సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజూ సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు అదుపులో వుంటుందని సెలవిచ్చారు. అమెరికాలోని ఓ విద్యా సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం తేలిందని ఆయన తాజాగా వెల్లడించారు. సంస్కృతం మాట్లాడటం వలన నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుందనీ, షుగర్ లెవల్స్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు.
సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయనఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు యుఎస్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన పరిశోధన ప్రకారం, సంస్కృతంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జరిగితే అది ఆగకుండా పని చేస్తుందని తెలిపారు. కొన్ని ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 శాతానికి పైగా భాషలు సంస్కృతం మీద ఆధారపడి ఉన్నాయని సింగ్ అన్నారు. మరోవైపు ఈ బిల్లుపై సంస్కృతంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి సంస్కృత భాష చాలా సరళమైందనీ, అందులో ఒక్కో పదాన్ని పలు విధాలుగా వాడుకోవచ్చని తెలిపారు. ఆవు, అన్నయ్య(బ్రదర్, కౌ) అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఈ భాష నుంచే ఉద్భవించాయని చెప్పుకొచ్చారు. ఈ పురాతన భాషను ప్రమోట్ చేయడం వలన ఇతర భాషలకొచ్చే ప్రమాదేమీ వుండదని సారంగి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment