‘అయ్యా.. నేను ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు చెప్పే ఈ ఒకటి రెండు మాటలు ఏ మాత్రం సరిపోవు. మీ మాటల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు’’ అన్నాడు ధనికుడు.
ఒక ఊళ్లో ఓ పెద్ద ధనికుడికి ఉన్నట్టుండి వ్యాపారంలో అనుకోని సమస్య తలెత్తింది. దాంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆ సమస్యలతో ఆయన సరిగ్గా నిద్రపోవడం లేదు. అంతలో ఆయన ఉంటున్న ప్రాంతానికి ఓ జెన్ గురువు వచ్చారు. ఆ గురువును కలిస్తే మీ మానసిక సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న కొందరు మిత్రుల సలహాపై ధనవంతుడు గురువుగారిని కలిసి, తన సమస్యలన్నింటినీ ఏకరువుపెట్టాడు. అవన్నీ విన్న గురువు ఒకటి రెండు మాటలలో తనకు తోచిన పరిష్కారాలు చెప్పారు.
అవి విన్న ధనవంతుడు కొంచెం చికాకు పడుతున్నట్లుగా ‘‘అయ్యా.. నేను ఎదుర్కొంటున్న సమస్యలకు మీరు చెప్పే ఈ ఒకటి రెండు మాటలు ఏ మాత్రం సరిపోవు. మీ మాటల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు’’ అన్నాడు. ఆయన మాటలకు జెన్ గురువు ఏ మాత్రం కోప్పడకుండా ‘‘ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఓ ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది‘‘ అన్నాడు ధనవంతుడు. ‘‘చీకటి పడింది కదా.. మీరిప్పుడు ఎలా వెళ్తారు?’’ అని అడిగారు గురువు.
‘‘అదేం పెద్ద విషయమండీ.. నేను వెళ్లేది కారులోనే కదండి.. కనుక చీకటి పడితేనేం, అది నాకో లెక్క కాదుగా’’ అన్నాడతను. ‘‘మీ కారుకున్న దీపాలు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వరకూ వెలుగు చూపిస్తాయా’’ అని అడిగాడు గురువు. ‘‘అందులో అనుమానమేముంది? కచ్చితంగా చూపుతాయి’’ అన్నాడు ధనవంతుడు. ‘‘ఏ వాహనంలోనైనా దీపాలు కొన్ని అడుగుల మేరకే కాంతి చూపుతాయని నాకు తెలుసు.. మరి ఆ వెలుగుతో ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణం చేయగలరు?’’ అని అడిగాడు గురువు అమాయకంగా.
‘‘మనం కారు నడపడానికి కాస్తంత దూరం మేరకు వెలుగు చూపితే సరిపోతుంది కదండీ.. వాహనం సాగే కొద్దీ ఆ వెలుగునే ఆధారంగా చేసుకుని గమ్యం చేరడం పెద్ద సమస్యేమీ కాదు కదండీ’’ అని అంటూనే.. గురువు ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకుని, సంతృప్తితో ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు ధనవంతుడు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment