న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు.
పవన విద్యుత్‌లో దిగ్గజం..
తులసి తంతి 1958లో రాజ్‌కోట్‌లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్‌టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్‌మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్‌లకు సుజ్లాన్‌కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్‌ఎఫ్ విండ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.
కష్టకాలంలో కంపెనీ..
సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్‌లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది.
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
Published Mon, Oct 3 2022 6:06 AM | Last Updated on Mon, Oct 3 2022 6:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment