Suzlon Energy
-
క్రిసిల్ పాజిటీవ్ ఔట్లుక్.. సుజ్లాన్ ఎనర్జీ రేటింగ్‌కు దన్ను
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన సొల్యూషన్లు అందించే సుజ్లాన్ ఎనర్జీ రేటింగ్ రెండంచెలమేర మెరుగుపడింది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా సానుకూల ఔట్‌లుక్‌తో బీబీబీప్లస్/ఏ2కు అప్‌గ్రేడ్ చేసింది. ఇంతక్రితం బీబీబీమైనస్/ఏ3గా రేటింగ్ నమోదైంది. కంపెనీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక సౌకర్యాల రేటింగ్స్‌ను క్రిసిల్ ఎగువముఖంగా సవరించినట్లు సుజ్లాన్ ఎనర్జీ తెలియజేసింది. ఇది కంపెనీ అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యంతోపాటు.. బలపడిన ఫైనాన్షియల్ పరిస్థితులను వెల్లడిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ పేర్కొన్నారు. పరిశ్రమసంబంధ సానుకూలతలు ఇందుకు జత కలిసినట్లు తెలియజేసింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా సమీకరించిన రూ. 2,000 కోట్లను కాలపరిమితి రుణాల పూర్తి చెల్లింపులకు వినియోగించడం రేటింగ్ సవరణలకు కారణమైనట్లు సుజ్లాన్ వెల్లడించింది. తద్వారా విజయవంతంగా రుణ భారాన్ని తగ్గించుకోగలిగినట్లు వివరించింది. -
సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ 11న
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ వచ్చే వారం(11న) ప్రారంభంకానుంది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీ తులసి తంతి ఇటీవల కన్ను మూసిన నేపథ్యంలో రైట్స్ ఇష్యూ అంశంపై సుజ్లాన్ తాజాగా స్పష్టతనిచ్చింది. రైట్స్ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ప్రమోటర్లు సైతం రైట్స్‌లో పాలుపంచుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రమోటర్ల కోటాలో రైట్స్‌కు పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ చేసేందుకు ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. వెరసి గత నెల 28న ప్రతిపాదించిన ఎల్‌వోఎఫ్ ప్రకారం రైట్స్ ఇష్యూని చేపట్టనున్నట్లు వివరించింది. ఎల్‌వోఎఫ్ ప్రకారం షేరుకి రూ. 5 ధరలో 240 కోట్ల పాక్షిక చెల్లింపుల షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకోనుంది. రైట్స్‌లో భాగంగా అక్టోబర్ 4కల్లా(రికార్డ్ డేట్) అర్హతగల వాటాదారుల వద్దగల ప్రతీ 21 షేర్లకుగాను 5 షేర్లను జారీ చేయనుంది. రైట్స్ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రైట్స్ వార్తల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.25 శాతం నీరసించి రూ. 7.90 వద్ద ముగిసింది. -
Suzlon Energy: ‘సుజ్లాన్’ తులసి తంతి తుది శ్వాస
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, విండ్ మ్యాన్‌గా పేరొందిన తులసి తంతి (64) కన్నుమూశారు. ఆయన శనివారం గుండెపోటుతో మరణించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. తులసి తంతికి భార్య (గీత), ఇద్దరు సంతానం (కుమారుడు ప్రణవ్, కుమార్తె నిధి) ఉన్నారు. ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన దిగ్గజాల్లో తులసి తంతి ఒకరు. ఆయన అకాల మరణంపై కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ప్రధాని ట్వీట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొని అహ్మదాబాద్ నుంచి పుణెకు వస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ కారు డ్రైవరుకు తులసి తంతి సూచించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందేలోగానే ఆయన కన్నుమూశారు. పవన విద్యుత్‌లో దిగ్గజం.. తులసి తంతి 1958లో రాజ్‌కోట్‌లో జన్మించారు. గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. 1995లో సుజ్లాన్ ఎనర్జీ ఏర్పాటుతో పవన విద్యుత్ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ప్రవేశించడానికి ముందు ఆయనకు టెక్స్టైల్ వ్యాపారం ఉండేది. దాన్ని 2001లో విక్రయించారు. అటు పైన 2003లో అమెరికన్ సంస్థ డాన్మర్ అండ్ అసోసియేట్స్ నుంచి 24 టర్బైన్లకు సుజ్లాన్‌కు భారీ ఆర్డరు దక్కింది. ఆ తర్వాత కంపెనీ వేగంగా విస్తరించడంలో తులసి తంతి కీలక పాత్ర పోషించారు. 2006 నుంచి బెల్జియంకు చెందిన టర్బైన్ విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ విండ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. కష్టకాలంలో కంపెనీ.. సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక సమస్యల్లో ఉన్న తరుణంలో తంతి అకాల మరణం ప్రాధాన్యం సంతరించుకుంది. 2005లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయిన తర్వాత శరవేగంగా కార్యకలాపాలు విస్తరించిన సుజ్లాన్ ఎనర్జీ ఒక దశలో రూ. 65,474 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ దక్కించుకుంది. కంపెనీలో మెజారిటీ వాటాలున్న తంతి సంపద విలువ దాదాపు రూ. 43,537 కోట్లకు పెరిగింది. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తడం, ఆ తర్వాత పరిణామాలతో పవన విద్యుత్ రంగం కుదేలైంది. దీనికి టర్బైన్లలో లోపాల ఫిర్యాదులు మొదలైనవి కూడా తోడు కావడంతో సుజ్లాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కంపెనీ విలువ రూ. 8,536 కోట్లకు పడిపోయింది. భారీగా రుణాలు పేరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు సుజ్లాన్ అక్టోబర్ 11న రూ. 1,200 కోట్ల రైట్స్ ఇష్యూకు రానుంది. ఈ తరుణంలో తంతి హఠాన్మరణంతో తలెత్తబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది. అయితే, అనుభవజ్ఞులైన బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సారథ్యంలో తంతి ఆకాంక్షలను నెరవేరుస్తామని సుజ్లాన్ ఎనర్జీ పేర్కొంది. -
జర్మనీ అనుబంధ సంస్థను విక్రయించిన సుజ్లాన్
* 1.2 బిలియన్ డాలర్లకు సెన్వియాన్ అమ్మకం... * రుణ భారం తగ్గించుకునేందుకు చర్యలు... న్యూఢిల్లీ: పవన విద్యుత టర్బయిన్ల తయారీ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ... రుణ భారం తగ్గించుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా తమ జర్మనీ అనుబంధ సంస్థ సెన్వియాన్ను 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.7,200 కోట్లు) మొత్తానికి విక్రయించింది. అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ సెంటర్బ్రిడ్జ్ పార్ట్నర్స్ ఎల్పీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సుజ్లాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. డీల్‌లోని కొన్ని షరతుల మేరకు మరో 5 కోట్ల డాలర్లు కూడా తమకు లభించే అవకాశం ఉందని తెలిపింది. తమ కంపెనీకి ఉన్న సుమారు రూ.16,500 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ఈ అమ్మకం నిధుల్లో రూ.6,000 కోట్లను ఉపయోగిస్తామని వివరించింది. మిగతాది వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ చర్యల నేపథ్యంలో 2016లో కంపెనీ లాభాల్లోకి రానుందని సుజ్లాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అమ్మకం ఒప్పందం ఈ ఏడాది మార్చికల్లా పూర్తవ్వొచ్చని అంచనా వేసింది. దేశీయంగా, అధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్లపైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నామని సుజ్లాన్ చైర్మన్ తులసి తంతి చెప్పారు. దీన్ని తెలివైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. 2007లో సెన్వియాన్ను సుజ్లాన్ దాదాపు 1.63 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాగా, సబ్సిడీరీ అమ్మకం వార్తలతో సుజ్లాన్ షేరు ధర భారీగా దిగజారింది. గురువారం బీఎస్ఈలో 7.45% క్షీణించి రూ.15.91 వద్ద ముగిసింది.