Gupchup
-
పానీపూరి.. రోగాల దారి!
భాగ్యనగరంలో నిత్యం చిన్నారులు మొదలు విద్యార్థులు, పెద్దల దాకా లాగించే స్ట్రీట్ ఫుడ్ గోల్గప్పా. అదేనండి.. పానీపూరీ లేదా గప్‌చుప్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి.. ఉడికించిన ఆలూ, కాబూలీ చెనా దట్టించి.. ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనోళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీగల్లీలో కనిపించే పానీపూరీ బండ్ల వద్ద ఈ టేస్టీ ఎక్స్పీరియన్స్ కోసం క్యూలు కూడా కడుతుంటారు.కానీ కొందరు పుదీనా నీటిలో కలిపేకృత్రిమ రంగులు, పూరీల తయారీకి వాడే నూనెల వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పానీపూరీ నమూనాలను పరీక్షించగా వాటిల్లో కేన్సర్కారక పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీల వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్రాలు యోచిస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్పానీపూరీల తయారీలో వాడే పదార్థాలు ఎలా ఉన్నా.. చాలా మంది పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరువ్యాపారులు వినియోగిస్తున్నారు. అలాంటి నీటిలో ఈ–కొలి వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ఇతర రోగకారకాలు ఉంటాయి. అలాంటి నీటిని పానీపూరిలో వాడితే ఇక మన ఆరోగ్యం అంతే సంగతులు.ఎసిడిటీ.. అల్సర్లు..!పానీపూరీ అంటే ఎంత ఇష్టమైనా అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తరచూ పానీపూరీ లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో జాగ్రత్త..అసలే వర్షాకాలం.. ఇంట్లో తాగే నీటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కలరా, డయేరియా వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాంటిది ఏ నీటిని వాడారో తెలియని పానీపూరీ బండ్ల వద్ద తిని ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని వైద్యులు ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా చిరువ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలూ, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు. టీబీ వచ్చే చాన్స్..అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆçహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధకులు కూడా చెబుతున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాలు శోషరస గ్రంథుల్లోకి (లింఫ్ ఎడినైటిస్) చేరితే క్షయ వ్యాధి (ఎక్స్ట్రా పల్మొనరీ) సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మెనింజైటిస్ వచ్చే ప్రమాదంపానీపూరీలో ఎలాంటి నీళ్లు వాడుతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది చాలా ప్రాణాంతక వ్యాధి. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్ఇంట్లో చేసుకుంటే మేలు.. పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే రుచిగా, శుచిగా తయారు చేసుకోండి. ఇందుకు అవసరమయ్యే పదార్థాలన్నీ దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుంటే చాలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మార్కెట్లోకి ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు.. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. వెండింగ్ మెషీన్ లాంటి ఈ డిస్పెన్సర్లలో మనం డబ్బు చెల్లిస్తే చాలు పానీపూరి ఆటోమేటిక్‌గా మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల కొంతలో కొంత కలుíÙతం కాకుండా ఉంటుంది. కాకపోతే అందులో డిస్టిల్డ్ వాటర్ వాడితే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. గోబీ మంచూరియాపై నిషేధం.. గోబీ మంచూరియాపై ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గోబీ మంచూరియాను గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక బ్యాన్ చేశాయి. టార్ట్రజైన్, కార్మోసిన్, సన్‌సెట్ యెల్లో, రోడమైన్ అనే రసాయనాలను గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయని గుర్తించారు. గోబీ మంచూరియాతోపాటు పీచు మిఠాయిని కూడా ఆయా రాష్ట్రాలు నిషేధించాయి. వాటిల్లో వాడే రసాయనాలు చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. రుచి కాదు.. శుచి ముఖ్యం.. పానీపూరి బండ్లు కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. చేతులు కడగకుండానే ఇస్తుంటారు. వాటినే చాలామంది రుచిగా తింటారు. అయితే రుచి కాదు.. శుచి ముఖ్యం.. ఈ మధ్య చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇష్టంగా తినే మెనూలో పానీపూరి ఉండటం బాధాకరం. – వేణుగోపాల్, బ్యాంకు ఉద్యోగి, ఉప్పల్దుమ్ము, ధూళి వాటిపైనే..పానీపూరీ చాలామంది తింటుంటారు. అందులో వాడే నీరు ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. పైగా.. ప్లాస్టిక్ ఫోమ్ ప్లేట్లు వాడుతుంటారు. వాటి మీద వేడి పదార్థాలు వేస్తే.. రసాయనాలు కరిగి.. ఆరోగ్య సమస్యలు తెస్తుంటాయి. ఆ బళ్లు కూడా రోడ్ల పక్కనే ఉంటాయి. దుమ్ము, ధూళి వాటిపై పడి కలుషితం చేస్తాయి. – సురేశ్ బొల్లేపల్లి, అంబర్‌పేట -
పదేళ్లుగా గప్‌చుప్ వ్యాపారం.. రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి..
సాక్షి, మరికల్ (మహబూబ్‌నగర్): రోడ్డుపై గప్‌చుప్‌ల వ్యాపారం చేస్తూ జీవనం ఓ వ్యాపారి ఏకంగా రూ.20 లక్షల అప్పు చేసి ఉడాయించాడు. ఈ సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని వడెగామ్తండాకు చెందిన రాజారాం పదేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మరికల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడే పోలీస్‌స్టేషన్ పక్కన గప్‌చుప్‌ల వ్యాపారం నడిపిస్తున్నాడు. ప్రైవేట్ ఫైనాన్స్‌లో, తెలిసిన వ్యక్తుల వద్ద చిట్టీలు వేస్తూ చేసి అప్పులు తీరుస్తూ అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత స్థానికంగా ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అంతేగాక వ్యాపారానికి, ఇంటికి కావాల్సిన సరుకులను కిరాణా దుకాణాల్లో తీసుకుని రూ.లక్షల్లో బాకీ పడ్డాడు. మూడు నెలల క్రితం ఇంటిని మరొకరికి విక్రయించి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సుమారు పది మంది వద్ద రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి పది రోజుల క్రితం రాత్రికి రాత్రే ఉడాయించాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు స్వగ్రామానికి వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. చివరకు అక్కడా అతను లేకపోవడంతో మోసపోయాయని వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై ఎస్ఐ నాసర్‌ను వివరణ కోరగా తమకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. దాటవేస్తూ వచ్చాడు.. ఏడాది క్రితం కూతురి పెళ్లి కోసం జమ చేసిన రూ.లక్షను అప్పుగా అడిగితే గప్‌చుప్‌ల వ్యాపారికి ఇచ్చా. తిరిగి అడితే ప్రతిసారి ఇస్తానంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. పది రోజుల క్రితం అతను ఉండే ఇంటికి వెళ్లి చూశాం. అప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి తనకు అమ్మాడని చెప్పడంతో మోసపోయామని గుర్తించాం. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – దాసరి అంజమ్మ, బాధితురాలు, మరికల్ -
పొంగేషు పూరీ... గుటకేషు గప్‌చుప్!
నవ్వింత: మా రాంబాబుగాడు దేన్నైనా బలంగా నమ్మాడంటే చాలు... దాన్ని నిరూపించడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అలాంటి వాడు అకస్మాత్తుగా పూరీల మీద పడ్డాడు. వాడు పడితే పడ్డాడు కానీ... మమ్మల్నందర్నీ పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడొచ్చింది ఇబ్బంది. పొద్దున్నే పూరీలు వండే ఇల్లు పూరిల్లట. చక్కటి పూరింట్లో దొరికే పూరీలూ, రుచికరమైన ఆలూఖుర్మా, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కర్పూరతాంబూలం, రకరకాల పూరీ కూరల రుచులను ఎంచే సరసులూ ఉంటే కవిత్వం ఆటోమేటిగ్గా వస్తుందంటాడు మా అల్లసాని రాంబాబు. వాడి వాదన ఎంతవరకూ వెళ్లిదంటే... ఏదైనా పద్యం తాలూకు చివరిపాదం చెప్పి మొదటి మూడు లైన్లూ నింపడాన్ని పూరించడం అని ఎందుకు అంటారంటే... పూరీలు తినడం వల్ల జ్ఞానం బాగా పెరిగి, తక్షణం ఆ లైన్లను నింపగలుగుతారట! ‘‘ఇది కరెక్ట్ కాదేమోరా?’ అంటే... ‘‘మరి వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల్లో ‘స్నానించడం’ అని రాస్తే దానికి ‘స్నానం చేయడం’ అని అర్థం ఉన్నప్పుడు సిమిలర్‌గా ఇదెందుకు కాకూడదు?’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఒరే... మిద్దె ఉన్న ఇల్లు మిద్దె ఇల్లు, గడ్డితో కప్పువేసే చిన్న గుడిసె పూరిల్లు. అది గుడిసె కాబట్టి పూరి గుడిసె అని కూడ అంటార్రా’’ అంటే వినడే! ఒకవేళ గుడిసెలో పూరీలు చేస్తే దాన్ని పూరి గుడిసె అంటారని వాడు ఒక్కసారి కమిటయ్యాడట. ఇక వాడి మాట వాడే వినడట. ఈ డైలాగ్ కూడా పేరులో పూరీ ఉన్న ఫిల్మ్ డెరైక్టర్ కమ్ రైటర్ పూరీ జగన్నాథ్దట. ‘అలాంటప్పుడు మీ మాట ఎందుకు వినాల’న్నది వాడి వాదన. పూరీల రుచిని ఒకపట్టాన వదులుకోలేని ఎందరో జిహ్వాగ్రేసరులంతా దాన్ని మరవలేక భేల్‌పూరీ, సేవ్పూరీ, పానీపూరీ అంటూ మరెన్నో విధాలుగా తింటుంటారట. పానీపూరీని ఇతరులతో షేర్ చేసుకోడానికి వీల్లేనందువల్ల, ఒక్కరే గప్‌చుప్‌గా గుటుక్కుమనిపిస్తారు కాబట్టే దాన్ని ముద్దుగా ‘గప్‌చుప్’ అని కూడా అంటారట. అక్కడితో ఆగకుండా ఫక్తు సంస్కృత సూక్తుల తరహాలో అనేక కొటేషన్లూ చెప్పాడు. ‘‘పొంగేషు పూరీ, మింగేషు మిర్చీ, గుటకేషు గప్‌చుప్, బొక్కేషు బోండా, భోజ్యేషు బజ్జీ, కొరికేషు కోవా, నమిలేషు కిళ్లీ’’ అని... ‘‘వీటన్నింటిలోనూ పూరీలను ముందుగా ఎందుకు పెట్టాననుకుంటున్నావ్? చపాతీ పెనానికి అతక్కుపోతుంది. అదేగానీ... పూరీ మూకుడులో వేయగానే పొంగుకుంటూ పైకి తేలుతుంది. ‘మునిగి మునకలేయకు, అతికి పెనానికి కరుచుకోకు, ముడుచుకోకు, విచ్చుకో... నాలా పైకి తేలు’ అంటూ ఎందరికో స్ఫూర్తినీ, సందేశాన్నీ ఇస్తుంది పూరీ. అందుకే నా శ్లోకంలో ముందుగా దానిపేరే రాశా’’ అన్నాడు వాడు. ‘‘వదిలెయ్ రా... పొడగకపోయినా రుచిలో మార్పేమీ రాదు కదా’’ అన్నా. ‘‘అలాగని గొప్పగొప్పవాళ్లు దాన్ని వదిలేయలేదు కదా. నిజానికి వాళ్లు పూరీని తమ పేరులో పెట్టుకోవడం వల్లే న్యూమరాలజీ ప్రకారం సక్సెసయ్యారట తెలుసా?’’ అన్నాడు. ‘‘ఎవర్రావాళ్లూ?’’ అడిగా. ‘‘ఓంపూరీ, అమ్రీష్‌పూరీ, పద్మినీ కొల్హాపూరీ లాంటి గ్రేట్ నటులూ, హస్రత్ జైపూరీ లాంటి మహాకవులూ... వీళ్లంతా నిత్యం పూరీని స్మరిస్తూ తమ పేరులో దాన్ని భాగం చేసుకున్నవాళ్లే’’ ‘‘వాళ్ల పేరులో ఉన్నది పూరీ కాదురా... పురి... పురి...’’ అని ఆ మాట సాగకుండా పురిపెట్టి వాడు చక్కగా ఉచ్చరించేలా పురిగొల్పడానికి ప్రయత్నించా. ‘‘కొంతమందికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్లూ పూరీతో పాటూ, అక్కడి దీర్ఘాన్ని మింగేశారు. చాలామంది తెలుగు వాళ్లు ఆ పేర్లను పిలిచేప్పుడు ‘పూరీ’ అంటూనే పిలుస్తారు. ఉచ్చారణే నాకు ప్రామాణికం’’ అంటూ మొండికేశాడు. అక్కడితో ఆగకుండా కవిత్వానికీ, పూరీకీ మళ్లీ మరో లింకు పెట్టాడు. అదేంట్రా అంటే... ‘‘ఒకాయన భోజుడి నుంచి ఏదైనా బహుమతి పొందాలని వచ్చాట్ట. భోజరాజు ముఖం చూస్తే చాలు కవిత్వం అలా పొంగుకొచ్చేస్తుందట కదా. అలా కార్యార్థియై వచ్చిన ఆయన భోజుడి ముఖం చూడగానే కవిత్వం మరచి, బాగా ఆకలేసి పలారం అడిగాట్ట. ‘‘టిపినీ దేహి రాజేంద్ర... పూరీ కూర్మా సమన్వితం’’ అని కోరాడట. భోజుడి లెవల్‌కు సింపుల్‌గా పూరీ మాత్రమే అడగటమేమిటీ, రాజుగారు ఇవ్వడమేమిటీ అని అతడి బంగారు పాలనలో ఉన్న ప్రజలంతా కలిసి తాము మాట్లాడుకునే భాషకు భోజ-పూరీ అని పేరుపెట్టుకున్నారట. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల ప్రాంతాల్లోనూ, బీహార్ పశ్చిమ ఏరియాల్లోనూ, గయానా, సురినమ్, ఫిజీ, మారిషస్... దేశాల్లోనూ భోజ్‌పురి భాష మాట్లాడతారట. ఎందుకనీ...భోజుడి పట్ల గౌరవం, పూరీల పట్ల విపరీతమైన ప్రేమ’’ అన్నాడు వాడు. మనమెంత చెప్పినా వీడింతే అనుకొని పూరీలు తినడం పూర్తయ్యాక.. ‘పుర్రెకో వెర్రీ... జిహ్వకో పూరీ’ అంటూ నిట్టూరుస్తూ బయల్దేరాం. - యాసీన్