లవ్వు సర్వత్ర వర్జయేత్..!
సరదాగా...
ప్రేమ అద్భుతమైనదనే విషయాన్ని టీన్స్‌లోకి రాగానే అందరూ గ్రహిస్తారు. కాబట్టే యౌవన దశ రాగానే దాని కోసం తపిస్తారు. కానీ లవ్వు కొవ్వు లాంటిది. కొలెస్ట్రాల్ పెరగగానే డాక్టర్లు దాన్ని వద్దన్నట్లే మనకు ప్రేమ లక్షణాలు కనిపించగానే అందరూ దీన్నీ నిరుత్సాహపరుస్తారు. పర్సనల్‌గా ఎవరేమనుకున్నా నా మాటగా నేనూ అదే అంటా. ఇందుకు ఎన్నో దృష్టాంతాలున్నాయి మన దగ్గర.
ప్రేమలో పడటానికి ముందుగా మనమంతా ర్యాంక్ స్టూడెంట్స్ అయి ఉంటాం.
అంతకు ముందు మనకు ఉన్న సంకుచిత మనస్తత్వంతో లోకంలోని మార్కుల సంపదనంతా మనమే అనుభవించాలనే ‘మార్క్స్’ యిస్టు ఆలోచనావిధానాన్ని అలవరచుకుంటాం. సదరు మార్కుల సంపదనంతా మనమే కట్టుకుపోవాలనీ, మార్కులన్నీ మన పేపర్ భోషాణంలోనే సోగైపోవాలనీ ఫ్యూడల్ ‘మార్క్సు లార్డు’లా అనుకుంటాం. నూటికి తొంభైతొమ్మిది మార్కులొచ్చినా ‘అరే... ఒకమార్కు తగ్గిందే!’ అనుకుంటాం. కానీ మనలో ప్రేమ భావనలు మొదలైన వెంటనే దేవుడి దయ వల్ల అమ్మాయి కనిపించగానే ఆమే మన లవర్ అని ఏకపక్షంగా, ఏకగ్రీవంగా అనుకుంటాం. మనం ప్రేమిస్తున్న అమ్మాయి అభిప్రాయంతోనైనా మనకు పనేమిటి?
అవును... అందరూ అనుకున్నట్లే ప్రేమ మనలో కొత్త లోకపు ద్వారాలు తెరుస్తుంది, పరివర్తన తెస్తుంది. మనకున్న సంకుచిత భావాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. క్లాసులోని వారంతా మన తోటి వారే కదా అనే ధోరణి మొదలవుతుంది. మన మార్కుల్ని నలుగురితో పంచుకోవాలనుకునే సామ్యవాద ధోరణలు మొదలవుతాయి. అత్తెసరు మార్కులొచ్చినా అదే మహా ప్రసాదమనుకునే విశాల దృక్పథం అలవడుతుంది. మార్కులనేమైనా మనం పొయ్యేటప్పుడు కట్టుకుపోతామా అనే తాత్విక ఆలోచనా ధోరణి మనది. అందుకే ‘మార్కిన్’హుడ్డులా మన మార్కులన్నీ అందరికీ సమానంగా పంచుతాం. ఈ ప్రయత్నంలో మన మార్కుల సంపద జీరో అయినా లెక్కచేయనంత తెంపరితనం మనది.
మార్కుల సమసమాజ స్థాపన కోసం మన మార్కులను నలుగురితో పంచుకోవడం పెద్దవాళ్లకు నచ్చదు. అంతకు ముందు మనం మార్కులు సంపాదించి పోగేసుకునే మార్క్‌యిస్టుగా ఉండటమే అందరికీ నచ్చుతుంది. అంతకుముందు మనలో అన్ని సబ్జెక్టులూ ఒకేసారి పాసవ్వాలన్న దూకుడుదనం, దుబారాతత్వం ఉండేవి. కానీ లవ్వుతో నెమ్మదితనం వస్తుంది. పొందిగ్గా అప్పుడొకటీ, ఇప్పుడొకటీ పాసవుతుంటాం. నాలుగైదు సబ్జెక్టులు పొదుపు చేసుకుని, ఆ తర్వాతి సప్లిమెంటరీ కాలానికో, మరుసటి ఏడాదికోసమో జాగ్రత్తగా మిగుల్చుకుంటాం. ప్రేమలో పడ్డ తర్వాత ఈ ప్రాపంచిక మార్కులన్నీ మనకు చాలా చిన్నవిగా తోస్తాయి. ‘నిండార ర్యాంకరు సాధించే ర్యాంకూనొకటే... అందనే మనకొచ్చే ఫెయిల్యూరూ నొకటే... మెండైన మేటివాడు సాధించు ఐఐటీ యొకటే... అత్తెసరు మార్కులతో మనము చేరు బీయ్యేయూ నొకటే’ అని తత్వం పాడతాం.
ఇలా మనం నాలుగైదు సబ్జెక్టులు వెనకేసుకోవడం పెద్దలకు నచ్చదు. మార్కుల సంపదంతా మన దగ్గరే పోగేసుకునే ఒకప్పటి సంకుచిత ధోరణే పెద్దలకు నచ్చుతుంది. ఇక్కడో సీక్రెట్ చెప్పాలి. మనం లవరనుకున్న ఆ అమ్మాయి కూడా మన పెద్దల్లాంటిదే. అందుకే... మన లవ్ సక్సెస్ అయినా... మీ ఆలోచన ధోరణికీ, ఆమె వివేచనా సరళికీ ఉన్న వైరుద్ధ్యం ఆ తర్వాత కాపురంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. చినికి చినికి గాలివానలా మీ జీవితమంతా వెంటాడుతూ ఎప్పుడూ కలహాల్లోనే కొట్టుమిట్టాడేలా చేస్తుంది.
అందుకే లవ్వూ కొవ్వులాంటిదే. లవ్వాతురాణం... న మార్క్సూ... న కెరీరు. అందుకే కొవ్వు పెరగకుండా చూసుకోవాలని డాక్టర్లు అన్నట్టే... లవ్వునూ పెరగనివ్వకూడదని నేనంటా. అందుకే మునపటిలా మార్కుల దోపిడీదారు మనస్తత్వంతోనే బతుకుదాం. ఇకపై ముక్తకంఠంతో ఒక మాట అనుకుందాం. మూజువాణీ ఓటుతో దాన్ని ఆమోదించుకుందాం. అదేమిటంటే... ‘‘లవ్వు సర్వత్ర వర్జయేత్’’.
- యాసీన్