అదొక అడవి. అక్కడ రెండు పెద్ద బండరాళ్ళు పక్క పక్కనే చాలాకాలంగా ఉంటున్నాయి... ఈ అడవికి సమీపంలో ఓ నగరం ఉంది. ఆ ఊరి ప్రజలు ఓరోజు సమావేశమై ఓ ఆలయం కట్టాలని తీర్మానించుకున్నారు. కొత్తగా నిర్మించదలచిన ఆలయానికి మూలవిరాట్టు, మరిన్ని దేవతా విగ్రహాలను చెక్కించడానికి శిల్పులను నియమించారు. ఆ శిల్పులు బండరాళ్ళకోసం వెతకడం మొదలుపెట్టారు. అడవిలోకి ప్రవేశించారు. తలో దిక్కు వెళ్ళారు. వారిలో ఓ శిల్పి అడవిలో చాలాకాలంగా ఉంటున్న ఈ రెండు బండరాళ్ళను చూశాడు. వెంటనే అతను వెళ్ళి తన తోటి శిల్పులకు ఈ బండరాళ్ళ గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ బండరాళ్ళ వద్దకు చేరుకున్నారు. వాటిని మరొక కొత్త చోటుకి తరలించడానికి మాట్లాడుకున్నారు. రేపు మళ్ళీ వచ్చి చూసుకుందామనుకుని వెళ్ళిపోయారు.
వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఓ రాయి మరో రాయితో ‘అమ్మయ్య ఇంతకాలానికి మనకీ అడవి నుంచి విముక్తి కలగబోతోంది... దీర్ఘకాలంగా కంటున్న కల నెరవేరబోతోంది.’’ అని సంబరపడింది. మొదటి రాయి మాటలకు రెండో రాయి ‘‘నీకసలు బుద్ధుందా, వాళ్ళు మనల్ని తీసుకుపోయేది నగర విహారానికి కాదు. ఉలితో చెక్కి నరకం చూపబోతున్నారు. మనం ఎన్ని దెబ్బలు భరించాల్సి వస్తుందో ... ఆ విషయం ఆలోచించు’’అంటూ రుసరుసలాడింది. ‘‘ఏం చేస్తాం. కొత్త రూపం పొందాలంటే పాత రూపం కోల్పోక తప్పదు. ఇది సర్వసహజం. వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వు; ఎన్ని దెబ్బలైనా వేయనీ... నేను భరిస్తాను...’’ అని చెప్పింది మొదటిరాయి.
‘‘అమ్మో నా వల్ల కాదు. నేను భరించలేనా దెబ్బలను. రేపు ఆ శిల్పులు వచ్చేసరికి నేను ఇక్కడే మరింత లోతుగా పాతుకుపోతాను... చెప్పింది రెండో రాయి. తెల్లవారింది. మరుసటి రోజు శిల్పులు మళ్ళీ ఈ రాళ్ళున్న చోటుకి చేరుకున్నారు. మొదటి భారీ రాయిని అందరూ కలిసి ఓ వాహనం మీదకు ఎక్కించారు. రెండోరాతిని అంగుళం కూడా కదల్చలేకపోయారు. దాంతో వారు దాన్ని అక్కడే విడిచిపెట్టి, ఉన్న ఒక్క రాతితోనే నగరానికి చేరుకున్నారు. ఆ మొదటి బండరాతితో దైవవిగ్రహాలు చెక్కారు.
ఆ విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించారు. శిల్పుల ఉలి దెబ్బలను భరించి వివిధ విగ్రహాలైన మొదటి రాతిని ఊరి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆరాధించారు. నగరంలోకి రానని భీష్మించుకుని ఉండిపోయిన రెండోరాయి అడవిలోనే ఉండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అక్కడే ఎల్లకాలమూ మిగిలిపోయింది. అందుకే జెన్ గురువులనేదొక్కటే... ఒకటి కోల్పోయినప్పుడే మరొకటి పొందగలమని. అలా కాదని మొండికేస్తే రెండో రాయిలా ఒకేచోట ఉండిపోక తప్పదు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment