పానీపూరీ నీటిలో కలిపే రసాయనాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక, తమిళనాడు
తమ రాష్ట్రాల్లో వాటిని నిషేధించాలని ఆయా ప్రభుత్వాల యోచన
నగరంలోనూ చాలా చోట్ల కలుషిత వాతావరణంలో అపరిశుభ్ర నీటితో తయారీ
అల్సర్లు, డయేరియా, క్షయ, టైఫాయిడ్ సోకే ప్రమాదముందంటున్న వైద్యులు
ఇప్పటికే గోబీ మంచూరియాపై పలు రాష్ట్రాల బ్యాన్
భాగ్యనగరంలో నిత్యం చిన్నారులు మొదలు విద్యార్థులు, పెద్దల దాకా లాగించే స్ట్రీట్ ఫుడ్ గోల్‌గప్పా. అదేనండి.. పానీపూరీ లేదా గప్‌చుప్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి.. ఉడికించిన ఆలూ, కాబూలీ చెనా దట్టించి.. ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనోళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీగల్లీలో కనిపించే పానీపూరీ బండ్ల వద్ద ఈ టేస్టీ ఎక్స్‌పీరియన్స్ కోసం క్యూలు కూడా కడుతుంటారు.
కానీ కొందరు పుదీనా నీటిలో కలిపేకృత్రిమ రంగులు, పూరీల తయారీకి వాడే నూనెల వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఇటీవల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పానీపూరీ నమూనాలను పరీక్షించగా వాటిల్లో కేన్సర్‌కారక పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో పానీపూరీల వినియోగంపై నిషేధం విధించాలని ఆ రాష్ట్రాలు యోచిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్
పానీపూరీల తయారీలో వాడే పదార్థాలు ఎలా ఉన్నా.. చాలా మంది పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరువ్యాపారులు వినియోగిస్తున్నారు. అలాంటి నీటిలో ఈ–కొలి వంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, ఇతర రోగకారకాలు ఉంటాయి. అలాంటి నీటిని పానీపూరిలో వాడితే ఇక మన ఆరోగ్యం అంతే సంగతులు.
ఎసిడిటీ.. అల్సర్లు..!
పానీపూరీ అంటే ఎంత ఇష్టమైనా అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తరచూ పానీపూరీ లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
వర్షాకాలంలో జాగ్రత్త..
అసలే వర్షాకాలం.. ఇంట్లో తాగే నీటి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కలరా, డయేరియా వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాంటిది ఏ నీటిని వాడారో తెలియని పానీపూరీ బండ్ల వద్ద తిని ఏరికోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని వైద్యులు ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా చిరువ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలూ, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు.
టీబీ వచ్చే చాన్స్..
అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆçహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయ వ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధకులు కూడా చెబుతున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాలు శోషరస గ్రంథుల్లోకి (లింఫ్ ఎడినైటిస్) చేరితే క్షయ వ్యాధి (ఎక్స్‌ట్రా పల్మొనరీ) సోకే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
మెనింజైటిస్ వచ్చే ప్రమాదం
పానీపూరీలో ఎలాంటి నీళ్లు వాడుతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇది చాలా ప్రాణాంతక వ్యాధి. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్
ఇంట్లో చేసుకుంటే మేలు..
పానీపూరీ అంటే ఇష్టమున్నా బయట తింటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఎంచక్కా ఇంట్లోనే రుచిగా, శుచిగా తయారు చేసుకోండి. ఇందుకు అవసరమయ్యే పదార్థాలన్నీ దుకాణాల్లో దొరుకుతాయి. వాటిని ఎలా తయారు చేయాలో యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకొని ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుంటే చాలు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
మార్కెట్లోకి ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు..
ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఆటోమేటిక్ పానీపూరి డిస్పెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. వెండింగ్ మెషీన్ లాంటి ఈ డిస్పెన్సర్లలో మనం డబ్బు చెల్లిస్తే చాలు పానీపూరి ఆటోమేటిక్‌గా మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. దీనివల్ల కొంతలో కొంత కలుíÙతం కాకుండా ఉంటుంది. కాకపోతే అందులో డిస్టిల్డ్ వాటర్ వాడితే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు.
గోబీ మంచూరియాపై నిషేధం..
గోబీ మంచూరియాపై ఇప్పటికే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించాయి. గోబీ మంచూరియాను గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక బ్యాన్ చేశాయి. టార్‌ట్రజైన్, కార్మోసిన్, సన్‌సెట్ యెల్లో, రోడమైన్ అనే రసాయనాలను గోబీ మంచూరియా తయారీలో వాడుతున్నారని, అవి తీవ్ర అనారోగ్య సమస్యలు తీసుకొస్తాయని గుర్తించారు. గోబీ మంచూరియాతోపాటు పీచు మిఠాయిని కూడా ఆయా రాష్ట్రాలు నిషేధించాయి. వాటిల్లో వాడే రసాయనాలు చిన్నారుల్లో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు.
రుచి కాదు.. శుచి ముఖ్యం..
పానీపూరి బండ్లు కొన్ని చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటాయి. చేతులు కడగకుండానే ఇస్తుంటారు. వాటినే చాలామంది రుచిగా తింటారు. అయితే రుచి కాదు.. శుచి ముఖ్యం.. ఈ మధ్య చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇష్టంగా తినే మెనూలో పానీపూరి ఉండటం బాధాకరం. – వేణుగోపాల్, బ్యాంకు ఉద్యోగి, ఉప్పల్
దుమ్ము, ధూళి వాటిపైనే..
పానీపూరీ చాలామంది తింటుంటారు. అందులో వాడే నీరు ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. పైగా.. ప్లాస్టిక్ ఫోమ్ ప్లేట్లు వాడుతుంటారు. వాటి మీద వేడి పదార్థాలు వేస్తే.. రసాయనాలు కరిగి.. ఆరోగ్య సమస్యలు తెస్తుంటాయి. ఆ బళ్లు కూడా రోడ్ల పక్కనే ఉంటాయి. దుమ్ము, ధూళి వాటిపై పడి కలుషితం చేస్తాయి. – సురేశ్ బొల్లేపల్లి, అంబర్‌పేట
Comments
Please login to add a commentAdd a comment