విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి...
24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు.
అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది.
(చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు)
కారణాలేంటి? ఎందుకిలా?
చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు.
యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే..
1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం.
2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం.
3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం.
4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం.
5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం.
(చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి)
Comments
Please login to add a commentAdd a comment