నా వయసు 55. నాకు ఈమధ్య ఛాతీలో నొప్పిగా ఉంటోందని దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాను. డాక్టర్‌గారు గుండె వాల్వ్స్‌లో సమస్య అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే వాల్వ్స్ రిపేర్ చేయించుకోవచ్చని కూడా చెప్పారు. రిపేర్ చేయించుకుంటే మంచిదా, వాల్వ్ మార్చుకుంటే మంచిదా? ఆ తర్వాత మందుల వాడకం గురించి కూడా తగిన సలహా ఇవ్వండి.
- కె. రామేశ్వరాచారి, కోదాడ
మీ గుండె వాల్వ్స్ మార్చుకోవాలని మీ డాక్టర్ సూచించారని తెలిపారు. మీ వాల్వ్స్ చికిత్సను రెండు పద్ధతుల్లో చేయవచ్చు. కొత్త వాల్వ్ వెయ్యడం లేదా వాల్వ్ రిపేర్ చేయడం. అయితే వాల్వ్స్‌ను రిపేర్ చేయాలా లేక వాల్వ్ మార్చాలా అన్నది మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వాల్వ్స్ రిపేర్ చేయించుకోవడమే మంచిది. వాల్వ్స్ రిపేర్ చేయించు కుంటే ఆ తర్వాత మందులు వాడే అవసరం తక్కువగా ఉంటుంది.
నాకు మూడు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు వెళితే హార్ట్ ఎటాక్ అని చెప్పి స్టెంట్ అమర్చారు. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సోమేశ్‌కుమార్, కరీంనగర్
మీరు వివరించినదాన్ని బట్టి చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స తీసుకున్నారని, దాంతో ఇప్పుడు మీ గుండె పంపింగ్ నార్మల్‌గా ఉందనీ తెలుస్తోంది. హార్ట్ పంపింగ్ నార్మల్‌గా ఉన్నప్పుడు ముందుగా ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా యధాప్రకారం ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.
మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి, కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మరీ మంచిది. మరో ముఖ్య విషయం ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు కొన్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మీ కార్డియాలజిస్ట్ సూచించిన విధంగా వాటిని వాడుతున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Mon, May 25 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM
Advertisement
Advertisement