కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్‌వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈమధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి.
- ఎస్.ఆర్.జి., కొత్తగూడెం
మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్‌స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్‌స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్.