సీటే బంగారమాయెనా...
హ్యూమర్
కాస్త డబ్బుంటే కష్టపడి ఎలాగోలా కిందా మీదా పడి ఏదో పార్టీలో ఓ ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు గానీ మన హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సులో సీటు సంపాదించుకోవడం మాత్రం అంతకన్నా కష్టం. అది బస్సెక్కి ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప చెబితే అతిశయోక్తే అంటారు. రోజూ రెండు పూటలా సిటీ బస్సెక్కితే ’బతుకు జట్కా బండి కాదనీ, గుట్కా పొడి అనీ, కిలోమీటర్ చొప్పున మనల్ని తొలిచేస్తుందనీ’ తెల్సుకుంటాం. నా పేరు ముఖేష్, నేను ఒక్కసారే బస్సెక్కాను, మళ్లీ నగరంలో బస్సు ప్రయాణం చేస్తానని నమ్మకం లేదు అంటూ థియేటర్లో స్లైడులు వేసుకోవాల్సిందే. రామదాసు గనుక సిటీ బస్సు ఎక్కితే ’సీటే బంగార మాయెనా కోదండపాణి’ అని ప్రార్థించక మానడు.
ఎక్కాల్సిన బస్సువైపు చూస్తే.. దాంట్లో ’దండయాత్ర ఇది దయా గాడి దండయాత్రా’ అంటూ చాలా మంది ఎన్టీఆర్ లు టెంపర్ మీదుంటారు. ‘ఈ బస్సు మనందరిదీ’ అనే స్లోగన్ బాగా నచ్చిన కాలేజీ కుర్రాళ్లు ఫుట్ బోర్డుపై గబ్బిలాల్లా వేలాడుతుంటారు. ’సెన్సిటివ్’ జీవులం గనుక ఆ ఫీట్లు చేయలేక.. జనాల్ని తోసుకుంటూ, జీవితంలో అసలు సిసలు సంఘర్షణ అంటే ఏంటో తెల్సుకుంటూ, బస్సు మధ్యలోకి చేరిపోతాం. అలా వెళ్లే క్రమంలో తోటివాళ్లు మన కాళ్లు ఇంట్లో చపాతీ పిండిలా మెత్తగా తొక్కే ప్రక్రియ పాక్షికంగా పూర్తవుతుంది. (మళ్లీ దిగేప్పుడు సంపూర్ణమవుతుందనుకోండి). ఆశతో ఒక సీటు పక్కన నిల్చుంటాం..అతను వచ్చే స్టాప్ లోనే లేచి వెళ్లిపోతాడని మన ప్రిడిక్షన్.
అయితే ఎన్టీఆర్ గార్డెన్ బయట చిలక జ్యోతిష్కులు చెప్పేవాటిలాగే ఇదీ జరగదు. అతనిది బస్సుతో విడిపోనిబంధమైనట్లు చివరి స్జేజీ వరకు దిగడు. ఈలోపు మీ తల ’సాధ్యమైనంత’ తిప్పితే కనబడే సీట్లలో కొందరు బిలబిలమంటూ దిగిపోతుంటారు. కొందరు నిరాశావాదులకు ఆ ఉచితాసనం దక్కుతుంది. ఇక వాళ్ల దర్జా మాటల్లో చెప్పలేం. అదృష్టాన్ని టిఫిన్ లో పెట్టుకుని బస్సెక్కిన ఆ ’సీటు రాజాలు’ వెంటనే ెహ డ్ ఫోన్స్ తీసి, పాటలు వింటూ, లయబద్దంగా తలూపుతుంటారు. ఆ ఊపుడుకి ’నో వేకెన్సీ’ వాళ్లందరికీ కడుపు మండుతుంటుంది. మా ఆఫీసులో ‘సార్’లా ఓరీ దురహంకారీ అనాలనిపిస్తుంది. మన పక్కసీట్లో కూర్చున్న పుణ్యపురుషుడు మాత్రం ఇంచు కదలడే. ఇక వీడు దిగడు అని విసిగిపోయి మన ఆశను వెనుక సీటు పక్కకి మార్చుకున్నామనుకో, ఇంతసేపూ మనం ఆశలు పెట్టుకున్న వాడు ఆకాశవాణి పిలిచినట్లు సడెన్ గా దిగిపోతాడు.
ఈ అవకాశంతో అప్పటిదాకా ఆ సీట్లో సర్దుకుని కూర్చున్న మరో ఇద్దరు కులాసాగా కూర్చోవడమో, మరో కొత్త అతిథి వాళ్ల గూటికి చేరడమో జరుగుతుంటుంది. ఈ ’కిరణజన్య సంయోగ క్రియ’ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న ఆశ- నిరాశ తెలుగు పాఠం లీలగా గుర్తుకొస్తుంది. మన రెండో ఆప్షన్ లేడీస్ రిజర్వేషన్ సీట్లపైకి వెళ్లినా.. అదృష్టదేవత మన వెంట ఉంటే తప్ప కూర్చోలేం. ఈ లోపు ఏ ఇంజినీరింగ్ సైన్స్ దేవ తనో వచ్చి ఇది లేడీస్ సీటుఅందనుకో.. సీటు వేటుతో పాటు అవమాన పోటూ తప్పదు. మనం వదిలేసిన మహిళా రిజర్వేషన్ సీట్లలో ఎవడో సభ్యత మరిచి ‘సిగ్గు’ లేకుండా కూర్చుంటాడు. ’మహిళలను గౌరవించడం మన విధి... వాళ్లకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం’ అన్న సుభాషితాలు తలపైనే రాసి ఉన్నా వాడికి పేనుకుట్టినట్లయినా ఉండదు.
అలాంటి అసభ్యుడు కూర్చున్నప్పుడు మాత్రం ఏ దేవకన్యా ఆ సీటు వైపు కన్నెత్తి చూడదు. బహుశా ఆఫీసులో పొద్దంతా కూర్చున్నాం కదా కాసేపు నిల్చుందాం అని డిఫరెంట్ గా ఆలోచిస్తుందేమో. మన కా కనికరం దక్కదెందుకో. పోనీ, సిగ్గూ బిడియం విడిచిపెట్టి, స్వార్థం బుసలు కొట్టి .. ఆ సీట్లలో మనం కూర్చున్నామనుకో... ఏదో అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేస్తున్నామని లోపలి మనిషి అరుస్తూనే ఉంటాడు. లేవరా.. అంటూ పెదరాయుడులో రజినీకాంత్ లా గద్దిస్తుంటాడు. ఈ లోపలి సంఘర్షణ తో పాటు, ఎవరైనా లేడీస్ వస్తారేమో అని క్షణక్షణం భయం భయంగా హార్రర్ సినిమా చూస్తున్నట్లు కూర్చోవాల్సి వస్తుంది.
ఇంత హెడ్ పెయిన్ తో కూర్చోడం కంటే... లెగ్ పెయిన్ తో నిల్చోవడం బెటరనిపిస్తుంది. అతి అరుదుగా ఎవరైనా బ్యూటిఫుల్ గర్ల్ కాస్త జరుగుతారా కూర్చుంటా.. అందనుకో, ఇక నువ్వు కూర్చునేది సీటుకి ఐదించుల పైనే గానీ సీట్లో కాదు. ఇదే కాదు.. బస్సు ఎక్కాలన్నా ఆశనిరాశే.. (మన ఫేట్ తిరగబడినట్లే) 9 నెంబరు కోసం కోసం చూస్తే 6 వెళ్లిపోతుంటుంది. మనవి కాని బస్సులు కదులుతూ, అమూల్యమైన సాయం సమయం కరుగుతూ, ఎన్నో ’హోప్స్’ పెట్టుకున్న ఇంటినుంచి ‘ఎక్కడ లక్కీ’ అంటూ ఫోన్ లో మెసేజ్ లు ఫ్లాష్ అవుతూంటే, ’కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం’ అంటూ మహాప్రస్థానంలో శ్రీ శ్రీ నా కోసమే పాట రాశాడా అనిపిస్తుంది. - రమేష్ గోపిశెట్టి