‘‘పునరాలోచించండి...’’ ఇదీ ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ డే థీమ్‌గా నిర్ణయించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) దాని అనుబంధంగా ఆరోగ్య రంగంలో పనిచేసే అనేక రంగాలకు చెందిన నిపుణులు. హెపటైటిస్ గురించి పునరాలోచించాలంటూ వీళ్లంతా అన్ని దేశాల ప్రభుత్వాలనూ, విధాన నిర్ణేతలనూ, ఆరోగ్య కార్యకర్తలనూ, చికిత్సారంగ నిపుణులనూ ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే... హెపటైటిస్ చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణం తీసుకోగలదు. ప్రపంచ జనాభాలో చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. అందుకే ఈ థీమ్ అవసరం ఏర్పడింది. హెపటైటిస్‌పై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం...
హెపటైటిస్ అంటే...
నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ; బి; సి; డి; ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్‌లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ యాభై లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుంచి వచ్చింది. ఈ పదంలోని మొదటిభాగం ‘హెపార్ స్టెమ్ ఆఫ్ హిప్యాట్’... అంటే కాలేయం అనీ, ‘ఐటిస్’ అంటే ఇన్‌ఫ్లమేషన్ (మంట, వాపు) అని అర్థం.
A- హెపటైటిస్
చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి (ముఖ్యంగా యుక్తవయస్కుల్లో) బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటకు కనిపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించేవారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన ఒక శాతం మందిలో ఇది మరణానికి దారితీస్తుంది.
వ్యాప్తి ఇలా: ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తిచెందుతుంది. మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల కలుషితమైనా లేదా ఆ నీటితో పదార్థాలు తయారు చేయడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. అంటే సురక్షితం కాని నీరు, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ.
తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోటీ నలభై లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి.
లక్షణాలు: హెపటైటిస్- ఏ తీవ్రత స్వల్పం మొదలుకొని తీవ్రం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు (చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుగా మారడం) కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలూ ఉండకపోవచ్చు.
నిర్ధారణ: హెపటైటిస్- ఏ ను కేవలం బయటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వైరస్‌ను నిర్ధారణ చేసే ప్రత్యేక రక్తపరీక్ష ఆధారంగా యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. దీనితో పాటు రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) అనే మరో అదనపు పరీక్ష కూడా ఈ వైరస్ నిర్ధారణ కోసం చేసేదే. ప్రత్యేకమైన ల్యాబ్‌లలో ఈ పరీక్ష ద్వారా ఈ వైరస్ తాలూకు ఆర్‌ఎన్‌ఏను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది.
చికిత్స: ఈ వ్యాధి చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కాలేయానికి భారం పడని విధంగా తేలికపాటి ఆహారం, లక్షణాలను బట్టి చేసే చికిత్సలు (సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్స్) చేస్తే చాలు. లక్షణాలు తగ్గడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి వారాలు మొదలుకొని నెలలు కూడా పట్టవచ్చు.
నివారణ:
సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు తాగడం / వాడటం
ఆరుబయట మల విసర్జన లాంటి అలవాట్లు మానుకుని, మలం బయటకు కనిపించని విధంగా కట్టించిన టాయెలెట్లలోనే మలవిసర్జన చేయడం (దీని వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి).
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం (అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కాళ్లూ,చేతులు కడుక్కోవడం వంటివి).
వ్యాక్సిన్: హెపటైటిస్-ఏ కు చాలారకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఏదైనప్పటికీ అవన్నీ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే విధానం మాత్రం ఒకటే. అయితే ఏడాది లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి లేదు. కేవలం ఒక్క మోతాదు వ్యాక్సిన్‌తో నెల రోజుల్లోనే ఈ వ్యాధి పట్ల నూరు శాతం భద్రత ఒనగూరుతుంది.
B- హెపటైటిస్
ఇది హైపటైటిస్‌లోని అన్ని వైరస్‌లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి (క్రానిక్)గా మారి వేధిస్తోంది.
వ్యాప్తి ఇలా: ఇది ఎంత చురుకైనదంటే... సూదిపోటు ద్వారా వ్యాపించడం అనే ఒక్క అంశంలోనే హెచ్‌ఐవీతో పోలిస్తే దాదాపు 50 నుంచి 100 రెట్లు వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తుంది.
గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే... తల్లి నుంచి బిడ్డకూ సోకుతుంది. లేదా మరీ నెలల పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది సెక్స్ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.
ఎంత ప్రమాదకరమైనదంటే.. : హెచ్‌ఐవీ వైరస్‌ను మానవ శరీరం నుంచి వేరు చేయగానే కొద్ది క్షణాల్లోనే అది మరణిస్తుంది. కానీ హెపటైటిస్-బి వైరస్ వ్యక్తి శరీరం బయటకు వచ్చాక కూడా కనీసం ఏడురోజుల పాటు సజీవంగా ఉండగలదు. అందుకే దీని వ్యాప్తి చాలా వేగవంతం, తీవ్రం. వ్యాక్సిన్ వేయని వ్యక్తిని రక్తమార్పిడి వల్లనో, సెక్స్ వల్లనో లేదా సూదిపోటు వల్లనో వ్యాపించడం జరిగితే అది అతి వేగంగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. అంటే సగటున 75 రోజుల్లో బయటపడవచ్చు.
లక్షణాలు: వ్యాధి సోకిన కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపితే అది సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా పరిణమించవచ్చు. అయితే అదృష్టవశాత్తు 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోవచ్చు కూడా.
నిర్ధారణ: చాలా సాధారణ రక్త పరీక్షతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఇదే పరీక్షతో రక్తంలో వైరస్ తీవ్రతనూ తెలుసుకరోవచ్చు.
చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్) మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగల చికిత్స. ఈ వ్యాధి ఉన్న రోగుల్లో కాలేయంపై దాని ప్రభావ తీవ్రతను బట్టి ఇంటర్‌ఫెరాన్, యాంటీవైరల్ ఏజెంట్స్ వంటి మందులు ఇస్తారు. ఒకవేళ దీని కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తే... దాన్ని చాలా త్వరితంగా గుర్తించినప్పుడు క్యాన్సర్‌కు గురైన భాగం వరకు తొలగించవచ్చు.
నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సి పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఇక చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వని 18 ఏళ్ల లోపు వారికి (ఆ ప్రాంతంలో హెపటైటిస్-బి వ్యాప్తిని గుర్తిస్తే) వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది.
దీనితోపాటు రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారు అంటే... చికిత్సారంగంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్‌వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
C - హెపటైటిస్
ఇది చాలామందిలో, చాలావరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్దిమందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్‌గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో ఆర్నెల్లలో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్‌గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్‌గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది.
వ్యాప్తి ఇలా: ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉంది.
లక్షణాలు: వైరస్ సోకాక లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం/అలసట, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిర్ధారణ: లక్షణాలు బయటకు కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌గా పరిణమించినవారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్తపరీక్షతో సీరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్‌సీవీ ఆర్‌ఎన్‌ఏ ను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే... దాదాపు 15 శాతం నుంచి 45 శాతం మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్‌ఎన్‌ఏ ని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్-సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది (ఫైబ్రోసిస్ / సిర్రోసిస్) అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు.
దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలూ అవసరమే. ఎందుకంటే వైరల్‌లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్‌లోనే ఆరు రకాల జీనోటైప్‌లు ఉంటాయి. ఒక జీనోటైప్ వైరస్‌కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్‌కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సనూ, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలనూ నిర్ణయిస్తారు.
నివారణ: ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకుని, వాటినుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య. కొన్ని సమర్థమైన నివారణ చర్యలివే....
చేతులు శుభ్రంగా ఉంచుకోవడం; చికిత్సారంగంలో ఉన్నవారు సర్జికల్ గ్లౌజ్ వంటివి వాడటం, గ్లౌజ్ వేసుకునే ముందర చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవడం.
చికిత్సరంగంలో ఉపయోగించిన వ్యర్థాలను సమర్థంగా పారేయడం (సేఫ్ డిస్పోజింగ్)
అన్ని ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకోవడం స్టెరిలైజ్ చేసుకోవడం వంటివి నివారణ చర్యల్లో కొన్ని.
D- హెపటైటిస్
ఇది వర్తులాకరంలో ఉన్న చాలా చిన్న ఆర్‌ఎన్‌ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తిస్థాయి వైరస్‌గా కాకుండా ఒక ఉప-వైరస్‌లాగే పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్-బి అండ లేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తిచెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్-బితో పాటూ రావచ్చూ (కో-ఇన్ఫెక్షన్)... లేదా హెపటైటిస్-బి వచ్చాక ఆ తర్వాతా రావచ్చు (సూపర్ ఇన్ఫెక్షన్).
అది కో-ఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్-బి ఉన్నప్పటి కంటే కాలేయం పై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్/కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్-బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్-డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. (దాదాపు 20 శాతం ఎక్కువ).
వ్యాప్తి ఇలా: హెపటైటిస్-బి వ్యాపించే అన్ని మార్గాల్లోనూ ఇది కూడా వ్యాపిస్తుంది. కాబట్టి హెపటైటిస్-బి వ్యాప్తిని నిరోధించే మార్గాలే ఈవ్యాధి నివారణకూ తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షల మందిలో ఇది హెపటైటిస్-బి వైరస్‌తో పాటూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ఉనికి అంతగా లేనప్పటికీ, డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది.
చికిత్స / నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అది హెపటైటిస్-బి సోకితేనే వస్తుంది కాబట్టి ఈ తరహా రక్షణ లభిస్తుందన్నమాట. ఇక హైపటైటిస్-బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలనూ దీని వ్యాప్తి నివారణకూ అవలంబించాలి.
E- హెపటైటిస్
ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్-ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలావరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా నాలుగు నుంచి ఆరువారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తరోగులు దీని బారిన పడుతున్నారు.
వ్యాప్తి ఇలా: సాధారణంగా మలంతో కలుషితమైన నీరు మంచినీటితో కలవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కలుషితమైన ఆహారం, నీటిని పూర్తిగా నివారించాలి. కేవలం సురక్షితమైన నీటినే తాగాలి/ఉపయోగించాలి. అలాగే రక్తమార్పిడి, రక్తంతో సంబంధం ఉన్న చర్యల వల్ల కూడా వ్యాప్తిచెందుతుంది. ఇక గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ప్రధానంగా ఇది కలుషితమైన నీటి వల్లనే వస్తుంది కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహారం పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదు.
లక్షణాలు: హెపటైటిస్‌కు ఉండే అన్ని సాధారణ లక్షణాలూ దీనిలోనూ ఉంటాయి. అంటే...
కామెర్లు (చర్మం, కళ్లలోని తెలుపు భాగం పచ్చగా మారడం, మూత్రం పచ్చగా రావడం, మలం తెల్లగా ఉండటం)
ఆకలి పూర్తిగా లేకపోవడం (అనొరెక్సియా),
కాలేయవాపు (హెపటోమెగాలీ),
పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపు భాగాన్ని ముట్టుకుంటే కూడా నొప్పి (టెండర్‌నెస్) వికారం/వాంతులు
జ్వరం.
ప్రభావం: హెపటైటిస్-ఈ వల్ల కలిగే లక్షణాలు సాధారణంగా వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ చాలా అరుదుగా ఫల్మినెంట్ హెపటైటిస్ (అంటే కాలేయం పూర్తిగా వైఫల్యం కావడం) వంటి కండిషన్ ఏర్పడి మరణానికి దారితీయవచ్చు. గర్భిణుల్లో ఈ వైరస్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ. సాధారణంగా ఈ వైరస్ సోకిన గర్భిణుల్లో 20 శాతం మంది మూడో త్రైమాసికంలో దీని వల్లనే మరణించిన దాఖలాలు ఉన్నాయి.
చికిత్స: హెపటైటిస్-ఈ వ్యాధి చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది. సమతుల ఆహారం ఇవ్వడం, లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం (సింప్టమ్యాటిక్ ట్రీట్‌మెంట్) మాత్రమే చేస్తారు. అయితే ఈ లక్షణాలు ఉన్న గర్భిణులను మాత్రం ఫల్మినెంట్ హెపటైటిస్ బారి నుంచి రక్షించడానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి హెపటైటిస్-ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చాలా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
డేంజరస్ హెపటైటిస్...
Published Mon, Jul 21 2014 11:35 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
Advertisement
Advertisement