నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు, వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి.
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్), 2) కవాటం లీక్ కావడం (రిగర్జటేషన్). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్‌తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది.
మైట్రల్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు ట్రాన్స్‌ఈసోఫేసియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగిపరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్‌వాల్స్ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్ అవుతుంటే ఈ వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్‌మెంట్ అన్నదే పరిష్కారం.గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు.
మెకానికల్ వాల్వ్ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్’ వంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రీప్లేస్ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్‌నే రిపేర్ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మాంసాహారం మానేయాల్సిందేనా?
నా వయసు 50 ఏళ్లు. నేను మాంసాహారం ఇష్టంగా తింటూ ఉంటాను. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఇంతగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలుచేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి.
ఎల్‌డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.
వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం మానేయలేకపోతే... కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచిది. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు.
డాక్టర్ పి. ప్రణీత్,
సీనియర్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment