నా వయసు 45 ఏళ్లు. నాకు చాలా రోజుల నుంచి ఛాతీ నొప్పి వస్తోంది. ఈ వయసులో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా?
- సుందర్‌కుమార్, రాజమండ్రి
మీ వయసు 45 అని చెప్పారు కాబట్టి... ఈ వయసులో గుండె జబ్బు రాదని చెప్పడానికి వీల్లేదు. కానీ 60 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే ఈ వయసులో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ. మీ విషయంలో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగతాగే అలవాటు ఉందా లేదా అన్న విషయం రాయలేదు కాబట్టి... మీకు వచ్చే ఛాతి నొప్పి దేనికి సంబంధించినదో అని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడం కష్టం. ఇది గుండెకు సంబంధించిన నొప్పా, కాదా అని నిర్ధారణ చేసుకోడానికి ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకుని నొప్పి కారణాలను కనుగొనడానికి అవకాశం ఉంది. ఏవైనా పరీక్షలన్నీ ఒక నిపుణులైన డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయించుకోవడం ఎంతైనా మంచిది.
నా వయసు 40 ఏళ్లు. ఇటీవల విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తున్నాను. మా జాబ్‌లో టార్గెట్స్ రీచ్ కావాల్సిన అవసరం కూడా ఉంటోంది. గుండెజబ్బుల నివారణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్న సూచన నేను తరచూ చదువుతున్నాను. కానీ మా వృత్తిలో అది సాధ్యం కాదు. మాలాంటి వారికి ఏదైనా ప్రత్యేక నివారణ సూచనలు ఉన్నాయా? దయచేసి చెప్పండి.
- సుధీర్‌కుమార్, విశాఖపట్నం
ఒత్తిడిలో పనిచేయడం అన్నది గుండెజబ్బు రావడానికి ఉన్న అనేక కారణాలలో ఒకటి. మీ ఉద్యోగరీత్యా నెరవేర్చాల్సిన బాధ్యతలు పూర్తి చేస్తూనే... గుండె జబ్బును నివారించడానికి రోజూ నడక, యోగా లాంటివి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీరు ఉద్యోగం మార్చుకోవడం వీలు పడదు కాబట్టి, దానిలోని ఒత్తిడికి రియాక్ట్ అయ్యే విధానాన్ని తగ్గించుకోండి. ప్రతిదానికి టెన్షన్ లేకుండా చూసుకోవడం వంటి ప్రక్రియలతో మీ వృత్తిలో ఎదగడంతో పాటు గుండె జబ్బు నివారణ కూడా ఏకకాలంలో జరుగుతుంది.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Sat, May 16 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement