Cholesterol.
-
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
మనిషి ఆరోగ్యానికి ఏ రకమైన బియ్యం మంచిది ??
-
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మార్గం
సాక్షి, హైదరాబాద్: శరీంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. కణత్వచంపై సెరటోనిన్ రిసెప్టార్–1ఏ.. కొలెస్ట్రాల్‌ను గుర్తించగలదని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అమితబ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సెరటోనిన్ రిసెప్టార్లు కణత్వచంలో ఉండే కొలెస్ట్రాల్‌కు సున్నితంగా ఉంటాయని ఆయన గతంలోనే గుర్తించారు. కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు రిసెప్టార్ ప్రోటీన్లు కీలకం కాగా.. చాలా మందులు ఈ రిసెప్టార్ ప్రొటీన్లనే లక్ష్యంగా చేసుకుని తయారుచేస్తుంటారు. సెరటోనిన్ రిసెప్టార్ ప్రొటీన్‌లోని సీఆర్‌ఏసీ నిర్మాణాలపై తాము దృష్టి పెట్టామని, నిర్దిష్ట అమైనో యాసిడ్స్‌ను మార్చి చూడగా, ఒక అమైనోయాసిడ్ కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. స్పెయిన్‌లోని పాంపియూ ఫాబ్ర యూనివర్సిటీ హాస్పిటల్ సాయంతో ప్రొటీన్, కొలెస్ట్రాల్ మధ్య జరిగే చర్యలను పరిశీలించామని, తద్వారా తాము గుర్తించిన అమైనో యాసిడ్.. ఎలా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందో తెలిసిందని చెప్పారు. వయసుతో పాటు కొలెస్ట్రాల్ మోతాదుల్లో తేడాలు వస్తాయని, ఈ రిసెప్టార్ ఆధారంగా కొత్తగా మందులు తయారుచేస్తే మరింత మెరుగ్గా కొలెస్ట్రాల్‌ను నియంత్రించొచ్చని తాము భావిస్తున్నట్లు వివరించారు. స్ట్రక్చరల్ బయాలజీలో సీసీఎంబీకి ఉన్న నైపుణ్యం ఈ కొత్త ఆవిష్కరణకు వీలు కలిగించిందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ తెలిపారు. -
పక్షవాతం వంశపారంపర్యమా?
నా వయసు 36 ఏళ్లు. మేము ముగ్గురు అన్నదమ్ములం. మా నాన్నగారు నా చిన్నతనంలో పక్షవాతానికి గురయ్యారు. అప్పట్లో సరైన వైద్యసౌకర్యాలు లేకపోవడంతో మంచానపడి పదేళ్లపాటు నరకం అనుభవించి చనిపోయారు. నా పెద్దతమ్ముడికి 29 ఏళ్లు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నెల్లాళ్ల కిందట ‘బ్రెయిన్‌స్ట్రోక్’కు గురయ్యాడు. వెంటనే మంచి వైద్యం ఇప్పించడం వల్ల వెంటనే కోలుకున్నాడు. కుడి చేయి, కుడి కాలు ఇంకా స్వాధీనంలోకి రాలేదుగానీ ప్రాణాపాయం లేదనీ, ఫిజియోథెరపీ, మందులు వాడటం వల్ల తొందరలోనే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఇప్పుడు నాకూ, మా చిన్న తమ్ముడికి ఒక భయం పట్టుకుంది. నాన్నగారిలా, తమ్ముడిలా మాకూ పక్షవాతం వస్తుందా? ‘బ్రెయిన్‌స్ట్రోక్’ వంశపారంపర్యంగా వచ్చే జబ్బా? పక్షవాతం గురించి వివరాలను విపులంగా తెలియజేయండి. పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్) వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఈ విషయంలో మీరు ఎలాంటి భయాలూ, ఆందోళనలూ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో పక్షవాతం ఉంది కాబట్టి బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్... అంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ వంటి వంశపారంపర్య వ్యాధుల పట్ల మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి. మీరు క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుని, ఒకవేళ ఏమైనా తేడాలుంటే క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పరిశోధనల ప్రకారం మహిళల కంటే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. పక్షవాతంలో రెండు రకాలున్నాయి. ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడు మొత్తానికి నాలుగు రక్తనాళాలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎడమవైపునకూ, రెండు కుడివైపునకూ వెళ్తాయి. ఈ రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దాంతో మెదడుకు రక్తసరఫరా సరిగా జరగక, కణాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుంది. దాదాపు 80 శాతం కేసుల్లో ఇదే కారణం. హేమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళాల్లో ఏదైనా చిట్లిపోయి, రక్తం బయటకు రావడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ఈ తరహా పక్షవాతం 20 శాతం కేసుల్లో కనిపిస్తుంటుంది. ఈ రెండు కారణాల వల్ల ఎడమవైపు మెదడు భాగాలు దెబ్బతింటే శరీరంలోని కుడివైపున ఉండే అవయవాలు, కుడివైపు మెదడు భాగాలు దెబ్బతింటే ఎడమ వైపున ఉండే అవయవాలు దెబ్బతింటాయి. కారణాలు : పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు అధిక రక్తపోటు. డయాబెటిస్. డ్రగ్స్, అధిక ఒత్తిడి కూడా ఇందుకు కారణాలే. ఇంతకుమునుపు ఇవి అరవై ఏళ్ల వయసులో కనిపించేవి. కానీ ఇప్పుడు మూడు పదుల్లోనే కనిపిస్తున్నాయి. అందుకే పక్షవాతం ఇప్పుడు చాలా చిన్న వయసువారిలోనూ కనిపిస్తోంది. ఎలా గుర్తించాలి : ►మాటలో తేడా రావడం, నత్తినత్తిగా రావడం ►విన్నది అర్థం చేసుకోలేకపోవడం ►మూతి పక్కకి వెళ్లిపోవడం ►ఒకవైపు కాలు, చెయ్యి బలహీనం కావడం ►నడిస్తే అడుగులు తడబడటం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సీటీ స్కాన్ చేసి, తక్షణం చికిత్స మొదలుపెట్టాలి. పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగున్నర గంటలలోపు చికిత్స అందించగలిగితే శరీరం చచ్చుబడకుండా కాపాడవచ్చు. ఇక ప్రధాన చికిత్స తర్వాత పక్షవాతం నుంచి పూర్తిగా కోలుకోడానికి ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరమవుతుంది. డా. జయదీప్ రాయ్ చౌధురి, సీనియర్ ఫిజీషియన్, యశోద హస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
సంస్కృతంతో కొలెస్టరాల్, డయాబెటిస్‌కు చెక్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజూ సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు అదుపులో వుంటుందని సెలవిచ్చారు. అమెరికాలోని ఓ విద్యా సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం తేలిందని ఆయన తాజాగా వెల్లడించారు. సంస్కృతం మాట్లాడటం వలన నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందనీ, షుగర్ లెవల్స్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు. సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయనఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు యుఎస్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన పరిశోధన ప్రకారం, సంస్కృతంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జరిగితే అది ఆగకుండా పని చేస్తుందని తెలిపారు. కొన్ని ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 శాతానికి పైగా భాషలు సంస్కృతం మీద ఆధారపడి ఉన్నాయని సింగ్ అన్నారు. మరోవైపు ఈ బిల్లుపై సంస్కృతంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి సంస్కృత భాష చాలా సరళమైందనీ, అందులో ఒక్కో పదాన్ని పలు విధాలుగా వాడుకోవచ్చని తెలిపారు. ఆవు, అన్నయ్య(బ్రదర్, కౌ) అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఈ భాష నుంచే ఉద్భవించాయని చెప్పుకొచ్చారు. ఈ పురాతన భాషను ప్రమోట్ చేయడం వలన ఇతర భాషలకొచ్చే ప్రమాదేమీ వుండదని సారంగి వ్యాఖ్యానించారు. -
గుండె కవాటాల సమస్య అంటే ఏమిటి? వివరంగా చెప్పండి
నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు, వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్), 2) కవాటం లీక్ కావడం (రిగర్జటేషన్). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది. మైట్రల్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు ట్రాన్స్ఈసోఫేసియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగిపరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్వాల్స్ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్ అవుతుంటే ఈ వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్’ వంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రీప్లేస్ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాంసాహారం మానేయాల్సిందేనా? నా వయసు 50 ఏళ్లు. నేను మాంసాహారం ఇష్టంగా తింటూ ఉంటాను. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఇంతగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలుచేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం మానేయలేకపోతే... కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచిది. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. డాక్టర్ పి. ప్రణీత్, సీనియర్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు
కేన్సర్ కణాలకు చక్కెరపై మక్కువ ఎక్కువని శాస్త్రం చెబుతుంది. చక్కెరను వాడుకోవడం ద్వారా కేన్సర్ కణాలు శక్తిని పొందుతాయి. అయితే కొన్ని రకాల కేన్సర్లు కొవ్వుకణాలతోనూ ఇంధనాన్ని సమకూర్చు కుంటాయి. నార్త్వెస్ట్ర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అంశం ఆధారంగా కేన్సర్‌కు సరికొత్త చికిత్సను సిద్ధం చేశారు. కొవ్వు కణాల్లోపల రహస్యంగా కీమోథెరపీ మందులు దాగి ఉండేలా చేశారు. ఫలితంగా కేన్సర్ కణాలు ఈ రకమైన కణాలను ఆహారంగా మార్చుకున్నప్పుడు అందులో ఉన్న మందు నేరుగా కణాలపై దాడి చేస్తుందన్నమాట. ఈ ప్రత్యేకమైన కొవ్వు కణాల్లో రెండు చేతుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయని.. ఒకటి కేన్సర్ మందును... ఇంకోటి ప్రొటీన్లకు అతుక్కుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నాథన్ గియాన్సెచీ తెలిపారు. కేన్సర్ కణితుల్లోని రిసెప్టర్లు ఈ కొవ్వు కణాలను లోనికి రానిస్తాయని.. ఆ తరువాత ఇందులోని కీమో మందు పనిచేయడం మొదలుపెడుతుందని కణితి తాలూకూ కణాలను చంపేస్తుందని నాథన్ వివరించారు. చాలా రకాల కేన్సర్లకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాసిలిటాక్సెల్ను ప్రత్యేక కొవ్వు కణాల్లోకి చేర్చి జంతువులపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని.. దుష్ప్రభావాలు అతితక్కువగా ఉంటూనే మూడు రకాల కేన్సర్లను ఈ కొత్త కొవ్వుకణాలు సమర్థంగా ఎదుర్కొన్నాయని వివరించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధారణ డోస్ కంటే 20 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన డోస్ కేన్సర్ కణాలకు అందుతూండటం ఇంకో విశేషం. -
మంచి కొవ్వును పెంచే మందులొస్తున్నాయి
శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల కొవ్వు మోతాదును ఎక్కువ చేసేందుకు సిడ్నీలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మార్గాన్ని ఆవిష్కరించారు. కొవ్వు తగ్గించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులన్నీ ఎల్డీఎల్ కొవ్వుపై మాత్రమే పనిచేస్తూండగా... హెచ్‌డీఎల్‌ను పెంచే మందులేవీ మార్కెట్లో లేవు. అయితే ఓఆర్పీ2 అనే ప్రొటీన్ కొవ్వును ఒక కణం నుంచి ఇంకోదానికి సరఫరా చేస్తున్నట్లు సిడ్నీ శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఈ పరిస్థితిలో మార్పు రానుంది. కణం లోపలి భాగాల్లో ఉండే కొవ్వును ఈ ప్రొటీన్ ఉపరితలం పైకి తీసుకొస్తుందని.. కణం స్థిరంగా ఉండేందుకు ఈ కొవ్వు ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాబ్ యాంగ్ అంటున్నారు. ఈ కారణంగానే శరీరంలోని 90 శాతం కొవ్వు కణాల ఉపరితలం పైనే కనిపిస్తుందని వివరించారు. శరీరానికి మంచి చేసే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కణ త్వచం తయారుచేస్తూంటుందని కణంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో కొంత ఇలా హెచ్డీఎల్గా మారుతుందని తెలిపారు. ఓఆర్పీ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎక్కువ మోతాదులో కొవ్వు త్వచాన్ని చేరేట్టు చేయవచ్చునని... తద్వారా హెచ్‌డీఎల్ ఉత్పత్తి ఎక్కువవుతుందని తెలిపారు. -
కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టుకోవడం ఎలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రక్తంలో పెరిగిందని రిపోర్డు వచ్చింది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని చాలామంది అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సలహా ఇవ్వండి. – డి. సరస్వతి, కందుకూరు కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్డీఎల్ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్కి›్లరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయినా హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. నాకు రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏది నిజమో చెప్పండి. – ఆర్. కౌశిక్, హైదరాబాద్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొలెస్ట్రాల్ తగ్గింపు సాధ్యమే!
జన్యువులలో మార్పులు చేర్పులు అత్యంత కచ్చితంగా చేసేందుకు పనికొచ్చే క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీకి కొత్త ఉపయోగాన్ని గుర్తించారు డ్యూక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వ్యాధికారకమైన జన్యువులలో మార్పులు చేయకుండానే వాటిని ఆఫ్ చేసేందుకూ దీన్ని వాడవచ్చునని వీరు నిరూపించారు. హెచ్‌ఐవీతోపాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని అంచనా. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించేందుకూ దీన్ని ఉపయోగించువచ్చునని తెలిసింది. జన్యువులను కత్తిరించడం.. కొత్త వాటిని చేర్చడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చినా, రాకున్నా కొన్ని దుష్ప్రభావాలు మాత్రం తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలిగితే మంచిదేనని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో డ్యూక్ శాస్త్రవేత్తలు క్రిస్పర్ క్యాస్–9కు పీఎస్కే9 ఎంజైమ్‌ను చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చునని గుర్తించారు. మరిన్ని ప్రయోగాల ద్వారా ఈ విధానాల పనితీరును అర్థం చేసుకోగలిగితే.. దుష్ప్రభావాలేవీ లేకుండా కొన్ని వ్యాధులకు చికిత్స కల్పించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఉక్కు కూర
గోంగూరకు కాస్త పుల్లటి రుచి ఉండటంతో... దాన్ని కోడికూరకు చేర్చి చికెన్‌గోంగూర అన్నా, పప్పుకు చేర్చి గోంగూర పప్పు అన్నా... అసలు కూరకు కొత్తరుచి వస్తుంది. అలా కొత్తరుచి తేవడంలో దానికి ఎంత స్పెషాలిటీ ఉందో... కొత్త రక్తం పట్టేలా చేయడమూ సాధ్యమవుతుందని గోంగూరకు ఒక ప్రతీతి ఉంది. గోంగూరలో ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల దాంతో మనకు కొత్తరక్తం పడుతుంటుంది. అదొక్కటే కాదు.... గోంగూరతో ఒనగూరే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి... ►గోంగూర చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండెజబ్బులను నివారిస్తుంది. ►గోంగూరలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అధిక రక్తపోటును నియంత్రించి, సాఫీగా రక్తప్రసరణ జరిగేలా చూస్తుంది. ►గోంగూరలోని పాలీఫీనాలిక్ కాంపౌండ్స్, యాంథోసయనిన్స్, ఫ్లేవనాయిడ్స్ లాంటి అనేక యాంటీఆక్సిడెంట్స్ వల్ల చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. క్యాన్సర్ సెల్ తనంతట తానే నశించేలా చేసే (అపాప్టోసిస్ను ప్రమోట్ చేసే) అద్భుతమైన గుణం గోంగూరకు ఉంది. ఫలితంగా క్యాన్సర్ ట్యూమర్లు నశించిపోయేలా చేస్తుంది. ►గోంగూరలో విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే శరీరానికి రోగనిరోధక శక్తిని సమకూర్చి, ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ►గోంగూరలో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి గోంగూర మంచిది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ పదిలంగా కాపాడుతుంది. ►గోంగూరలోని విటమిన్–సి... ఏజింగ్‌కు కారణమయ్యే ఫ్రీరాడియల్స్ను హరించి, చాలాకాలం యౌవనంగా ఉండేలా చేయడంతో పాటు, చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. -
జన్యుమార్పిడితో సగం తగ్గిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్...
ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను జన్యుమార్పిడి పద్ధతులతో తగ్గించవచ్చునని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన స్పష్టం చేసింది. మన అవసరాలకు తగ్గట్టుగా కచ్చితమైన జన్యుమార్పులు చేయగలిగే క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీని వాడటం ద్వారా తాము కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సగానికి తగ్గించగలిగామని వీరు తెలిపారు. ఏఎన్జీపీటీఎల్–3 ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులో సహజమైన మార్పు ఉన్నవారిలో, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తక్కువగా ఉంటాయని, ఈ జన్యుమార్పును ప్రవేశపెట్టడం ద్వారా ఇతరుల్లోనూ ఇదే ఫలితాలు సాధించవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముసునూరు కిరణ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశామని, ముందుగా వీటికి ఏఎన్జీపీటీఎల్–3 జన్యువులో మార్పులు చేయగల క్రిస్పర్ ఆధారిత చికిత్స ఇచ్చామని.. వారం తరువాత పరిశీలించినప్పుడు మార్పులు 35 శాతం వరకూ పూర్తయినట్లు గుర్తించామని కిరణ్ వివరించారు. దీంతోపాటే ఆ ఎలుకల్లో హానికారక కొవ్వులు సగం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందని.. తద్వారా గుండెజబ్బుల బారిన పడిన వారు జీవితాంతం మందులు తీసుకునే అవసరం లేకుండా పోతుందని.. జన్యుమార్పులు చేసే వ్యాక్సీన్‌ను ఒకసారి తీసుకుంటే సరిపోతుందని కిరణ్ వివరించారు. -
ప్రొటీన్ బార్స్‌తో రిస్క్
లండన్: బరువు తగ్గేందుకు బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రొటీన్ బార్స్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఓ అథ్యయనం హెచ్చరించింది. వీటిలో కొవ్వును కరిగించే పదార్థాలు ఏమీ లేవని ఈ పరిశోధన తేల్చింది. ప్రొటీన్ బార్లు అదే పనిగా తింటే అవి శరీరానికి మేలు కన్నా హానే తలపెడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రొటీన్ షేక్స్, బార్లు మెరుగైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని లండన్ డాక్టర్స్ క్లినిక్‌కు చెందిన డాక్టర్ డేలియన్ ఫెంటాన్ చెప్పారు. ప్రొటీన్ బార్స్‌లో పలు రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు, స్వీటెనర్లు, నూనెలు ఉంటాయని, వీటి వల్ల అధిక కొవ్వు చేరడం మినహా మరో ప్రయోజనం లేదని ఆయన వివరించారు. ప్రొటీన్ బార్స్‌ను ఆహారంగా తీసుకునేవారు బరువు పెరుగుతారని స్పష్టం చేశారు. 50 ప్రముఖ ప్రొటీన్ బార్స్‌లో ఉండే కొవ్వు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, చక్కెర ఏ మేరకు ఉంటాయనేదానిపై పరిశోధకుల బృందం క్షుణ్ణంగా అథ్యయనం చేసింది. ప్రొటీన్ బార్స్‌లో అధిక కొవ్వులు ఉన్నాయని, వీటి ద్వారా బరువు తగ్గడం అసాధ్యమని పరిశోధకులు తేల్చారు. శరీర కండర నిర్మాణానికి అవసరమైన కీలక అమినో ఆమ్లాలు ఈ ప్రొటీన్ బార్స్‌లో లేవని స్పష్టం చేశారు. -
‘అవి బతికిస్తాయ్’
లండన్: తీవ్ర గుండెపోటుకు గురైన తర్వాత మరో స్ట్రోక్ రాకుండా, కొవ్వును తగ్గించేందుకు వాడే స్టాటిన్స్ కీలకంగా పనిచేస్తున్నాయని తాజా అథ్యయనం తేల్చింది. ఇవి ప్రాణాపాయం నుంచీ రోగులను కాపాడుతున్నాయని తేలింది. తక్కువ డోస్ తీసుకునే వారి కన్నా స్టాటిన్స్ అధిక మోతాదులో తీసుకునే వారు ఐదు రెట్లు తక్కువగా గుండె పోటు, స్ట్రోక్‌కు గురువుతున్నారనీ ఈ అథ్యయనంలో వెల్లడైంది. సాల్ట్‌లేక్ సిటీలోని ఇంటర్మౌంటెన్ మెడికల్ సెంటర్ హార్ట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ అథ్యయనం నిర్వహించారు. 1999 నుంచి 2013 మధ్య గుండె పోటు, స్ట్రోక్‌కు గురైన 62,000 మంది రోగుల వైద్య రికార్డులను వీరు పరిశీలించారు. వీరిలో స్టాటిన్స్ తీసుకుంటున్న వారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే వివరాలను దీర్ఘకాలంగా పరిశీలించారు. గుండెపోటుకు గురైన వారిలో స్టాటిన్స్‌ను తీసుకుంటున్నవారు చాలా తక్కువగా మరోసారి గుండె పోటు లేదా స్ట్రోక్ బారినపడుతున్నారని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జెఫ్రీ అండర్సన్ తెలిపారు. తక్కువ డోస్ వాడే వారి కన్నా అధిక స్టాటిన్ డోసేజ్ తీసుకుంటున్న వారిలో తదుపరి స్ట్రోక్ రిస్క్ 21 శాతం మేర తక్కువగా ఉందని చెప్పారు. హార్ట్ ఎటాక్ వచ్చిన రోగులకు కార్డియాలజిస్టులు కేవలం స్టెంట్ వేసి ఇంటికి పంపుతుండటంతో రోగులకు అవగాహన ఉండటం లేదని, తగిన మోతాదులో స్టాటిన్స్ మరింత మందికి ఇవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. -
హృద్రోగులు ఇవి చెక్ చేసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: హృద్రోగులు తరచూ చెడు కొలెస్ర్టాల్ లెవెల్స్‌ను పరీక్షించుకోవాలని, గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఎల్డీఎల్ (చెడు కొలెస్ర్టాల్)పై కన్నేసి ఉంచాలని తాజా అథ్యయనం పేర్కొంది. గుండె పోటు, స్ర్టోక్ బారినపడ్డ రోగుల్లో కొవ్వు స్థాయిలను పరీక్షించుకోని వారిలో తదుపరి స్ర్టోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అథ్యయనంలో వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడుతున్న 66 ఏళ్ల సగటు వయసున్న 60,000 మందిపై ఈ అథ్యయనం నిర్వహించగా, కొలెస్ర్టాల్‌ను అదుపులో ఉంచే మందులు తీసుకుంటున్న వారితో పోలిస్తే ఎల్‌డీఎల్‌ను అసలు పరీక్షించుకోని వారిలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నట్టు తేలింది. కొలెస్ర్టాల్ చెకప్ ప్రాధాన్యత కీలకంగా మారిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన ఇంటర్మౌంటెన్ మెడికల్ సెంటర్ హార్ట్ ఇనిస్టిట్యూట్ డైరెక్ర్ కిర్క్ యూ నోల్టన్ చెప్పారు. -
లవ్వు సర్వత్ర వర్జయేత్..!
సరదాగా... ప్రేమ అద్భుతమైనదనే విషయాన్ని టీన్స్‌లోకి రాగానే అందరూ గ్రహిస్తారు. కాబట్టే యౌవన దశ రాగానే దాని కోసం తపిస్తారు. కానీ లవ్వు కొవ్వు లాంటిది. కొలెస్ట్రాల్ పెరగగానే డాక్టర్లు దాన్ని వద్దన్నట్లే మనకు ప్రేమ లక్షణాలు కనిపించగానే అందరూ దీన్నీ నిరుత్సాహపరుస్తారు. పర్సనల్‌గా ఎవరేమనుకున్నా నా మాటగా నేనూ అదే అంటా. ఇందుకు ఎన్నో దృష్టాంతాలున్నాయి మన దగ్గర. ప్రేమలో పడటానికి ముందుగా మనమంతా ర్యాంక్ స్టూడెంట్స్ అయి ఉంటాం. అంతకు ముందు మనకు ఉన్న సంకుచిత మనస్తత్వంతో లోకంలోని మార్కుల సంపదనంతా మనమే అనుభవించాలనే ‘మార్క్స్’ యిస్టు ఆలోచనావిధానాన్ని అలవరచుకుంటాం. సదరు మార్కుల సంపదనంతా మనమే కట్టుకుపోవాలనీ, మార్కులన్నీ మన పేపర్ భోషాణంలోనే సోగైపోవాలనీ ఫ్యూడల్ ‘మార్క్సు లార్డు’లా అనుకుంటాం. నూటికి తొంభైతొమ్మిది మార్కులొచ్చినా ‘అరే... ఒకమార్కు తగ్గిందే!’ అనుకుంటాం. కానీ మనలో ప్రేమ భావనలు మొదలైన వెంటనే దేవుడి దయ వల్ల అమ్మాయి కనిపించగానే ఆమే మన లవర్ అని ఏకపక్షంగా, ఏకగ్రీవంగా అనుకుంటాం. మనం ప్రేమిస్తున్న అమ్మాయి అభిప్రాయంతోనైనా మనకు పనేమిటి? అవును... అందరూ అనుకున్నట్లే ప్రేమ మనలో కొత్త లోకపు ద్వారాలు తెరుస్తుంది, పరివర్తన తెస్తుంది. మనకున్న సంకుచిత భావాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. క్లాసులోని వారంతా మన తోటి వారే కదా అనే ధోరణి మొదలవుతుంది. మన మార్కుల్ని నలుగురితో పంచుకోవాలనుకునే సామ్యవాద ధోరణలు మొదలవుతాయి. అత్తెసరు మార్కులొచ్చినా అదే మహా ప్రసాదమనుకునే విశాల దృక్పథం అలవడుతుంది. మార్కులనేమైనా మనం పొయ్యేటప్పుడు కట్టుకుపోతామా అనే తాత్విక ఆలోచనా ధోరణి మనది. అందుకే ‘మార్కిన్’హుడ్డులా మన మార్కులన్నీ అందరికీ సమానంగా పంచుతాం. ఈ ప్రయత్నంలో మన మార్కుల సంపద జీరో అయినా లెక్కచేయనంత తెంపరితనం మనది. మార్కుల సమసమాజ స్థాపన కోసం మన మార్కులను నలుగురితో పంచుకోవడం పెద్దవాళ్లకు నచ్చదు. అంతకు ముందు మనం మార్కులు సంపాదించి పోగేసుకునే మార్క్యిస్టుగా ఉండటమే అందరికీ నచ్చుతుంది. అంతకుముందు మనలో అన్ని సబ్జెక్టులూ ఒకేసారి పాసవ్వాలన్న దూకుడుదనం, దుబారాతత్వం ఉండేవి. కానీ లవ్వుతో నెమ్మదితనం వస్తుంది. పొందిగ్గా అప్పుడొకటీ, ఇప్పుడొకటీ పాసవుతుంటాం. నాలుగైదు సబ్జెక్టులు పొదుపు చేసుకుని, ఆ తర్వాతి సప్లిమెంటరీ కాలానికో, మరుసటి ఏడాదికోసమో జాగ్రత్తగా మిగుల్చుకుంటాం. ప్రేమలో పడ్డ తర్వాత ఈ ప్రాపంచిక మార్కులన్నీ మనకు చాలా చిన్నవిగా తోస్తాయి. ‘నిండార ర్యాంకరు సాధించే ర్యాంకూనొకటే... అందనే మనకొచ్చే ఫెయిల్యూరూ నొకటే... మెండైన మేటివాడు సాధించు ఐఐటీ యొకటే... అత్తెసరు మార్కులతో మనము చేరు బీయ్యేయూ నొకటే’ అని తత్వం పాడతాం. ఇలా మనం నాలుగైదు సబ్జెక్టులు వెనకేసుకోవడం పెద్దలకు నచ్చదు. మార్కుల సంపదంతా మన దగ్గరే పోగేసుకునే ఒకప్పటి సంకుచిత ధోరణే పెద్దలకు నచ్చుతుంది. ఇక్కడో సీక్రెట్ చెప్పాలి. మనం లవరనుకున్న ఆ అమ్మాయి కూడా మన పెద్దల్లాంటిదే. అందుకే... మన లవ్ సక్సెస్ అయినా... మీ ఆలోచన ధోరణికీ, ఆమె వివేచనా సరళికీ ఉన్న వైరుద్ధ్యం ఆ తర్వాత కాపురంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. చినికి చినికి గాలివానలా మీ జీవితమంతా వెంటాడుతూ ఎప్పుడూ కలహాల్లోనే కొట్టుమిట్టాడేలా చేస్తుంది. అందుకే లవ్వూ కొవ్వులాంటిదే. లవ్వాతురాణం... న మార్క్సూ... న కెరీరు. అందుకే కొవ్వు పెరగకుండా చూసుకోవాలని డాక్టర్లు అన్నట్టే... లవ్వునూ పెరగనివ్వకూడదని నేనంటా. అందుకే మునపటిలా మార్కుల దోపిడీదారు మనస్తత్వంతోనే బతుకుదాం. ఇకపై ముక్తకంఠంతో ఒక మాట అనుకుందాం. మూజువాణీ ఓటుతో దాన్ని ఆమోదించుకుందాం. అదేమిటంటే... ‘‘లవ్వు సర్వత్ర వర్జయేత్’’. - యాసీన్