నా వయసు 65 ఏళ్లు. నాకు పదేళ్ల నుంచి షుగర్, బీపీ ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని అడుగులు వేయగానే కుడి కాలి పిక్కలో విపరీతమైన నొప్పి వస్తోంది. అదేమిటోగాని ఆగి కాసేపు కూర్చున్నాక మరు నిమిషంలోనే తగ్గుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే నరాల బలహీనత అని బీ-కాంప్లెక్స్, కొన్ని మందులు ఇచ్చారు. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ఇదే విషయం డాక్టర్‌గారికి చెబితే ఒకసారి గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చారు. కాల్లో సమస్య ఉంటే గుండెజబ్బుల నిపుణడిని కలవాల్సిన అవసరం ఎందుకు? నేను నడవలేకపోతుండటంతో పనేమీ చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాను. నాకు మంచి సలహా ఇవ్వగలరు.
- జగదీశ్వరప్రసాద్, విజయవాడ
మీరు వివరించిన దాన్ని బట్టి చూస్తే మీకు చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉండటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ చేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాకేజెస్) వచ్చి అలా పిక్కలో నొప్పి వస్తోందని అనిపిస్తోంది. దీనిని వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. దీనికి యాంజియోగ్రామ్ పరీక్ష చేసి బ్లాక్ ఎక్కడ ఉందో తెలుసుకుని దానిని తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ ద్వారా రక్తప్రసరణ మళ్లీ సాఫీగా జరిగే విధంగా చేయవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత మళ్లీ మామూలుగా నడవగలరు. బహుశా ఈ విషయాన్ని చెప్పించడం కోసమే మీ డాక్టర్‌గారు మీ సమస్య విషయంలో గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చి ఉంటారు. అయితే బెలూన్ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ, మీ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.
నా వయసు 43 ఏళ్లు. ఇటీవల రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు నా కొలెస్ట్రాల్ 380 అని చెప్పారు. కానీ నేను పూర్తిగా శాకాహారిని. నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?
- సూర్యనారాయణమూర్తి, గన్నవరం
రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాదు... జన్యుపరమైన కారణాలపై కూడా ఆధారపడుతుంది. ఇలాంటి వారు ఏ ఆహార నియమాలూ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ మున్ముందు అది గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై తీసుకుంటూ ఉండాలి.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Sun, Jun 7 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement