నా వయసు 35. పదిహేనురోజుల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా ఫీలయ్యాను. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా ఉండవచ్చు అని అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
- రాంబాబు, హైదరాబాద్
సాధారణంగా మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు.
ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి.
మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
Published Mon, Jun 1 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement