మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ ! | Einstein cutting follows children in story | Sakshi
Sakshi News home page

మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !

Published Sun, Jul 19 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !

మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !

హ్యూమర్
మా బుజ్జిగాడిని తీసుకొని హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్తుంటే ఎదురొచ్చాడు మా బ్రహ్మంగాడు. ‘‘ఏంట్రా వాడి జుట్టు అలా పెంచేశావ్. ఈ వయసులో వెంట్రుకలు చిన్నగా ఉండాలి. స్మార్ట్‌గా కనిపిస్తూనే చిన్నగా ఉండేలా కట్ చేయమని బార్బర్‌తో చెప్పు’’ అని సలహా ఇచ్చాడు వాడు.  ‘‘అబ్బే లేదురా. మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది మా ఆవిడ. అందుకోసమే ఇంత పెరిగేదాకా ఆగి, ఇప్పుడా కటింగ్ చేయించబోతున్నా’’ అన్నాన్నేను. ‘‘ఐన్‌స్టీన్ కటింగా? అదెందుకూ’’ ఆశ్చర్యపోయాడు వాడు. ఇక ఒక శ్రోత దొరికిన ఆనందంలో కారణాలు వివరించా.
   
మా బుజ్జిగాడికి సైన్స్ బాగా రావాలని ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టా. ఏదైనా వస్తువుకు వేడి తగిలితే అది కరుగుతుందనీ, ఘన పదార్థమైతే ద్రవంగా మారుతుందనీ వివరించా. పేరిన నెయ్యిని కరిగించడానికి వేడి చేస్తామనీ, చలికాలంలో కొబ్బరినూనె పేరుకుంటే దాన్ని రాసుకోడానికి వీలుగా మార్చడానికి ఎండలో పెడతామనీ సోదాహరణంగా చెప్పా. వాడూ ఇంటరెస్టింగ్‌గానే విన్నాడు. ఓరోజు రాత్రి వాడు అకస్మాత్తుగా ‘‘నాన్నా... వేడిచేస్తే ఘనపదార్థాలు ద్రవంగా మారతాయని నువ్వు చెప్పిన ఫిజిక్స్ సిద్ధాంతం తప్పు’’ అంటూ ఓ బాంబు పేల్చాడు.
 
‘‘అదెలారా? కొబ్బరినూనెనూ,పేరిన నెయ్యినీ ఎగ్జాంపుల్స్‌గా చూపించి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేశాక కూడా ఇలా ఎర్రర్స్ మాట్లాడితే ఎలారా?’’ అని అడిగా. అప్పుడు వాడు వివరించిన విషయాలు ఇవి. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం. కోడిగుడ్డు కొన్నప్పుడు దాని లోపలి సొనలు ద్రవరూపంలో ఉంటాయి. కానీ అమ్మ నీకోసం బాయిల్డ్ ఎగ్ చేయడానికి వాటిని ఉడక బెడుతుంది. అంటే కొన్ని నీళ్లు పోసి వేడి చేస్తుంది. నీ లెక్క ప్రకారం ద్రవరూపంలో ఉన్నవి, వేడి చేశాక వాయు రూపంలోకి రావాలి. కానీ ఇక్కడంతా రివర్సు. వేడిచేశాక గుడ్డులో ఉన్న ద్రవం కాస్తా ఘన రూపంలోకి మారుతుంది కదా’’ అన్నాడు వాడు.
 
‘‘నువ్వు మొండిగా వాదిస్తున్నావ్. గుడ్డు ఉడకబెట్టడం వేరు. ఈ ఒక్క అంశాన్నీ పట్టుకొని ఫిజిక్స్ సూత్రాలు తప్పు అనడం తప్పురా’’ అంటూ నేనేదో సర్దిచెప్పబోయా. కానీ వాడు ఒప్పుకోలేదు.
 ‘‘ఇదొక్కటే కాదు నాన్నా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతెందుకు... ఇడ్లీలు వండే సమయంలో ఇడ్లీ పాత్రలో దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండిని అమ్మ ఇడ్లీ పళ్లేలలో పోస్తుంది. వాటిని ఇడ్లీపాత్రలో ఉంచి, కింద నీరుపోసి వేడిచేస్తుంది. నిజానికి నేరుగా తగిలే మంట కంటే... ఆవిరిలోనే వేడి ఎక్కువగా ఉంటుంది.

అంటే నీ లెక్క ప్రకారం ఆవిరికి మరింత వేడి ఎక్కువ కాబట్టి దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండి, ఈ వేడికి వాయురూపంలోకి మారాలి. కానీ మళ్లీ ఇక్కడ పిండి కాస్తా రుచికరమైన ఇడ్లీలా... అంటే ఓ ఘనపదార్థంగా, ఘనమైన వంటకంగా మారిపోతుంది. అంతేకాదు, పాలు కాచి వేడి పాలలో తోడేసి, వెంటనే ఫ్రిజ్‌లో పెడితే అది పెరుగులా అంటే ఘన పదార్థంగా మారదు. బయట ఉంచితేనే గట్టిగా పేరుకుపోయి పెరుగవుతుంది. అలా అయ్యాకే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

కాబట్టి నువ్వు చెప్పే ఫిజిక్స్ సూత్రాలు నెయ్యికీ, కొబ్బరి నూనెకీ ఒక రకంగానూ, ఇడ్లీకీ, కోడిగుడ్డుకూ మరోరకంగానూ వర్తిస్తాయని నా మెదడు ల్యాబ్‌లో చేసిన ఆలోచనల ఎక్స్‌పెరిమెంట్స్‌లో తేలింది. పైగా అది మన కిచెన్‌ల్యాబ్‌లో ప్రూవ్ కూడా అయింది కదా నాన్నా. అలాంటప్పుడు వేడి తగిలితే ఘనపదార్థాలు కరుగుతాయనీ, ద్రవాలు వాయురూపంలోకి మారతాయని, చల్లబరిస్తే ద్రవపదార్థాలు ఘనరూపంలోకి మారతాయని నువ్వు చెప్పింది తప్పు కదా?’’ అని అడిగాడు వాడు.
   
‘‘మరి మీవాడి ఎక్స్‌పెరిమెంట్స్‌కూ, ఐన్‌స్టీన్ కటింగ్‌కీ సంబంధమేమిట్రా’’ అడిగాడు బ్రహ్మం.
‘‘ఈ సంభాషణ మొత్తం మా ఆవిడ విన్నది. ఐన్‌స్టీన్ తెలివితేటలన్నీ ఆయన విలక్షణమైన జుట్టులోనే ఉన్నాయని ఎవరో అన్నారట. అందుకే ఆమె మావాడి తెలివి తేటలకు అబ్బురపడిపోయి... వెంటనే వాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది.  ఇక మావాడు అన్నీ సైంటిఫిగ్గా ప్రూవ్ చేశాడు కాబట్టి, పైగా నేను మా ఆవిడ మాట కాదనను కాబట్టి మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించడానికే ఫిక్సయిపోయా’’ అంటూ కారణాన్ని వివరించా.
 
‘‘అవున్రా... నువ్వు చెప్పింది కరెక్టే. పైగా జుట్టు పొడవుగా ఉన్నందువల్ల  దాన్ని సర్దుకోవడానికి తల ఎగరేసినప్పుడల్లా మెదడు కూడా కదలి మరింత చురుగ్గా మారవచ్చు. దాంతో మీవాడికి మరిన్ని ఐడియాలు రావచ్చు’’ అంటూ వాడు మరింత సైంటిఫిగ్గా వివరించేసరికి మా ఆవిడ నిర్ణయం సరైనదే అన్న భావన నాలో మరింత బలపడింది.
- యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement