమర్థవంతమైన వ్యవస్థలు, చట్టాలు ఇంకా రాలేదనే చెప్పాలి. ఇది అనేక సంక్లిష్టతలతో కూడుకున్నది. డిజిటల్ వరల్డ్, వర్చువల్ రియాల్టీలో క్రియేట్ అవుతున్న సమస్యలపై ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ట్రోలింగ్, బులీయింగ్, డిఫమేషన్స్ వంటి అంశాలపై అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నేరం/ఘటన ఎక్కడ జరిగినా అందుకు సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం, విచారణ చేయడంలో దేశాల మధ్య ఒప్పందాలు జరగాలి. అదేవిధంగా వర్చువల్ /డిజిటల్ వరల్డ్‌కి సంబంధించిన అంశాలపై సామాన్యులకూ అవగాహన కలిగేలా కెపాసిటీ బిల్డింగ్ జరగాలి. కనీసం అవతార్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా మారాలి. అప్పుడే జరగబోయే అనర్థాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. – అనిల్ రాచమల్ల, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగిస్తున్న సాంకేతిక నిపుణులు కేసులు పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2022లో.. సైబర్ క్రైమ్‌కి సంబంధించి దేవశ్యాప్తంగా 65,843 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో అత్యధికంగా చీటింగ్ కేసులు 42,710 (64.8 శాతం) ఉండగా బెదిరింపులకు పాల్పడిన కేసులు 3,648 (5.5 శాతం) ఉన్నాయి. ఇక సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్కి సంబంధించి 3,434 (5.2 శాతం) కేసులు నమోదయ్యాయి. సైబర్ కేసుల పెరుగుదలను పరిశీలిస్తే 2012లో దేశవ్యాప్తంగా 3.693 కేసులు నమోదుకాగా 2022కి వచ్చేసరికి ఈ సంఖ్య 65,893కి చేరుకుంది. నమోదు కాని కేసులు సంఖ్య ఇంతకు నాలుగింతలు ఉండొచ్చని అంచనా. గత దశాబ్దకాలంగా స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో అదే స్థాయిలో సైబర్ కేసుల తీవ్రతా పెరుగుతోంది. 2012లో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారు 12.5 శాతం ఉండగా 2022 చివరికి అది 76.6 శాతానికి పెరిగింది. హై స్కూల్ పిల్లలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్స్ ఉంటోంది. ప్రస్తుతమైతే సైబర్ నేరాల్లో ఆర్థిక నేరాలదే అగ్రస్థానం. సరైన జాగ్రత్తలు, నియంత్రణ లేని పక్షంలో లైంగిక వేధింపులు, మానసిక సమస్యలకూ డిజిటల్ దునియానే ప్రధాన కారణం కావడానికి అవకాశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. పేరెంట్స్‌పైనే భారం ఇంటర్నెట్ వినియోగం నేడు అనివార్యమైపోయింది. చిన్నా, పెద్దా అందరికీ అత్యవసరం అయింది. అయితే అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న హద్దును అందరూ మరచిపోతున్నారు. ముందు తేరుకోవాల్సింది పెద్దలే. ఇంటర్నెట్నే ఇల్లులా భ్రమపడుతున్న పిల్లలను ఆ మాయజాలం నుంచి బయటకు తేవాల్సిన బాధ్యత పెద్దలదే. అవసరానికి.. వ్యసనానికి మధ్య ఉన్న గీత మీద అవగాహన కల్పించాలి. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన గోపత్యను పాటించడం ఇప్పుడు చాలా అవసరం. అన్నీ గూగుల్లోనే ఉన్నాయిశ వేవ్‌లో పడిపోయిన నేటి తరం అంతర్జాలంలో తమ వ్యక్తిగత వివరాలను ప్రూవ్స్తోసహా (ఫొటోలు, వీడియోలు వగైరా) ఎంత తక్కువగా అప్ డేట్ చేస్తే అంత సేఫ్‌గా ఉండొచ్చనే ఫ్యాక్ట్‌ని బ్రెయిన్స్ చిప్‌లోకి ఎక్కించాలి. ‘వర్చువల్ వరల్డ్ అనేది ఒక భ్రాంతి.. అదొక కాలక్షేపం..’ అనే సత్యాన్నీ వీలైనన్ని సార్లు మెదడులో సేవ్ చేయించాలి. ఇదీ పేరెంటింగ్‌లో భాగం కావాలి. -కృష్ణగోవింద్ -
Funday Cover Story: నవ్వు.. నవ్వు.. నవ్వు..
పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు.. జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే.. ‘ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం’ అంటుంటారు. ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వును ఆరు రకాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు. అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. అందుకే చాలామంది ‘మర్యాద మరువకుండా, దూషణ లక్ష్యంగా పెట్టుకోకుండా, శ్రుతి మించనీయకుండా చేసే హాస్యమే నిజమైన హాస్యం’ అని చెబుతుంటారు. నవ్వేటప్పుడు కేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదుళ్లు, పక్కవాళ్లను గిచ్చుళ్లు ఇవన్నీ సహజం. ఎగరడాలు, మెలికలు తిరగడాలు, కళ్లనీళ్లు తుడుచుకోవడాలు ఇవన్నీ నవ్వులో తారస్థాయికి చిహ్నాలు. అయితే ‘మనసారా నవ్వే నవ్వుకు ఆయువు ఎక్కువ’ అంటున్నారు వైద్యులు. ‘స్నానం.. దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం.. బుద్ధిని సరి చేస్తుంది.ఉపవాసం.. ఆరోగ్యాన్ని అందిస్తుంది.హాస్యం.. మనిషినే ఉబ్బితబ్బిబ్బు చేస్తుంది, మనసును ఉర్రూతలూగిస్తుంది. అంతకుమించి.. ఆలోచనల్ని ఉత్తేజపరుస్తుంది’ అంటుంటారు ప్రవచనకర్తలు. అందుకే, వాసన లేని పువ్వులా.. పరిహాసం లేని ప్రసంగం వ్యర్థమని చెబుతుంటారు. నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులవోలె ప్రేమరసముం గురిపించు విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ ‘ఈ లోకంలో మనిషి తప్ప ఏ జీవీ నవ్వలేదు. నవ్వులు మనిషి మనోవికాసానికి దివ్వెలు. అయితే కొన్ని విషపునవ్వులు ఉంటాయి. అలాంటివి కాకుండా.. పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు లోకంలోని సమస్త దుఃఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి’ అని మహాకవి జాషువా ఎప్పుడో చెప్పారు. నవ్వితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే.. నవ్వుతో గుండె లయ పెరిగి.. శ్వాసలో వేగం పుంజుకుంటుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత హాట్ బీట్ నెమ్మదించి.. బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం. తరచూ ఒత్తిడిలో ఉండేవారికి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించే న్యూరోపెపై్టడ్స్ అనే చిన్న మాలిక్యూల్స్ విడుదల కావాలంటే.. ఎక్కువగా నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారు యాక్టివ్‌గా కనిపిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు. దాంతో స్నేహితులు కూడా పెరుగుతారు. స్మైలీ ఫేస్ ఉండేవారితో స్నేహం చేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ నవ్వుల్లో మర్మం తెలుసుకుని మెలగడం ఉత్తమం. నిత్యం మూడీగా ఉండేవాళ్లు.. ఎప్పటికప్పుడు బ్రెయిన్‌కి స్మైలీ సంకేతాలు ఇస్తూ ఉండాలి. లేదంటే ఆ దిగులు మరింత పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు.. అహ్లాదకరమైన వాతావరణాల్లో తిరగడం.. స్నేహితుల మధ్య ఉండటం చాలా అవసరం. అప్పుడే మూడ్ మారుతుంది. నవ్వితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి.. రోగనిరోధకశక్తికి ఎంతో అవసరమైన యాంటీ బాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిరునవ్వు ఎందరిలో ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గానే నిలుస్తుంది. నవ్వుతో చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవ్వేవారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది. నవ్వు జీవితంపై సానుకూలప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో భవిష్యత్ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని, ఆయుష్షుని కూడా పెంచుతుందని సైంటిఫిక్‌గా నిరూపితమైంది. నవ్వు బాడీలో ఆక్సిజన్ స్థాయిని పెంచి.. శ్వాస వ్యాయామానికి ఒక మార్గంగా నిలుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరస్తుంది. కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు ఆ రోజంతా తెలియని ఎనర్జీని అందుకోవచ్చు. లాఫింగ్ థెరపీతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ నవ్వు.. శరీరం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. నవ్వు.. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు.. ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. దాంతో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. మోబియస్ సిండ్రోమ్ మోబియస్ సిండ్రోమ్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అరుదైన లోపం. ఈ జబ్బున్నవాళ్ల ముఖంలో ఎలాంటి కవళికలు పలికించలేరు. వీళ్లు నవ్వలేరు, ఆవులించలేరు, కనుబొమలను పైకెత్తలేరు. ఇది ఒకరకమైన నాడీ సమస్య. ఫేక్ స్మైల్స్ సర్వేలు కాల్ సెంటర్స్ వంటి పబ్లిక్ సర్వీస్‌లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి. కానీ అది వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు తేల్చేశారు. ఇలా నకిలీ నవ్వు నవ్వే వాళ్లు తమ వ్యక్తిగత ఫీలింగ్స్‌ను మనసులోనే దాచి వేస్తారని.. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ పరిశోధనలో తేలింది. దీని ప్రకారం.. ఇష్టంలేని వారి ముందు.. తప్పని పరిస్థితుల్లో నవ్వే నకిలీ నవ్వులు ఏమాత్రం మంచివి కావని తేలింది. పైగా ఇలాంటి నవ్వుల వల్ల.. ఫీలింగ్స్‌లో మిశ్రమమైన స్పందనకు మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. అది మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. నవ్వుకు కాస్త సమయం వీలు చిక్కినప్పుడల్లా కామెడీ సినిమాలు, కామెడీ ప్రోగ్రామ్స్ (హెల్దీ జోక్స్) చూస్తూండాలి · నలుగురిలో ఉన్నప్పుడు అహ్లాదకరమైన గత హాస్య స్మృతులను వివరిస్తూ.. నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుండాలి. కామెడీని పండించగల స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూండాలి. గ్రూప్ ఎంటర్టైనింగ్ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటే.. తప్పకుండా అందులో భాగస్వాములు కావాలి. కుటుంబ సభ్యులతో చిన్ననాటి చిలిపి సంగతులను చర్చించడం.. అప్పటికే మీకు ఎదురుపడిన కామెడీ సన్నివేశాల గురించి వారితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి · కొన్నిసార్లు ఎదుటివారిపైన పంచులు వేసినా.. మరి కొన్నిసార్లు ఎదుటివారు మన మీద వేసే పంచులకు ఫీల్ అవ్వకుండా ఉండగలగాలి. -
సంక్రాంతి: వైజ్ఞానికం.. ఆధ్యాత్మికం.. ఆనంద భరితం
శుభ్రంగా ఊడ్చి కళ్లాపుచల్లిన వాకిళ్ళు ఆ వాకిళ్లలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు ఆ రంగవల్లుల నడుమ ఠీవిగా కూర్చున్న గొబ్బిళ్లు ఇంకా హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వాళ్లు ఇలా ఇంటిముందుకొచ్చిన చిరుకళాకారులందరికీ లేదనకుండా ధాన్యదానం అమ్మలక్కలతో కలిసి ఆడుతూ పాడుతూ చేసిన రకరకాల పిండివంటలు పండక్కి పిలిచిన బంధుమిత్రులు... స్వయంగా వెంటబెట్టుకొచ్చిన కూతురు, అల్లుడు అందరూ కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేయడం, కోడిపందాలు, ఎడ్లపందాలు ఈ సంబరాల కోసమే కదా ఎంత ఖర్చయినా, ఎన్ని కష్టాలు పడ్డా పల్లెటూరికి పయనం కావడం ఇవన్నీ సంక్రాంతి సంబరాలలోని భాగాలే కానీ... ఇవన్నీ ఎందుకు? అని ప్రశ్నించుకున్నప్పుడే కదా ఆ పండగలోని పరమార్థం అర్థమయ్యేది... ఊరంతా కలిసి సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో అంతా ఆనందమే! ప్రతి పనిలోనూ సృజనాత్మకత.. కళాత్మకత తొంగి చూడవలసిందే! సాధారణంగా ఏ పండగకైనా కడుపునిండా తినడం, ఆ తర్వాత వినోదాలతో ఉల్లాసంగా ఉండటం మామూలే. అయితే సంక్రాంతి మాత్రం అందుకు భిన్నమైనది. కడుపునిండా తినడం మాత్రమే కాదు, చేతినిండా దానం చేయడం, నడుం వంచి పని చేయడం, నోరారా హరినామ స్మరణ చేయడం, కూతుళ్లను, అల్లుళ్లను ఆహ్వానించి, వారికి సమస్త భోగాలూ సమకూర్చడం, కష్టజీవులు, కళాకారులు, చేతివృత్తిదారులకు తిండిగింజలు కొలవడం, ఆపై కోడిపందాలు, ఎడ్లపందాలు, పతంగులతో వినోదించడం, తమతో సమానంగా ఏడాదంతా కష్టపడ్డ గొడ్డూ గోదను కూడా సమాదరించడం వంటివన్నీ సంక్రాంతి పండగ ఇతర పండగల కన్నా కాస్త విభిన్నమైనదని చెప్పకనే చెబుతాయి. ధనుర్మాసం ప్రకృతి తలుపు తట్టడం ఆలస్యం.. తూరుపు తెలతెలవారుతుండగానే ఇంటిముందు అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు.. ఆ వెంట హరిదాసుల సుతిమెత్తని స్వరం నుంచి వెలువడే కీర్తనలు, ఆ కీర్తనలకు తగ్గట్టు చిరతలతో తాళం వేస్తూ.. ఆ తాళానికి తగ్గట్టుగా చిద్విలాసాన్ని చిందిస్తూ ఉంటే వినడానికి, చూడటానికి ఎంత మంగళకరంగా అనిపిస్తుంది! హరిలో రంగ హరీ అంటూ హరిదాసు ఆగిన ఇంటి ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది మాలక్ష్మమ్మ. నిండైన మనసుతో, ప్రశాంత వదనంతో, మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయపాత్రలో దోసెడు ధాన్యం కుమ్మరించిన ఇల్లాలిని సకల సంపదలతో తులతూగమని ఆశీర్వదించి మరో ఇంటికి వెళుతుంది మహాలక్ష్మీదేవి. దానం చేసిన ఇంట అషై్టశ్వర్యాలూ అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి. అందుకే సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేసే చిరుదానం కూడా అనంత పుణ్య ఫలితాన్నిస్తుందని శాస్త్రం చెబుతోంది. స్వయంకృషితో పాటు భగవత్ కృప కూడా తోడుకావడం వల్ల కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సంప్రదాయం. మూడురోజుల సంక్రాంతి నేర్పేది ఇదే! తమకున్న దానిని నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం. కనికట్టు కళ మాయాలేదు.. మర్మం లేదు! అంతా కళే! కనికట్టు. చూపరులను ఆశ్చర్యంతో కట్టిపడేసే కళ. కళ్లప్పగించి చూస్తుండగానే కాసును కప్పగా... నిమ్మను దానిమ్మగా మార్చేస్తాడు కాటికాపరి. వీరినే విప్రవినోదులని కూడా అంటారు. కాస్త ఘటికుడైన మాయలోడు అయితే ఇంద్రజాలాన్ని ప్రదర్శించి మరో నాలుగు కుంచెల ధాన్యాన్ని అదనపు బహుమతిగా పొందుతాడు. ఆనందాన్ని పంచే వినోదమూ లక్ష్మీరూపమే! ఇప్పుడు కనుమరుగైన విప్రవినోదులు ఒకప్పుడు పల్లెపల్లెలో చేసే సందడి అంతా ఇంతా కాదు! సోది చెబుతానమ్మ.. సోది చెబుతాను.. ‘కంచి కామాక్షి పలుకు.. మధుర మీనాక్షి పలుకు..’ అంటూ వచ్చి సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఎరుకల సోదమ్మ. చారెడు ధాన్యమిస్తే చాలు.. బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. అమ్మవారి అ అనుగ్రహమో, వంశపారంపర్యంగా వచ్చిన అనుభవమో.. చెప్పించుకునే వారి ముఖాలలో మారే భావాలను బట్టి వెల్లువలా దొర్లే మాటల మహిమో తెలియదు కానీ.. మనసులో దాగున్న మనోవ్యథను మాయం చేసేస్తుంది తన పలుకులతోనే. బతుకును బంగారంలా పండించుకోవడానికి సాక్షాత్తూ ఆ కంచి కామాకమ్మో, మధుర మీనాక్షమ్మో ఎరుక చెప్పే సోదెమ్మ రూపంలో సాక్షాత్కరించిందేమో అన్నట్లు చెబుతుంది. నందీశ్వరుడే ఇంటిముంగిట నర్తనమాడేవేళ... డూ డూ బసవన్నను తోలుకొని గంగిరెద్దు దాసరి వచ్చేది.. పాతబట్టలు ఇస్తారనే ఆశతోనే కావచ్చు! కానీ, పండుగ సరదాని పదింతలు పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తాడు. వీనులవిందైన డోలు, సన్నాయి వాద్యాలతో ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అంటూ బసవన్నను ఆడిస్తూ ఇంటిల్లిపాదీ పండుగపూట నందీశ్వరుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాడు. గంగిరెద్దును ఆడించే అప్పన్న మాత్రం తక్కువా! సాక్షాత్తూ విష్ణుమూర్తి స్వరూపమే! పూర్వం గజాసురుడి పొట్టలో ఉన్న పరమేశ్వరుణ్ణి వెలుపలికి రప్పించడానికి శ్రీమహావిష్ణువు వేషం మార్చి, గంగిరెద్దుల మేళాన్ని కట్టిన కథ ప్రతి ఏటా వినాయక వ్రతకల్పంలో చదివేదే కదా! ఘల్లు ఘల్లుమని మోగే గంగిరెద్దుల కాళ్లగజ్జెల మోత సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి కాలి అందెల మోతను తలపిస్తుంది. కైలాసాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసే డమరుక నాదాలు ‘అంబ పలుకు.. జగదంబ పలుకు..’ అని గొంతెత్తే బుడబుక్కల కళాకారుడు శకున శాస్త్రంలో సాటిలేని మేటి. తొలికోడి కూసింది మొదలుకొని నింగిలో సూర్యకిరణాలు చురుక్కుమనిపించే వరకు అతను పలికిందల్లా బంగారమే! అతని చేతి డమరుకం ధ్వని చెవిన పడినవారంతా సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువుండే కైలాసాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేసుకుంటారు. ఒకటేమిటి సంక్రాంతి వేళ పల్లెపల్లెలో కనిపించే, వినిపించే కళారూపాలన్నీ పుష్యలక్ష్మి అనుగ్రహాలే! ఇన్ని సంబరాలు స్వాగతం పలుకుతూ ఉండగా.. పుష్యమాసంలో పౌష్యలక్ష్మి ప్రతి ఇల్లూ తన పుట్టిల్లే అని భావించి కదిలి వస్తుందని కవులు అభివర్ణించారు. సంక్రాంతి అంటే చేరడం అని అర్థం. ఈ పండుగ నాటికి పొలాల్లోంచి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుతుంది. పట్నవాసులంతా పల్లెకు చేరుకుంటారు. ఇలాతలం నుంచి రివ్వున ఎగిరే గాలిపటాలు గగనతలంలోకి దూసుకెళ్తాయి. భోగిపండ్ల అభిషేకం కోసం పిల్లలంతా వాడకట్టులోని ఇండ్లలోకి చేరిపోతారు. నోముల వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ముత్తయిదువలు కలివిడిగా ఒక్కో ఇంటికి చేరిపోతుంటారు. ఇన్ని చేరికలకూ కారణం ఆదిత్యుడు ధనుస్సులోంచి మకర రాశిలోకి సంక్రమించడం. ఆయన నెలకో రాశి మారుతూనే ఉంటాడు కదా! ఇదే ఎందుకు ప్రత్యేకం? ద్వాదశాదిత్యుడైన దివాకరుని దివ్యయాత్రలో ప్రధాన ఘట్టాలు నాలుగు. అవి మేష, కర్కాటక, తుల, మకర సంక్రమణాలు. మార్తాండుడు ఈ మజిలీలు చేరగానే వాతావరణంలో మార్పులు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో మకర సంక్రమణం మరింత మనోహరం. జొన్న, సజ్జ, కొర్ర తదితర మెట్ట పంటలు దట్టంగా పండి దిట్టంగా దిగుబడులు కురిపించే కాలమిది. వరి కోతలు పూర్తయ్యే ముచ్చట తెలిసిందే! పాడి గేదెలు దండిగా పాలను వర్షించే కాలం, లేగదూడలతో పశుసంపద పెరిగే సమయం ఇది. ప్రకృతి పరంగా ఇన్ని విశేషాలున్న ఈ కాలం ఆధ్యాత్మికంగా మరెన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నది. ఆరోగ్య క్రాంతి ‘సర్వ సాధనలో దేహ సాధన ముఖ్యమ’ని సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటేనే కదా.. ఏ పనైనా చేయగలం. సంక్రాంతి సందర్భంగా చేసే పిండివంటలన్నీ ఆరోగ్య సాధనకు అక్కరకొచ్చేవే! చకిలాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు ఇలా చేసే ప్రతి పదార్థమూ నువ్వులు, బెల్లం ప్రాధాన్యం కూడుకున్నవే ఉంటాయి. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని అందించడంతోపాటు కీళ్లకు సత్తువనిస్తాయి. సజ్జలు పండే ప్రాంతంలో నువ్వులు చల్లుకొని సజ్జరొట్టెలు చేసుకునే ఆచారం ఉంది. ఉత్తర భారతదేశంలో గొంగళ్లు దానం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. ఇలా దానమిచ్చిన వారికి భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి పర్వం సందర్భంగా శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు. నువ్వులు కొనలేని బీదసాదలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నియమం చేశారు పెద్దలు. ఈవిధంగా సంక్రాంతి పండుగ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు సామాజిక బాధ్యతనూ గుర్తుచేస్తుంది. సంక్రాంతి సందడికి తలలూపుతూ తొలుతగా స్వాగతం పలికేది పతంగులే! ఈ పండుగకు పదిరోజుల ముందు నుంచే రంగురంగుల గాలిపటాలు నింగిలో గిరికీలు కొడుతూ గాలివాటానికి తగ్గట్టుగా తలలు వంచి వందనాలు చేస్తూ సయ్యాటలు ఆడతాయి. ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా పతంగులు ఇప్పుడు ఎగురవేయడం దేనికి? ఈ ప్రశ్న వెనుకా ఆరోగ్య మంత్రమే సమాధానంగా కనిపిస్తుంది. ఈ కాలంలో సూర్యరశ్మి అధికంగా అవసరం అవుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు! అందుకే కాబోలు పెద్దలు పతంగుల సంప్రదాయానికి తెరలేపారు. గాలిపటాల జోరులో, పతంగులతో పేచీ పడుతూ పిల్లలంతా ఆరుబయట అలసిపోతున్నా పట్టించుకోకుండా వినోదిస్తుంటారు. ఈ క్రమంలో శరీరానికి కావాల్సినంత ‘డి’ విటమిన్ లభిస్తుంది. అంతేకాదు.. నింగిలోకి అలా చూస్తూ ఉండటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వారిలో పెరుగుతుంది. భోగి.. పిల్లల వైభోగం సంక్రాంతికి ముందురోజు ‘భోగి’తో భోగభాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు ఇదే. ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగుపండ్లకు బదరీఫలాలు అని పేరు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. పండగలోని పరమార్థం సంక్రాంతి అనగానే ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దటం భోగిమంటలు వేయడం, బాలలకు భోగిపళ్లు పోయడం, పిండివంటలు చేసుకోవడం, బంధుమిత్రులతో కలిసి సరదాగా గాలిపటాలు ఎగురవేయడం అనే అనుకుంటూ ఉంటుంది నేటితరం. నిజానికి ఇవన్నీ సంక్రాంతి సంబరాలలోని భాగాలే కానీ, ఎందుకు చేయాలి ఇవన్నీ అని ప్రశ్నించుకున్నప్పుడే ఆ పండగలోని పరమార్థం అర్థమయ్యేది. గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బొమ్మల కొలువు తీర్చిదిద్దడం, కోడిపందాలాడటం ఈ పండగ పేరు చెప్పగానే ఎలా గుర్తుకొస్తాయో, సంక్రాంతి అంటే నిర్వాణం, మోక్షం అని కూడా అర్థం కావాలి. పరమేశ్వరుడితో ఎలా మమేకం కావాలో తెలియాలి. సూర్యుడు ఈ పర్వదినాన ధనుర్రాశి నుంచి మకరరాశికి మారుతుండటం వల్ల ఈ రోజును మకర సంక్రాంతి అనడం పరిపాటి. నిజానికి సంక్రాంతి పండగ రైతుల పండగ, పెద్ద పండగ, పెద్దల పండగ. ఆడపడచులు, అల్లుళ్ల పండగ. కళాకారుల పండగ. చేతివృత్తుల వారి పండగ. ఆఖరకు పశువులకు కూడా పండగే. భోగిపండగ ఏం చెబుతోందంటే... భోగి రోజున తెల్లవారుఝామునే లేచి ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగిమంటల్లో వేసి కాల్చేస్తూ ఉంటారు. అంటే గతం తాలూకు జ్ఞాపకాలు, ఆలోచనలు అలాగే అశాశ్వతాలైన ఆస్తి, వస్తువులు, పాతబడి, పాడైపోయిన పరికరాలు, పనిముట్లపై వ్యామోహం వదిలేయనంతవరకు ఆనందంగా ఉండలేమని, గతం నుంచి బయటపడి వర్తమానంలో ఉండటమే పండగ అని చెబుతోంది భోగి. రైతులు సంవత్సరం పొడవునా వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్తాచెదారాన్ని భోగిరోజున ఉదయాన్నే మంటలుగా వేసుకుంటారు. ఇండ్లలో ఉన్న పాత కలప, పనికిరాని వస్తువులను అన్నింటిని మంటలో వేయడాన్ని వరుణయాగంగా పిలుస్తారు. ఎందుకంటే వరుణదేవుని కరుణా కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్లలోకి ధాన్యం రావడం ఆనందంతో ఉండటం, తరువాతి సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణుడు అనుగ్రహించాలనే దృక్పథమే ఈ మంటలు వేయడంలోని ఉద్దేశం. మేఘాలకు అధిపతి అయిన వరుణదేవుడిని గ్రామీణులు భోగి మంటల రూపంలో చేసే వరుణ యాగం ద్వారా ప్రార్థిస్తారు. ఆ పిండివంటలే ఎందుకు? ఈ పండగ చలికాలంలో వస్తుంది కాబట్టి బియ్యం, బెల్లం, పాలు, నువ్వులు, మినుములతో వండిన పిండివంటలు తీసుకోవడం వల్ల శరీరంలో కొంత ఉష్ణం పెరిగి చలికాలంలో ఉండే నిస్సత్తువ, నిస్పృహ, నిరాశ వంటి లక్షణాలు పోయి ఉత్సాహంగా ఉండటానికి దోహదం చేస్తుంది. పతంగులకు పండగొచ్చింది! సాధారణంగా మన పండుగలన్నీ చంద్రుడి గమనం మీదనే ఆధారపడి ఉంటాయి. సంక్రాంతి ఒక్కటే సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటున్నాము. సూర్యుడు మనకు ఎన్నోవిధాలుగా సహకరిస్తుంటాడు. పంటలు బాగా పండి మనమంతా ఆరోగ్యంగా ఉండటంలో, సృష్టి అంతా మనుగడ సాగించగలగడంలో సూర్యుడి పాత్ర సాటిలేనిది. రకరకాల రంగు రంగుల గాలిపటాలు ఎగురవేస్తూ మన సంతోషాన్ని, కృతజ్ఞతలను సూర్యునికి తెలియ జేయడమే పతంగుల పండగ వెనక ఉన్న అంతరార్థం. అంతేకాదు, దేవతల పగలు అయిన ఉత్తరాయణంలో దేవతలకు స్వాగతం పలకడం, గాలి వాలును బట్టి గాలిపటం ఎటుపడితే అటు ఎగిరిపోకుండా సమతుల్యత సాధించడం కోసం మనం దారాన్ని పట్టుకుని ఏకాగ్రంగా ఎగురవేసినట్లే జీవితంలోని ఒడుదొడుకులను, సమస్యలు, సవాళ్లను కూడా ఎదుర్కోగలగాలి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే ఈ పండుగనాడు గాలిపటాలను ఎగురవేస్తాం. సంక్రాంతి దానాలు.. తర్పణాలు మకర సంక్రమణంతో ప్రచండ తేజోమంతుడైన సూర్యుడు తన దివ్యకాంతులతో నూతన తేజాన్ని, కొత్తదనాన్ని కల్పించడానికి స్వాగతించే రోజే మకర సంక్రాంతి. ప్రతినెలా జరిగే సూర్యసంక్రమణాలలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా గోచరించదు. కాని మకర సంక్రమణంతో ప్రకృతిలో వచ్చే మార్పు స్పష్టంగా కనపడుతుంది. మకర సంక్రాంతినాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో యథాశక్తి దానధర్మాలు చేస్తే జన్మజన్మల దారిద్య్రబాధలు అంటవని పెద్దలు చెబుతారు. అందుకే పితృదేవతలందరికీ తర్పణాలు ఇచ్చుకుంటారు. మోక్ష సాధన మార్గం ఆధ్యాత్మిక సాధనలన్నీ మోక్షలక్ష్మిని పొందడానికే! ఇహంలో సకల సంపదలతో తులతూగినా.. పరంలో సాధించాల్సిన స్థిరమైన సంపద మోక్షమే కదా! మహోన్నతమైన పురుషార్థాన్ని పొందడానికి అనువైన కాలం ఉత్తరాయణం. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్రఫలకారిగా అనుకూలించే సమయమిది. ఉత్తరాయణాన్ని దేవయానంగానూ అభివర్ణిస్తారు. వెలుగును ఇచ్చే మార్గంగా దీన్ని చెబుతారు. ఇదే ఉత్తరాయణం. రెండోది పితృయానం. ఇది చీకటి మార్గం, ధూమ మార్గం. అదే దక్షిణాయనం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తత్త్వాన్ని గ్రహించిన ఉపాసకులు ఉత్తరాయణ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకుంటారు. కనుమ... ముక్కనుమ సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో మనతోపాటు శ్రమించిన ఎడ్లను, పాడికి ఆధారమైన గోవులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. సేద్యానికి ఉపయోగించే పరికరాలను కూడా శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పొంగళ్లు చేసి పొలాల్లో చల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్లను ఊరేగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని పల్లెల్లో ఎడ్లతో ‘కంబళ’ పోటీలు నిర్వహిస్తారు. వీటిని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు సంక్రాంతి వేళకు అక్కడికి చేరుకుంటారు. కనుమ మర్నాడు ముక్కనుమగా చెబుతారు. గురుగులు.. కుంకుమ భరిణెలు.. సంక్రాంతి పండుగలో ముత్తయిదువలు నోము ఆచరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి ముందు పక్షం రోజులను పీడదినాలుగా భావిస్తారు. వృద్ధులు, రోగపీడితులు ఈ కాలంలో మరణించే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిహారంగా సంక్రాంతి పూట వ్రతం చేస్తారు. అమ్మవారిని ఆరాధిస్తారు. ఒకప్పుడు మట్టి గురుగులను నోములో ఉంచి గురిగితోపాటు పసుపు, కుంకుమ, నువ్వులు ముత్తయిదువలకు వాయనంగా ఇచ్చేవారు. ఇప్పుడు గురుగుల స్థానంలో భరిణెలు, ఇతర అలంకరణ వస్తువులను వాయనంగా ఇస్తున్నారు. పండుగ వేళ పాలు పొంగించే తంతు ప్రహసనంగా సాగుతున్నది. ఇంటి మధ్యలో ఆవుపిడకలపై మట్టి గురిగిలో పాలను మరిగించి, పొంగిస్తారు. పాలు పొంగి ఇంటి లోపలి వైపునకు దొర్లితే ఆ ఏడాది సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఉత్తరాయణ ప్రవేశ సమయంలో కొందరు పితృదేవతల ప్రీత్యర్థం తర్పణాలు విడుస్తారు. కూష్మాండదానం చేస్తారు. సంక్రాంతి పండుగలో ఆద్యంతం ఆనందాలే కనిపిస్తాయి. ప్రతి పనిలోనూ దైవత్వం దర్శనమిస్తుంది. సంప్రదాయాలు, సందళ్లు అన్నిటా వైజ్ఞానిక రహస్యాలూ దాగి ఉన్నాయి. సంక్రాంతి శోభను పల్లెపల్లెకూ పంచే కళాకారులకు తోచింది ఇవ్వడం, వ్యవసాయంలో సాయంగా ఉన్న పశువులను పూజించుకోవడం, ఏడాదంతా మనకు చేదోడు వాదోడుగా నిలిచిన వ్యక్తులకు పంటలో భాగం ఇవ్వడం.. ఇవన్నీ మన పెద్దలు ఆచరించి, ఆనందించిన విధానాలు. వారి అడుగుజాడల్లోనే మనమూ పయనిద్దాం. సంక్రాంతి లక్ష్మిని సమంగా పంచుకుందాం! - డి.వి.ఆర్. భాస్కర్