అధికంగా సెల్‌ఫోన్ మాట్లాడే వారిలో రక్తపోటు
చైనాలోని గ్వాంగ్‌జౌ సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధనలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందిలో బీపీ సమస్య
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్‌ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్‌లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.
130 కోట్ల మందిలో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.
కండరాలపై ఒత్తిడి..
మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్‌ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment