ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ!
హ్యూమర్
‘‘ఉపమాలంకారం అంటే ఉప్మా అనే టిఫిన్‌తో మన డైనింగ్ టేబుల్ అందాలను మరింత ఇనుమడింపజేయడం అన్నమాట. అందుకే దాన్ని ఉపమాలంకారం అన్నారు’’ అంటూ ఏదో లెక్చర్ ఇస్తున్నాడు మా రాంబాబు గాడు. ‘‘నీ ముఖం ఉపమాలంకారం అనేది ఒక వ్యాకరణ ప్రక్రియ అనుకుంటా. పోలికలు అందంగా చెప్పే అనేక తరహా రకాల్లో అదీ ఒకటి అనుకుంటా. నీకు తెలియకపోతే నోర్మూసుకో... కానీ ఇలా అడ్డమైన వ్యాఖ్యానాలు చెయ్యకు’’ అంటూ మరింతగా కోప్పడ్డాను నేను. నా కోపానికి అసలు కారణం వేరే ఉంది.
ఉదయం టిఫిన్‌లోకి మా ఆవిడ ఉప్మా చేయడంతో కాస్త ధుమధుమలాడుతూ బయటకు వచ్చేశా. మామూలుగా అయితే ఇడ్లీ పట్ల నాది కాస్త ఫ్రెండ్లీ ధోరణి. ఉప్మా అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ టిఫిన్‌లలోకెల్లా కాస్త త్వరగానూ, వీజీగానూ చేసేయవచ్చని మా ఆవిడ మాటిమాటికీ ఉప్మా చేస్తుంటుంది.
‘‘ఒరేయ్... అసలే ఇష్టమైన టిఫినూ దక్కలేదు. పైగా నీ గోల ఏమిట్రా’’ అంటూ వాడిపై మరింత విరుచుకుపడ్డాను. ఆ కోపమూ, ఈ కోపమూ కలిపి రాంబాబు గాడి మీద వెళ్లదీశాన్నేను.
అంతే... వాడు ఉప్మా గురించి నాకు హితబోధ మొదలుపెట్టాడు. ‘‘ఒరేయ్ నాయనా... ఎప్పుడైనా టిఫిన్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఉప్మా-పెసరట్ అద్భుతంగా ఉంటుందన్న మాట విన్నావా?’’ అడిగాడు.
‘‘విన్నాను’’
‘‘అందుకే మరి... కేవలం ఒక్క డైనింగ్ టేబుల్‌కు మాత్రమే ఉప్మా తలమానికం కాదురా... దోసెనూ ఉప్మాతోనే అలంకరిస్తారు. అందుకే ఇలా పలహారబల్లలనూ, దోసెల్నీ... మరెన్నింటినో ఉప్మాతో అలంకరించే అవకాశం ఉంది కాబట్టే అలంకార శాస్త్రంలో ఉప్మాకు టిఫిన్లలో పెద్దపీటకు బదులు పెద్దటేబుల్ వేశార్రా. అంతేకాదు... మనం పరిశ్రమ పరిశ్రమ అంటూ అభివర్ణించుకునే సినిమా రంగం అంతా మూవీ హిట్టు కొట్టాలంటే ఉప్మా మీదే ఆధారపడి ఉంది’’ అంటూ తన జిహ్వాగ్రం మీది ఉప్మాగ్ర చర్చలతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాడు.
‘‘ఒరేయ్... నన్ను మరీ ఇంత వేధించకు రా... ఉప్మాకూ సినిమా హిట్స్‌కూ సంబంధం ఏమిట్రా?’’ అడిగాన్నేను.
‘‘మొన్న బ్లాక్‌బస్టర్ అయిన మహేశ్‌బాబు పోకిరి సినిమా చూశావా? అందులో హీరోయిన్ ఎప్పుడూ బాక్స్‌లో ఉప్మా పెట్టుకు తిరుగుతుంటుంది. హీరోయిన్ తమ్ముడు కూడా ఉప్మానే బాక్స్ కట్టించుకుంటాడట. దాంతో హీరో ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తున్నార్రా’’ అని సరసమాడతాడు’’ అన్నాడు రాంబాబు గాడు.
‘‘కరెక్టే రా’’ అన్నాన్నేను.
‘‘నిన్నా మొన్నా మాత్రమే కాదురా బాబూ... దాదాపు 40 ఏళ్లకు ముందు అడవి రాముడు అన్న సినిమాలో రాజబాబు అనే మహనీయ కమేడియన్ ఉప్మా తయారు చేస్తే అడవిలో పెద్దపులి తనకు నోరూరించే దుప్పులూ, జింకలూ వంటి వాటిని వేటాడటం మానేసి ఉప్మా గిన్నెను శుబ్బరంగా ఊది పారేసింది. అంటే పులికి సైతం ఇష్టమైన వంటకం ఉప్మాయే అన్నమాట. అంతెందుకు... సదరు ఉప్మా వండిన రాజబాబు సైతం ‘పులి ఉప్మా తిందేమిటి చెప్మా’ అంటూ ఆశ్చర్యపడిపోతాడు. మొన్నటి బజ్‌వర్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తున్నార్రా అయితే ... నలభై ఏళ్లకిందట ఫేమస్ డైలాగ్ ’పులి ఉప్మా తిందేమిటి చెప్మా’. నీకో సీక్రెట్ చెప్పనా? ఏదైనా సినిమాలో ఉప్మాకు సంబంధించిన డైలాగ్ బజ్‌వర్డ్ అయ్యిందంటే ఆ సినిమా అప్పటి అడవిరాముడు లాగో, మొన్నటి పోకిరీ లాగో సూపర్, డూపర్, బంపర్ హిట్టన్నమాట’’ అంటూ వాక్రుచ్చాడు వాడు.
అంతకు ముందు నేనెప్పుడూ ఎరగని సెంటిమెంట్ ఇది. ఫలానా అక్షరంతో సినిమా మొదలవ్వాలనీ, ఫలానా నటుడే తప్పనిసరిగా ఉండాలనీ... ఇలా సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువే అన్న విషయం నాకు తెలుసు. కానీ... ఇలాంటి సెంటిమెంట్ అంటూ ఒకటి ముందుకొస్తే... ఉప్మాకు ప్రాధాన్యం పెరిగి, అది ఉప్మా పెసరట్ టిఫిన్‌లో కేవలం మెగాపవర్ పెసరట్టు సరసన మాత్రమే హీరోయిన్‌గా కాకుండా... అనేక టిఫిన్ల సరసన ఉప్మాయే హీరోయిన్ అయి జతకడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది నాకు.
‘‘ఒరేయ్... అలా అడ్డదిడ్డంగా మాట్లాడి నీ మాటలు సినిమా వాళ్లు వినకుండా చూసుకో’’
‘‘నోనో... ఐయాం సారీ. కొన్ని సిన్మాలలో ఉప్మాకు తగినంత ప్రాధాన్యం దొరికినా... దాని పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. నిజానికి కుట్టుపిండి, రవ్వ ఉప్మా, మసాలా ఉప్మా, టమాటా బాత్ అంటూ వివిధ రకాలుగా చిన్నా చితకా వేషాలు వేస్తున్నప్పటికీ ఉప్మాకు తగినంత బ్రేక్‌థ్రూ రాలేదు రా. అందుకే నాకు గనక అవకాశం దొరికితే సినిమా ఇండస్ట్రీ వారికి ఉప్మాతో హిట్ కొట్టడం ఎలా అన్నది వివరంగా తెలియజెబుతాను. ప్రస్తుతం నా జీవితలక్ష్యం ఒకటే రా?’’
‘‘ఏమిటది?’’ అడిగాను నేను బితుకు బితుకుమంటూ.
‘‘అన్నట్టు ఇవ్వాళ్ల టిఫిన్‌లో మీ ఆవిడ ఉప్మా చేసిందన్నావు కదా. మీ ఇంటికెళ్లి అలా కాస్త టిఫిన్ తినేసి వస్తా. నీ ఫ్యామిలీ ఏమిటీ... నా ఫ్యామిలీ ఏమిటి. వసుధైక కుటుంబం అంటారే... ఆ స్టైల్లో మనదంతా ఉపమైక కుటుంబం? అన్నట్టు నీకో మాట చెబుతా విను. ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ అని ఆర్యోక్తి. కాబట్టి ఉప్మా వండినందుకు నిరసనగా భార్య మీద అలిగి బయటకు రాకూడదన్నది మంత్రాల అంతరార్థం రా బాబూ ’’ అంటూ మా ఇంటి వైపునకు కదిలాడు రాంబాబుగాడు.
- యాసీన్