దుఃఖ సాగరంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ ( సింగపూర్)
తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్ 2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకువై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజుల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మకు పెద్దకొడుకు అంటూ నరేందర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. టీసీఎస్‌ఎస్‌కు అందించిన సేవలు చాలా గొప్పవంటు ఆయనకు జోహార్లు అర్పించారు. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు.
మృదు స్వభావి, ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారనీ, సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియాకు తరలించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియాకు తోడు వెళ్లారు.
వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌కి వచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు , కుమారుడు. ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment