doctor A. Srinivaskumar
-
కార్డియాలజీ కౌన్సెలింగ్
ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెకు సంబంధించినదా, కాదా అని నిర్ధారణ చేసే ‘సీటీ స్కాన్’ అందుబాటులోకి వచ్చిందని నా మిత్రుడొకరు చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? - విశాల్, హైదరాబాద్ గుండెకు సంబంధించిన రక్తనాళాలనూ, వాటిలోని అడ్డంకులను గుర్తించడానికి గత ఐదేళ్లుగా ‘కొరనరీ సీటీ యాంజియోగ్రామ్’ (సీటీఏ) అనే పరికరం అందుబాటు లోకి వచ్చిన మాట వాస్తవం. కానీ ఇది ప్రతి చిన్న ఛాతీనొప్పికీ చేయించుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని కొన్ని వందల ఎక్స్-రేలు తీయించుకున్నదా నితో సమానమైన రేడియేషన్‌కు గురిచేస్తుంది. ఇటీవలే రేడియేషన్ పాళ్లను తగ్గించే స్కాన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇంకా అన్ని రకాల ఛాతి నొప్పిలకూ వాడ టానికి డాక్టర్లు వీటిని సిఫార్సు చేయరు. ఎవరికైతే గుండె జబ్బు తాలూకు రిస్క్‌ఫాక్టర్లు కనిపిస్తూ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా ఉంటే వారికి మాత్రమే ‘డాక్టర్ సలహా మేరకు మాత్రమే’ ఆ పరీక్షలు చేయించు కోవాలి. ఎవరిలోనైతే సాధారణ ఈసీజీ, ఎకో, టీఎమ్‌టీ వంటి పరీక్షలతో గుండెపోటు ఉందని నిర్ధారణ జరుగు తుందో వారికి కూడా సీటీఏ పరీక్ష అనవసరం. ఎందు కంటే వారికి చేతి ద్వారా చేసే యాంజియోగ్రామ్ ఎలా గూ అవసరమవుతుంది. కాకపోతే కొందరిలో అప్పటిక ప్పుడే స్టెంటింగ్ (అడ్డంకులను నివారించే ప్రక్రియ) చేసి, ఒకే సిట్టింగ్‌లో రక్తనాళాలను నార్మల్ చేసేందుకు గల అవకాశాలను నిర్ధారణ చేయడంలో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించాల్సి రావచ్చు. నాకు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాను. నేనెప్పుడు బీపీ పరీక్ష చేయించుకోడానికి వెళ్లినా నా బీపీ నార్మల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నా వయసు కేవలం 35 మాత్రమే. నేను ఇలాగే మందులు వాడాల్సిందేనా లేదా మానవచ్చా? వివరించగలరు. - వినోద్, కరీంనగర్ ఎవరికైనా హైపర్‌టెన్షన్ (హైబీపీ) ఉందని నిర్ధారణ అయ్యా వారికి బీపీ ఎంతగా పెరిగిందో దాన్ని బట్టి డాక్టర్లు మందును, మోతాదును నిర్ధారణ చేస్తారు. బీపీ నార్మల్ కంటే ఎక్కువగా ఉందని గుర్తించిన తొలిదశల్లో నడక, ఆహారంలో ఉప్పు తగ్గించడం వంటి జీవనశైలి ప్రక్రియలతో బీపీ నార్మల్ అవుతుందా లేదా అని కొద్ది వారాల పాటు పరీక్షించి చూస్తారు. కానీ ఇంకా తగ్గ కుండా బీపీ అధికంగానే ఉంటుంటే (అంటే 160 / 100 కంటే ఎక్కువగా) మందులు వాడమనే రోగికి డాక్టర్లు సలహా ఇస్తారు. సాధారణంగా ఒకసారి బీపీ మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత బీపీ హెచ్చుతగ్గులను బట్టి మందు మోతాదులను మారుస్తూ, అది ఒకేలా ఉండేలా చూస్తారు డాక్టర్లు. అంతేగానీ... బీపీ నార్మల్‌గా ఉందని మందులు మానడం సరికాదు. బీపీ పెరిగిందా లేక తగ్గిందా లేక స్థిరంగా ఉందా అన్న విషయం తెలుసు కోడానికి క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్ష చేయించుకోడాలి. మీకు మందుల వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకపోతే అవి ఎప్పుడూ వాడటమే శ్రేయస్కరం. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈమధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి. - ఎస్.ఆర్.జి., కొత్తగూడెం మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్. -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 65 ఏళ్లు. నాకు పదేళ్ల నుంచి షుగర్, బీపీ ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని అడుగులు వేయగానే కుడి కాలి పిక్కలో విపరీతమైన నొప్పి వస్తోంది. అదేమిటోగాని ఆగి కాసేపు కూర్చున్నాక మరు నిమిషంలోనే తగ్గుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే నరాల బలహీనత అని బీ-కాంప్లెక్స్, కొన్ని మందులు ఇచ్చారు. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ఇదే విషయం డాక్టర్గారికి చెబితే ఒకసారి గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చారు. కాల్లో సమస్య ఉంటే గుండెజబ్బుల నిపుణడిని కలవాల్సిన అవసరం ఎందుకు? నేను నడవలేకపోతుండటంతో పనేమీ చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాను. నాకు మంచి సలహా ఇవ్వగలరు. - జగదీశ్వరప్రసాద్, విజయవాడ మీరు వివరించిన దాన్ని బట్టి చూస్తే మీకు చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉండటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ చేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాకేజెస్) వచ్చి అలా పిక్కలో నొప్పి వస్తోందని అనిపిస్తోంది. దీనిని వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. దీనికి యాంజియోగ్రామ్ పరీక్ష చేసి బ్లాక్ ఎక్కడ ఉందో తెలుసుకుని దానిని తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ ద్వారా రక్తప్రసరణ మళ్లీ సాఫీగా జరిగే విధంగా చేయవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత మళ్లీ మామూలుగా నడవగలరు. బహుశా ఈ విషయాన్ని చెప్పించడం కోసమే మీ డాక్టర్‌గారు మీ సమస్య విషయంలో గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చి ఉంటారు. అయితే బెలూన్ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ, మీ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. నా వయసు 43 ఏళ్లు. ఇటీవల రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు నా కొలెస్ట్రాల్ 380 అని చెప్పారు. కానీ నేను పూర్తిగా శాకాహారిని. నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? - సూర్యనారాయణమూర్తి, గన్నవరం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాదు... జన్యుపరమైన కారణాలపై కూడా ఆధారపడుతుంది. ఇలాంటి వారు ఏ ఆహార నియమాలూ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ మున్ముందు అది గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35. పదిహేనురోజుల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా ఫీలయ్యాను. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా ఉండవచ్చు అని అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - రాంబాబు, హైదరాబాద్ సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 55. నాకు ఈమధ్య ఛాతీలో నొప్పిగా ఉంటోందని దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాను. డాక్టర్‌గారు గుండె వాల్వ్స్‌లో సమస్య అని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే వాల్వ్స్ రిపేర్ చేయించుకోవచ్చని కూడా చెప్పారు. రిపేర్ చేయించుకుంటే మంచిదా, వాల్వ్ మార్చుకుంటే మంచిదా? ఆ తర్వాత మందుల వాడకం గురించి కూడా తగిన సలహా ఇవ్వండి. - కె. రామేశ్వరాచారి, కోదాడ మీ గుండె వాల్వ్స్ మార్చుకోవాలని మీ డాక్టర్ సూచించారని తెలిపారు. మీ వాల్వ్స్ చికిత్సను రెండు పద్ధతుల్లో చేయవచ్చు. కొత్త వాల్వ్ వెయ్యడం లేదా వాల్వ్ రిపేర్ చేయడం. అయితే వాల్వ్స్‌ను రిపేర్ చేయాలా లేక వాల్వ్ మార్చాలా అన్నది మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వాల్వ్స్ రిపేర్ చేయించుకోవడమే మంచిది. వాల్వ్స్ రిపేర్ చేయించు కుంటే ఆ తర్వాత మందులు వాడే అవసరం తక్కువగా ఉంటుంది. నాకు మూడు నెలల క్రితం ఛాతీ నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు వెళితే హార్ట్ ఎటాక్ అని చెప్పి స్టెంట్ అమర్చారు. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - సోమేశ్‌కుమార్, కరీంనగర్ మీరు వివరించినదాన్ని బట్టి చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స తీసుకున్నారని, దాంతో ఇప్పుడు మీ గుండె పంపింగ్ నార్మల్‌గా ఉందనీ తెలుస్తోంది. హార్ట్ పంపింగ్ నార్మల్‌గా ఉన్నప్పుడు ముందుగా ఏయే పనులు చేసుకునేవారో, వాటన్నింటినీ ఇప్పుడు కూడా యధాప్రకారం ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మీకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి, కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ, వాకింగ్, యోగాలాంటివి ప్రాక్టిస్ చేయడం మరీ మంచిది. మరో ముఖ్య విషయం ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి స్టెంట్ అమర్చిన తరువాత యాస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు కొన్ని జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మీ కార్డియాలజిస్ట్ సూచించిన విధంగా వాటిని వాడుతున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు చాలా రోజుల నుంచి ఛాతీ నొప్పి వస్తోంది. ఈ వయసులో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా? - సుందర్‌కుమార్, రాజమండ్రి మీ వయసు 45 అని చెప్పారు కాబట్టి... ఈ వయసులో గుండె జబ్బు రాదని చెప్పడానికి వీల్లేదు. కానీ 60 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే ఈ వయసులో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. మీ విషయంలో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగతాగే అలవాటు ఉందా లేదా అన్న విషయం రాయలేదు కాబట్టి... మీకు వచ్చే ఛాతి నొప్పి దేనికి సంబంధించినదో అని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడం కష్టం. ఇది గుండెకు సంబంధించిన నొప్పా, కాదా అని నిర్ధారణ చేసుకోడానికి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలు చేయించుకుని నొప్పి కారణాలను కనుగొనడానికి అవకాశం ఉంది. ఏవైనా పరీక్షలన్నీ ఒక నిపుణులైన డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయించుకోవడం ఎంతైనా మంచిది. నా వయసు 40 ఏళ్లు. ఇటీవల విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తున్నాను. మా జాబ్‌లో టార్గెట్స్ రీచ్ కావాల్సిన అవసరం కూడా ఉంటోంది. గుండెజబ్బుల నివారణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్న సూచన నేను తరచూ చదువుతున్నాను. కానీ మా వృత్తిలో అది సాధ్యం కాదు. మాలాంటి వారికి ఏదైనా ప్రత్యేక నివారణ సూచనలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. - సుధీర్‌కుమార్, విశాఖపట్నం ఒత్తిడిలో పనిచేయడం అన్నది గుండెజబ్బు రావడానికి ఉన్న అనేక కారణాలలో ఒకటి. మీ ఉద్యోగరీత్యా నెరవేర్చాల్సిన బాధ్యతలు పూర్తి చేస్తూనే... గుండె జబ్బును నివారించడానికి రోజూ నడక, యోగా లాంటివి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీరు ఉద్యోగం మార్చుకోవడం వీలు పడదు కాబట్టి, దానిలోని ఒత్తిడికి రియాక్ట్ అయ్యే విధానాన్ని తగ్గించుకోండి. ప్రతిదానికి టెన్షన్ లేకుండా చూసుకోవడం వంటి ప్రక్రియలతో మీ వృత్తిలో ఎదగడంతో పాటు గుండె జబ్బు నివారణ కూడా ఏకకాలంలో జరుగుతుంది. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్