ఆటలు ఎందుకు ఆడాలి?
జెన్ పథం
అదొక మైదానం. అక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మార్గంలో నడుచుకుంటూ పోతున్న ఒక సాధువు ఆడుకుంటున్న పిల్లలను చూసి అక్కడే ఆగిపోయారు. పిల్లలు మహదానందంగా ఆడుకుంటున్నారు. వాళ్లకు చుట్టూ ఏం జరుగుతున్నదీ పట్టలేదు. వారి ఆటను చూసి సాధువు సంతోషించారు. ఓ గంటైంది. అనంతరం ఆయన చప్పట్లుకొట్టి వాళ్ల ముగ్గుర్నీ పిలిచారు. పిల్లలు ముగ్గురూ సాధువు వద్దకు వచ్చి ఆయనను ఎగాదిగా చూశారు. ఆయన వేషధారణ పిల్లలకు విచిత్రంగా అనిపించింది. పిల్లలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా సాధువు వారిని కోపగించుకోలేదు.
వాళ్లు నవ్వు ఆపిన తర్వాత సాధువు వారివంక చూసి ‘‘మీరెప్పుడూ ఇక్కడే ఈ మైదానంలోనే ఆడుకుంటారా?’’అని అడిగారు.
‘‘అవును’’ అని ముగ్గురూ ఒక్క మాటగా చెప్పారు.
‘‘ఇంతకీ ఎందుకు రోజూ ఆడుకుంటారు? దాని వల్ల మీకు కలిగే లాభమేంటి?’’ అని సాధువు ముగ్గురినీ ప్రశ్నించారు.
అప్పుడు మొదటి కుర్రాడు ‘‘బాగా ఆడితే శరీరానికి ఎంతో మంచిది. దేహం గట్టిపడుతుంది. బలమొస్తుంది. అంతేకాదు, ఎవరికీ భయపడక్కర్లేదు. ఎదురుగా ఎవరొచ్చినా వారిని ఇట్టే ఎదుర్కోవచ్చు’’ అన్నాడు.
ఆ కుర్రాడి మాటలు విని సాధువుకు ఆనందమేసింది.
‘‘నువ్వు తప్పకుండా బలవంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు.
ఆ తర్వాత రెండో కుర్రాడు ‘‘హాయిగా ఆడితేనే మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. ఆ తర్వాత మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదివినదంతా బుర్ర కెక్కుతుంది’’ అన్నాడు.
వాడి మాటలు విన్న సాధువు ‘‘బాగా చెప్పావు. నువ్వు గొప్ప విద్యావంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు.
అనంతరం మూడో కుర్రాడు ‘‘నాకు ఆటలంటే ఇష్టం. అందుకే ఆడతాను’’ అని టూకీగా చెప్పాడు. అంతకన్నా మరేమీ మాట్లాడలేదు.
సాధువు వాడికి నమస్కరించి ‘‘ఇకమీదట నువ్వే నా గురువు’’ అని అన్నారు.
మనం చేసే ప్రతి పనికీ ఏవేవో కార ణాలు, ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి. లాభనష్టాలు ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ అయోమయంలో పడిపోక మనమున్న క్షణాన్ని ఆవగింజంత కూడా మిగల్చక అనుభవించాలి. అదే జెన్ పథంలోని తొలి మెట్టు. అప్పుడే ఏ బాదరబందీలుండవు.
- యామిజాల జగదీశ్