పొంగేషు పూరీ... గుటకేషు గప్‌చుప్!
నవ్వింత: మా రాంబాబుగాడు దేన్నైనా బలంగా నమ్మాడంటే చాలు... దాన్ని నిరూపించడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అలాంటి వాడు అకస్మాత్తుగా పూరీల మీద పడ్డాడు. వాడు పడితే పడ్డాడు కానీ... మమ్మల్నందర్నీ పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడొచ్చింది ఇబ్బంది. పొద్దున్నే పూరీలు వండే ఇల్లు పూరిల్లట. చక్కటి పూరింట్లో దొరికే పూరీలూ, రుచికరమైన ఆలూఖుర్మా, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కర్పూరతాంబూలం, రకరకాల పూరీ కూరల రుచులను ఎంచే సరసులూ ఉంటే కవిత్వం ఆటోమేటిగ్గా వస్తుందంటాడు మా అల్లసాని రాంబాబు. వాడి వాదన ఎంతవరకూ వెళ్లిదంటే... ఏదైనా పద్యం తాలూకు చివరిపాదం చెప్పి మొదటి మూడు లైన్లూ నింపడాన్ని పూరించడం అని ఎందుకు అంటారంటే... పూరీలు తినడం వల్ల జ్ఞానం బాగా పెరిగి, తక్షణం ఆ లైన్లను నింపగలుగుతారట!
‘‘ఇది కరెక్ట్ కాదేమోరా?’ అంటే... ‘‘మరి వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల్లో ‘స్నానించడం’ అని రాస్తే దానికి ‘స్నానం చేయడం’ అని అర్థం ఉన్నప్పుడు సిమిలర్‌గా ఇదెందుకు కాకూడదు?’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఒరే... మిద్దె ఉన్న ఇల్లు మిద్దె ఇల్లు, గడ్డితో కప్పువేసే చిన్న గుడిసె పూరిల్లు. అది గుడిసె కాబట్టి పూరి గుడిసె అని కూడ అంటార్రా’’ అంటే వినడే! ఒకవేళ గుడిసెలో పూరీలు చేస్తే దాన్ని పూరి గుడిసె అంటారని వాడు ఒక్కసారి కమిటయ్యాడట. ఇక వాడి మాట వాడే వినడట. ఈ డైలాగ్ కూడా పేరులో పూరీ ఉన్న ఫిల్మ్ డెరైక్టర్ కమ్ రైటర్ పూరీ జగన్నాథ్‌దట. ‘అలాంటప్పుడు మీ మాట ఎందుకు వినాల’న్నది వాడి వాదన.
పూరీల రుచిని ఒకపట్టాన వదులుకోలేని ఎందరో జిహ్వాగ్రేసరులంతా దాన్ని మరవలేక భేల్‌పూరీ, సేవ్‌పూరీ, పానీపూరీ అంటూ మరెన్నో విధాలుగా తింటుంటారట. పానీపూరీని ఇతరులతో షేర్ చేసుకోడానికి వీల్లేనందువల్ల, ఒక్కరే గప్‌చుప్‌గా గుటుక్కుమనిపిస్తారు కాబట్టే దాన్ని ముద్దుగా ‘గప్‌చుప్’ అని కూడా అంటారట. అక్కడితో ఆగకుండా ఫక్తు సంస్కృత సూక్తుల తరహాలో అనేక కొటేషన్లూ చెప్పాడు.
‘‘పొంగేషు పూరీ, మింగేషు మిర్చీ, గుటకేషు గప్‌చుప్, బొక్కేషు బోండా, భోజ్యేషు బజ్జీ, కొరికేషు కోవా, నమిలేషు కిళ్లీ’’ అని... ‘‘వీటన్నింటిలోనూ పూరీలను ముందుగా ఎందుకు పెట్టాననుకుంటున్నావ్? చపాతీ పెనానికి అతక్కుపోతుంది. అదేగానీ... పూరీ మూకుడులో వేయగానే పొంగుకుంటూ పైకి తేలుతుంది. ‘మునిగి మునకలేయకు, అతికి పెనానికి కరుచుకోకు, ముడుచుకోకు, విచ్చుకో... నాలా పైకి తేలు’ అంటూ ఎందరికో స్ఫూర్తినీ, సందేశాన్నీ ఇస్తుంది పూరీ. అందుకే నా శ్లోకంలో ముందుగా దానిపేరే రాశా’’ అన్నాడు వాడు.
‘‘వదిలెయ్ రా... పొడగకపోయినా రుచిలో మార్పేమీ రాదు కదా’’ అన్నా.
‘‘అలాగని గొప్పగొప్పవాళ్లు దాన్ని వదిలేయలేదు కదా. నిజానికి వాళ్లు పూరీని తమ పేరులో పెట్టుకోవడం వల్లే న్యూమరాలజీ ప్రకారం సక్సెసయ్యారట తెలుసా?’’ అన్నాడు.
‘‘ఎవర్రావాళ్లూ?’’ అడిగా.
‘‘ఓంపూరీ, అమ్రీష్‌పూరీ, పద్మినీ కొల్హాపూరీ లాంటి గ్రేట్ నటులూ, హస్రత్ జైపూరీ లాంటి మహాకవులూ... వీళ్లంతా నిత్యం పూరీని స్మరిస్తూ తమ పేరులో దాన్ని భాగం చేసుకున్నవాళ్లే’’
‘‘వాళ్ల పేరులో ఉన్నది పూరీ కాదురా... పురి... పురి...’’ అని ఆ మాట సాగకుండా పురిపెట్టి వాడు చక్కగా ఉచ్చరించేలా పురిగొల్పడానికి ప్రయత్నించా.
‘‘కొంతమందికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్లూ పూరీతో పాటూ, అక్కడి దీర్ఘాన్ని మింగేశారు. చాలామంది తెలుగు వాళ్లు ఆ పేర్లను పిలిచేప్పుడు ‘పూరీ’ అంటూనే పిలుస్తారు. ఉచ్చారణే నాకు ప్రామాణికం’’ అంటూ మొండికేశాడు. అక్కడితో ఆగకుండా కవిత్వానికీ, పూరీకీ మళ్లీ మరో లింకు పెట్టాడు.
అదేంట్రా అంటే...
‘‘ఒకాయన భోజుడి నుంచి ఏదైనా బహుమతి పొందాలని వచ్చాట్ట. భోజరాజు ముఖం చూస్తే చాలు కవిత్వం అలా పొంగుకొచ్చేస్తుందట కదా. అలా కార్యార్థియై వచ్చిన ఆయన భోజుడి ముఖం చూడగానే కవిత్వం మరచి, బాగా ఆకలేసి పలారం అడిగాట్ట. ‘‘టిపినీ దేహి రాజేంద్ర... పూరీ కూర్మా సమన్వితం’’ అని కోరాడట. భోజుడి లెవల్‌కు సింపుల్‌గా పూరీ మాత్రమే అడగటమేమిటీ, రాజుగారు ఇవ్వడమేమిటీ అని అతడి బంగారు పాలనలో ఉన్న ప్రజలంతా కలిసి తాము మాట్లాడుకునే భాషకు భోజ-పూరీ అని పేరుపెట్టుకున్నారట. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల ప్రాంతాల్లోనూ, బీహార్ పశ్చిమ ఏరియాల్లోనూ, గయానా, సురినమ్, ఫిజీ, మారిషస్... దేశాల్లోనూ భోజ్‌పురి భాష మాట్లాడతారట. ఎందుకనీ...భోజుడి పట్ల గౌరవం, పూరీల పట్ల విపరీతమైన ప్రేమ’’ అన్నాడు వాడు. మనమెంత చెప్పినా వీడింతే అనుకొని పూరీలు తినడం పూర్తయ్యాక.. ‘పుర్రెకో వెర్రీ... జిహ్వకో పూరీ’ అంటూ నిట్టూరుస్తూ బయల్దేరాం.
- యాసీన్