విచక్షణ ప్రధానం | Discrimination is a priority | Sakshi
Sakshi News home page

విచక్షణ ప్రధానం

Published Sun, Oct 25 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

విచక్షణ ప్రధానం

విచక్షణ ప్రధానం

జెన్ పథ్
 

ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. ఇంతలో ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ‘‘ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘‘లేదు...ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ‘‘ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన చుక్క లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు.

అప్పుడు గురువుగారు ‘‘ఐతేనేం...? ఆయన గొంతు అద్భుతం. మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?’’ అన్నారు. ‘‘మీరు ఎన్నయినా అనండి... నాకైతే ఆయన తీరు నచ్చదు’’ అంటూ విసవిసా వెళ్ళిపోయాడా సాధువు. కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడిని పొగిడాడు. ఆయన గాత్రమధురిమ అమోఘం. ఆయన ఏ పాటైనా భావానికి తగ్గట్టు పాడటమే కాకుండా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘మీరు చెప్పేదంతా పక్కనపెట్టండి... ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంఉండలేడంటారు అందరూ...’’ అని గురువుగారు అన్నారు. దాంతో ఆ సాధువు కాస్తా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు.

ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును అక్కడే ఉండి గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. ఎవరూ లేని సమయం చూసుకుని ‘‘గురువుగారూ, ముందొచ్చిన సాధువు ఆ గాయకుడిని తాగుబోతు అని విమర్శిస్తే మీరు గాయకుడి సామర్థ్యాన్ని పొగిడారు. మరో సాధువు వచ్చి గాయకుడిని పొగిడితే మీరు ఆ గాయకుడిని కించపరచినట్లు మాట్లాడారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు.

గురువుగారు ఇలా అన్నారు - ‘‘ఎవరు ఎవర్ని  ఏమన్నా, నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఏవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ .

- యామిజాల జగదీశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement