Sigmund Freud
-
'సైకో' పితామహుడికి గూగుల్ ఘన నివాళి
'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైకాలజీ'గా ఖ్యాతి పొందిన ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కు దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం (మే 6న) ఫ్రాయిడ్ 160వ జయంతిని పురస్కరించుకుని ఆయన డూగుల్ ను రూపొందించింది. 'మనిషి మనస్సులో 'అ చేతనం' (అన్ కాన్షెసినెస్) అనేది ఉంటుంది. అది మన ప్రవర్తనను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తుంది' అన్న ఫ్రాయిడ్ విశ్లేషణ.. మనస్తత్వ విశ్లేషణలో తారకమంత్రమైంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856, మే 6న జెకేస్లోవేకియాలోని ఫ్రీ బెర్గ్లో జన్మించారు.1860లో వారి కుటుంబ మంతా వియన్నాకు తరలిపోయింది. పేదరికంలోనూ కష్టపడి చదివి గ్రీస్, లాటిన్, గణితం, ప్రకృతి శాస్త్రాలు,చరిత్రలను వంటపట్టించుకున్న ఫ్రాయిడ్.. 1873లో వియన్నా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో చేరాడు. నాటికి అదే వైద్యశాస్త్రంలో ప్రపంచ రాజధాని. మానసిక రుగ్మతులకు సరైన చికిత్స చేయడానికి దోహదపడే క్లినికల్ న్యూరాలజీకి సంబంధించి చాలా రకాల అధ్యయనం చేసిన ఫ్రాయిడ్.. న్యూరాలజీ, మెదడు పని చేసే విధానం గురించి అనేక పరిశోధక పత్రాలు ప్రచురించారు.'సైకో అనాలసిస్' అన్న పదం వాడిందీ, ఆ అంశం ఒక సబ్జెక్టుగా అభివృద్ధి చేసిందీ ఫ్రాయిడ్. 1905లో ఫ్రాయిడ్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ సెక్యువాలిటీ అంశం మీద ప్రచురించబడిన మూడు వ్యాసాలు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అదే సమయం లో సైకో అనాలసిస్ను ఫ్రాయిడ్ ఒక థెరపీగా ప్రతిపాదిస్తూ వ్యాసాలు రాశారాయన. మెదడు పనితీరుమీద అనేక పరిశోధనలు చేసిన ఆయన 1939, సెప్టెంబరు 23న కన్నుమూశారు. -
మనమేంటో మనకేం తెలుసు?
వియన్నా నగరానికి మొదటిసారిగా విద్యుచ్ఛక్తి పరిచయమైన కొత్తలో సిగ్మండ్ ఫ్రాయిడ్ను చూడటానికి ఆయన మిత్రుడొకడు ఆయన వద్దకు వ చ్చాడు. ఫ్రాయిడ్ అతనిని ఆ రోజు రాత్రి ఒక గదిలో ఉండమని ఏర్పాట్లు చేశాడు. ఆ మిత్రుడు ఓ పల్లెటూరివాసి. అతనికి విద్యుచ్ఛక్తి కొత్త. అదంటే భయం. ఆ భయంతోనే అతను తన గదిలో వెలుగుతున్న బల్బుని ఆపాలనుకున్నాడు. దాన్ని నోటితో ఊది ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆరలేదు. దాంతో ఫ్రాయిడ్ని లేపి బల్బు ఆర్పమందామని చెప్పాలనుకున్నాడు. కానీ అలా అడిగితే ఆయన తనను ఏమనుకుంటాడో అని శంక. దాంతో ఆ మిత్రుడు వెలుగుతున్న బల్బు వంక భయంభయంగా చూస్తూ పడుకుంటాడు. తెల్లవారుతుంది. ఫ్రాయిడ్ అతని గదిలోకి వచ్చీ రావడంతోనే ‘‘రాత్రి బాగా నిద్ర పట్టిందా?’’ అన్నాడు. ‘‘నిద్ర మాట దేవుడెరుగు గానీ ఈ దీపాన్ని ఎలా ఆర్పాలి?’’ అని అడిగాడు మిత్రుడు. అప్పుడు ఫ్రాయిడ్ తన మిత్రుడిని స్విచ్ దగ్గరకు తీసుకెళ్లి, దానిని ఎలా నొక్కితే ఆరిపోతుందో ఎలా నొక్కితే వెలుగుతుందో చెప్పాడు. ఫ్రాయిడ్ మాటలు విని తనకిప్పుడు విద్యుచ్ఛక్తి గురించి తెలిసిందన్నాడు మిత్రుడు. ఓషో ఈ విషయాన్ని తన శిష్యులకు చెప్తూ స్విచ్ నొక్కడం గురించి తెలుస్తుంది...బాగానే ఉంది కానీ ప్రేమ, అభిమానం గురించి ఏం తెలుసు అని అడిగారు. ఇంతకూ స్విచ్ నొక్కినప్పుడు అది ఎలా పని చేసి వెలుగుతున్న బల్బుని ఆర్పిందో తెలియకపోవ చ్చు. కనుక ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏదీ తెలియదని అర్థమవుతుంది. మీలోని మనసుని, దాని పని తీరును సరిగ్గా తెలుసుకోగలిగితే జీవితంలోని రహస్యాలన్నింటినీ తెలుసుకోవడం సాధ్యమవుతుందని ఓషో బోధించారు. - యామిజాల జగదీశ్ -
వాళ్లు అలా చేసేవారా?!
రహస్యం ప్రముఖుల జీవితాలను పుస్తకాల్లో చదివేసి మనకు వారి గురించి అన్నీ తెలుసనుకుంటాం. కానీ ఎంత పదిమందికీ తెలిసిన వ్యక్తికయినా కొన్ని రహస్యాలు ఉంటాయి. ఎవరికీ తెలియని అలవాట్లు ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయిన కొందరు ప్రముఖుల అలవాట్లు ఎంత వింతగా ఉన్నాయో చూడండి... డిటెక్టివ్ నవలలతో పాఠకులను ఉర్రూత లూగించిన రచయిత్రి అగాథా క్రిస్టీకి అటూ ఇటూ తిరుగుతూ రాయడం అలవాటు. టేబుల్ మీద కూర్చుని రాస్తే ఆలోచనలు వచ్చేవి కావట! సిగ్మండ్ ఫ్రాయిడ్ తన బ్రష్కి తాను పేస్ట్ పెట్టుకునేవారు కాదట. ఆయన భార్యే ఆ పని చేసేదట. ఆ సమయం కూడా వృథా చేయకూడదన్న ఉద్దేశంతో మొదలైన ఈ పద్ధతి తర్వాత అలవాటుగా మారిపోయిందట! జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏదైనా రచన మొదలు పెట్టేముందు, తర్వాత కిటికీ వద్ద నగ్నంగా నిలబడి వ్యాయామం చేసేవారట. అలా చేస్తే శరీరంతో పాటు మనసు కూడా ఉత్తేజితమవుతుందని అనేవారట. రచన ముగిసిన తరువాత అయితే పది నిమిషాలు ఎక్కువసేపు చేసేవారట! ప్రముఖ సంగీతకారుడు బీతోవెన్కి కాఫీ తాగకపోతే క్షణం కూడా బుర్ర పని చేసేది కాదట. ఆయన రోజుకు యాభై కప్పులకు పైగా కాఫీ తాగేవారట! ఏదైనా రచన చేయాలంటే ముందుగా స్టీఫెన్ కింగ్ ఓ చీజ్ కేక్ ముక్క తినాల్సిందే. అప్పుడే ఆయన పెన్ను కదిలేదట! చార్లెస్ డికెన్స ఎప్పుడూ ఉత్తర దిక్కుకు అభిముఖంగా పడుకుని నిద్రించేవారట. అలా చేస్తే సృజనాత్మకత పెరుగుతుందని ఆయన నమ్మేవారట! తెల్లకోటు వేసుకుని, తన పొట్ట నేలకి ఆనేలా పడుకుని రాసుకునేవారట జేమ్స్ జాయిస్. అంతేకాదు... నీలిరంగు పెన్సిల్తోనే రాసేవారట! స్పానిష్ చిత్రకారుడు సాల్వెడార్ డాలీకి నిద్ర వస్తే... ఓ మెటల్ గిన్నెను నేలమీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలేవాడు. చేతిలో ఓ స్పూన్ పట్టుకుని, దాన్ని గిన్నె దిశగా ఉంచి నిద్రకు ఉపక్రమించేవాడు. బాగా మత్తు వచ్చాక చెంచా జారి గిన్నె మీద పడినప్పుడు ఆ శబ్దానికి లేచి కూచునేవాడు. ఎందుకిదంతా అని ఎవరైనా అడిగితే... నాకు కాస్తంత నిద్ర సరిపోతుంది, అందుకే ఈ ఏర్పాటు అనేవాడట!