మనమేంటో మనకేం తెలుసు?
వియన్నా నగరానికి మొదటిసారిగా విద్యుచ్ఛక్తి పరిచయమైన కొత్తలో సిగ్మండ్ ఫ్రాయిడ్‌ను చూడటానికి ఆయన మిత్రుడొకడు ఆయన వద్దకు వ చ్చాడు. ఫ్రాయిడ్ అతనిని ఆ రోజు రాత్రి ఒక గదిలో ఉండమని ఏర్పాట్లు చేశాడు. ఆ మిత్రుడు ఓ పల్లెటూరివాసి. అతనికి విద్యుచ్ఛక్తి కొత్త. అదంటే భయం. ఆ భయంతోనే అతను తన గదిలో వెలుగుతున్న బల్బుని ఆపాలనుకున్నాడు. దాన్ని నోటితో ఊది ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆరలేదు. దాంతో ఫ్రాయిడ్‌ని లేపి బల్బు ఆర్పమందామని చెప్పాలనుకున్నాడు. కానీ అలా అడిగితే ఆయన తనను ఏమనుకుంటాడో అని శంక. దాంతో ఆ మిత్రుడు వెలుగుతున్న బల్బు వంక భయంభయంగా చూస్తూ పడుకుంటాడు.
తెల్లవారుతుంది. ఫ్రాయిడ్ అతని గదిలోకి వచ్చీ రావడంతోనే ‘‘రాత్రి బాగా నిద్ర పట్టిందా?’’ అన్నాడు.
‘‘నిద్ర మాట దేవుడెరుగు గానీ ఈ దీపాన్ని ఎలా ఆర్పాలి?’’ అని అడిగాడు మిత్రుడు.
అప్పుడు ఫ్రాయిడ్ తన మిత్రుడిని స్విచ్ దగ్గరకు తీసుకెళ్లి, దానిని ఎలా నొక్కితే ఆరిపోతుందో ఎలా నొక్కితే వెలుగుతుందో చెప్పాడు.
ఫ్రాయిడ్ మాటలు విని తనకిప్పుడు విద్యుచ్ఛక్తి గురించి తెలిసిందన్నాడు మిత్రుడు.
ఓషో ఈ విషయాన్ని తన శిష్యులకు చెప్తూ స్విచ్ నొక్కడం గురించి తెలుస్తుంది...బాగానే ఉంది కానీ ప్రేమ, అభిమానం గురించి ఏం తెలుసు అని అడిగారు. ఇంతకూ స్విచ్ నొక్కినప్పుడు అది ఎలా పని చేసి వెలుగుతున్న బల్బుని ఆర్పిందో తెలియకపోవ చ్చు. కనుక ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏదీ తెలియదని అర్థమవుతుంది. మీలోని మనసుని, దాని పని తీరును సరిగ్గా తెలుసుకోగలిగితే జీవితంలోని రహస్యాలన్నింటినీ తెలుసుకోవడం సాధ్యమవుతుందని ఓషో బోధించారు.
- యామిజాల జగదీశ్