Jagdish yamijala
-
ధనవంతుడి చికాకు
‘అయ్యా.. నేను ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు చెప్పే ఈ ఒకటి రెండు మాటలు ఏ మాత్రం సరిపోవు. మీ మాటల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు’’ అన్నాడు ధనికుడు. ఒక ఊళ్లో ఓ పెద్ద ధనికుడికి ఉన్నట్టుండి వ్యాపారంలో అనుకోని సమస్య తలెత్తింది. దాంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆ సమస్యలతో ఆయన సరిగ్గా నిద్రపోవడం లేదు. అంతలో ఆయన ఉంటున్న ప్రాంతానికి ఓ జెన్ గురువు వచ్చారు. ఆ గురువును కలిస్తే మీ మానసిక సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న కొందరు మిత్రుల సలహాపై ధనవంతుడు గురువుగారిని కలిసి, తన సమస్యలన్నింటినీ ఏకరువుపెట్టాడు. అవన్నీ విన్న గురువు ఒకటి రెండు మాటలలో తనకు తోచిన పరిష్కారాలు చెప్పారు. అవి విన్న ధనవంతుడు కొంచెం చికాకు పడుతున్నట్లుగా ‘‘అయ్యా.. నేను ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు చెప్పే ఈ ఒకటి రెండు మాటలు ఏ మాత్రం సరిపోవు. మీ మాటల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు’’ అన్నాడు. ఆయన మాటలకు జెన్ గురువు ఏ మాత్రం కోప్పడకుండా ‘‘ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఓ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది‘‘ అన్నాడు ధనవంతుడు. ‘‘చీకటి పడింది కదా.. మీరిప్పుడు ఎలా వెళ్తారు?’’ అని అడిగారు గురువు. ‘‘అదేం పెద్ద విషయమండీ.. నేను వెళ్లేది కారులోనే కదండి.. కనుక చీకటి పడితేనేం, అది నాకో లెక్క కాదుగా’’ అన్నాడతను. ‘‘మీ కారుకున్న దీపాలు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ వెలుగు చూపిస్తాయా’’ అని అడిగాడు గురువు. ‘‘అందులో అనుమానమేముంది? కచ్చితంగా చూపుతాయి’’ అన్నాడు ధనవంతుడు. ‘‘ఏ వాహనంలోనైనా దీపాలు కొన్ని అడుగుల మేరకే కాంతి చూపుతాయని నాకు తెలుసు.. మరి ఆ వెలుగుతో ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణం చేయగలరు?’’ అని అడిగాడు గురువు అమాయకంగా. ‘‘మనం కారు నడపడానికి కాస్తంత దూరం మేరకు వెలుగు చూపితే సరిపోతుంది కదండీ.. వాహనం సాగే కొద్దీ ఆ వెలుగునే ఆధారంగా చేసుకుని గమ్యం చేరడం పెద్ద సమస్యేమీ కాదు కదండీ’’ అని అంటూనే.. గురువు ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకుని, సంతృప్తితో ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు ధనవంతుడు. – యామిజాల జగదీశ్ -
కళ్లు మూసుకుంటే సరిపోదు
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసుకోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు. అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు. అతను కళ్ళు తెరిచి అడిగాడు – ‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’ అని.గురువు చెప్పాడు ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను‘‘ అని. అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపుకోనివ్వండి‘‘ అని చెప్పాడు. అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది. శిష్యుడిని ప్రశ్నించాడిలా గురువు – ‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు‘‘ అనేసరికి శిష్యుడి నోటంట మరో మాట లేదు. ‘‘ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు‘‘ అని చెప్పాడు గురువు. ‘‘దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని నీకెవరు చెప్పార‘‘న్నాడు గురువు. – యామిజాల జగదీశ్ -
చచ్చాక పొడవు పెరిగింది!
ఓ సూఫీ జ్ఞాని నివాసముంటున్న ఓ ఊళ్ళో ఓ రైతు ఉన్నాడు. అతను తన ఇంటి పెరట్లో ఓ రెండు అడుగుల పామును కొట్టి చంపాడు. వెంటనే ఇంట్లోకి వచ్చి భార్య, బిడ్డలతో తాను మూడడుగుల పామును చంపానని చెప్పాడు. అతని భార్య వెంటనే పక్కింటావిడతో తన భర్త అయిదడుగుల పామును కొట్టి చంపాడని గొప్పగా చెప్పింది. కాస్సేపటికి ఆ పొరుగింటావిడ పక్క వీధిలో ఉన్న తన మిత్రురాలింటికి వెళ్ళి మా వీధిలో మా ఇంటి పక్కింట్లో ఒకతను పది అడుగుల పామును కొట్టి చంపాడని ఒకింత విచిత్రంగా చెప్పింది. s ఆ ఇంటావిడ ఈ మాటలు విని ఊరుకోకుండా ఆ రోజు రాత్రి పొరుగూరి నుంచి తన ఇంటికి వచ్చిన చుట్టంతో పక్క వీధిలో ఒకరు ముప్పై అడుగుల పొడవున్న పాముని కొట్టి చంపారని మరింత ఆశ్చర్యంగా చెప్పింది. ఇలా ఒక్కొక్కరి నోటా చనిపోయిన పాము పొడవు పెరుగుతున్న విషయం సూఫీ జ్ఞాని చెవుల దాకా వ్యాపించింది. సూఫీ జ్ఞాని రైతు కొడుకుని పిలిపించాడు. మీ నాన్న ముప్పయి అడుగుల పామును చంపాడటగా అని అడిగారు. ఆ కుర్రాడు జ్ఞాని వంక విచిత్రంగా చూసి చనిపోయిన పాము పొడవు పెరుగుతుందా అని అమాయకంగా అడిగాడు. అతని మాటలు విన్న జ్ఞాని ఓ చిర్నవ్వు నవ్వారు. తండ్రి తాను పామును కొట్టి చంపానని చెప్పడంతోనే ఆ కుర్రాడు పెరట్లోకి వెళ్ళి చచ్చిన పామును చూశాడు. అది రెండడుగులకు మించి లేకపోవడాన్ని గ్రహించాడు. ఆ కుర్రాడిలా ప్రతి ఒక్కరూ నిజాన్ని అన్వేషిస్తే తప్పుడు ప్రచారానికి ఆరంభంలోనే అడ్డుకట్ట వేయొచ్చు కదా అని జ్ఞాని గ్రామప్రజలను ప్రశ్నించారు. దాంతో ఊరి ప్రజలందరూ తల దించుకుని అవును కదా అనుకున్నారు. – యామిజాల జగదీశ్ -
ఒకటి వదులుకుంటేనే మరొకటి పొందగలం
అదొక అడవి. అక్కడ రెండు పెద్ద బండరాళ్ళు పక్క పక్కనే చాలాకాలంగా ఉంటున్నాయి... ఈ అడవికి సమీపంలో ఓ నగరం ఉంది. ఆ ఊరి ప్రజలు ఓరోజు సమావేశమై ఓ ఆలయం కట్టాలని తీర్మానించుకున్నారు. కొత్తగా నిర్మించదలచిన ఆలయానికి మూలవిరాట్టు, మరిన్ని దేవతా విగ్రహాలను చెక్కించడానికి శిల్పులను నియమించారు. ఆ శిల్పులు బండరాళ్ళకోసం వెతకడం మొదలుపెట్టారు. అడవిలోకి ప్రవేశించారు. తలో దిక్కు వెళ్ళారు. వారిలో ఓ శిల్పి అడవిలో చాలాకాలంగా ఉంటున్న ఈ రెండు బండరాళ్ళను చూశాడు. వెంటనే అతను వెళ్ళి తన తోటి శిల్పులకు ఈ బండరాళ్ళ గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ బండరాళ్ళ వద్దకు చేరుకున్నారు. వాటిని మరొక కొత్త చోటుకి తరలించడానికి మాట్లాడుకున్నారు. రేపు మళ్ళీ వచ్చి చూసుకుందామనుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఓ రాయి మరో రాయితో ‘అమ్మయ్య ఇంతకాలానికి మనకీ అడవి నుంచి విముక్తి కలగబోతోంది... దీర్ఘకాలంగా కంటున్న కల నెరవేరబోతోంది.’’ అని సంబరపడింది. మొదటి రాయి మాటలకు రెండో రాయి ‘‘నీకసలు బుద్ధుందా, వాళ్ళు మనల్ని తీసుకుపోయేది నగర విహారానికి కాదు. ఉలితో చెక్కి నరకం చూపబోతున్నారు. మనం ఎన్ని దెబ్బలు భరించాల్సి వస్తుందో ... ఆ విషయం ఆలోచించు’’అంటూ రుసరుసలాడింది. ‘‘ఏం చేస్తాం. కొత్త రూపం పొందాలంటే పాత రూపం కోల్పోక తప్పదు. ఇది సర్వసహజం. వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వు; ఎన్ని దెబ్బలైనా వేయనీ... నేను భరిస్తాను...’’ అని చెప్పింది మొదటిరాయి. ‘‘అమ్మో నా వల్ల కాదు. నేను భరించలేనా దెబ్బలను. రేపు ఆ శిల్పులు వచ్చేసరికి నేను ఇక్కడే మరింత లోతుగా పాతుకుపోతాను... చెప్పింది రెండో రాయి. తెల్లవారింది. మరుసటి రోజు శిల్పులు మళ్ళీ ఈ రాళ్ళున్న చోటుకి చేరుకున్నారు. మొదటి భారీ రాయిని అందరూ కలిసి ఓ వాహనం మీదకు ఎక్కించారు. రెండోరాతిని అంగుళం కూడా కదల్చలేకపోయారు. దాంతో వారు దాన్ని అక్కడే విడిచిపెట్టి, ఉన్న ఒక్క రాతితోనే నగరానికి చేరుకున్నారు. ఆ మొదటి బండరాతితో దైవవిగ్రహాలు చెక్కారు. ఆ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. శిల్పుల ఉలి దెబ్బలను భరించి వివిధ విగ్రహాలైన మొదటి రాతిని ఊరి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆరాధించారు. నగరంలోకి రానని భీష్మించుకుని ఉండిపోయిన రెండోరాయి అడవిలోనే ఉండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడే ఎల్లకాలమూ మిగిలిపోయింది. అందుకే జెన్ గురువులనేదొక్కటే... ఒకటి కోల్పోయినప్పుడే మరొకటి పొందగలమని. అలా కాదని మొండికేస్తే రెండో రాయిలా ఒకేచోట ఉండిపోక తప్పదు. – యామిజాల జగదీశ్ -
లోటుపాట్లు అనేవే లోపం!!
ఆయన ఓ గురువు. చిత్రకారుడు కూడా. ఆయన ఓ బొమ్మ గీస్తున్నారు. దగ్గరలోనే ఓ శిష్యుడు నిల్చుని చూస్తున్నాడు. అంతేకాదు, మధ్యమధ్యలో అతను విమర్శిస్తున్నాడు కూడా. గురువుగారు ఎలాగైతేనేం బొమ్మ గీశారు. అదేమంత గొప్పగాలేదు. ఇద్దరిలోను దిగులు.దేనినైనా చక్కగా చేసే తన గురువు ఈరోజు ఎందుకు సరిగ్గా గీయలేదు? ఆయనకు ఏమైంది? అని ఆలోచించాడు శిష్యుడు. గురువు కూడా రకరకాలుగా ఆలోచించి గీసినా అదేమంత చక్కగా అమరలేదు. ఆయన దిద్దేకొద్దీ అది మరింత పిచ్చిగా తయారవుతోంది. శిష్యుడు బొమ్మ బాగులేదని చెప్తూ వచ్చాడు. చివరికి వర్ణాలన్నీ అయిపోయాయి. ‘‘వెళ్లి కాస్త వర్ణాలు తీసుకురా....’’అని చెప్పారు గురువు శిస్యుదితో. శిష్యుడు లేచి వెళ్ళాడు. గురువు తనదగ్గరున్న కుంచెలను మారుస్తున్నారు. కాసేపటికి శిష్యుడు వచ్చాడు. శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. బొమ్మ పూర్తి అయిపోయింది. అద్భుతంగా ఉంది. ‘‘గురువుగారూ! బొమ్మ చాలా గొప్పగా ఉంది...’’ అన్నాడు ఆనందంతో. గురువు నవ్వుతూ ‘‘నువ్వు ఇక్కడే ఉండటంతో ఆ సమస్య తలెత్తింది. నువ్వు చూస్తున్నావు అనే విషయం నన్ను ఏదో చేసింది. ఆ భావంతోనే బొమ్మ సరిగ్గా రాలేదు. పక్కన విమర్శించే ఓ మనిషి ఉంటే ఏ సృష్టీ సరిగ్గా రాదు. మనసులో ప్రశాంతత ఉండదు. ఆత్మ ప్రశాంతంగా లేకుంటే సృష్టిలో క్రమం తప్పుతుంది. పూర్ణత్వం రాదు... నువ్వు వెళ్ళిపోయావు. నాలో నాపై ఉన్న నిషేధం, ఒత్తిడి పోయాయి. ఆ స్థితిలో చిత్రం చక్కగా రూపుదిద్దుకుంది. పూర్ణత్వం ఏర్పడాలనే తలపే అపూర్వాన్ని పుట్టిస్తుంది. మనస్సుని నిండుగా అర్పించినప్పుడు లోటుపాట్లు పటాపంచలవుతాయి. అందుకే అంటున్నా, లోటు అనేదే ఓ లోపం. అది ఉన్నంతవరకూ ఏదీ పూర్ణం కాదు. అర్ధమనస్సుతో ఏదీ చేయకూడదు. సహజత్వం అనేదే పూర్ణత్వం. సహజంగా చేసేదేదైనా పరిపూర్ణమే’’ అన్నారు. – యామిజాల జగదీశ్ -
విచక్షణ ప్రధానం
జెన్ పథ్ ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. ఇంతలో ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ‘‘ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘‘లేదు...ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ‘‘ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన చుక్క లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు. అప్పుడు గురువుగారు ‘‘ఐతేనేం...? ఆయన గొంతు అద్భుతం. మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?’’ అన్నారు. ‘‘మీరు ఎన్నయినా అనండి... నాకైతే ఆయన తీరు నచ్చదు’’ అంటూ విసవిసా వెళ్ళిపోయాడా సాధువు. కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడిని పొగిడాడు. ఆయన గాత్రమధురిమ అమోఘం. ఆయన ఏ పాటైనా భావానికి తగ్గట్టు పాడటమే కాకుండా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘మీరు చెప్పేదంతా పక్కనపెట్టండి... ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంఉండలేడంటారు అందరూ...’’ అని గురువుగారు అన్నారు. దాంతో ఆ సాధువు కాస్తా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును అక్కడే ఉండి గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. ఎవరూ లేని సమయం చూసుకుని ‘‘గురువుగారూ, ముందొచ్చిన సాధువు ఆ గాయకుడిని తాగుబోతు అని విమర్శిస్తే మీరు గాయకుడి సామర్థ్యాన్ని పొగిడారు. మరో సాధువు వచ్చి గాయకుడిని పొగిడితే మీరు ఆ గాయకుడిని కించపరచినట్లు మాట్లాడారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు. గురువుగారు ఇలా అన్నారు - ‘‘ఎవరు ఎవర్ని ఏమన్నా, నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఏవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ . - యామిజాల జగదీశ్ -
నిస్వార్థ ప్రేమ
దేశ సంచారం చేస్తున్న ఒక జ్ఞానికి ఒక మామిడి పండు దొరుకుతుంది. ఆ మామిడిపండు ప్రత్యేకత ఏమిటంటే, ఆ పండు తిన్న వారి ఆయుష్షు పెరుగుతుంది. విషయం తెలిసిన జ్ఞాని ఆ పండును తాను తినడం కన్నా ప్రజలకు మేలు చేసే రాజు తింటే మంచిదని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా జ్ఞాని తనంతట తానుగా రాజసభకు వెళ్ళి రాజుకిస్తాడు. రాజు ఆ పండు తీసుకుని తాను తినడం కన్నా తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్యకు ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఆమెకు ఇస్తాడు. అయితే ఆమె దానిని తినకుండా కుంటివాడైనా తన శక్తియుక్తులతో గుర్రపుస్వారీలో విశేష ప్రతిభతో తనను ఆశ్చర్యపరచిన గుర్రపురౌతుకు ఇస్తుంది. ఆ వికలాంగ రౌతు ఆ పండు తీసుకుని ఇంటికెళతాడు. తన భార్యది ఎంతో గొప్పమనసు అని, తనకన్నా ఆమె దీర్ఘకాలం జీవిస్తే బాగుంటుందని అనుకుని ఆ పండుని తన భార్యకు ఇస్తాడు. కానీ ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుకు ఇస్తే ఆయన ఆయుష్షు పెరిగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనుకుంది. ఆమె పండు ప్రాధాన్యాన్ని చెప్పి రాజుకు ఇమ్మంటుంది తన భర్తను. అతను అలాగే అని ఆ పండు తీసుకువెళ్ళి రాజుకు అందజేస్తాడు. మామిడి పండు తిరిగి తన చేతికి రావడం తెలిసి రాజు ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజే రాజు రాజ ్యపాలనను కొడుకుకి అప్పగించి సన్యసిస్తాడు. ప్రేమ అనేది ఏదో ఆశించి, లోలోపల ఏదో అనుకుని స్వార్థచింతనతో కూడినదై ఉండకూడదనేదే ఈ కథ సారాంశం. ఆశించడానికి అతీతంగా ఉండాలి ప్రేమ. అప్పుడే ప్రేమతోపాటు ప్రేమను ప్రేమించే వ్యక్తులూ విజయం సాధిస్తారు. యామిజాల జగదీశ్ -
మనమేంటో మనకేం తెలుసు?
వియన్నా నగరానికి మొదటిసారిగా విద్యుచ్ఛక్తి పరిచయమైన కొత్తలో సిగ్మండ్ ఫ్రాయిడ్ను చూడటానికి ఆయన మిత్రుడొకడు ఆయన వద్దకు వ చ్చాడు. ఫ్రాయిడ్ అతనిని ఆ రోజు రాత్రి ఒక గదిలో ఉండమని ఏర్పాట్లు చేశాడు. ఆ మిత్రుడు ఓ పల్లెటూరివాసి. అతనికి విద్యుచ్ఛక్తి కొత్త. అదంటే భయం. ఆ భయంతోనే అతను తన గదిలో వెలుగుతున్న బల్బుని ఆపాలనుకున్నాడు. దాన్ని నోటితో ఊది ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆరలేదు. దాంతో ఫ్రాయిడ్ని లేపి బల్బు ఆర్పమందామని చెప్పాలనుకున్నాడు. కానీ అలా అడిగితే ఆయన తనను ఏమనుకుంటాడో అని శంక. దాంతో ఆ మిత్రుడు వెలుగుతున్న బల్బు వంక భయంభయంగా చూస్తూ పడుకుంటాడు. తెల్లవారుతుంది. ఫ్రాయిడ్ అతని గదిలోకి వచ్చీ రావడంతోనే ‘‘రాత్రి బాగా నిద్ర పట్టిందా?’’ అన్నాడు. ‘‘నిద్ర మాట దేవుడెరుగు గానీ ఈ దీపాన్ని ఎలా ఆర్పాలి?’’ అని అడిగాడు మిత్రుడు. అప్పుడు ఫ్రాయిడ్ తన మిత్రుడిని స్విచ్ దగ్గరకు తీసుకెళ్లి, దానిని ఎలా నొక్కితే ఆరిపోతుందో ఎలా నొక్కితే వెలుగుతుందో చెప్పాడు. ఫ్రాయిడ్ మాటలు విని తనకిప్పుడు విద్యుచ్ఛక్తి గురించి తెలిసిందన్నాడు మిత్రుడు. ఓషో ఈ విషయాన్ని తన శిష్యులకు చెప్తూ స్విచ్ నొక్కడం గురించి తెలుస్తుంది...బాగానే ఉంది కానీ ప్రేమ, అభిమానం గురించి ఏం తెలుసు అని అడిగారు. ఇంతకూ స్విచ్ నొక్కినప్పుడు అది ఎలా పని చేసి వెలుగుతున్న బల్బుని ఆర్పిందో తెలియకపోవ చ్చు. కనుక ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏదీ తెలియదని అర్థమవుతుంది. మీలోని మనసుని, దాని పని తీరును సరిగ్గా తెలుసుకోగలిగితే జీవితంలోని రహస్యాలన్నింటినీ తెలుసుకోవడం సాధ్యమవుతుందని ఓషో బోధించారు. - యామిజాల జగదీశ్ -
ఎవరు పేదవాడు?
జెన్ పథం ‘‘దేవుడు నా దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నాడు. ప్రస్తుతం ఒక్క మరణం మినహా నా దగ్గర మరేదీ లేదు’’ అని ఓ యువకుడు ఒక చెట్టు కింద కూర్చుని తనలో తను అనుకుంటున్నాడు. ఆ మాటలు పక్కనే ఉన్న ఒక బిచ్చగాడి చెవిన పడ్డాయి. అతను వెంటనే యువకుడితో ‘‘నీ దగ్గర అమూల్యమైనవి ఉన్నాయి. నేను వాటిని చూస్తున్నాను. వాటిని నువ్వు అమ్ముతావా? వాటిని అమ్మడం వల్ల నువ్వు పొందలేకపోతున్నాననుకున్నవన్నీ పొందుతావు. కనుక దేవుడ్ని నిందించకు’’ అన్నాడు. యువకుడు ఆశ్చర్యపడ్డాడు. ‘‘ఏమిటీ? నా దగ్గర నాకు తెలియకుండానే అంత విలువైనవేమున్నాయబ్బా? ఒక్క పైసా కూడా లేదు ’’ అన్నాడు యువకుడు. అప్పుడు బిచ్చగాడు నవ్వి ‘‘నాతో రా. మనం రాజు దగ్గరకు వెళ్దాం. రాజు చాలా గట్టివాడు. సమర్థుడు. ఏదైనా అజ్ఞాతంగా ఉందంటే చాలు... దాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు. ఆయన నీ దగ్గరున్న వాటిని తప్పక మంచి ధరకే కొనుగోలు చేస్తాడు. నేను గతంలోనూ ఇలా పలువురిని రాజు వద్దకు తీసుకుపోయాను. రాజు వారందరికీ బాగానే డబ్బులిచ్చి వాటిని కొనుక్కున్నాడు’’ అన్నాడు. యువకుడికి బిచ్చగాడి మాటలకు ఆశ్చర్యమేసింది. సరేనని బిచ్చగాడితో కలసి రాజువద్దకు బయల్దేరాడు. దారిలో బిచ్చగాడు ఇలా అన్నాడు - ‘‘మనం ముందుగా కొన్ని విషయాల్లో ఓ నిర్ణయానికి రావాలి. ఎందుకంటే రాజు సమక్షంలో మనం గొడవపడకూడదు. రాజు తాను సొంతం చేసుకోవాలనుకున్న వాటిని ఎంత ధరకైనా కొంటాడు. నువ్వు వాటిని అమ్మడానికి సిద్ధమా? కాదా? ఇప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. లేకుంటే నిన్ను నేను అంత దూరం తీసుకువెళ్లడం వృథా’’ అని. ‘‘ఏమిటీ నా దగ్గర అంత విలువైనవున్నాయా?’’ అని యువకుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. బిచ్చగాడు అంతటితో ఆగలేదు. ‘‘మాటవరసకి చెప్తున్నా. నీ కళ్లు తీసుకో. వాటినెంతకిస్తావు? నేను రాజు దగ్గర నుంచి యాభై వేల వరహాలు ఇప్పిస్తాను. ఈ డబ్బు నీకు చాలదంటావా? పోనీ నీ గుండె లేదా నీ మెదడు. వాటికైతే లక్ష వరహాల వరకు బేరం మాట్లాడి నీకు ఇప్పిస్తాను’’ అని. యువకుడికి ఏమీ అర్థం కాలేదు. బిచ్చగాడు ఓ పిచ్చివాడనే నిర్ణయానికి వచ్చాడు యువకుడు. ‘‘ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? కళ్లు, గుండె, మెదడు...వీటిని రాజుకే కాదు, ఎవ్వరడిగినా ఇవ్వను గాక ఇవ్వను. బుర్ర ఉన్నవాడెవడైనా వాటిని అమ్ముకుంటాడా?’’ అని యువకుడు బిచ్చగాడి వంక ఎగాదిగా చూశాడు. యువకుడి మాటలకు బిచ్చగాడు పెద్దగా నవ్వి- ‘‘పిచ్చివాడైంది నువ్వా నేనా? లక్షల రూపాయల విలువైన వాటిని అమ్మడానికి నిరాకరిస్తున్న నువ్వెందుకు పేదవాడిలా నిరాశతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు? నా దగ్గర ఏముంది? దేవుడు ఒక్క మర ణం తప్ప మిగిలినవన్నీ తీసేసుకున్నాడని ఇంతక్రితం నువ్వేగా గొణిగావు’’ అని చివాట్లు పెట్టడంతో యువకుడు సిగ్గుతో తలదించుకున్నాడు. తన ఆలోచనా ధోరణిని మార్చుకున్నాడు. జీవితంపై ఆశలు చిగురింపజేసుకున్నాడు. - యామిజాల జగదీశ్ -
మరణానికి జీవితమే లేదు!
తత్వ చింతన ఓ వ్యవసాయ భూమి సమీపంలో నిల్చున్న ఖలీల్ జిబ్రాన్ దృష్టి అక్కడ ఉన్న ఓ గడ్డిబొమ్మపై పడింది. ఆ బొమ్మ వంకే ఆయన చూస్తూ నిల్చున్నారు. దానిని చూసి జిబ్రాన్ ‘‘నువ్వు ఇలా రోజుల తరబడి ఇక్కడ నిల్చున్నావు. నీకు విసుగేయడం లేదా?’’ అని అడిగాడు. దానికి ఆ బొమ్మ ఇలా చెప్పింది - ‘‘నాకే విసుగూ లేదు. ఇటుగా వచ్చే పక్షుల్ని భయపెట్టడంలో పొందుతున్న ఆనందం ముందు మరెందులోనూ దొరకడం లేదనుకో. పక్షులు నన్ను చూసి భయపడి ఎగిరిపోయే తీరుని మాటల్లో చెప్పలేను. కనుక కాలం ఎలా గడిచిపోతోందో తెలియనే తెలీదు’’ అని. ఆ మాటలతో జిబ్రాన్ ఆలోచించాడు. కాస్సేపు తర్వాత ఆయన ‘‘నిజమే. ఈ ఆనందాన్ని నేనూ అనుభవించాను. మనల్ని చూసి ఇతరులు భయపడేటప్పుడు కలిగే ఆనందాన్ని మరి దేనితోనూ పోల్చలేను’’ అని అనగా బొమ్మ ‘‘నిజం. నాలోపల గడ్డి, ఒకింత మట్టి తప్ప మరేమీ లేదు. నాలాగే లోపల గడ్డి, మట్టి నింపిన వాళ్ళు తప్పకుండా ఆనందం అనుభవిస్తారు’’ అని చాలా మామూలుగా చెప్పింది. జిబ్రాన్ ఓ చోట రాసుకున్న ఈ మాటలు మన జీవితాన్ని ఫొటో తీసి చూపుతోంది. దాన్ని చూసి జాలి పడి ఒకడు అనుకుంటాడు... లోపల గడ్డి, మట్టి మినహా మరేదీ లేని వికృతరూపం ఈ గడ్డిబొమ్మ. ఎటూ కదల్లేదు. అయినా అది పక్షులన్నీ తనను చూసి భయపడి దరిదాపుల్లోకి రావడం మానేశాయని చెప్పుకుంటోంది. ఎలా సాధ్యం?’’ అని. మనుషుల్లోనూ చాలా మందికి లోపల ఏమీ లేదు. జ్ఞానం లేని వొట్టి రూపాలు. ఆ గడ్డిబొమ్మ లోపల గడ్డి, మట్టి ఉన్నట్టు మనలో ఎముకలు, రక్తం ఉన్నాయి. కనుక జ్ఞానమున్న వారెవరైనా అజ్ఞానులైన వారిని చూసి పాపం వారిలో ఏమీ లేదు కదా అని జాలిపడతారు. కానీ అజ్ఞానులు ఆ మాటకు ఒప్పుకోరు. ‘‘ఎవరన్నారు? వాడికన్నా నేను గొప్పోడిని...వీడి కన్నా పెద్దవాడిని. ఫలానా వాడిని ఓమారు ఫలానా విషయంలో ఓడించాను అని చంకలు గుద్దుకుని తెగ ఆనంద పడతారు. కానీ ఆ గడ్డి బొమ్మ ఒకే చోట ఎటూ కదలక ఉంది. మనం ప్రాణమున్నా కదిలే శక్తి ఉన్నా జీవితంలో చలనం లేకుండా ఉన్నాం. నిజానికి మనల్ని మనం ఆ బొమ్మతో కాకుండా పక్షులతో పోల్చుకోవాలి. గడ్డిబొమ్మ కనీసం పక్షుల్ని బెదరగొట్టి పంటపొలాలను కాపాడుతోంది. మనిషి తన లోపల ఏమీ లేదనే వాస్తవాన్ని తెలుసుకుని కూడా ఎదుటి వారి వద్ద అన్నీ ఉన్నట్టు తెలిసినట్టు డాంబికాలు పోతాడు. విర్రవీగుతాడు. ఆ మాయలోనే బతుకుతాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అలాగే ఒక రోజు అదృశ్యమైపోతాడు. జీవితానికి ఎప్పుడూ మరణం లేదు. మరణానికి ఎప్పుడూ జీవితం లేదు. జీవితాన్ని తెలుసుకున్న వారే మరణమే జీవితానికి ముగింపు అని అనుకుంటున్నారు. - యామిజాల జగదీశ్ -
దారి దీపం
జెన్ పథం సాయంత్రం దాటింది. చీకటి మొదలైంది. ఒక కుర్రాడు తన చేతిలో ఒక లాంతరు పట్టుకుని ఓ చెట్టుకింద దిగాలుగా కూర్చున్నాడు. ఆ దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన దిగులు పడుతూ కూర్చున్న కుర్రాడిని చూసి అతని వద్దకు వెళ్లాడు. కుర్రాడి బాధేంటో తెలుసుకోవాలనుకున్నాడు. కుర్రాడు ‘‘నేను పొరుగూరికి వెళ్లాల్సి ఉంది. చీకటి పడింది. నాదగ్గరున్న ఈ లాంతరు దీపం వెలుగు ఓ మూడడుగుల దూరం వరకే కనిపిస్తుంది. కనుక కొన్ని మైళ్ల దూరంలో ఉన్న మా పల్లెకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. భయంగా ఉంది...’’ అని వాపోయాడు. అతను చెప్పినదంతా విన్న పెద్దాయన ‘‘నీ దగ్గరున్న లాంతరు దీపం వెలుగు మూడడుగుల దూరం వరకే కనిపిస్తుందనేది నిజమే కావచ్చు. కానీ నువ్వీ చెట్టు కింద కూర్చుని అలా అనుకోవడం సరికాదు. ఆ దీపాన్నే నువ్వు చేత్తో పట్టుకుని నడిచే కొద్దీ ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నట్టే అవుతుంది కదా? వేసే ప్రతి అడుగు వల్ల ఆ దీపం వెలుగు దారిపొడవునా ఉన్నట్టే అవుతుంది కదా? కనుక దిగులు మాని లేచి అడుగులు వెయ్యి...’’ అన్నాడు. కుర్రాడు పెద్దాయన చెప్పినట్లే చేశాడు. తన చేతిలో ఉన్న లాంతరు వెలుగులో నమ్మకంతో నడిచి తన పల్లెకు చేరుకున్నాడు. ఉపయోగపడేదేదో మన దగ్గర ఉంటే సరిపోదు. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం అవసరం. - సమయ -
ఆటలు ఎందుకు ఆడాలి?
జెన్ పథం అదొక మైదానం. అక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మార్గంలో నడుచుకుంటూ పోతున్న ఒక సాధువు ఆడుకుంటున్న పిల్లలను చూసి అక్కడే ఆగిపోయారు. పిల్లలు మహదానందంగా ఆడుకుంటున్నారు. వాళ్లకు చుట్టూ ఏం జరుగుతున్నదీ పట్టలేదు. వారి ఆటను చూసి సాధువు సంతోషించారు. ఓ గంటైంది. అనంతరం ఆయన చప్పట్లుకొట్టి వాళ్ల ముగ్గుర్నీ పిలిచారు. పిల్లలు ముగ్గురూ సాధువు వద్దకు వచ్చి ఆయనను ఎగాదిగా చూశారు. ఆయన వేషధారణ పిల్లలకు విచిత్రంగా అనిపించింది. పిల్లలు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా సాధువు వారిని కోపగించుకోలేదు. వాళ్లు నవ్వు ఆపిన తర్వాత సాధువు వారివంక చూసి ‘‘మీరెప్పుడూ ఇక్కడే ఈ మైదానంలోనే ఆడుకుంటారా?’’అని అడిగారు. ‘‘అవును’’ అని ముగ్గురూ ఒక్క మాటగా చెప్పారు. ‘‘ఇంతకీ ఎందుకు రోజూ ఆడుకుంటారు? దాని వల్ల మీకు కలిగే లాభమేంటి?’’ అని సాధువు ముగ్గురినీ ప్రశ్నించారు. అప్పుడు మొదటి కుర్రాడు ‘‘బాగా ఆడితే శరీరానికి ఎంతో మంచిది. దేహం గట్టిపడుతుంది. బలమొస్తుంది. అంతేకాదు, ఎవరికీ భయపడక్కర్లేదు. ఎదురుగా ఎవరొచ్చినా వారిని ఇట్టే ఎదుర్కోవచ్చు’’ అన్నాడు. ఆ కుర్రాడి మాటలు విని సాధువుకు ఆనందమేసింది. ‘‘నువ్వు తప్పకుండా బలవంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. ఆ తర్వాత రెండో కుర్రాడు ‘‘హాయిగా ఆడితేనే మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. ఆ తర్వాత మొహం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదివినదంతా బుర్ర కెక్కుతుంది’’ అన్నాడు. వాడి మాటలు విన్న సాధువు ‘‘బాగా చెప్పావు. నువ్వు గొప్ప విద్యావంతుడివవుతావు’’ అని ఆశీర్వదించారు. అనంతరం మూడో కుర్రాడు ‘‘నాకు ఆటలంటే ఇష్టం. అందుకే ఆడతాను’’ అని టూకీగా చెప్పాడు. అంతకన్నా మరేమీ మాట్లాడలేదు. సాధువు వాడికి నమస్కరించి ‘‘ఇకమీదట నువ్వే నా గురువు’’ అని అన్నారు. మనం చేసే ప్రతి పనికీ ఏవేవో కార ణాలు, ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి. లాభనష్టాలు ఉంటాయి. వాటినే ఆలోచిస్తూ అయోమయంలో పడిపోక మనమున్న క్షణాన్ని ఆవగింజంత కూడా మిగల్చక అనుభవించాలి. అదే జెన్ పథంలోని తొలి మెట్టు. అప్పుడే ఏ బాదరబందీలుండవు. - యామిజాల జగదీశ్