లోటుపాట్లు అనేవే లోపం!!
ఆయన ఓ గురువు. చిత్రకారుడు కూడా. ఆయన ఓ బొమ్మ గీస్తున్నారు. దగ్గరలోనే ఓ శిష్యుడు నిల్చుని చూస్తున్నాడు. అంతేకాదు, మధ్యమధ్యలో అతను విమర్శిస్తున్నాడు కూడా. గురువుగారు ఎలాగైతేనేం బొమ్మ గీశారు. అదేమంత గొప్పగాలేదు. ఇద్దరిలోను దిగులు.దేనినైనా చక్కగా చేసే తన గురువు ఈరోజు ఎందుకు సరిగ్గా గీయలేదు? ఆయనకు ఏమైంది? అని ఆలోచించాడు శిష్యుడు.
గురువు కూడా రకరకాలుగా ఆలోచించి గీసినా అదేమంత చక్కగా అమరలేదు. ఆయన దిద్దేకొద్దీ అది మరింత పిచ్చిగా తయారవుతోంది. శిష్యుడు బొమ్మ బాగులేదని చెప్తూ వచ్చాడు. చివరికి వర్ణాలన్నీ అయిపోయాయి. ‘‘వెళ్లి కాస్త వర్ణాలు తీసుకురా....’’అని చెప్పారు గురువు శిస్యుదితో.
శిష్యుడు లేచి వెళ్ళాడు. గురువు తనదగ్గరున్న కుంచెలను మారుస్తున్నారు. కాసేపటికి శిష్యుడు వచ్చాడు. శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. బొమ్మ పూర్తి అయిపోయింది. అద్భుతంగా ఉంది. ‘‘గురువుగారూ! బొమ్మ చాలా గొప్పగా ఉంది...’’ అన్నాడు ఆనందంతో. గురువు నవ్వుతూ ‘‘నువ్వు ఇక్కడే ఉండటంతో ఆ సమస్య తలెత్తింది. నువ్వు చూస్తున్నావు అనే విషయం నన్ను ఏదో చేసింది. ఆ భావంతోనే బొమ్మ సరిగ్గా రాలేదు.
పక్కన విమర్శించే ఓ మనిషి ఉంటే ఏ సృష్టీ సరిగ్గా రాదు. మనసులో ప్రశాంతత ఉండదు. ఆత్మ ప్రశాంతంగా లేకుంటే సృష్టిలో క్రమం తప్పుతుంది. పూర్ణత్వం రాదు... నువ్వు వెళ్ళిపోయావు. నాలో నాపై ఉన్న నిషేధం, ఒత్తిడి పోయాయి. ఆ స్థితిలో చిత్రం చక్కగా రూపుదిద్దుకుంది. పూర్ణత్వం ఏర్పడాలనే తలపే అపూర్వాన్ని పుట్టిస్తుంది. మనస్సుని నిండుగా అర్పించినప్పుడు లోటుపాట్లు పటాపంచలవుతాయి. అందుకే అంటున్నా, లోటు అనేదే ఓ లోపం. అది ఉన్నంతవరకూ ఏదీ పూర్ణం కాదు. అర్ధమనస్సుతో ఏదీ చేయకూడదు. సహజత్వం అనేదే పూర్ణత్వం. సహజంగా చేసేదేదైనా పరిపూర్ణమే’’ అన్నారు.
– యామిజాల జగదీశ్