హస్తవాసి
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45. ఇటీవల రొటీన్ రక్త పరీక్షలు చేయించుకున్నాను. అందులో నా కొలెస్ట్రాల్ 350కి పైనే ఉందని అని చెప్పారు. నేను మద్యం, మాంసాహారాలకు చాలా దూరంగా ఉంటాను. అయినప్పటికీ నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి?
- జీవన్, కొత్తగూడెం
రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీద మాత్రమే కాదు... జన్యుపరమైన అంశాలపైన కూడా ఆధారపడుతుంది. జన్యుపరమైన అంశమే కారణమై ఉన్నవారిలో ఏలాంటి ఆహార నియమాలూ పాటించకపోతే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనా దాని వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.
నా వయసు 35 ఏళ్లు. మా కుటుంబంలో చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి. మా నాన్నగారికి కూడా గుండెజబ్బు ఉంది. నాకు కూడా గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- కనకరత్నం, గుంటూరు
మీరు చెప్పినదాన్ని బట్టి మీ కుటుంబ చరిత్రలో గుండెజబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. మీదింకా చిన్న వయసే కాబట్టి ప్రస్తుతం మీది వట్టి ఆందోళన మాత్రమే అనిపిస్తోంది. అయినా మీరు ఒకసారి దగ్గర్లో ఉన్న కార్డియాలజిస్ట్‌ను కలిసి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌తో పాటు ఈసీజీ ఎకో, టీఎమ్‌టీ టెస్టులు చేయించుకుని జబ్బు లేదని నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయండి. మంచి జీవనశైలితో జీవించండి. మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
- డాక్టర్ శ్రీనివాసకుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్.
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
ఎవరో అకస్మాత్తుగా ముందుకు పడిపోతుండగా, వాళ్లను పడిపోకుండా ఆపే ప్రయత్నంలో నా వీపు మధ్యభాగం బెణికింది. ఈ సంఘటన ఆర్నెల్ల కిందట జరిగింది. అప్పట్నుంచి నాకు వీపు మీద నొప్పి వస్తూ, అది మోకాలి కింది వరకూ పాకుతోంది. ఫిజియోథెరపీతో నొప్పి తగ్గింది. అయితే ఇప్పుడు గమనించిన అంశం ఏమిటంటే... నా ఎడమకాలి కంటే కుడికాలు తొందరగా అలసిపోతోంది. నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాను.
ఈ మధ్య రెండు నిమిషాలు నిలబడితే చాలు... నొప్పి వచ్చి అది కాలి కిందవైపునకు పాకుతోంది. డాక్టర్‌ను కలిస్తే ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య వాపు వచ్చినట్లు తెలుస్తోంది, మళ్లీ ఫిజియో చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. అయినా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడం లేదు. పైగా ఒక్కోసారి వెన్ను మధ్యన నొప్పి వస్తోంది. ఈ డిస్క్ వాపు సమస్య పూర్తిగా తగ్గుతుందా? దయచేసి వివరించండి.
- సుధాకర్‌రెడ్డి, హైదరాబాద్
వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ తన స్థానం నుంచి జరిగి, అది కాలికి వెళ్లే నరాలను నొక్కుతుండటం వల్ల మీకు ఈ నొప్పి వస్తుండవచ్చు. అందువల్లనే మీకు కాలిలోకి పాకుతున్నట్లు నొప్పి వస్తోందనిపిస్తోంది. ఇలాంటి నొప్పులు మాటిమాటికీ తిరగబెడుతుంటాయి. మీరు సందేహిస్తున్నట్లుగా మీ వెన్నునొప్పికీ, కాలిలోకి పాకే నొప్పికీ సంబంధం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఫిజియోథెరపీ, కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్-ఎన్‌ఎ స్‌ఏఐడీ), వేడి కాపడం పెట్టడం, టెన్స్, అల్ట్రాసౌండ్ చికిత్సలతో ఇది తగ్గవచ్చు. ఒకవేళ కొందరిలో ఈ ప్రక్రియలతో నొప్పి తగ్గకపోతే చివరి ప్రయత్నంగా సర్జరీ అవసరం కావచ్చు. కానీ చాలామందిలో సాధారణ ఫిజియోథెరపీతోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంటుంది.
మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును కలిసి, వారు సూచించిన ఫిజియోథెరపీ ప్రక్రియలను అనుసరించండి. అలాగే కొంతకాలం పాటు మీరు బరువులు ఎత్తకపోవడం, జాగింగ్ చేయకపోవడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగకపోవడం, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వ్యాయామాల్లో భాగంగా ఈత చాలా మేలు చేస్తుంది. వాకింగ్ కూడా మంచిదే.
- ఆర్. వినయ కుమార్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఫిజియోథెరపీ, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
ఈఎన్‌టి కౌన్సెలింగ్
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్‌లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.
- సీ.ఎస్.రావు, రావులపాలెం
ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు.
మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్‌ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.
మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు.
అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.
నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- సుకుమార్, విజయవాడ
మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి.
దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి.
- డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ .
మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com
నిర్వహణ: యాసీన్
డిస్క్ వాపుతో రిస్క్ ఉంటుందా?
Published Mon, Dec 7 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement