Cardiology counseling
-
గుండెవైఫల్యం అంటే...?
నా వయసు 59 ఏళ్లు. గత నాలుగేళ్లుగా మూత్రం తగ్గడం, చర్మం పలచబడటం, కండరాల పటుత్వం కూడా తగ్గడం వంటి లక్షణాలతో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గుండెవైఫల్యం అంటే ఏమిటి? ఇందుకు కారణాలేమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – సుధాకర్‌రావు, కంకిపాడు గుండె వైఫల్యానికి అతి ప్రధాన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటు బారిన పవడ్డవారిలో నూటికి 60 మందిలో గుండెవైఫల్యం సంభవించవచ్చు. అయితే గుండెవైఫల్యానికి ఇదొక్కటే కారణం కాదు. దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండెకండరం దెబ్బతిని వైఫల్యానికి దారితీస్తుంది. అలాగే డయాబెటిస్ నియంత్రణలో లేనప్పడు కూడా సూక్ష్మరక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషపదార్థాల ప్రభావం పెరిగి, కరమంగా గుండె దెబ్బతింటుంది. అదురుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, కొందరిలో జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూ లేనంత తీవ్రమైన మానసిక ఒత్తిడి బారిన పడ్డవారికి కూడా హఠాత్తుగా గుండెవైఫల్యం సంభవించి ముప్పు ఉంటుంది. నిర్ధారణ గుండెవైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ‘ఈసీజీ’ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారైందా... వంటి వివరాలన్నీ బయటపడతాయి. ఎకో పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉందన్న విషయం తెలుస్తుంది. ఇవికాకుండా గుండెవైఫల్య లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు... ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్’ అవసరమవుతుంది. దాదాపు 99 శాతం మందికి ఈ పరీక్షలతో గుండెవైఫల్యం కచ్చితంగా నిర్ధాణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎమ్మారై, పెట్‌స్కాన్ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండెవైఫల్యమా లేక ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్పీ’ అనే పరీక్ష ఉపకరిస్తుంది. చికిత్స: గుండెవైఫల్యానికి చికిత్స దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. గుండెవైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం, కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. గుండె వ్యాధి ముదరకుండా చూడటానికి మందులు వాడాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటాబ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్హిబిటర్లు, స్పైరనోలాక్టోస్ వంటి మందులు ఇస్తారు. వీటికితోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలీసిలిన్ ఇన్హిబిటర్’ వంటి కొత్తమందులు రాబోతున్నాయి. ఇక ఒంట్లోకి అధికంగా చేరిన నీటిని బయటకు పంపేందుకు ‘డైయూరెటిక్స్’ మందులు, లక్షణాలను తగ్గించేందుకు ‘డిజిటాయిల్స్’ మందులు తోడ్పడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ జీవితికాలాన్ని పెంచడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్ సామర్థ్యం 30 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి ‘ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్స్’ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటాబ్లాకర్స్ను తట్టుకోలేరు వీరికి ‘ఇవాబ్రాడిన్’ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ‘ఐసారజైన్’ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారేలా చేస్తూ గుండెమీద భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా, గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలు తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారం వాడటం చాలా కీలకం. గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...? నా వయసు 54 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్) అన్నారు. నేను కూడా డాక్టర్లు చెప్పినట్టే క్రమం తప్పకుండా మందులు వాడాలనుకుంటున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయాలి? - ఆర్. జగన్నాథరావు, గుడివాడ మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్ అంత ఎక్కువగా లేవనీ అర్థం. లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్ అవసరం పడాల్సి రావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేయించుకుని పూర్తిగా సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. - డాక్టర్ జి. సూర్యప్రకాశ్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్, హైదరాబాద్ -
గుండె కవాటాల సమస్య అంటే ఏమిటి? వివరంగా చెప్పండి
నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు, వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్), 2) కవాటం లీక్ కావడం (రిగర్జటేషన్). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది. మైట్రల్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు ట్రాన్స్ఈసోఫేసియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగిపరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్వాల్స్ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్ అవుతుంటే ఈ వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్’ వంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రీప్లేస్ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాంసాహారం మానేయాల్సిందేనా? నా వయసు 50 ఏళ్లు. నేను మాంసాహారం ఇష్టంగా తింటూ ఉంటాను. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఇంతగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలుచేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం మానేయలేకపోతే... కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచిది. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. డాక్టర్ పి. ప్రణీత్, సీనియర్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుంది?
మా అమ్మ వయసు 57 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండె దడ వంటివి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. హార్ట్వాల్వ్లలో ఏదో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు, చికిత్సల వంటి వివరాలను దయచేసి తెలియజేయండి. – యశస్విని, విశాఖపట్నం మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అమ్మగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి... 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4)అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాలలలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్). వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే (కంజెనిటల్గా) రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజనరేటివ్గా) కూడా ఇవి వచ్చే అవకాశం ఉంది. వాల్వ్ సమస్యతో కనిపించే లక్షణాలు:హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ (పాల్పిటేషన్)గా ఈ లక్షణాలు కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. ఈ సాధారణ లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ∙ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ–గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు ∙మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు ∙అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు. వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ అనే చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాలు సన్నగా మారినా లేదా లీక్ అవుతున్న సందర్భాల్లో ఈ వాల్విలోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.వాల్వ్స్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్.మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది. ’ టిష్యూ వాల్వ్స్ అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది.ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా వాల్వ్స్‌ను రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలుచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. బైపాస్అయింది..జాగ్రత్తలు? ఇటీవలే మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. శ్రీనాథ్, ఖమ్మం అన్ని కండరాలకు అవసరమైనట్లే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెలో అడ్డంకులు పెరిగి గుండెకు తగినంత రక్తం అందే పరిస్థితి లేనప్పుడు, గుండెకండరం చచ్చుపడే ప్రమాదాన్ని నివారిస్తారు. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని ముందుగా తీసుకుంటారు. దీన్ని ద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి. డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ∙ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు ∙మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు ∙నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి ∙శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి. ∙భారమైన పనులు చేయకండి ∙డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి. శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత: దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ప్రభాలను నివారించడానికి కూడా ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి... ∙కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి. ∙రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి. ∙రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు ∙సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు ∙మద్యంకూడా గుండెకు హానిచేసేదే ∙ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ∙ఒకేచోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి. తరచూగుండెదడ...ప్రమాదమా? నా వయసు 45 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపా దడపా ఇలా జరుగుతోంది. దీనివల్ల గుండెకు ఏమైనా ప్రమాదమా? దయచేసి తగిన సలహా ఇవ్వండి.– ఎమ్. అప్పారావు, విజయనగరం సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గుర్తించం. కానీ ఒకవేళ వాటిని స్పష్టంగా గుర్తించడమూ, గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇలాంటి తాత్కాలికంగా కనిపించి దానంతట అదే సద్దుమణుగుతుంది.అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంఇంచిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు.సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. కొన్ని సాధారణ కారణాలు: గుండె కవాటాలు వ్యాధిగ్రస్తం కావడం, గుండె కండరాలు క్రియాహీనంకావడం జరిగితే గుండెదడ ఉంటుంది. ఛాతీలో వచ్చే నొప్పి, ఆయాసాన్ని నిర్లక్షం చేయకూడదు. శ్వాస అందని సమయాల్లోనూ, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించినప్పుడు, కళ్లుబైర్లుగమ్మినట్లు అనిపించినప్పుడు ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. సూచనలు: ’ గుండెగడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. ∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు ∙కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం ∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి ∙మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి ∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది ∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి ∙మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్లకార్డియోథొరాసిక్ సర్జన్ అండ్డైరెక్టర్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ, సెంచరీ హాస్పిటల్,రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి?
ఈమధ్య నేను ఒకసారి గుండె పరీక్షలు చేయించుకున్నాను. నా ఎజెక్షన్ ఫ్రాక్షన్ పర్సెంటేజీ తక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. అయితే నేను పూర్తిగా నార్మల్‌గానే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే... నాలో ఎలాంటి లక్షణాలూ కనిపించడం లేదు. ఇప్పుడు డాక్టర్ చెబుతున్నదాన్ని బట్టి నేనేమైనా చికిత్స తీసుకోవాలా? అసలు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? మన గుండె నిమిషానికి డెబ్బయిరెండుసార్లు కొట్టుకుంటుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా కొట్టుకునే ప్రతిసారీ దాని సంకోచ వ్యాకోచాల వల్లనే మన రక్తనాళాల ద్వారా ప్రతి అవయవానికీ రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలా రక్తాన్ని సరఫరా చేసే సమయంలో గుండె సామర్థ్యాన్ని తెలియజేసే ఒక రకం కొలమానమే ‘ఎజెక్షన్ ప్రాక్షన్’. వైద్యపరిభాషలో దీన్నే సంక్షిప్తంగా ‘ఈఎఫ్’ అని సూచిస్తుంటారు. గుండె తాను వ్యాకోచించిన సమయంలో తనకు అందిన రక్తంలో ఎంత మొత్తాన్ని తన సంకోచ సమయంలో బయటకు పంపుతుందో... ఆ మొత్తాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని శాతంలో చెబుతారు. వైద్య చికిత్సలో ‘ఈఎఫ్’ను తెలుసుకోవడం అన్నది చాలా ప్రాధాన్యం గల అంశమే. అయితే కొన్ని సందర్భాల్లో ఈఎఫ్ తెలుసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈఎఫ్ తక్కువగా ఉన్న ప్రతివారిలోనూ హార్ట్ ఫెయిల్యూర్ రావాలన్న నియమమేమీ లేదు. అయితే ఈఎఫ్ తక్కువగా ఉన్నవారిలో పాదాల వాపు, ఆయాసం, ముఖం ఉబ్బడం, మెడనరాలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న సూచనగా పరిగణించాలి. ఇది సంకోచ లోపం లేదా వ్యాకోచ లోపం... ఈ రెండింటిలో దేనివల్లనైనా రావచ్చు. కొందరు పేషెంట్లలో ఈఎఫ్లో లోపం ఉండి కూడా లక్షణాలు కనపడకుండా పేషెంట్ హాయిగా ఉంటారు. మరికొందరిలో ఈఎఫ్ తక్కువగా ఉండి, హార్ట్ ఫెయిల్యూర్ ఉందని తెలిశాక మందులు వాడుతున్నప్పటికీ వారులో ఒక్కోసారి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. అయితే ఈఎఫ్ తక్కువగా ఉందని తెలిసినప్పుడు గుండె సామర్థ్యం పెంచడానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈఎఫ్ తగ్గుతుంటే అందించాల్సిన చికిత్స... ►ఈఎఫ్ విలువ తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని గుండె నిపుణుడిని వీలైనంత త్వరగా సంప్రదించాలి. ►ఈ సమస్యను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏసీఈ ఇన్హిబిటార్స్ అనే మందులతో సమర్థంగా చికిత్స చేయవచ్చు. ►ఈఎఫ్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిత్యం క్రమం తప్పకుండా గుండె నిపుణులతో ఫాలోఅప్‌లో ఉంటూ, తగిన చికిత్స తీసుకుంటే... ఈ రోగులు కూడా చాలాకాలం హాయిగా బతికేందుకు అవకాశాలున్నాయి. గుండెపోటుకీ... ఛాతీనొప్పికీ తేడా గుర్తించడం ఎలా? నా వయసు 47 ఏళ్లు. నాకు తరచూ గ్యాస్‌తో ఛాతీమీద మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్ నొప్పే కదా అని, అలాంటప్పుడు ఒక యాంటీసిడ్ తీసుకొని ఉండిపోతుంటాను. ఇటీవల నాలో ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ నాకు గుండెనొప్పి వచ్చినా... దాన్ని కూడా గ్యాస్‌తో వచ్చిన సమస్యగానే భావించి అప్పుడు కూడా ఇలా తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వస్తోంది. అదెంతో హానికరం కదా. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి ఉన్న తేడాలు చెప్పండి. ఇది నాతో పాలు చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా కూడా ఉంటుంది. మనకు వచ్చే నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... అది తప్పక గుండెనొప్పేనని అనుమానించాలి. ఒత్తిడి తగ్గించుకొని గుండెను రక్షించుకోవడమెలా? నా వయసు 45 ఏళ్లు. ఇటీవల విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తున్నాను. మా జాబ్‌లో టార్గెట్స్ రీచ్ కావాల్సిన అవసరం కూడా ఉంటోంది. గుండెజబ్బుల నివారణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్న సూచన నేను తరచూ చదువుతున్నాను. కానీ మా వృత్తిలో అది సాధ్యం కాదు. మాలాంటి వారికి ఏదైనా ప్రత్యేక నివారణ సూచనలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. మీ వయసు 45 ఏళ్లు అంటున్నారు. మీ వయసులో తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయడం అన్నది గుండెజబ్బు రావడానికి దోహదం చేసే అనేక ప్రధానమైన కారణాలలో ఒకటి. మీ ఉద్యోగరీత్యా నెరవేర్చాల్సిన బాధ్యతలు పూర్తి చేస్తూనే... గుండె జబ్బును నివారించడానికి రోజూ నడక, యోగా లాంటివి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీరు ఉద్యోగం మార్చుకోవడం వీలు పడదు కాబట్టి, దానిలోని ఒత్తిడికి రియాక్ట్ అయ్యే విధానాన్ని తగ్గించుకోండి. ధ్యానం (మెడిటేషన్) ప్రక్రియ ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే ధ్యానం లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించండి. ఇక ఆహారం విషయానికి వస్తే తాజా శాకాహారాలు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకుంటూ ఉండండి. మీరు మాంసాహార ప్రియులైతే కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి, ప్రోటీన్ల కోసం చికెన్, చేపల వంటి మాంసాహారాలపైనే ఆధారపడండి. వేటమాంసం, రెడ్ మీట్ జోలికి పోవద్దు. ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించండి. ఇక మీ జీవనశైలి నైపుణ్యాలలో భాగంగా... మీరు ప్రతిదానికి టెన్షన్ పడకుండా చూసుకోవడం జరిగితే... అది మీ వృత్తిలో ఎదగడానికి సహాయపడటంతో పాటు గుండె జబ్బు నివారణకూ దోహదపడుతుంది. డాక్టర్ సి. రఘు, చీఫ్ కార్డియాలజిస్ట్, ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేట, హైదరాబాద్ -
మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. మెనోపాజ్ దాటిన మహిళలకు గుండెజబ్బులు ఎక్కువని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది వాస్తవమేనా? - శ్రీలేఖ, కాకినాడ గతంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో గుండెజబ్బులు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు స్త్రీలలోనూ గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న జీవనశైలి, క్రమపద్ధతిలో లేని నిద్ర, ఆహార నియమాలు, పనుల ఒత్తిళ్లు... లాంటి పరిస్థితులన్నీ మహిళల్లోనూ ఇప్పుడు గుండెజబ్బులను పెంచుతున్నాయి. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సన్నబారడం లేదా మూసుకుపోవడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలిచే ఈ జబ్బు గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యమవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగే మాట వాస్తవమే. మెనోపాజ్ తర్వాత శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ తగ్గి, చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. పెరిగే వయసుతో అధిక రక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పును పెంచే అంశాలే. నడక వంటి వ్యాయామంతో పాటు ముందు నుంచీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులను చాలావరకు అదుపులో ఉంచవచ్చు ప్రతిరోజూ కనీసం అరగంట నడక లేదా పరుగు లేదా ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదురోజులైనా ఈ వ్యాయామాలు చేయాలి ఆహారంలో ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి మీ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంతగా తగ్గించాలి. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి నూనెలను చాలా పరిమితంగా తీసుకోవాలి. వయసును బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి గుండెజబ్బులకు దారితీసే అంశాలపై (రిస్క్ ఫ్యాక్టర్లపై) దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ లాంటివి ఉంటే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గుండెజబ్బులను నివారించుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదాన్నీ నివారించుకున్నట్లేనని తెలుసుకోండి. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. గర్భాశయంలో కణుతులు... తగ్గుతాయా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నాకు కొంతకాలంగా రుతుస్రావం ఎక్కువరోజులు కొనసాగటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడడంతో గైనకాలజిస్టును సంప్రదించాను. వారు స్కాన్ చేయించి నా గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయని, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. హోమియోతో ఈ వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా? - పి.పి.జె, మచిలీపట్నం చాలామంది స్త్రీలలో ఈ గర్భాశయ కణితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతోపాటు వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వంటి చర్యలకు దారితీస్తుంది. తద్వారా వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావడం జరుగుతుంది కానీ హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. 16-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశ ఉంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి వయస్సు గల వారినే ఇది ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది సంతానలేమికి కూడా దారితీస్తోంది. ఈ కణితులు ఒకటిగా లేదా చిన్న చిన్న కణితులు మిల్లీమీటరు మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. గర్భాశయంలో ఇవి ఏర్పడే ప్రాంతపు ఉనికి, పరిమాణం రీత్యా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఇన్ట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్: గర్భాశయం లోపలి గోడల మధ్యలో ఏర్పడే ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. సబ్ సీరోజల్: గర్భాశయం వెలుపలి గోడలపై ఏర్పడే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయంలో ఉండే మ్యూకోజల్ పొరలో ఏర్పడి గర్భాశయపు కుహరంలోకి పెరుగుతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో ఈ హార్మోన్ ఉత్పాదన తక్కువగా ఉండటం వల్ల అవి కుచించుకుపోతాయి. స్థూలకాయం, మద్యపానం, కెఫీన్ వాడకం వంటి అంశాలు ఈ కణితులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. లక్షణాలు: రుతుస్రావం ఎక్కువ రోజులపాటు కొనసాగడం, అధిక రక్తస్రావం కావడం, రెండు రుతుచక్రాల మధ్యలో రక్తస్రావం అవడం, నడుమునొప్పి, కడుపులోనొప్పి, కాళ్లలో నొప్పి. అధిక రక్తస్రావం మూలంగా రక్తహీనత ఏర్పడటం. తరచు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటివి. చికిత్స: హోమియోలో అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా ఈ గర్భాశయ కణితులను పూర్తిగా కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్రాన్ని సరిచేయడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం అవుతంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
ఈ పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ సురక్షితమేనా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 55 ఏళ్లు. ఏడాది కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి ఒక స్టెంట్ వేశారు. కొన్ని నెలల పాటు బాగానే ఉన్నారు. సాయంత్రాల పూట అలా వాకింగ్‌కు కూడా వెళ్లి వచ్చేవారు. కానీ కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్రమైన ఆయాసానికి గురవుతున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ లో పూడికలు ఏర్పడ్డాయని, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు, షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? రిస్కేమైనా ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు. - సురేశ్, హైదరాబాద్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) వస్తే బైపాస్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి లేదా రెండు బ్లాక్స్ ఏర్పడితే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేయవచ్చు. మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తే మొదట్లో మీ నాన్నగారికి అలానే వేశారు. అయితే ఈసారి మీ నాన్నగారి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడినట్లు పరీక్షల ద్వారా తేలి ఉండవచ్చు. అందుకే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సూచించి ఉంటారు. ఇక మీ సందేహాల విషయానికి వస్తే మీరు మీ నాన్నగారి విషయంలో ఎలాంటి భయాందోళనలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా బైపాస్ సర్జరీ 50 ఏళ్లు దాటిన వాళ్లకి, అది కూడా గుండె స్థితిని బట్టి డాక్టర్లు నిర్వహిస్తుంటారు. ఒకప్పటిలాగా ఇప్పుడు గుండెకు సంబంధించిన ఆపరేషన్ అంటే కలవరడాల్సిన అవసరం లేదు. వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే నిపుణులైన డాక్టర్లు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ‘మినిమల్లీ ఇన్వేజివ్’ అనే అత్యాధునిక పద్ధతి ద్వారా ఛాతీ ఎముకలను కట్ చేయకుండానే కేవలం చిన్నకోత ద్వారా గుండె బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించవచ్చు. ఈ పద్ధతిలో వైద్యులు కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలను సులువుగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సర్జరీ సమయంలో గుండెను బయటకు తీసి దానికి బదులుగా ఒక మెషిన్‌ను కొన్ని గంటల పాటు రక్తం పంపింగ్ కోసం సపోర్టుగా వాడుకుంటారు. వాల్వ్‌లలో ఏర్పడిన పూడికలను తీసివేసిన అనంతరం మళ్లీ గుండెను యధాస్థానంలో విజయవంతంగా అమర్చి ఆపరేషన్‌ను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కోత చిన్నగా, రక్తస్రావం తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా పెద్దగా ఉండదు. ఇన్ఫెక్షన్ కూడా సోకదు. 3 - 4 రోజుల్లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేస్తారు. ఇక మీ నాన్నగారి బీపీ, షుగర్ లెవల్స్ విషయానికి వస్తే... సర్జరీకి ముందే డాక్టర్లు అన్ని పరీక్షలను నిర్వహిస్తారు. నిపుణుల అభిప్రాయాలను తీసుకునే ఆపరేషన్‌కు ఉపక్రమించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి మంచి ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల ద్వారా చికిత్సను అందించండి. - డాక్టర్ ఆరుముగమ్ సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ నెఫ్రోటిక్ సిండ్రోమ్‌కు మందులు చెప్పండి... ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత 20 ఏళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. మందులు వాడతున్నాను. అదుపులో ఉంది. ప్రస్తుతం వారం రోజుల క్రితం జ్వరం వచ్చి మూడు రోజులుగా బాధపడ్డాను. అది తగ్గి ఒళ్లంతా వాపులు, ముఖం ఉబ్బిపోవడం జరిగింది. అన్ని పరీక్షలూ చేసి డాక్టర్లు ‘నెఫ్రోటిక్ సిండ్రోమ్’ అన్నారు. దీన్ని సంపూర్ణంగా పోగొట్టడానికి ఆయుర్వేద చికిత్స తెలపండి. - యు.వి. కృష్ణమూర్తి, బెంగళూరు ఆయుర్వేద పరిభోషలో వాపుని ‘శోథ’ అంటారు. మీకు సర్వాంగశోథ వచ్చింది. మూత్రాపిండాలు ‘నెఫ్రానులు’ అనే అతిన్న పరికరాల సముదాయంతో తయారవుతాయి. ఇవి రక్తాన్ని వడగట్టడం ద్వారా మూత్రాన్ని తయారు చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని కారణాల వల్ల నెఫ్రానుల్లో గొట్టాలు బలహీనపడి, అతి ముఖ్యమైన, శరీరానికి బలాన్ని సమకూర్చే ప్రోటీన్లను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దీనివల్ల ఒళ్లంతా వాపు, రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రుగ్మతకు కొన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, విషాలు, హెవీమెటల్స్, అలర్జీ కలిగించే పదార్థాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కారణమవుతాయి. ఈ కింద వివరించిన విధంగా ఆహార విహారాలు పాటించి, మందులను క్రమం తప్పకుండా వాడితే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు, రెండు వారాల పాటు పాటించాల్సినవి... ఆహారం : ఉప్పుని 95 శాతం తగ్గించి, నామమాత్రంగా వేసి, జావలు (బార్లీ జావ, బొంబే రవ్వ జావ మొదలైనవి) తయారు చేసుకొని మూడుపూటలా తాగాలి. కేవలం మెత్తగా చేసిన పెరుగన్నం తినండి. నిమ్మరసం పిండిన మజ్జిగను పుష్కలంగా తాగండి. ఇడ్లీని తేనెతో రోజూ తినండి. పెసరకట్టు, కందికట్టు పలచగా చేసుకొని, పుల్కాలను వాటిలో నానబెట్టి తినండి. ఖర్జూరం తినండి, (డయాబెటిస్, రక్తపోటులను మాత్రం నియంత్రించుకోవాలి). విహారం : పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతుండండి. భారీ పనులు చేయవద్దు. తగినంత నిద్ర, మానసిక స్థైర్యం ఉండాలి. మందులు : కోక్షురాది గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ( వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 1, మధ్యాహ్నం 2, రాత్రి 1 (వారం రోజులు); వారం తర్వాత ఉదయం 1, రాత్రి 1 యష్టిమధు (మాత్రలు) ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 (మొదటి వారం); వారం తర్వాత ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 పునర్నవాది మండూర (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 (రెండు వారాలు) వరుణాది క్వాధ (ద్రావకం) : 4 చెంచాలు రెండుపూటలా సమానంగా నీళ్లు కలిపి. రెండు వారాల తర్వాత : యష్టిమధుచూర్ణ 2 గ్రాములు + గోక్షురాది చూర్ణం 3 గ్రాములు - కలిపి ఒక మోతాదుగా తేనెతో తీసుకోవాలి. రోజూ రెండు మోతాదులు మూడు నెలల పాటు వాడండి. రోజూ ఒక ఉసిరికాయ తినండి లేదా ఆమలకీ స్వరసం రెండు చెంచాలు సేవించండి. గమనిక : వ్యాధి కారణాలను గుర్తుంచుకొని జాగ్రత్త వహించండి. బలకరమైన, మూత్రం సాఫీగా వెళ్లడానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోండి. సహజసిద్ధమైన పానీయాలను (మజ్జిగ, నీరు, బార్లీజావ, అప్పుడప్పుడు చెరకురసం, కొబ్బరినీళ్లు సముచితమైన పరిమాణంలో సేవించండి. నెఫ్రానులకు సంబంధించిన గొట్టాలు తిరిగి ప్రాకృతావస్థకు వస్తాయి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
స్టెంట్ వేయించుకున్న తర్వాత కూడా గుండెజబ్బు వస్తుందా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మల్లయ్య, మహబూబ్‌నగర్ ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
డిస్క్ వాపుతో రిస్క్ ఉంటుందా?
హస్తవాసి కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45. ఇటీవల రొటీన్ రక్త పరీక్షలు చేయించుకున్నాను. అందులో నా కొలెస్ట్రాల్ 350కి పైనే ఉందని అని చెప్పారు. నేను మద్యం, మాంసాహారాలకు చాలా దూరంగా ఉంటాను. అయినప్పటికీ నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి? - జీవన్, కొత్తగూడెం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీద మాత్రమే కాదు... జన్యుపరమైన అంశాలపైన కూడా ఆధారపడుతుంది. జన్యుపరమైన అంశమే కారణమై ఉన్నవారిలో ఏలాంటి ఆహార నియమాలూ పాటించకపోతే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనా దాని వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. నా వయసు 35 ఏళ్లు. మా కుటుంబంలో చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి. మా నాన్నగారికి కూడా గుండెజబ్బు ఉంది. నాకు కూడా గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కనకరత్నం, గుంటూరు మీరు చెప్పినదాన్ని బట్టి మీ కుటుంబ చరిత్రలో గుండెజబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. మీదింకా చిన్న వయసే కాబట్టి ప్రస్తుతం మీది వట్టి ఆందోళన మాత్రమే అనిపిస్తోంది. అయినా మీరు ఒకసారి దగ్గర్లో ఉన్న కార్డియాలజిస్ట్‌ను కలిసి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌తో పాటు ఈసీజీ ఎకో, టీఎమ్‌టీ టెస్టులు చేయించుకుని జబ్బు లేదని నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయండి. మంచి జీవనశైలితో జీవించండి. మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. - డాక్టర్ శ్రీనివాసకుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ ఎవరో అకస్మాత్తుగా ముందుకు పడిపోతుండగా, వాళ్లను పడిపోకుండా ఆపే ప్రయత్నంలో నా వీపు మధ్యభాగం బెణికింది. ఈ సంఘటన ఆర్నెల్ల కిందట జరిగింది. అప్పట్నుంచి నాకు వీపు మీద నొప్పి వస్తూ, అది మోకాలి కింది వరకూ పాకుతోంది. ఫిజియోథెరపీతో నొప్పి తగ్గింది. అయితే ఇప్పుడు గమనించిన అంశం ఏమిటంటే... నా ఎడమకాలి కంటే కుడికాలు తొందరగా అలసిపోతోంది. నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాను. ఈ మధ్య రెండు నిమిషాలు నిలబడితే చాలు... నొప్పి వచ్చి అది కాలి కిందవైపునకు పాకుతోంది. డాక్టర్‌ను కలిస్తే ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య వాపు వచ్చినట్లు తెలుస్తోంది, మళ్లీ ఫిజియో చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. అయినా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడం లేదు. పైగా ఒక్కోసారి వెన్ను మధ్యన నొప్పి వస్తోంది. ఈ డిస్క్ వాపు సమస్య పూర్తిగా తగ్గుతుందా? దయచేసి వివరించండి. - సుధాకర్‌రెడ్డి, హైదరాబాద్ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ తన స్థానం నుంచి జరిగి, అది కాలికి వెళ్లే నరాలను నొక్కుతుండటం వల్ల మీకు ఈ నొప్పి వస్తుండవచ్చు. అందువల్లనే మీకు కాలిలోకి పాకుతున్నట్లు నొప్పి వస్తోందనిపిస్తోంది. ఇలాంటి నొప్పులు మాటిమాటికీ తిరగబెడుతుంటాయి. మీరు సందేహిస్తున్నట్లుగా మీ వెన్నునొప్పికీ, కాలిలోకి పాకే నొప్పికీ సంబంధం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఫిజియోథెరపీ, కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్-ఎన్ఎ స్ఏఐడీ), వేడి కాపడం పెట్టడం, టెన్స్, అల్ట్రాసౌండ్ చికిత్సలతో ఇది తగ్గవచ్చు. ఒకవేళ కొందరిలో ఈ ప్రక్రియలతో నొప్పి తగ్గకపోతే చివరి ప్రయత్నంగా సర్జరీ అవసరం కావచ్చు. కానీ చాలామందిలో సాధారణ ఫిజియోథెరపీతోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును కలిసి, వారు సూచించిన ఫిజియోథెరపీ ప్రక్రియలను అనుసరించండి. అలాగే కొంతకాలం పాటు మీరు బరువులు ఎత్తకపోవడం, జాగింగ్ చేయకపోవడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగకపోవడం, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వ్యాయామాల్లో భాగంగా ఈత చాలా మేలు చేస్తుంది. వాకింగ్ కూడా మంచిదే. - ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ ఈఎన్టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - సీ.ఎస్.రావు, రావులపాలెం ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుకుమార్, విజయవాడ మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. - డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
బరువు పెరిగితే గర్భధారణ అవకాశాలు తగ్గుతాయా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 64. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్‌ను వేశారు. ఇటీవల శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. డాక్టర్ నన్ను పరీక్షించి, గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట గుండెలో జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు. కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందీ, ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పై భాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బరువు పెరగకుండా చూసుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పల్మనాలజీ కౌన్సెలింగ్ నేను వృత్తిరీత్యా డీజిల్ పొగ వెలువడే ప్రదేశంలో ఎక్కువగా ఉండాల్సి వస్తోంది. నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంది. దయచేసి లంగ్ క్యాన్సర్ నివారణ చెప్పండి. - అహ్మద్‌బాషా, గుంటూరు మీరు చెప్పినట్లుగా డీజిల్ వంటి ఇంధనాల నుంచి వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తుల (లంగ్) క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో మొదటిది ఊపిరితిత్తుల క్యాన్సర్. మహిళలతో పాటు పురుషుల్లోనూ లెక్కచూస్తే ఇది నాలుగోది. పురుషుల్లో ఉండే పొగాకు వాడే అలవాటు, ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల వెలువడే పొగ, పట్టణప్రాంతాల్లోని కాలుష్యం వంటి అంశాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం. ఇక ఇంట్లో ఎవరికైనా పొగతాగే అలవాటు ఉంటే, వాళ్లతో పాటు ఆ పొగపీల్చేవారూ (ప్యాసివ్ స్మోకింగ్ చేసేవాళ్లూ) ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను టీబీ వ్యాధిగా నిర్ధారణ చేయడం (మిస్ డయాగ్నోజ్) వల్ల అది ముదిరిపోయే అవకాశాలూ ఎక్కువ. ఒకవేళ మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. లేకపోతే మీరు వృత్తిరీత్యా పీల్చే కాలుష్యానికి తోడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఈ అలవాటు మరింత వేగవంతం చేయవచ్చు. ఇక మీరెలాగూ మీ వృత్తిరీత్యా డీజిల్ పొగకు ఎక్స్పోజ్ అయ్యే చోట ఉన్నారు కాబట్టి లంగ్ క్యాన్సర్ నివారణకు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. మీకు వృత్తిపరంగా తీసుకునే జాగ్రత్తలలో భాగంగా రెస్పిరేటర్ వంటివి ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని తప్పనిసరిగా ధరించండి. ఇక అది సాధ్యం కాని పరిస్థితుల్లో ఎన్-95 రేటింగ్ ఉన్న మాస్క్‌లను ముక్కుకు అడ్డుగా కట్టుకోండి. దీనివల్ల చాలావరకు డీజిల్ పొగతో పాటు, కాలుష్యప్రభావాలనూ అధిగమించవచ్చునని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా భార్య వయసు 24 ఏళ్లు. మాకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్లయిన దగ్గర్నుంచి పిల్లలను కోరుకుంటున్నాం. మేమిద్దరమూ ఆరోగ్యంగానే ఉంటాం. అయితే నా భార్య బరువు 115 కిలోలు. కొంచెం పొట్టిగా ఉంటుంది. మేం మా డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆమె నా భార్య బరువు ఎక్కువగా ఉందనీ, పిల్లలు పుట్టడానికి ఆమె బరువు కూడా ఒక సమస్య అని చెప్పారు. ఇది నిజమేనా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - సురేశ్, చిత్తూరు స్థూలకాయం (ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం) చాలా సమస్యలకు దారితీస్తుందన్న విషయం వాస్తవమే. అయితే బరువు తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా సులభంగా అధిగమించవచ్చు. బరువు పెరగడం వల్ల మహిళల్లో రుతుస్రావం సరిగా కాకపోవడం, ఫలదీకరణ సమస్యల వంటివి వస్తాయి. దీనివల్ల గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు అనుసరించే మహిళల్లోనూ బరువు ఎక్కువగా ఉన్నవారిలో మందులు వాడాల్సిన సమయం, గర్భధారణ కోసం పట్టే సమయం పెరుగుతాయి. పైగా మందుల మోతాదు కూడా పెరుగుతుంది. గర్భస్రావాలూ పెరుగుతుంటాయి. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు (కాంప్లికేషన్లు) కూడా పెరుగుతుంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారిలో గర్భధారణ సమయంలో హైబీపీ, డయాబెటిస్ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. పైగా అవసరమైన బరువు కంటే ఎక్కువగా ఉండటం సాధారణ ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. అది దీర్ఘకాలంలో గుండెజబ్బులకూ, ఆర్థరైటిస్కూ, హైబీపీ, డయాబెటిస్‌కు దారితీస్తుంది. బరువును అదుపులో పెట్టుకుంటే ఎన్నో సమస్యలను నివారించవచ్చు. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మొదట ఆమె బరువు తగ్గడం ప్రధానం. జీవనశైలి మార్పులు, సమతులమైన, క్యాలరీలను తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. వీటితో పాటు తగినంత శారీరక శ్రమ చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి అవసరమైన మార్గాలు పాటించడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇక తమ బరువు తమ జీవితానికి చేటు తెస్తుందనకున్న వారికి మందులు, బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడతాయి. మందులు, బేరియాట్రిక్ సర్జరీ ఎవరికి అవసరం అన్న విషయాన్ని వైద్యనిపుణులు నిర్ణయిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు, ఆమెతో పాటు ఒకసారి డాక్టర్‌ను కలిసి ఆమె బరువు తగ్గడానికి అవసరమైన సూచనలు పాటించండి. -
వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై కూడా ర్యాష్ వచ్చింది. పాప కంప్లెయింట్‌ను మా డాక్టర్ గారికి చెబితే ఆయనకు అనుమానం వచ్చి షుగర్ టెస్ట్ చేయించారు. పాపకు డయాబెటిస్ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ వస్తుందా? దయచేసి మా పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సువర్చల, విజయవాడ మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియుంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవుతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయుడం కూడా అవసరం. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయూలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, మూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హెలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ (ఇన్సులిన్ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతాయి. మీరు పీడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. - డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 68. ఇప్పటివరకూఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. ఇటీవలే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు చేయించి, నాకు వాల్వులోప్లాస్టీ చికిత్స అవసరమని అన్నారు. వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటో దయచేసి వివరించండి. - నాగేంద్రరావు, వినుకొండ గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులోప్లాస్టీ అంటారు. ఎడమపక్కన ఉన్న మైట్రల్ వాల్వ్ మూసుకుపోయినప్పుడు, దాన్ని బెలూన్ సహాయంతో వెడల్పు చేస్తారు. దీన్ని పీబీఎంఏ అంటారు. ఇక పల్మునరీ వాల్వులోప్లాస్టీలో గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం అయిన పల్మునరీ వాల్వు మూసుకుపోతే... దాన్ని బెలూన్ ద్వారా తెరుస్తారు. దీన్ని పీబీపీఏ అంటారు. ఈలోపం సాధారణంగా చిన్న వయసులో వచ్చేది కాబట్టి చిన్న వయసులోనే సరిచేయవచ్చు. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకెళ్లే ధమని కవాటాన్ని అయోర్టిక్ కవాటం అంటారు. ఇది మూసుకుపోయినప్పుడు పీబీఏవీ ప్రక్రియ ద్వారా సరిచేయవచ్చు. ఇక ట్రైకస్పిడ్ అనే కవాటం మూసుకుపోయినప్పుడు బెలూన్ సహాయంతో తెరవడాన్ని పీబీటీఏ అంటారు. ఇలా ఈ ప్రక్రియలతో కవాటాలను తెరుస్తూ చేసే చికిత్సతో మీలాంటి రోగుల ఇబ్బందులను దూరం చేయవచ్చు. మా బాబు వయసు ఏడేళ్లు. పుట్టినప్పుడు అంతా మామూలుగానే ఉన్నాడు. కానీ... ఈమధ్య తరచుగా దగ్గు, జలుబు వస్తోంది. రెండువారాల క్రితం మాకు దగ్గరలోని ఒక డాక్టర్ పరీక్షించి గుండెజబ్బు ఉండవచ్చని చెప్పారు. అప్పటినుంచి మాకు ఆందోళనగా ఉంది. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. - దీపక్, విజయనగరం మీరు చెప్పినదాన్ని బట్టి మీ బాబుకు పుట్టుకతో వచ్చే గుండెజబ్బు... అంటే గుండెలో రంధ్రం (ఏఎస్డీ లేదా వీఎస్డీ) ఏర్పడి ఉండవచ్చునని అనిపిస్తోంది. కానీ మీ బాబు విషయంలో మంచిని సూచించే విషయం ఏమిటంటే... ఇప్పటికవరకు మీ బాబు మామూలుగానే ఉన్నాడు. కాబట్టి ఆ రంధ్రం చాలా చిన్నదై ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వారికి ఈమధ్య వచ్చిన ఆధునిక టెక్నాలజీ సహకారంతో ఏ ఆపరేషన్ లేకుండానే ‘డివైజ్ క్లోజర్’ అనే ప్రక్రియ ద్వారా పూర్తిగా నార్మల్‌గా అయ్యేలా చేయవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఆందోళన వీడి, ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే మీకు దగ్గరలో గుండె వ్యాధులకు అడ్వాన్స్డ్ చికిత్సలు లభ్యమయ్యే సెంటర్లో మీ బాబును చూపించండి. - డాక్టర్ అనూజ్ కపాడియా సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 62 ఏళ్లు. గృహిణిని. నా కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటుంటాయి. శాండల్స్ కూడా వేసుకోను. ఈమధ్య నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - అనసూయ, నెల్లూరు మీరు చెబుతున్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. నా వయసు 27 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడే బట్టతల వస్తుంది. నేను ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో - కిరణ్, కొత్తపేట మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35. పదిహేనురోజుల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా ఫీలయ్యాను. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా ఉండవచ్చు అని అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - రాంబాబు, హైదరాబాద్ సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 55. నాకు ఈమధ్య ఛాతీలో నొప్పిగా ఉంటోందని దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాను. డాక్టర్‌గారు గుండె వాల్వ్స్‌లో సమస్య అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే వాల్వ్స్ రిపేర్ చేయించుకోవచ్చని కూడా చెప్పారు. రిపేర్ చేయించుకుంటే మంచిదా, వాల్వ్ మార్చుకుంటే మంచిదా? ఆ తర్వాత మందుల వాడకం గురించి కూడా తగిన సలహా ఇవ్వండి. - కె. రామేశ్వరాచారి, కోదాడ మీ గుండె వాల్వ్స్ మార్చుకోవాలని మీ డాక్టర్ సూచించారని తెలిపారు. మీ వాల్వ్స్ చికిత్సను రెండు పద్ధతుల్లో చేయవచ్చు. కొత్త వాల్వ్ వెయ్యడం లేదా వాల్వ్ రిపేర్ చేయడం. అయితే వాల్వ్స్‌ను రిపేర్ చేయాలా లేక వాల్వ్ మార్చాలా అన్నది మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వాల్వ్స్ రిపేర్ చేయించుకోవడమే మంచిది. వాల్వ్స్ రిపేర్ చేయించు కుంటే ఆ తర్వాత మందులు వాడే అవసరం తక్కువగా ఉంటుంది. నాకు మూడు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు వెళితే హార్ట్ ఎటాక్ అని చెప్పి స్టెంట్ అమర్చారు. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సోమేశ్‌కుమార్, కరీంనగర్ మీరు వివరించినదాన్ని బట్టి చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స తీసుకున్నారని, దాంతో ఇప్పుడు మీ గుండె పంపింగ్ నార్మల్‌గా ఉందనీ తెలుస్తోంది. హార్ట్ పంపింగ్ నార్మల్‌గా ఉన్నప్పుడు ముందుగా ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా యధాప్రకారం ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి, కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మరీ మంచిది. మరో ముఖ్య విషయం ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు కొన్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మీ కార్డియాలజిస్ట్ సూచించిన విధంగా వాటిని వాడుతున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్