పేదోళ్లకే గుండెపోట్లు ఎక్కువ!!
చివరకు గుండెపోటుకు కూడా పేద.. పెద్ద తారతమ్యం కనపడుతోంది. ఎందుకంటే, బాగా డబ్బున్నవారి కంటే, పేదవాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశాలు దాదాపు రెట్టింపు ఉంటాయని తాజా పరిశోధనలలో తేలింది. గుండెపోటు వచ్చే ప్రమాదానికి.. వారి ఆర్థిక స్థోమతకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనలలో స్పష్టమైందని టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన వికీ మైర్స్ తెలిపారు. ఆమెతో పాటు ప్రొఫెసర్ యరివ్ గెర్బర్ కలిసి 40 రకాల ఆరోగ్య సూచికలను రూపొందించారు. ఇవి గుండెపోటు నిర్ధారణలో 'బలహీనత' అంశం నిగ్గు తేలుస్తాయి. మధ్య ఇజ్రాయెల్లో గత 10 నుంచి 13 ఏళ్ల మధ్య గుండెపోటు వచ్చిన దాదాపు 1151 మంది రోగులకు సంబంధించిన వైద్య రికార్డుల ఆధారంగా తమ పరిశోధన సాగించారు.
గుండెపోటు వచ్చిన రోగుల్లో 35 శాతం మంది తర్వాత దశాబ్ద కాలంలో బాగా బలహీనపడ్డారు. వీళ్లంతా ఆర్థికంగా బాగా వెనకబడినవారు, సామాజికంగా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి చదువు తక్కువగా ఉండటం, కుటుంబ ఆదాయం తక్కువ కావడం, నిరుద్యోగం.. ఇలాంటివన్నీ కనిపించాయి. పైపెచ్చు పేదవారు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం కూడా చాలా తక్కువ. గుండెపోటు వచ్చిన తర్వాత బలహీనపడటమే కాదు.. మొత్తం గుండెపోటు వచ్చినవారిలో కూడా పేదవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని మైర్స్ తెలిపారు.