అన్ని చెట్లూ ఉన్నా ఆముదం చెట్టే గ్రేట్! | Humor | Sakshi
Sakshi News home page

అన్ని చెట్లూ ఉన్నా ఆముదం చెట్టే గ్రేట్!

Published Sat, Jan 23 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

అన్ని చెట్లూ ఉన్నా ఆముదం చెట్టే గ్రేట్!

అన్ని చెట్లూ ఉన్నా ఆముదం చెట్టే గ్రేట్!



  హ్యూమర్
 ‘‘ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమనీ...’’ అంటే అనుకున్న పని పూర్తి చేయని ఒకరిని నేను ఫోన్లో కోప్పడు తుండగా వచ్చాడు మా బుజ్జిగాడు.

‘‘నేను ఒప్పుకోను నాన్నా’’ అన్నాడు. ‘‘ఏమిట్రా నువ్వు ఒప్పుకోనిది?’’ అడిగా.
 ‘‘ఏమీ లేని చోట ఆముదం చెట్టు గొప్ప అంటే నేను అస్సలు ఒప్పుకోను’’ అన్నాడు వాడు.
 ‘‘ఇది నేనన్నమాట కాదురా. ఎన్నో ఏళ్లుగా చెప్పుకుంటున్న మాట’’ అన్నాన్నేను.
 ‘‘ఎర్త్ రౌండుగా లేదని ఏళ్ల తరబడి చెప్పుకున్నారట. అన్నంత మాత్రాన అది నిజమైపోయిందా?’’
 ‘‘ఇంతకీ నువ్వేమంటావ్?’’ అడిగాను.

 ‘‘దీనికి ఆన్సర్ చెప్పాలంటే నీతో చాలా చెప్పాలి’’ అన్నాడు వాడు.  ‘‘మరి చెప్పు’’ అన్నాను ఏం చెప్తాడో చూద్దామని.  ‘‘లాస్ట్ ఇయర్ సెలవుల్లో నాకు ఈత నేర్పాలని నువ్వనుకున్నావ్. అందుకోసం సద్దల చెరువుకు తీసుకెళ్లావ్. అక్కడ ఆముదపు లొట్టలన్నీ ఒక చోట చేర్చి కట్టిన కట్టను నా వీపుకు కట్టి... చెరువులో నేను తేలేలా చేశావ్. ఆముదపు లొట్టలు కాకుండా... ఇంకేవైనా సన్నటి కొమ్మల కట్టతో నాకు ఈత నేర్ప గలిగేవాడివా?’’

 ‘‘అలా ఎలా కుదుర్తుంది? తరతరాలుగా ఎంతోమంది ఆముదపు లొట్టలే కట్టి ఈత నేర్చుకున్నారు’’ ‘‘ఓకే... కొత్తగా పుట్టే ఆముదపు ఆకు అందాన్నీ, ఆ ఆకు డిజైన్‌నీ, ప్యాట్రన్‌నీ  ఎప్పుడైనా దగ్గరిగా చూశావా? దానంత అందమైన ఆకులు నువ్వనుకునే పెద్ద పెద్ద చెట్లయిన మర్రి, వేప లాంటి వాటికి ఉన్నాయా?’’
 ‘‘లేవు. అయితే...’’

 ‘‘ఉండుండు. నన్ను పూర్తి చేయనీ... అప్పుడు నేను బోల్డంత చిన్నగా ఉన్నప్పుడు బుడగలూదేవాడి దగ్గర పైపు ఇప్పించమని కోరుతుండగానే వాడు మనకు అందకుండా  సైకిల్‌మీద వెళ్లిపోయాడు. అప్పుడు నువ్వు ఆముదపు ఆకుకు ఉన్న కాడను కోశావ్. సబ్బునీళ్ల సీసాలో దాన్ని ముంచి ఊదితే... బుడగలు బుడగలన్నీ దొంతర్లుగా వచ్చేట్లు చేసిన సీన్ నీకు గుర్తుందా?’’
 ‘‘ఉంది.’’

 ‘‘ఇక ఆముదం చెట్టు కాయలు కాసే సమయంలో దానిపై మొదట్లో మెత్తగా ఉన్న ఈనెల్లాంటి ఆకృతులు, కాయ ఎండాక ముళ్లలా తయారవుతాయి. ఆ సమయంలో కాయను పగలగొడితే... ఆముదపు గింజ వీపు మీద ఉన్నంత క్రియేటివ్ డిజైన్ ప్యాట్రన్ ఆలివ్‌రిడ్లే తాబేళ్ల వీపు మీద కాకుండా మరెక్కడైనా ఉంటుందా?’’ ‘‘లేదు... అయితే’’ అంటూ నేనేదో చెప్పబోతుండగా మధ్యలోనే అందు కున్నాడు. ‘‘నన్ను పూర్తి చేయనీ... నీ తలకాయ సదరు ఆయిల్‌ను హ్యాపీగా రాసుకుని... ‘ఆముదం రాయండీ... ఈలేయండి’ అంటూ నువ్వు జోక్ చేసే విలువైన ఆయిల్ ఏది?’’

 ‘‘ఆముదమే.’’
 ‘‘కదా... మరి అలాంటి ఆముదం నీలాంటి మంచివాడి తలమీదకెక్కడంతో పాటూ ఇటు దొరక్కుండా ఉండేందుకు దొంగలకూ ఉపయోగపడుతుందట. ఇక ఆరోగ్యం బాగుండాలంటూ అప్పట్లో పిల్లలకు ప్రతివారం ఆముదం పట్టించేవారని నువ్వే చెప్పావు. అది తాగిన మోము వల్లనే ‘ఆముదం తాగినట్లుగా ముఖం పెట్టారనే వాడుక పుట్టిందని కూడా అన్నావు. పిల్లలను అమ్మదొంగా అని పిలుస్తుంటారు కదా. ఇలా పిల్లలనూ, దొంగలనూ ఒకే గాట కట్టించిన ఆముదం అన్నా... ఇంతటి సోషలిజం పాటించేందుకు దోహదం చేసిన ఆ చెట్టన్నా నాకెంతో గౌరవం’’ అన్నాడు మా బుజ్జిగాడు.

 ‘‘మరి ఇప్పుడు నన్నేం చేయ మంటావురా’’ విసుగ్గా అడిగాన్నేను. ‘‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టు గొప్ప అనకు. అన్ని చెట్లూ ఉన్నచోటైనా ఆముదం చెట్టే గ్రేటు అను. అప్పుడే నాకు బ్లిస్సు’’ అన్నాడు సీరియస్‌గా. నా మాట తుస్సు మనడంతో ఇప్పుడు నేను ఆముదం తాగినట్టు ముఖం పెట్టి, ఎప్ప ట్నుంచో నా నోట్లో ఆడు తున్న సామెతను మార్చుకోక తప్పలేదు.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement