
నవ్వింత: చెట్నీస్ అండ్ చెనెక్కాయాస్!
‘‘ఏమిటోరా... న్యాయానికి రోజులు కావివి’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఎందుకురా?’’ అన్నాన్నేను. ‘‘ఎందుకేమిట్రా... రుచి అంతా చట్నీది. దానికి కారణమైన పల్లీలదీ. కానీ ఆ గొప్పదనం దక్కేది ఇడ్లీకి. ఫలానా హోటల్‌లో ఇడ్లీ బాగుందంటారుగానీ... చెట్నీ గురించి ఎవడూ మాట్లాడడు. ఈ లోకం తీరే అంత’’ అంటూ నిట్టూర్చాడు.‘‘ఏంట్రా నీ చెట్నీస్ అండ్ చెనెక్కాయాస్ గొడవ?’’ అడిగా. ‘‘కష్టపడేదొకరు, క్రెడిట్టు మరొకరిది’’ ‘‘ఛ... అలాగెందుకు జరుగుతుందిలే. నువ్వు మరీనూ’’ ‘‘ఇప్పుడూ... క్రికెట్టు చూడు.
ఒకడు కిందా మీదా పడి క్యాచుపడతాడు. ఒళ్లు దోక్కుపోయేలా కిందపడతాడు. కిరీటం మాత్రం బౌలర్ నెత్తిన పెడతారు. క్యాచేమో వీడు పట్టడమేంటీ? బౌలర్‌గాడు ఆ ఘనతంతా తనదే అన్నట్లుగా ఆ గొప్పను తన ఖాతాలో వేసుకుని గాల్లో ఆ సోడాలు కొట్టడమేంటీ? ఇడ్లీ దాదాపుగా అన్ని చోట్లా ఒకేలా ఉంటుంది. ఏదైనా హోటల్‌లో ఇడ్లీ బాగుందని పేరొచ్చిందంటే అక్కడ ఉండే చట్నీ బాగా ఉన్నట్టు లెక్క. అయినా ఎవ్వరూ చట్నీ ఔన్నత్యాన్ని గుర్తించరు. చట్నీ అయితేనేం... దాని మూలమైన చెనెక్కాయ అయితేనేం... క్రెడిట్టునంతా ఇడ్లీకి త్యాగం చేసేసి తాను ప్రేమించిన హీరోను... వాడు ప్రేమించిన హీరోయిన్‌కు కట్టబెట్టేసిన పోజుతో నిశ్శబ్దంగా హొరైజన్‌లోకి వెళ్లిపోతుందిరా పాపం పల్లికాయ’’
‘‘కావాలనుకుంటే వేపుకుని మెక్కు. లేదా ఉడకబెట్టుకొని బొక్కు. అంతేగానీ... ప్రతిదానికీ పటం గట్టేసి దానికి లేనిపోని గొప్పలు ఆపాదిస్తావేమిట్రా నువ్వు’’ అని చిరాకు పడ్డాన్నేను. ‘‘లేని గొప్పలు కాదురా... పల్లీలకు ఉన్న గొప్ప అంతా ఇంతా కాదు. అసలు ప్రేమికులు పార్కులో పల్లీలే ఎందుకు తింటారంటావ్? ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవేమోగానీ... ఒక్క తొక్కలో రెండు పిక్కలు ఇముడుతాయి. అంటే ఏమిటన్నమాట.... ఒక్క అఫైర్‌లోని ఇద్దరు లవర్స్‌ను సింబాలిగ్గా చూపుతుంది పల్లీకాయ. కాబట్టే ప్రేమికులంతా పార్కులో పల్లీలు తింటారు. లవర్స్ ఏమి తిన్నా తినకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఒక పల్లీని ఒలుచుకుని చెరో గింజా తినే ఉంటారు. ఒకే స్ట్రాతో రెండు కూల్‌డ్రింక్స్ తాగిన ఫీలింగు పెట్టే ఉంటారు. నిజానికి కూల్‌డ్రింక్ కంటే పల్లీ చాలా చీపూ, పైగా తినొచ్చు చాలా సేపు. ఇప్పటికి నడిచిన ప్రేమకథలనన్నింటినీ లెక్కేస్తే వాటన్నింటిలోనూ ప్రేమికుల నాలుకలపై నాట్యమాడిన పల్లీల సంఖ్య కొన్ని కోట్ల టన్నులుంటుందిరా. ఇదీ పల్లీల ప్రేమ ఫిలాసఫీ’’
‘‘మరి అదేంట్రా... ఎవరిదైనా జీతం తక్కువగా ఉంటే... ఆ.. వాడికొచ్చేదేముంది పీనట్స్ అంటూ పల్లీలను తీసిపారేస్తారేంట్రా?’’ ‘‘అజ్ఞానం కొద్దీ కొందరు అలా చేస్తారుగానీ... పీనట్స్ అంటే ఏమనుకున్నావు. అరకును పేదవాడి ఊటీ అన్నట్టూ... కుండను పేదవాడి ఫ్రిజ్జు అన్నట్టు నిజానికి పల్లీలను పేదవాడి జీడిపప్పు అనాల్రా. గొప్పవాళ్లు జీడిపప్పు వాడే ప్రతిచోటా సామాన్యుడు వేరుసెనగపప్పు వాడతాడంటే వాటి గొప్పతనం ఏమిటో... అవి వేటికి ప్రత్యామ్నాయమో నీకు అర్థం కావడం లేదూ? పైగా జీడిపప్పుకు లేని జాలిగుండె పల్లీలకుంటుంది’’
‘‘పోను పోనూ నీకు మతిపోతోందిరా రాంబాబూ... పల్లీలకు జాలేమిట్రా?’’ ‘‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనవుతుందో కాదోగానీ... అతిథులెక్కువైతే పల్లీకాయ జాలితో కరిగినీరవుతుంది. ఫలితంగా పల్లీచెట్నీ పలచబారుతుంది. అదేగానీ ఎవరైనా వీఐపీగారు టిఫినుకు వస్తే వారి గొప్పదనానికి, గట్టిదనానికీ అనులోమానుపాతంగా సదరు మహనీయుడికి గట్టిచెట్నీ భాగ్యం దక్కుతుంది.
అంతటి ‘బీజ’గణితముంది పల్లీల్లో. అందుకే వేరుశెనగ తీరే వేరు. ఇంత లెక్క ఉన్నా సరే... అది మాత్రం చెట్టుకొమ్మలకెక్కి నిక్కి నీలగకుండా... నిశ్శబ్దంగా భూమిలోపలే తన పొట్టు వల్మీకంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. దాని వినయాన్ని వర్ణించాలంటే డౌన్ టు ఎర్త్ అనే మాట కూడా చాలదురా... డౌన్ బిలో ద ఎర్త్ అనాలి. ఓ నిశ్శబ్ద నిర్వికల్ప నీరవ సమాధిలో జీవాన్ని నింపుకుని భూమికింద మనుగడ సాగిస్తూ పీకేవరకూ ఒకలాంటి ధ్యానంలో ఉంటుందిరా ఆ మహాగింజ’’ ‘‘ఏమోరా రాంబాబూ... అందరూ పల్లీలో రుచిని మాత్రమే చూస్తారు. నువ్వు మాత్రం ఇంకా ఏమేమో చూస్తావు... అయినా తినాల్సినవి తింటే అందంగానీ... ఇలా అర్థం లేకుండా పొగుడుకుంటే లాభమేముందిరా...’’
‘‘నేనేం పొగిడానురా... చంద్రుని మీదికి కాలుమోపాలని వెళ్లిన బృందంలోని అలెన్ షెపర్డ్ అనే ఆస్ట్రోనాట్ ఒకాయన వేరుశెనక్కాయల రుచిని వదల్లేక... వాటిని చంద్రుని మీదికి కూడా తీసుకెళ్లాడు. చంద్రుని మీద కూడా కాలుమోపిన ఒకే ఒక గింజరా వేరుశెనక్కాయ! అలా ఆ గింజను తీసుకెళ్లిన ఆ మహనీయుడు ఇకపై తనను ఆస్ట్రోనాట్ అనొద్దనీ, ఆస్ట్రో‘నట్’ అనాలనీ కోరాడట. ఆ మహనీయుడితో పోలిస్తే నేనెంతరా!’’ అంటూ ఎప్పటిలాగే తన వినయగుణాన్ని చాటుకున్నాడు మా రాంబాబుగాడు.
- యాసీన్