గుండెవైఫల్యం అంటే...? | Cardiology Counseling By Dr G Surya Prakash | Sakshi
Sakshi News home page

గుండెవైఫల్యం అంటే...?

Published Wed, Dec 18 2019 12:45 AM | Last Updated on Wed, Dec 18 2019 12:45 AM

Cardiology Counseling By Dr G Surya Prakash - Sakshi

నా వయసు 59 ఏళ్లు. గత నాలుగేళ్లుగా మూత్రం తగ్గడం, చర్మం పలచబడటం, కండరాల పటుత్వం కూడా తగ్గడం వంటి లక్షణాలతో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి గుండెవైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌) కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గుండెవైఫల్యం అంటే ఏమిటి? ఇందుకు కారణాలేమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – సుధాకర్‌రావు, కంకిపాడు 

గుండె వైఫల్యానికి అతి ప్రధాన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటు బారిన పవడ్డవారిలో నూటికి 60 మందిలో గుండెవైఫల్యం సంభవించవచ్చు. అయితే గుండెవైఫల్యానికి ఇదొక్కటే కారణం కాదు. దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండెకండరం దెబ్బతిని వైఫల్యానికి దారితీస్తుంది. అలాగే డయాబెటిస్‌ నియంత్రణలో లేనప్పడు కూడా సూక్ష్మరక్తనాళాలు దెబ్బతిని అంతిమంగా అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషపదార్థాల ప్రభావం పెరిగి, కరమంగా గుండె దెబ్బతింటుంది. అదురుగా పుట్టుకతో కండర ప్రోటీన్‌ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, కొందరిలో జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూ లేనంత తీవ్రమైన మానసిక ఒత్తిడి బారిన పడ్డవారికి కూడా హఠాత్తుగా గుండెవైఫల్యం సంభవించి  ముప్పు ఉంటుంది. 

నిర్ధారణ గుండెవైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ‘ఈసీజీ’ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారైందా... వంటి వివరాలన్నీ బయటపడతాయి. ఎకో పరీక్ష చేస్తే గుండె పంపింగ్‌ సామర్థ్యం ఎలా ఉందన్న విషయం తెలుస్తుంది. ఇవికాకుండా గుండెవైఫల్య లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు... ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్‌’ అవసరమవుతుంది. దాదాపు 99 శాతం మందికి ఈ పరీక్షలతో గుండెవైఫల్యం కచ్చితంగా నిర్ధాణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎమ్మారై, పెట్‌స్కాన్‌ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండెవైఫల్యమా లేక ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్‌పీ’ అనే పరీక్ష ఉపకరిస్తుంది. 

చికిత్స: గుండెవైఫల్యానికి చికిత్స దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. గుండెవైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం, కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. గుండె వ్యాధి ముదరకుండా చూడటానికి మందులు వాడాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటాబ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్హిబిటర్లు, స్పైరనోలాక్టోస్‌ వంటి మందులు ఇస్తారు. వీటికితోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ప్రభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలీసిలిన్‌ ఇన్హిబిటర్‌’ వంటి కొత్తమందులు రాబోతున్నాయి. ఇక ఒంట్లోకి అధికంగా చేరిన నీటిని బయటకు పంపేందుకు ‘డైయూరెటిక్స్‌’ మందులు, లక్షణాలను తగ్గించేందుకు ‘డిజిటాయిల్స్‌’ మందులు తోడ్పడతాయి.

ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా కాపాడుతూ జీవితికాలాన్ని పెంచడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్‌ సామర్థ్యం 30 శాతం కంటే తక్కువగా ఉన్నవారికి ‘ఆల్డోస్టెరాన్‌ యాంటగోనిస్ట్స్‌’ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటాబ్లాకర్స్‌ను తట్టుకోలేరు వీరికి ‘ఇవాబ్రాడిన్‌’ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ‘ఐసారజైన్‌’ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారేలా చేస్తూ గుండెమీద భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా, గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలు తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారం వాడటం చాలా కీలకం. 

గుండె ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...? 
నా వయసు 54 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్‌ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్‌) అన్నారు. నేను కూడా డాక్టర్లు చెప్పినట్టే క్రమం తప్పకుండా మందులు వాడాలనుకుంటున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే చేయాలి? - ఆర్‌. జగన్నాథరావు, గుడివాడ 

మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుందని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్‌ అంత ఎక్కువగా లేవనీ అర్థం.  లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్‌ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్‌ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్‌ అవసరం పడాల్సి రావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్‌ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. 

యోగా, వాకింగ్‌ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్‌ చేయించుకుని పూర్తిగా సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి. - డాక్టర్‌ జి. సూర్యప్రకాశ్, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, ముషీరాబాద్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement