కేన్సర్ కణాలకు చక్కెరపై మక్కువ ఎక్కువని శాస్త్రం చెబుతుంది. చక్కెరను వాడుకోవడం ద్వారా కేన్సర్ కణాలు శక్తిని పొందుతాయి. అయితే కొన్ని రకాల కేన్సర్లు కొవ్వుకణాలతోనూ ఇంధనాన్ని సమకూర్చు కుంటాయి. నార్త్‌వెస్ట్‌ర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అంశం ఆధారంగా కేన్సర్‌కు సరికొత్త చికిత్సను సిద్ధం చేశారు. కొవ్వు కణాల్లోపల రహస్యంగా కీమోథెరపీ మందులు దాగి ఉండేలా చేశారు. ఫలితంగా కేన్సర్ కణాలు ఈ రకమైన కణాలను ఆహారంగా మార్చుకున్నప్పుడు అందులో ఉన్న మందు నేరుగా కణాలపై దాడి చేస్తుందన్నమాట.
ఈ ప్రత్యేకమైన కొవ్వు కణాల్లో రెండు చేతుల్లాంటి నిర్మాణాలు ఉన్నాయని.. ఒకటి కేన్సర్ మందును... ఇంకోటి ప్రొటీన్లకు అతుక్కుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నాథన్ గియాన్‌సెచీ తెలిపారు. కేన్సర్ కణితుల్లోని రిసెప్టర్లు ఈ కొవ్వు కణాలను లోనికి రానిస్తాయని.. ఆ తరువాత ఇందులోని కీమో మందు పనిచేయడం మొదలుపెడుతుందని కణితి తాలూకూ కణాలను చంపేస్తుందని నాథన్ వివరించారు. చాలా రకాల కేన్సర్లకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాసిలిటాక్సెల్‌ను ప్రత్యేక కొవ్వు కణాల్లోకి చేర్చి జంతువులపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని.. దుష్ప్రభావాలు అతితక్కువగా ఉంటూనే మూడు రకాల కేన్సర్లను ఈ కొత్త కొవ్వుకణాలు సమర్థంగా ఎదుర్కొన్నాయని వివరించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధారణ డోస్ కంటే 20 రెట్లు ఎక్కువ శక్తిమంతమైన డోస్ కేన్సర్ కణాలకు అందుతూండటం ఇంకో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment