టవల్‌స్టార్!
హ్యూమర్
టవలు, తువాలు, తువ్వాల, తుండు గుడ్డ... పేరైదైనా గానీ దానికి మనం అన్నకున్న దానికంటే ఎక్కువ సీన్ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ విస్తృతి ఉంది. కాకపోతే చాలామంది దాన్ని గుర్తించరంతే! గుర్తించినవాడు సమర్థంగా వాడుకుంటాడు. ‘ఆ... ఎవరికి తెలియదులే, ఎవరు వాడుకుంటార్లే పెద్ద చెప్పొచ్చారూ’ అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఖచ్చి తంగా తెలియదు.
తెలిస్తే... రజనీకాంత్‌కు ముందుగా మీరే దాన్ని గిరగిరా అనేకమైన మెలికలు తిప్పేసి భుజం మీద కప్పేసేవారు. పెదరాయుడు సినిమాకంటే ముందర దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసినా, ఆ సినిమా తర్వాతే దాంతో అన్ని గిరికీలు కొట్టించవచ్చని తెలిసింది.
అసలు హీరోయిజమ్‌ను భుజం మీది కండువాతో సాధించవచ్చని తెలిశాక... దాన్ని రజనీకాంత్ కంటే సమర్థంగా ఉప యోగించిన వాళ్లు లేరు.
మన సూపర్‌స్టార్ రజనీని కుర్చీ మీద కూర్చోబెట్టకుండా, నిలబెట్టి అవమానిద్దామంటే... అక్కడెక్కడో ఆకాశంలో వేలాడదీసి ఉన్న తూగుటుయ్యాలకు కండువాతో మెలికేసి, సయ్‌మంటూ లాగేసి, హుందాగా దాని మీద కూర్చొని... మళ్లీ రయ్‌మంటూ కాళ్లమీద కాళ్లేసుకుని తన హీరోచిత దర్జా చూపించడానికి ఉపయోగపడేది భుజం మీద టవలే. తదాదిగా ధీరోచిత ప్రద ర్శనకు టవల్‌ను ఒక టూల్‌లాగా సినిమా రంగాన విశేషంగా వాడుకున్నారు.
అంటే భుజం మీడి కండువా తీసుకో వడం, కుర్చీ కోడుకు మెలికేసి దగ్గరికి లాక్కో వడం, కాలు మీద కాలేసుకొని కూర్చో వడం వంటి ప్రదర్శనలకు దాని సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. ఒక్క సినీరంగంలోనే కాదు... రాజకీయ రంగంలోనూ దాని సేవలు అందుతున్న విషయం సమకాలీనులకు తెలియనిదేమీ కాదు. ఒకప్పుడు పార్టీ మారడాన్ని చాలా ఇండికేటివ్‌గా మరింత సున్నితంగా చెప్పేందుకు ‘పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ లాంటి నర్మగర్భమైన మాటలు వాడేవారు.
ఇప్పుడు అన్ని రంగాలలోనూ సింపుల్ మాటలు ఉపయోగించడం పరిపాటి అయ్యింది కాబట్టి పార్టీ మునుపటి తీర్థం స్వీకరించడం వంటి వాటి కంటే ‘కండువా కప్పుకున్నారు’ లాంటి మాటలే ఎక్కువగా వాడుతున్నారు. భాషాపరంగా వచ్చిన ఈ మార్పు కూడా జనాన్ని తమకు చేరువ చేస్తుందనీ నేతల విశ్వాసం. ఎంత ఆ నమ్మకం లేకపోతే ఒక బలమైన మాట స్థానంలో కండువా చేరుతుంది చెప్పండి!
ఇప్పుడంటే రాజకీయ నేతలూ, దానికి కాస్త ముందు సినిమావాళ్లు తువ్వాలును, తుండుగుడ్డను తమ స్వప్ర యోజనాలకు వాడుతున్నారు గానీ... అనాది కాలంగా దాని ఉపయోగాలన్నీ మనందరికీ తెలియనివేమీ కాదు. అందుకే తుండుగుడ్డ పేరిట ఎన్నో జాతీయాలూ, సామెతలూ వెలిశాయి. ‘నడుం బిగించారు’ అనే మాటలో తువ్వాల అనే మాటే లేకపోయినా... ఏదైనా పనికి ఒడిగడుతున్నామంటే తువ్వాలనే నడుముకి బిగించామన్నది సమస్త తెలుగువాడకందారులందరికీ సుపరిచితమైన మాట.
ఇక తలకు గుడ్డ కట్టుకోవడం అన్నది చాలా శ్రమతో కూడిన పనికి ముందర ఆరంభసూచికగా చేసే పని.
ఇక ఊళ్లో పెద్దమనిషి డ్రెస్‌కోడ్‌లో భుజం మీద తువ్వాలు తప్పకుండా ఉంటుంది. పైగా దాని క్వాలిటీ మీదనే ఆయన ఎంత పెద్దవాడనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద నేతలైతే ఖద్దరు కండువాలూ, రాజకీయ వాసనలేమీ లేకుండా జస్ట్... మామూలు పెద్దవాళ్లు (అనగా పెద్దరికం మైనస్ రాజకీయాలు అన్నమాట) అయితే ఖరీదైన టర్కీటవళ్లు, ఓన్లీ పెద్దమనుషులైతే మంచి క్వాలిటీ కండువాలు, అదే శ్రామిక వర్గం అయితే ముతక తుండుగుడ్డలు భుజాల మీద ఉంటాయి.
అనగా... మతం, కులం, ఇతర సూచికలతో పాటు... సామాజిక వర్గీకరణకు సైతం తుండుగుడ్డలు బాగా ఉపయోగపడతాయని సోషియాలజిస్టులు ఇంకా కనుగొనాల్సిన వాస్తవం. ఇక ఆధ్యాత్మికతకూ తుండుగుడ్డ ఒక సూచన. కావి రంగు తువ్వాల దీనికి ఒక తిరుగులేని చిహ్నం. ఆడంబరాలకూ, ఐశ్వర్యాలకూ, ఐహిక భవబంధాలకూ దూరంగా ఉన్నారని తెలపడానికీ ముతక కావిరంగు భుజంగుడ్డ ఒక తార్కాణం. సర్వసంగ పరిత్యాగ గుణంతో, ఒక రకమైన నిర్లిప్తతతో గడిపే గుణం తెలిపేందుకు ఈ భుజం గుడ్డ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తన శంకరశాస్త్రి గారి భుజాన ఇది వేసి చూపెడతాడు. పవర్‌లెస్ అని చూపించడానికి అదెంత పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందో నిరూపిస్తాడు.
చిత్రమేమిటంటే... టవల్ అనే ఒకే ఒక అంశం... అటు ఆడంబరతకూ, ఇటు నిరాడంబరానికీ... ఈ రెండు గుణాలకూ ప్రతీక కావడం దాని గొప్పదనం. దండెం మీద వేలాడుతూ సామాన్యంగా కనిపిస్తుందని దానివైపు అసలు దృష్టే పోవడం లేదని అనుకోకండి. అటు సూపర్‌స్టార్ రజనీని అయినా, ఇటు కామన్‌స్టార్ శంకరశాస్త్రి గారినైనా సమదృష్టితో ఆదరించే గుణం తువ్వాలకు ఉంది. ఆ వస్త్రవిశేష నేత విజ్ఞతలో భగవంతుడికి ఉన్నంత స్థితప్రజ్ఞత ఉంది.
- యాసీన్