ద్వారకా తిరుమల: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చిమ్మాలన్న దురుద్దేశంతో లేనిది ఉన్నట్టు చూపించేందుకు ప్రయత్నాలు చేసిన టీడీపీ నాయకుడు చివరికి భంగపడ్డారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో జరిగిన ఈ ఘటన వివరాలున్నాయి.. బుట్టాయిగూడేనికి చెందిన నోముల రాంబాబు పూరి గుడిసెకు 2021 అక్టోబర్ నుంచి 2022 నవంబర్ వరకు (13 నెలలకు) రూ.26,660 విద్యుత్ బిల్లు వచ్చిం ది. అతను అధికారులను సంప్రదించగా, అంత బిల్లు రావడానికి మీటరు జంప్ అవడమే కారణమని తెలుసుకున్నారు.
2022 నవంబర్ 30న రూ.16,840 బిల్లును మినహాయించి, మిగిలిన రూ.9,820 చెల్లించాలని సూచించారు. పైగా, రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. అప్పటి నుంచి అతడికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోంది. అయితే రాంబాబు పాత బకాయితో పాటు ఆ తర్వాతి నెలల బిల్లులు కూడా చెల్లించలేదు. అతని బకాయి రూ.10,150కు చేరింది. దీంతో అధికారులు నెల క్రితం అతని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించారు.
రాంబాబు ఈ నెల 7న రూ.2 వేలు మాత్రమే చెల్లించాడు. అయితే అధికారులు మొత్తం బిల్లు చెల్లించాలని సూచించారు. గోపాలపురం టీడీపీ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు పార్టీ కార్యక్రమంలో భాగంగా గురువారం అక్కడికి వచ్చారు. ఆయనకు రాంబాబు పాత బిల్లు చూపాడు. వెంటనే ఆయన పాత బిల్లు పట్టుకొని పూరి గుడిసెకు వేలల్లో బిల్లు వచ్చిం దంటూ రోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. చివరకు అది పాత బిల్లని తేలడంతో నాలుక్కరుచుకున్నారు.
ప్రతి నెలా ఎస్సీ సబ్సిడీ వస్తోంది
ప్రభుత్వం గతేడాది డిసెంబర్ రెండో తేదీ నుంచి రాంబాబుకు ఎస్సీ కోటాలో ప్రతి నెలా విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని, అతనికి నెలకు రూ.28 మాత్రమే బిల్లు వస్తోందని భీమడోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గోపాలకృష్ణ తెలిపారు. పాత బిల్లు బకాయికి సంబంధించి రాంబాబు శనివారం మరో రూ.500 చెల్లించాడని, దాంతో అతడి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. బిల్లు నెలకు రూ.26,660 వచ్చిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment