
భువనేశ్వర్: అశేష భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచి్చంది. ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామికి శతాబ్దాలుగా రాజులు, భక్తులు కానుకగా సమరి్పంచిన వజ్రాభరణాలు, వెండి, బంగారు నిల్వలను దాదాపు 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా తనిఖీచేయనున్నారు. ఆభరణాలను తూకం వేసి, నాణ్యత లెక్కించి, అవసరమైతే మరమ్మతులు చేయనున్నారు. ఆలయంలోని రహస్య ఖజానా గది జీర్ణావస్థకు చేరిన నేపథ్యంలో గదికి మరమ్మతులు చేయనున్నారు.
అంతవరకు అపారమైన ఖజానాను జాగ్రత్తగా వేరేచోట భద్రపరచనున్నారు. ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఖజానా యజమానులైన విమలా మాత, మహాలక్షీ ఆజ్ఞ తీసుకున్నారు. తర్వాత ఖజానాకు రక్షకుడైన లోకనాథ్ స్వామి అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.28 గంటలకు ఖజానా గది తలుపులు తెరిచారు. 11 మంది మాత్రమే సంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లారు. ఆభరణాలను లెక్కించకుండానే సాయంత్రం 5.20కి బయటికి వచ్చారు.
తరలింపు మరో రోజున
‘‘లోపలి గది తాళాలు తెరుచుకోకపోవడంతో వాటిని పగలగొట్టి తెరిచాం. ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించి సీల్ వేశాం. అన్నింటినీ ఒకే రోజు తరలించడం కష్టం. త్వరలో తేదీని నిర్ణయించి తరలింపు మొదలెడతాం. రిపేర్ల తర్వాత ఆభరణాలకు విలువ కట్టే పని మొదలుపెడతాం’ అని ఏఎస్‌ఐ శాఖ అధికారులు వెల్లడించారు. గదిలోని ఆభరణాలను తరలించేందుకు సిద్ధం చేసిన 4.5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల లోతున్న పెద్ద టేకు చెక్కపెట్టెలను గది వద్దకు తెప్పించారు. గదిలో పాములేవీ లేవని తేలింది.