అంతా ‘రాత’ మహత్యం!
హ్యూమర్
విధిని ఇంగ్లిష్‌లో ఫేట్ అంటుంటారు. ఫేట్ అనేదానికి ఫేస్ ఉండదు. కానీ వెక్కిరించడం దీని హాబీ. కండరాలు ఉండవు. కానీ బలమైనది. ‘విధి బలీయమైనది’ అని అందరూ అంటుంటారు. బలమైనది అనడానికి బదులు... బలీయం అనే మాటను విధికి విధిగా ఎందుకు వాడతారో పండితులకు మాత్రమే తెలుసేమో. అయితే విచిత్రం ఏమిటంటే పామరులూ అదే మాట వాడుతుంటారు.
కొందరు మహనీయులుంటారు. విధిరాతతో సహా దేనినైనా వాళ్లు మార్చగలమంటారు. ఇడ్లీ రౌండ్‌గానే ఎందుకు ఉండాలని వాళ్లు ప్రశ్నిస్తారు.
సంప్రదాయానికి తాము ఎదురు నిలవగల ధీరులమంటారు. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మూసను నలు చదరాకారంగానో, త్రిభుజాకారంలోనో రూపొందిస్తారు. సమోసా షేప్‌లో ఇడ్లీని తయారు చేస్తారు. తాము దేన్నైనా మార్చగలమని ఈ కారణ జన్ములు ఇలా సెలవివ్వగానే... అలా నమ్మేస్తారు కొందరు. కానీ ఇడ్లీపాత్రను అడ్డుపెట్టి ఇడ్లీల షేపు మార్చగలరేమోగానీ దాని టేస్టు మార్చగలరా? విధీ అంతే... ఇంచుమించు ఇడ్లీతో సమానం.
విధిరాత బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ చెల్లని నాణేనికి లాగానే దాని గీతలూ గజిబిజిగా ఉంటాయట. ముఖానికి రింకిల్స్ వచ్చినట్లుగానే సాధారణంగా విధిరాత అనే సదరు హ్యాండ్ రైటింగ్ ఎప్పుడూ కాస్త అర్థం కాకుండా ఉంటుందని దాని గురించి ఆందోళన పడేవాళ్లు అనే మాట. అందుకే విధిరాతనూ, బ్రహ్మరాతనూ ఒకేలా పరిగణిస్తుంటారు. అందుకేనేమో ఆ బ్రహ్మరాతను రాసే రైటర్‌ను విధాత అని కూడా అంటుంటారు. డాక్టర్ విధాతగారు సాధారణంగా మనిషి నుదురును తన ప్రిస్క్రిప్షన్ పేపర్‌లాగా ఉపయోగి స్తుంటారని బాగా చదువుకున్నవాళ్లు అంటుంటారు.
అసలు విధి, బ్రహ్మ ఒకటేనని శాస్త్రాలన్నీ తెలిసినవాళ్లు అంటుంటారు. కానీ వాక్యనిర్మాణంలో విధి గురించి చెప్పేటప్పుడు ఫిమేల్‌గానూ, బ్రహ్మను మేల్‌గానూ చెబుతూ జెండర్ డిఫరెన్స్ చూపిస్తారు. విధికి ‘గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ బాగా తెలుసని చాలామంది అంగీకరించే సత్యం. ఆటల్లో దానికి మక్కువ ఎక్కువట. అందుకే అది తమతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుందని వాళ్ల అభిప్రాయం. అయితే సదరు క్రీడలో విధికి నైపుణ్యం చాలా ఎక్కువ. అందుకే విధి ఆడే ఆటలో అది మాత్రమే ఎప్పుడూ గెలుస్తుంది.
అందుకే సదరు స్పోర్ట్‌లో ఎప్పుడూ దానికి తలవంచాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు.
అన్నట్టు... ఫైన్ ఆర్ట్స్ విభాగంలో విధికి డ్రామాలు చాలా ఇష్టమట. అయితే అది ఎప్పుడూ వింత వింత నాటకాలు ఆడుతుంటుందనేది జీవితాన్ని కాచి వడబోసిన వారి ఉవాచ. అందుకే వారు ‘విధి ఆడే వింత నాటకం’లో... అంటూ ఒక స్టాక్ డైలాగ్ చెబుతుంటారు. విధి విషయంలో వారి వారి వ్యక్తిగత అనుభవాలు అందరికీ ఉంటాయి. విధి దేవత అనే మాట లేదు గానీ... శనిదేవుడి కంటే విధికే ఎక్కువ భయపడుతుంటారు.
దాని పట్ల ఇంతగా భయం ఉన్నందు వల్లనే తాము చేసే పనులకూ, బాధ్యతలనూ ‘విధులు’ అనే బహువచన రూపంలో చెబుతుంటారు. విధికి దయా దాక్షిణ్యాలు కరువు అని కాస్త భయం భయంగా చెబుతుంటారు. మనం ప్రయాణం చేయడానికి అవసరమైన రోడ్లను ఆర్ అండ్ బీ విభాగం వేసినా వేయకపోయినా విధి మాత్రం తప్పక నిర్మిస్తుందట. సదరు రహదారులలో ఎత్తుపల్లాలు చాలా ఎక్కువట. అందుకే సదరు రోడ్లపై బాగా ప్రయాణం చేసిన వారి గురించి అనుభవజ్ఞులు మాట్లాడుతూ ‘వారు ఎక్కని ఎత్తుల్లేవూ, వారు చూడని పల్లాలు లేవు’ అని అంటుంటారు.
‘తమరు ఏం ఆదేశిస్తే అదే చేస్తాను’ అనే సారాన్ని ఒకే మాటలో చెప్పడానికి ‘విధే’యుడు అనే పదాన్ని వాడతారు. పాలసీ మ్యాటర్ అనగా అది తప్పక పాటించాల్సిన రూల్ కాబట్టీ, అంత పవర్‌ఫుల్ కాబట్టే దాన్ని ‘విధానం’ అంటారు. విధివిధానాలు అనే మాటను ద్వంద్వసమాసంగా వాడుతుంటారు. దైవ లీలలలాగానే విధిలీలలూ ఒక పట్టాన అర్థం కావట. విధికి లక్ అనే పర్యాయపదం ఉందని చెబుతూ ఉన్నప్పటికీ... దాన్ని దురదృష్టంతోనే ఎక్కువగా ముడివేస్తుంటారు. అందుకేనేమో... శిక్షనూ, జరిమానాను వేసినప్పుడు దాన్ని పనిష్మెంట్‌లాగా చూపుతూ ‘విధిం’చారు అనే మాటను వాడుతుంటారు.
ఇది చివరివరకూ చదివినవారు ఒక్క మాటను ఇష్టమున్నా లేకున్నా అంగీకరించి తీరాలి. సాధారణంగా విధికి మరో మాటగా వాడుతుండే ఒక మాటను స్మరించాలి. అదే ఖర్మ. తమ ఖర్మ కొద్దీ ఇలా జరిగిందనీ, ఇందుకు ఈ వ్యాసకర్త ఎంతమాత్రమూ బాధ్యడు కాదనీ విజ్ఞులైన పాఠకులు గ్రహించాలి.
- యాసీన్